Previous Page Next Page 
అపశ్రుతులు పేజి 7


    ఆయనేరీ కనిపించరూ. దాచావేమిటి మాకు చూపకుండా అడిగాడు శ్రీధర్ నవ్వుతూ.
    లేదు మా "స్వగ్రామం వెళ్ళారు" అంది తనూ నవ్వబోతూ.
    "ఓ ఎప్పుడు వస్తారు?"
    వారంరోజులు పట్టవచ్చు.
    "ప్చ్....ఆయన్ని కూడా చూసి మా ఆవిణ్ణి నీకు పరిచయం చేసి...."
    ఇంకేమిటనుకున్నావ్ నవ్వింది రమాదేవి.
    మాకో అబ్బాయీ మీకో అమ్మాయీ కలిగితే వియ్యమందుకుందామని.
    పోండి....సిగ్గుపడింది శ్రీధర్ భార్య జానకి.
    వారున్న రెండురోజులూ, బామ్మా, భర్తా, ఆలోచనలకి తావులేకుండా సందడిగా గడిచి పోయాయి.
    వెళ్తూ. "రమ మునుపటిలా చలాకీగా లేదు. ఏదో డల్ గా ఉంటూంది" అన్నాడు శ్రీధర్.
    పేలవంగా నవ్వేసింది రమ.
    శ్రీనివాసరావు ఇంట్లో లేకపోవడం. బాధ కన్నా సంతోషమే ఎక్కువపాలేమో! రమలో "అబ్బ ప్రాణాన్కి స్థిమితంగా ఉంది. ఇంటికి రాగానే ఎత్తిపొడుపు మాటలు, అబ్బా ఆయన మాటలు తన హృదయంలో చురకత్తుల్లా గుచ్చుకునేవి. ప్రతి మాటలోవ్యంగ్యం. కూరవండడం దగ్గరనుంచీ చీర కట్టుకునేదాకా ఆయన ఇష్టాలు నాపై రుద్ధబోవడం. ఛీ....ఛీ చదువుకున్నారు మళ్ళీ ఎంత సంకుచిత హృదయం? ఎంత కుసంస్కార వ్యక్తిత్వం. వెళ్ళని గాలివాన వెలిసిన ట్లుంది నా జీవితానికేదో రిలీఫ్ ఇచ్చినట్టుంది....పెళ్ళి చేసుకోకుండా ఉంటే హాయిగా బ్రతికేదాన్ని ఇంకా ఎన్నో రకాలుగా శ్రీనివాసరావు వ్యక్తిత్వాన్ని ఏవగించుకుంటూ పది రోజులు గడిపింది రమ. ఉత్తరమైనా వ్రాయకుండా ఈయన ఉద్దేశమేమిటో! ఉద్యోగం వదిలినట్టు బార్యవి కూడా వదలించుకోవాలనికాబోలు.....చూస్తాను. ఎన్నాళ్ళిలా భీష్మించుకు మౌనంగా ఉండి పోతారో! నాకేం తిండి బత్తా ఈయన ఇయ్యక్కర్లేదు. అనుకున్న రమ మొండిగా రోజులు వెళ్ళదీస్తూంది. "ఆయన రిజైన్ చేశారట? ..... మరి వస్తూంటారా? .... ఏం చేస్తున్నా రిప్పుడూ? ఇలా ఇంకా చనువుతీసుకు ఏదో పొరపొచ్చా లొచ్చి ఉంటాయ్. రమా నువ్వు కాస్త తగ్గిపోవాలి. అని మందలించాడు కూడా. ప్రశ్నించడంతో పాటు స్నేహితుఊ, హితులూ, నిర్లక్ష్యంగా నవ్వేసేది రమాదేవి.

                                    *    *    *

    ఇద్దరు పాలేర్లని కుదుర్చుకుని సొంతవ్యవసాయం పెట్టాడు శ్రీనివాసరావు. పగలల్లా పొలం పనులలో లీనమైన శ్రీనివాసరావుకి రాత్రి పక్కమీద నడుం వాల్చేక భార్యా తనుపట్నంలో వేల్లదీసిన జీవితం గుర్తుకొచ్చేది.    
    తీవ్రంగా కసిగా ఉక్రోషంగా ఆలోచనలు దొర్లి ఎలా అన్నా ఆమెనుంచి విడాకులు తీసుకొని ఒక పల్లెటూరి అమ్మాయిని పెళ్ళి చేసుకొని తానుకోరు కొన్న జెవెఇథమ్ అనుభవించాలి అనే నిశ్చయానికి వచ్చి ఏ రాత్రికో నిద్రపోయేవాడు.
    ఓ రోజు పొలం నుంచి వస్తూనే వంట ఇంట్లో తల్లితో ఎవరిదో కొత్త గొంతు మాట్లాడడం విన్పించి తలుపు చాటునుంచి వంట ఇంట్లోకి చూశాడు. చప్పున అతని చూపులలా నిల్చిపోయాయి కొన్నిక్షణాలు.
    పచ్చని శరీరచ్చాయతో బొద్దుగా అందంగా వున్న పద్దెనిమిదేళ్ళ అమ్మయి పీటమీద కూచుని మోకాళ్ళ  మీద తల ఆన్చి రెండు చేతులూ కాళ్ళకు చుట్టుకొని జనికమ్మ వేసే ప్రశ్నలకు జవాబు చెప్తూంది.        
    తాను వచ్చినట్టు చిన్నగాదగ్గి అమ్మా! పిల్చాడు శ్రీనివాసరావు.
    వస్తానత్తయ్యా కంగారుగా లేచి నిల్చుందా అమ్మాయి.
    ఏం కావాల్సినా అడిగి తీసుకుపో శాంతా. అమ్మతో చెప్పు మొహమాటం వద్దని. తీరిక చేసుకు రేపోసారి వస్తాలే....అంది జానికమ్మ.
    ఎవరమ్మా ఆ అమ్మాయి?
    ఓరి గుర్తుపట్టలేదూ. ఎలిమెంటరీ స్కూల్లో పని చేసేవాడు జగన్నాధం మామయ్య. పోయాడు ఈమధ్య...అతని కూతురు.
    ఓ..... అతని కూతురు చిన్నపిల్ల నుకున్నాను.
    చిన్నదేవిటీ నీ బొంద ఆరేళ్ళయి పెద్ధమనిషయింది. మహమహవాళ్ళే చస్తున్నారు ఆడపిల్ల పెళ్ళిళ్ళు చెయ్యలేక....పాపం తిండి గడవని వాళ్ళు......ఎలా చేస్తారు. చాలా మంచి పిల్ల నా కేవో పనులు సాయం చేస్తూంటుంది. నువ్వింట్లో లేనప్పుడు.
    నేనింట్లో ఉంటే ఏం? అనాలోచితంగా ప్రశ్నించాడు శ్రీనివాసరావు.
    బాగుంది. మనమూ మనమూ ఎంతమంచివాళ్ళ మైనా లోకం అనే మాట మానేస్తుందా? ఇప్పటికే శ్రీనివాసరావు. పెళ్ళాల్ని వదిలేశాడని ఊరు అట్టుడికిపోతూంది.
    పోనీ అనుకోనీ....నష్టమేం లేదు. విసురుగా తన గదిలోకెళ్ళి పోయాడు శ్రీనివాసరావు.
    ఆ రాత్రి భోజనాలయి అందరూ వాకిట్లో మంచాల మీద కూర్చుని మాట్లాడుకునేటప్పుడు అంది జానికమ్మ. అబ్బాయ్ నాకు తెలియక అడుగుతాను.....మరి దాన్ని తీసుకురానా?....పోనీ ఓ ఉత్తరం ముక్కయినా వ్రాశావా! అని.
