Previous Page Next Page 
అపశ్రుతులు పేజి 8


    ఆ మాటవిన్న రమ, దిగ్భ్రాంతయై స్థాణువులా చలన రహితంగా కొన్ని క్షణాలతనివైపు చూస్తూ నిల్చుండిపోయిది.
    "ఎందుకలా చూస్తావ్? నన్ను మెత్తపరచి మళ్ళీ నా జీవితంతో ఆడుకోకు. వెళ్ళు నా యింట్లో నీకు స్థానం లేదు. ఎవ్వరికీ కన్నావో బిడ్డను..... విడాకులు తీసుకుందాం నీకూ, నాకూ హాయి అరిచినట్టన్నాడతను.
    "ఏమండీ!......" అసహనంగా అరిచి...."సుకుమారంగా ఆకర్షణీయంగా అందంగా కన్పించే మీ హృదయమెంత క్రూరమైనది? భగవంతుని మొహం చూసి నిజం చెప్పండి. పోనీ నాతో దాంపత్య జీవితం గడపొద్దు నాకేమీ డబ్బు పెట్టొద్దు.... ఒక్కమాట ... అదే... నేను..... నేను కనబోయే బిడ్ద మీ బిడ్డకాదూ?" ఆమె గొంతు దుఃఖావేశంతో వణికి రుద్ధమయింది. అతణ్ణి చూస్తోన్న ఆమె కళ్ళు నిప్పులు కురుస్తున్నాయ్.
    "కాదు...... చాలా కాలమై నీకూ నాకూ సంబంధంలేదు.....విడాకులు వ్రాసిచ్చావో సరి..లేదా ఇదే చెప్తాను ఎప్పుడైనా మనిద్దరికీ సఖ్యత లేదని చాలామందికి తెల్సు...." తల విసురుగా ఎగరేసి ఆమెకు మొహం చాటు చేసుకొని అన్నాడు శ్రీనివాసరావు.
    అతని ఒక్కొక్క మాటా ఆమె హృదయాన్ని చీల్చి చెండాడింది. అతనా మాటనే స్థిరం చేసి నలుగురి మధ్యా నవ్వుల పాలు చేస్తే. భగవాన్ తానేం కావాలి? తన పాప భవిష్యత్తేమిటి? కాళ్ళకింద భూమి కంపిస్తూన్నట్టయింది. తన చుట్టూ పరిసరాలు గిరి గిరా తిరుగుతూన్నట్టన్పించింది. తల రెండు చేతుల్లో పట్టుకుని నిల్చున్న చోటనే కూలబడింది రమ.    
    కొన్నిక్షణాలిద్ధరి మధ్యా భయంకర నిశ్శబ్దం.
    "వెళ్ళి పో నీ మొహం మరి నాకు చూపించకు ఇంకా ఉంటే ఏం చేస్తానో చెప్పలేను..... పో. విడాకులు తీసుకుందాం. నీ ఇష్టమొచ్చిన నీ ఫ్రెండ్సంధరితో ప్రతి మగవాడితో జీవితం గడిపెయ్." పిచ్చెక్కినట్టు అరిచాడు శ్రీనివాసరావు.
    "ప్రతి మగవాడితో తిరిగేదన్నా నేను? ఆపండి పాపం మూటగట్టుకోండి. ఏం చేస్తున్నారో తెలియదూ! ఇంతకన్నా ఏ మగాడన్నా రాక్షసుడన్నా మీలా చెయ్యగలడా?.... జలజలా కన్నీరు కారుస్తూ- "మీ భార్య జారిణి అంటున్నారు. మీ బిడ్డ మీది కాదంటున్నారు." అంది రమ.
    "వెళ్తావా లేదా? ఎప్పుడూ నీమీద చెయ్యి చేసుకోలేదు. ఇవ్వాళ ఆ పని చేస్తాను." అరిచాడు మళ్ళీ.
    "కొట్టి తిట్టి పగ చల్లార్చుకునే సామాన్యులా మీరు? హు నా శరీరం మనస్సూ డబ్బూ అన్నీ మీ పరం చేశాను. అన్నీ మీరే దోచుకున్నారు. నేనీ ప్రపంచంలో ఎలా బ్రతకాలి? కొంచెం న్యాయంగా ఆలోచించండి? అతని పాదాలు తాకబోయింది.
    "శరీరం డబ్బూ మనస్సూ ఇస్తేసరి గౌరవం మాటకు విలువా అభిప్రాయాలూ మన్నించడం.....అస్సలు మగవాడికి లొంగి బ్రతకలేని నువ్వు ఆ మగవాళ్ళే బజారు స్త్రీలా చూస్తూంటే..." పళ్ళు పటపటా కొరికాడు ఆమెకు దూరంగా నడుస్తూ.
    నన్ను.....నన్ను బజారు స్త్రీలా చూస్తారా?.....ఎంత కసి మీకు ఎటువంటి దాన్నయినా, ఎలా బ్రతికినా నన్ను శ్రీనివాసరావు భార్యంటారు. గుర్తుంచుకోండి సరే వెళ్ళిపోతున్నాను. మీరివ్వలేదన్నా. మీరిచ్చిన బిడ్డతో జీవితం హాయిగా గడపడానికి ప్రయత్నిస్తాను......విడాకులు వ్రాసి ఇస్తాను.....అందమైన అమ్మాయిని సాధ్విని మీ అభిప్రాయాలు మన్నించేదాన్ని ఇల్లు కదలని దాన్ని...
    వెళ్ళూ..." గర్జించాడు శ్రీనివాసరావు. వణికే చేతుల్తో సంచీ చేతిలోకి తీసుకు ఇవ తలకొచ్చింది రమ.
    పాలిపోయిన వదనాల్తో ఆమె వైపు చూస్తూ. నిరుత్తరులై పోయారు రంగనాధం. జానకమ్మా గడప దిగుతూ బోరున ఏడ్చి చీర చెంగుతో మొహం కప్పుకుంది రమ. ఆమె కాళ్ళు బరువుగా బస్ స్టాండు వైపు నడిచాయి.
    "చాలా కాలమై నీకూ నాకూ సంబంధం లేదు......!" ఎంత మోసం! తాళికట్టిన క్షణం నుంచీ తనను వేపుకు తింటూ. అడుగడుగునా శాసిస్తూ ఇంకా కసి తీరలేదు కాబోలు. పుట్టబోయే బిడ్డకూ, తనకూ సంబంధమే లేదట. భగవాన్ నాకు న్యాయమెక్కడ లభిస్తుంది? నా తరపున సాక్ష్యం ఎవ్వరు చెప్పగలర్. లేదు భగవంతుడు మూగవాడు. ధర్మం మూగది న్యాయం మూగది. మోసానికే గాత్రముంది. శ్రీనివాసరావ్! నిన్ను భగవంతుడు క్షమించడు. నువ్వు.....నువ్వు....ఆమె పెదవులు వణకుతున్నాయ్.
    ఓడిపోయిన రమ-కాదు పురుషుని మోసాన్ని ఎదిరించి విలువలేని స్త్రీ ప్రకృతి అబలకి విధించిన శిక్ష. పగబట్టిన మగవానికి ప్రకృతి ఇచ్చిన వరం తాను శ్రీనివాసరావు కాదన్న ఈ అవును అన్న నిజాన్ని లోకానికి చెప్పలేని అబల. శ్రీనివాసరావ్! పగబట్టిన త్రాచూ! నా జీవితాన్ని కాతువేసి లోకం దృష్టిలో నన్ను పతితను చేసి నన్ను ఈ విశాల ప్రపంచంలో ఏకాకిగా వదిలి. నా బిడ్డను అనామకం చేసి తృప్తి పడుతున్నావు కదూ! ఓటమి అంగీకారించలేని బాధ ఎదిరించి. విలువలేని నిస్సహాయత పెల్లుబికే దుఃఖం బరువెక్కిన హృదయం తడబడే అడుగులు కదలబోతున్న బస్సెక్కింది రమ. బొటబొటా కన్నీళ్ళు ఆమెకు తెలియకుండానే కారిపోతున్నాయి. "టికెట్".....ఆమె వాస్తవంలో కొచ్చి చప్పున కళ్ళు తుడుచుకుంది.
    
                                  *    *    *

    అబ్బాయ్.....నీ వరసెం నాకు నచ్చలేదు...కోపంగా, విసురుగా శ్రీనివాసరావును సమీపించి అన్నాడు రంగనాధం.
    "కోడలి వరసేనా నచ్చింది!" వ్యంగ్యంగా నవ్వాడు శ్రీనివాసరావు.
    "తానేం చేసిందిప్పుడు అప్రతిష్ట.....మాటలని...."
    అప్రతిష్ట.....ఎవ్వరికో పుట్టిన బిడ్డని మీ మనవడిగా ఎత్తుకు ముద్దాడగలరా నాన్నా?"
    "ఎలా అంటున్నావ్? అంతమాట"
    "నాకూ, తనకూ ఆరునెలలయి సంబంధం లేదు"
    "లేదు. నమ్మను. నువ్వు వచ్చి నాలుగు నెలలయి ఉంటుంది."
    మనస్పర్ధల మూలంగా మా ఇద్దరిమధ్యా అంతకు రెండు నెలలు క్రితంనుంచీ మాట ల్లేవు".....ఆమెమీద ఉండే క్రోధం లోంచి ప్రతీ కార వాంఛలోంచి ప్రసరించాయా మాటలు.
    "పోనీ......ఎవరన్నా డాక్టర్ని సంప్రదించి...." ఆలోచనలో విషాదంగా ఉంది రంగనాధం వదనం.
    "భ్రూణహత్యా.....ప్రశ్నించాడు శ్రీనివాసరావు గొంతు వణుకుతూంటే. "ఆ మాట తండ్రి నోటి నుంచి వింటూంటే అతని మనస్సు గట్టిగా పిండినట్టయింది బాధగా ఎందుకనో.
    "అయితే ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తావటరా?"
    "తానే చేసుకుంది. నేనేం చెయ్యటం లేదు. నా నిర్ణయానికి అడ్డు తగలకండి. "విసురుగా వెళ్ళి పోయాడు శ్రీనివాసరావు.
    "ఏం చేద్దాం.....అలా ఇంటి కోడల్ని ఉసురుపెట్టొచ్చా!" అప్పటివరకు విశదమైన సంగతులు విని. ఇలా జరుగుతుందా! రమ అలాటి పిల్లా? అని నమ్మీ నమ్మలేకా సతమతమవుతున్న జానకమ్మ ప్రశ్నించింది.
    "మనమేం పెట్టామే ఉసురూ నువ్వూరుకో రేపొద్ధుట పట్నం వెళ్ళి సంగతేమిటో ఆ అమ్మా యిని కనుక్కుంటాను. ఎవారన్నా వింటే అప్రతిష్ట, నువ్వు నోర్ముయ్ కోడలు వెళ్ళిపోయిందే మని అడుగుతే సెలవులేదట అనిచెప్పు. భార్యను కసురుకున్నారు రంగనాధం.
    ఆ రాత్రీ లోకం మంచీచెడూ, పాపం పుణ్యం, ఎన్నో రకాలు హితబోధలు చేసి, రమకూ, కొడుక్కూ సామరస్యం కుదిరి మళ్ళీ కాపురం చెయ్యాలనే కాంక్షతో. అనునయించ బోయాడా తండ్రి. మొండి పట్టుదలే విడువని శ్రీనివాసరావు తండ్రినికూడా తూలనాడాడు.
    సహించలేని రంగనాధం. రాత్రి పదకొండు గంటల వేళ" ఎలా విడాకులిస్తావో చూస్తాను? అని గట్టిగా అరిచి లేచి నిల్చున్నారు.
    "ఎలానా?" అంటూ వికటంగా నవ్వి. నాకు ఈ కాపురం అక్కర్లేదు. అతనికీ నాకూ, "నాకూ పుట్టబోయే బిడ్డకూ ఏం సంబంధమూ లేదు. అతను మళ్ళీ వివాహం చేసుకోవచ్చు అని వ్రాసి విడాకులిస్తే ధన్యురాలే ... లేకపోతే దాని..... దాని మగ స్నేహితులు వ్రాసిన ఉత్తరాలు నా దగ్గరున్నాయ్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS