Previous Page Next Page 
గూడు చేరిన పక్షులు పేజి 7

 

    'చూడండి ...మీ పేరు...
    '....................'
    'బాధ పడకండి.... జరిగిందేదో జరిగిపోయింది....' ఊరట కలిగించడం లో కన్నీరు కార్చాడు.
    'డాక్టర్....నేను పాపిని. సంతోష సాగరం లో మునిగి తేలుతున్న నా సంసారాన్ని దుఃఖ భాజనంగా మార్చుకున్నాడు. అందుకు కారణం? దుష్ట స్నేహం! మీరు నా కుటుంబానికి చేసిన మేలు ఈ జన్మలో మరిచిపోలేను... నన్ను క్షమించండి....'
    'ఇంతకూ మీ పేరు చెప్పలేదు. మీరేం చేస్తూ ఉంటారు?'
    'నా పేరు కృష్ణ. నేను కలెక్టరు ఆఫీసులో క్లర్కు గా పని చేస్తూ ఉండేవాడిని. నీతి నిజాయితీ ఉన్నవాడినని పేరు సంపాదించు కున్నాను. నా స్నేహితుడోకడు నాతొ కాని పని ఒకటి చేయించాలని ప్రయత్నం చేశాడు. డబ్బాశ చూపాడు. ఎన్నో విధాల ప్రయత్నించాడు. నా బంధువులతో చెప్పించి చూశాడు. అతడు అన్ని విధాల ప్రయత్నించినా నేను ఏ మాత్రం లొంగలేదు. ఆవిధంగా కొంతకాలం జరిగిపోయింది. ఒకరోజు నేను ఆఫీసు నుండి బయట పడగానే నాకోసం కాచుకొని ఉండి ఒక గంటసేపు వేధించాడు. ఆరోజు నిష్కర్షగా చెప్పి వేశాను. నాతొ ఆ పని జరగదని. మనిషి మారినట్టు కనుపించాడు . ఇంత కాలం నన్ను బాధ పెట్టినందుకు క్షమార్పణ కోరాడు. ఈ విషయం మన స్నేహానికి ప్రతిబంధం కాగూడదని ప్రార్ధించాడు. బ్రతిమాలాడు. అతని బారి నుండి తప్పించుకోవదానికి అతని మాటలన్నిటిని సరేనని ఒప్పుకుంటూ అతని దగ్గర శలవు తీసుకోవాలని ప్రయత్నించాను. సాధ్యపడలేదు. మెల్లిగా తీయటి కబుర్ల తో నన్ను పొగుడుతూ హోటలు కు తీసుకు వెళ్ళాడు. తనతోకలిసి టిఫిను చేస్తే తప్ప తనను క్షమించినట్లు కాదని బలవంతం చేశాడు. టిఫిను చేసిన తర్వాత డ్రింకు ని చెబుతూ నాతొ బ్రాంది త్రాగించాడు. మొదటిగుక్క నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.. ఫర్వాలేదంటూ నాతొ గ్లాసు పూర్తీ చేయించాడు.... నా పతనం ప్రారంభమైంది.ఈ హోటలు టిఫిన్లు డ్రింకు లు నాకు అలవాటు లేవు. వచ్చే జీతం కమల చేతి కిచ్చి ఆమె యిష్ట ప్రకారం నడుచుకుంటూ ఉండేవాడిని. ఆమె చాలా తెలివైనది. నాకెటు వంటి లోటు రానిచ్చేది కాదు. అవసరమొచ్చినప్పుడు తను పస్తు లుంటూ నాకు కడుపు నిండా భోజనం పెడుతూ ఉండేది. ఆ పరిస్థితుల్లో నాకు హోటలు కు వెళ్ళాలనే తలంపే కలిగేది కాదు. నాకు కావలసిన ఫలహారాలు తనే యింట్లో చేస్తూ హోటలు టిఫిన్లు ఆరోగ్యానికి భంగకరమని హెచ్చరిస్తూ ఉండేది కమల. నన్ను మించిన అదృష్టవంతుడు లేడని ఎంతో పొంగిపోతూ ఉండేవాడిని. పై కారణంగా నేను ఎప్పుడూ హోటలు కు వెళ్ళేవాడిని కాదు. అతనిని నమ్మాను. ఆరోజు ఒక్క గ్లాసు తోటే వదిలాడు నన్ను. మరోరోజు , ఇంకోరోజు అలాగే నా పతనం కొనసాగింది. అతని పని పూర్తయింది. నేను నాశనమయ్యాను. ఈ దురభ్యాసం నాకు పూర్తిగా వంటబట్టి రాత్రింబవళ్ళు మైకంలో ఉండసాగాను. తత్ఫలితంగా నా ఉద్యోగం పోయింది. పర్యవసానం మీరిప్పుడు చూస్తూనే ఉన్నారు. కమల ఆరోగ్యాన్ని లెక్క చేసే వాణ్ణి కాదు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే వాణ్ణి.ఆమెను ఈ స్థితికి దిగజార్చిన దుర్మార్గుడను నేనే. మత్తు వదలగానే మరెప్పుడూ త్రాగకూడదని అనుకుంటూ ఉంటాను. కాని ఆ నిర్ణయం ఎంతోసేపు నిలవదు. మళ్ళీ మామూలే! నా హృదయం యింత దుర్భలమైనందుకు ఎంతగానో వాపోతున్నాను డాక్టర్! నేనేం చేయాలో నాకర్ధం కావడం లేదు....నన్ను మన్నించండి.... మీరు నా కుటుంబాన్ని ఆదుకున్నారు . మీకు ఎన్నో విధాల ఋణపడ్డాను. ఋణం తీర్చుకోలేను.' బాధతో తలవాల్చి కుర్చీలో కూర్చున్నాడు రామం.
    ఆ కధ విన్న నా హృదయం తల్లడిల్లింది. ఎటువంటి సంస్కారం....ఎలా మారింది: దుష్ట స్నేహం వల్ల ఈ పరిస్థితి.. క్షణం ఆలోచించాను. మెరుపు లాంటి ఆలోచన నా మదిలో మెదిలింది. ఇతను చూస్తె సహృదయుడిలా ఉన్నాను ప్రయత్నిస్తాను.
    'మిస్టర్ కృష్ణ....! మీరు ఈ అలవాటు మానలేరా?'
    'లేదు డాక్టర్ ! ఎంతగానో ప్రయత్నించాను. సాధ్యపడడం లేదు. ఏం చెయ్యమంటారు?' అతని ముఖంలో పశ్చాత్తాపం ఉట్టిపడుతూ ఉంది.
    'మిస్టర్! మీ త్రాగుడు మానడానికి మీకు ప్రతిరోజూ మందిస్తాను తీసుకుంటారా?'
    'నిజంగానా డాక్టర్! నేనెప్పుడూ వినలేదు. ఆ విషయం తెలుసుంటే ఏనాడో ఆ మందు తీసుకునే వాడిని దయచేసి ఆ మందు యిప్పించండి.'
    'అలాగే!'
    రాధతో అటు ప్రక్కగా వెళ్లి ఒక సీసా లో 'మిక్చర్ కార్మేటివ్ తీసుకువచ్చాను. సీసా అతనికి యిస్తూ 'చూడండి....! ఇది మీ అలవాటుకు మందు. కాని మీ దృడ నిర్ణయం కూడా చాలా ముఖ్యం. రోజుకు మూడు సార్లు ఈ మందు త్రాగండి. ఒక్క పదిరోజులు త్రాగితే చాలు.'
    'మీ ఋణం ఎన్ని జన్మల కైనా తీర్చుకో లేను డాక్టర్! వస్తాను.'
    అతను వెళ్ళిపోయాడు. కమలకు పూర్తిగా ఆరోగ్యం చేకూరింది. లేచి తిరగగలుగుతూ ఉంది. లక్ష్మీ ఆనందానికి అవధుల్లేవు. కృష్ణ పూర్తిగా మారిపోయాడు. కమలను అడ్మిట్ చేసి నెల రోజులైంది. రేపు ఆమెను పంపించేస్తాను. కృష్ణ కు నా మందు బాగా పనిచేసింది. మందు త్రాగుతున్నాననే ధైర్యంతో త్రాగుడు మానాడు కృష్ణ. నిజానికది త్రాగుడు మాన్పే మందు కానేకాదు. అతని దృడ విశ్వాసమే కారణం , అతని మార్పుకు. క్రితం రోజు వచ్చాడు. త్రాగుడు మాని వేసినట్లు నేనిచ్చిన మందు బాగా పనిచేసినట్లు చెప్పాడు. కృతజ్ఞత నన్ను పొగిడాడు అతనిని అభినందించాను. వాణితో చెప్పి, వాళ్ళ ఫరం లో ఉద్యోగం యిప్పించాను నూతన జీవితం ప్రారంభించ వలసిందిగా హితబోధచేశాను. ఆనంద భాష్పాలు రాల్చాడు. కృతజ్ఞత నిండిన చూపులతో నాకు థాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు.
    కమల ఆరోజే యింటికి వెళ్ళిపోతుంది. నాతొ చెప్పి వెళ్లాలని కమల, లక్ష్మీ నా గదికివచ్చారు. వారి ముఖాలలో ఉన్న ఆ తృప్తి ఆ ఆనందం నన్ను ఆనంద పరవశురాలను చేశాయి.
    'డాక్టర్! మీరు దేవతలు. దయతో నా సంసారం నిలబెట్టారు.' కాళ్ళ పై పడబోతున్న ఆమెను ఆప్రయత్నం నుండి విరమింప జేసి కుర్చీలో కూర్చుండబెట్టాను.
    'చూడమ్మా , యిందులో నేను చేసిందేమీ లేదు. డాక్టరు గా నావిధిని నేను నిర్వర్తించాను. అంతే....! నీ అదృష్టం బాగుంది నీ సంసారం బాగుపడింది.' అని లక్ష్మీ వైపు చూస్తూ "లక్ష్మీ యివిగో అమ్మ గాజులు.... అమ్మను జాగ్రత్తగా తీసుకు వెళ్లు." అన్నాను.
    నన్ను కృతజ్ఞత నిండిన చూపులతో చూస్తూ వెళ్ళిపోయారిద్దరూ... వారటు వెళ్ళగానే నాన్నగారు నన్ను పిలిస్తూ ఉన్నట్లు రాధ చెప్పింది. వారి గదికి వెళ్ళాను.
    నన్ను చూడగానే 'జరిగిన సంగతంతా రాధ చెప్పిందమ్మా! చాలా సంతోషం.... ప్రసాదు కూడా యిటువంటి మంచి పనులు ఎన్నో చేశాడు. నీవు కూడా ఈ విషయం లో అతనికి ఏమాత్రం తీసిపోవని రుజువు చేసుకున్నావు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక యింటికి వెడదాం ...పొద్దు పోయింది.'
    'అలాగే నాన్నారూ! పదండి వెడదాం....'
    ప్రసాదు ను గుర్తు చేయడంతో నా మనసులో తీయని ఊహలు నిండి పోయాయి. ఆ ఊహలను గుండెలలో భద్ర పరుచుకుంటూ నాన్నగారి ననుసరించి కారెక్కాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS