విశాలమైన హాలులో భారీ ఏర్పాట్ల తో సాగుతుంది పార్టీ. అంతా పూర్తీ పాశ్చాత్య పద్దతిలో ఉంది. వాద్యకారులు, పాశ్చాత్య వాయుద్యాలతో "రాక్ ఎన్ రోల్" నాట్యాన్ని కనుగుణమైన సంగీతాన్ని సృష్టిస్తున్నారు.దేశమంతటా అమలు జరుపబడుతున్న మద్యపాన నిషేధం మహానగరాలలో మాత్రం లేదు. అరుంధతి కా వాతావరణం ఎంత చిరాగ్గా వుందో , ప్రకాశరావు కంత ఉల్లాసంగా ఉంది. సంగీతాని కనుగుణంగా పాదాన్ని నేలకు తాటిస్తూ "చూడు! ఏర్పాట్లన్నీ చాలా గొప్పగా లేవూ? సుందర్రావుగారిని చాలా గొప్ప అభిరుచులు, మనోరంజని అన్నివిధాల ఆయనకు తగిన భార్య" అన్నాడు.
ఇంతలో చాలా గొంతుకలు ఒక్కసారిగా "హల్లో! శ్రీధర్" అనటం వినిపించింది. అరుంధతి కుతూహలంగా చూసింది. ఒక సమున్నతా కారం ఠీవిగా నడుచుకుంటూ , పార్టీ మధ్యకు వస్తుంది. సంగీతం, తాత్కాలికంగా ఆగిపోయింది. మనోరంజని సుందర్రావులు ఆతృతతో ఎదురెళ్ళి ఆప్యాయంగా ఆహ్వానించటం గమనించిన అరుంధతి అతడెవరో ప్రముఖ వ్యక్తీ అయి ఉంటాడని ఊహించింది, కొందరు ముఖ్యులకు పరిచయం చేసిన తరువాత శ్రీధర్ ను ప్రకాశరావు దగ్గరకు తీసికోచ్చాడు సుందర్రావు.
"ఈయన సుప్రసిద్ధ న్యాయవాది ప్రకాశరావు గారు -- ఈమె శ్రీమతి అరుంధతీ ప్రకాశరావు గారు. ఈయన డాక్టర్ శ్రీధర్."
పరస్పర నమాస్కరాలయిన తరువాత, డాక్టర్ శ్రీధర్ చిరునవ్వుతో , "అరుంధతీ ప్రకాశరావు గారు మీరేనా? మిమ్మల్ని చూడగలగటం , నాకు చాలా సంతోషంగా ఉంది" అన్నాడు.
అరుంధతి ఆశ్చర్యపోతూ , "నన్ను మీకెలా తెలుసూ?" అంది.
"నేను మీ కధ చదివాను. అది చాలా బాగుంది. ఆ కారణంగానే రచయిత్రి పేరు గుర్తుంది."
అరుంధతి ఈసారి ఇంకా ఆశ్చర్య పోయింది. "నన్ను కూడా రచయిత్రి గా గుర్తించే వాళ్లున్నారంటే నవ్వొస్తుంది . నేను వ్రాసిన ఒకే ఒక్క కధ!"
"బాగా వ్రాస్తారని గుర్తించటానికి ఒక్క కధ చాలు! మళ్ళీ ఏం వ్రాయలేదా?"
ఈ ప్రశ్న విని విని అరుంధతికి విసుగొచ్చింది. ఒక్కొక్కరూ వచ్చి, తన కధ బాగుందనటమూ, 'మళ్ళీ, ఏం వ్రాయటం లేదా?' అని అడగటమూ, అక్కడికి వీళ్ళ కోసమైనా తను వ్రాయక తప్పదన్నట్లు కటువుగా సమాధాన మిచ్చింది.
"వ్రాసాను"
"అరె! ఎందులో వచ్చింది? నేనుచూదలేదే!" "ఎందులోనూ రాలేదు. తిరిగొచ్చింది."
శ్రీధర్ ఎంత అణచుకున్నా, అతని పెదవులు మీద చిరునవ్వు విరిసింది.
"అరరే! గట్టిగా అనకండి! ఇట్లాంటి వ్యాపార రహస్యాలు బయట పెట్టుకోవచ్చా?!"
"దీన్ని నేను 'వ్యాపారం' అనుకోవటం లేదు."
"సారీ! పోనీ వ్యక్తిగత రహస్యం."
"ఉహు! అసలు రహస్యం కానే కాదు. కావలసిన అవసరం లేదు.
ఒక్క లిప్త మాత్రం శ్రీధర్ అరుంధతి ముఖంలోకి చూసి ఊరుకున్నాడు. అంతవరకూ , వాళ్ళు నిలబడే ,మాట్లాడుకున్నారు. అరుంధతి ప్రక్కన ఖాళీగా ఉన్న సీట్ లో కూర్చోబోతూ అంగీకారం కోసం అన్నట్లు ఆమె ముఖంలోకి చూసాడు శ్రీధర్. అరుంధతి చిరునవ్వుతో తన అంగీకారాన్ని సూచించింది. శ్రీధర్ కూర్చున్నాడు.
అక్కడ చేరిన వాళ్ళలో రకరాకాల వ్యక్తులున్నారు. అత్యంత ఆధునికంగా అలంకరించుకొన్న హిందువులు, పార్శీలు, సిక్కులు, పంజాబీలు, ఆంగ్లో ఇండియన్ లు-- అరుంధతి వారినందరినీ పరిశీలనగా గమనించింది. అరుంధతి లాగ సాధారణంగా అలంకరించుకొన్న వాళ్ళు కూడా లేకపోలేదు. మాములుగా ఎంత జాగ్రత్తగా ఉంటుందో, ఇట్లాంటి పార్టీలలో అంత ఖర్చు పెడుతుంది మనోరంజని. ఆమె డబ్బు ఆమెకు సంపాదించి పెట్టె నిజమైన ఆనందం ఇదొక్కటే నెమో.
తార ,మెరుపు తీనేలాగ ఉంది. ఆకాశం రంగులో కలిసే లేత నీలిరంగు దుస్తులు ధరించి ముదురు నీలిరంగు పూసలతో కూర్చిన ముత్యాల లాకెట్ వేసికొని, లోకమంతా నాచే నన్నంత ధీమాతో చిరునవ్వు నవ్వుతూ , తన స్నేహితులతో కబుర్లు చెపుతుంది. మిగిలినదంతా, ఎలా ఉంటె, తారకేం? తన స్నేహితులందరి తో కలిసి టీ తీసికోవటం తో, తార ఎంతో ఆనందించగలదు. ఎక్కడి కక్కడ ఆనందాన్ని వెతుక్కోగలిగే వయసది.

వెయిటర్స్ రకరకాలైన పదార్ధాలు ట్రేలతో పుచ్చుకొని, తిరుగుతూ ఒక్కొక్క బల్ల దగ్గిర అగుతున్నారు. ఒక వెయిటర్ , అరుంధతి, ప్రకాశరావు , శ్రీధర్ ఉన్న బల్ల దగ్గర కొచ్చి , ట్రే లోంచి విస్కీ బాటిల్ తీసి మూత తియ్యబోతూ, అంగీకారం కోసం చూసాడు. శ్రీధర్ చేత్తో అతడిని వారించి, అరుంధతి వంక తిరిగి, "క్షమించండి! మీరు తీసి కొంటారా?" అన్నాడు. అరుంధతి సభ్యతను కూడా మరిచిపోయి "ఛీ!' అంది. వెంటనే నాలుక కరచుకొని శ్రీధర్ వెయిటర్ కు వద్దన్నట్లు సైగ చేసేసరికి అతడు వెళ్ళిపోయాడు. అరుంధతి నొచ్చుకుంటూ , "నా కలవాటు లేదు మీరు తీసికోక పోయారా?" అంది.
"నాకన్నీ అలవాటు! ఏదీ అలవాటు కాదు. ఎవరి కంపెనీతో ఉంటె, వాళ్ళ అలవాట్లే నా అలవాట్లు!" చిరునవ్వుతో అన్నాడు శ్రీధర్. ఇంకొక వెయిటర్ తెచ్చిన కేక్స్ అందుకొని, తనే అరుంధతి ప్రకాశరావు ల పెట్లలో పెట్టి, తన ప్లేట్ లో కూడా పెట్టుకున్నాడు.
ప్రకాశరావుకు చాల చిరచిర గా ఉంది. అతని ప్రాణాలన్నీ ఆ సీసాల వెంటే ఉన్నాయి. మందంగా వినవస్తున్న పాశ్చాత్య సంగీతం, అతడిని విపరీతంగా ఉత్తేజ పరుస్తుంది. హాయిగా రెండు గ్లాసులు త్రాగి ఎవరితో నైనా కొంచెం సేపు డాన్స్ చేస్తే .... అక్కడి ఆంగ్లో ఇండియన్ స్త్రీలతో ఎవరో ఒకరు తన ఆహ్వానాన్ని అంగీకరించక పోరు. మనోరంజని ఎదురుగా , మరొకరితో నాట్యం చేసే సాహసం సుందర్రావు కు లేదు. కానీ తనకా బాధ లేదు. అరుం ధతి చాలా మంచిది. ఇవేమీ పట్టించుకోదు. సరిగ్గా ఆ సమయానికి ప్రకాశరావు పాలిట దేవదూత లాగ సుందర్రావునక్కడికి వచ్చాడు. శ్రీధర్ ప్రకాశరావు లను చూసి "ఇదేమిటి? ఒట్టి కేక్సే తీసి కొంటున్నారు? వెయిటర్ ని కాక్ టెయిల్ తయారు చెయ్యమన్నాను-- తెమ్మంటాను" అన్నాడు.
"ఇక్కడకు వద్దు!' అన్నాడు శ్రీధర్.
"అదేం?"
శ్రీధర్ అరుంధతి వంక చూసాడు.
"ఓ!" అంటూ సుందర్రావు ఇబ్బందిగా నవ్వి, "పోనీ, మీరిద్దరూ కొంచెం సేపక్కడకు రండి. డాన్స్ లో మీరు పార్ట్ తీసికోవాలి. ప్రకాశరావు గారు చాలా బాగా డాన్స్ చేస్తారు."
ఇంతలో మనోరంజని , సుందర్రావును పిలిచింది. "యస్! మనో!" అంటూ సుందర్రావు "రండి !" అని శ్రీధర్ ప్రకాశరావు లతో అని తను కదిలాడు.
ప్రకాశరావు వెంటనే లేచాడు. శ్రీధర్ లేవకుండానే "ఒకసారి వద్దను కొన్నాను. మళ్ళీ తీసుకోవాలని లేదు. మీరు వెళ్ళండి!' అన్నాడు.
ప్రకాశరావు ఇంక ఒక్క క్షణమైనా ఆలస్యం చెయ్యలేదు.
హుషారుగా నడిచే ప్రకాశరావునూ, నిస్పృహతో వెనక్కు వాలిన అరుంధతినీ కుతూహలంగా గమనించే, శ్రీధర్ చూపులు శూన్యంగా ఉన్న అరుంధతి చూపులతో కలుసుకోన్నాయి.
"గట్టివాడు." అనుకొంది అరుంధతి.
"ఈవిడే ఒక కధలాగుంది." అనుకొన్నాడు శ్రీధర్. ఆ బల్ల దగ్గర తాను శ్రీధర్ మాత్రమే కూర్చున్నామన్న సంగతి గమనించి, అరుంధతి కొంచెం 'నెర్వస్' గా అనుభూతి చెందింది. నిశ్శబ్దాన్ని భరించలేక, "మీరు డాక్టర్ కదా, మీకు పత్రికలూ, అవీ చదివేటంత తీరుబడి ఉంటుందా?' అంది.