    తాను వ్రాసిందా అమ్మా.........తన ఇంటికి తాను రావడాన్కి నేను తీసుకురావాలా. వద్దమ్మా ఎప్పుడో ఓ రోజు వెళ్ళి......విడాకులు తీసుకుంటాను. నీకు నచ్చిన అమ్మాయిని చూడు మళ్ళీ పెళ్ళి చేసుకుంటాను.
    నోర్ముయ్....కసిరింది జానికమ్మ.
    తప్పు తప్పు ఏవో అభిప్రాయ బేధాలొస్తూనే ఉంటాయి. భార్యా భర్తలన్నాక సర్దుకు పోవాలి. ఏమే నిన్ను ఎన్నిసార్లు వీధిలో పెట్టి తలుపేశాను విడిపోయామా!" అన్నారు రంగనాధంగారు.
    చాల్లెండి.....మీరూ మనుషులే..... గతం గుర్తుకొచ్చిన జానికమ్మ అసహ్యంగా చూసింది రంగనాధం వైపు.
    హాస్యంకాదమ్మా నిజంగానే చెప్తున్నాను. "అది మంచిది కాదమ్మా! గుండెలనిండా ధైర్యం పుంజుకుంటూ తాను చెయ్యబోయే పనికి పునాది లాటి మాట....ధర్మం న్యాయం విస్మరించి రమ మీద ప్రతీకారం వాంఛ పురి కొల్పగా అన్నాడు శ్రీనివాసరావు.
    ఛ ఛ అవేం మాటలు రా....ఇన్నేళ్ళు కాపురం చేసి! ముక్కుమీద వేలేసుకుని మందలింపుగా అంది జానికమ్మ.
    మగా ఆదా భేదంలేకుండా ఫ్రీగా తిరగటం నువ్వు చూశావుగా!..... ఇంకా ఏవో సంబంధా లుండే ఉంటాయ్. లేకపోతే నాలుగు నెలలై వచ్చాను. భర్త కాపురం కావలసిన దైతే. కనీసం ఉత్తర మన్నా వ్రాసి ఉండాలిగా. లేదమ్మా ఎలాగో తెగతెంపులు చేసుకోవాలి.
    చ నోర్ముయ్ ఆ అమ్మాయి కెవరూ మంచీ చెడూ చెప్పివాళ్ళు లేరు. రేపు నేనువెళ్ళి కేక లేసి తీసుకువస్తానుండూ. అన్నాడు రంగనాధం.
    నాన్నా మా వ్యక్తిగత విషయాల్లో మీరు జోక్యం పెట్టుకోండి. చిరాగ్గా అన్నాడు శ్రీనివాసరావు.
    మీ ఇద్దరూ సఖ్యంగా కాపురం వెలగబెడుతూంటే అలానే బాబూ కాని. ఇద్దరి కిద్దరూ. ఆమె అక్కడా నువ్విక్కడా ఇంకింత పగలు పెంచుకు కూచుంటే పెద్దవాళ్ళం నోరు మూసుకు కూర్చోగలమా? నాలుగు  చీవాట్లేసి....
    ఎందుకు చీవాట్లు? మీకన్నా ఎక్కువ చదివింది మీ కోడలు. తన జీవితం ఎలా వెళ్ళబుచ్చు కోవాలో తెలియదూ! వ్యంగ్యంగా నవ్వాడు శ్రీనివాసరావు.
    ఛ. ఛ. ఛ వట్టి తెలివితక్కువ దిరా చదువు కోకపోయినా మీ అయ్యే నయం, కాపురం నిలబెట్టుకుంది.
    "కాపురం నిలబెట్టుకుంటుంది..... హు...... నాకొద్దు నాన్నా తనతో కాపురం." చివాలున ఇంట్లోకెళ్ళిపోయాడు శ్రీనివాసరావు.
    
                                  *    *    *

    అసుర సంధ్యవేళ అలసి నీరసంగా వచ్చిన రమవైపు జాలిగా చూస్తూ మంచినీళ్ళిచ్చింది జానకమ్మ.
    ఆమె చేతిలో గ్లాసందుకుంటూ 'మీ అబ్బాయి లేరా అత్తయ్యా?" ప్రశ్నించింది రమ.
    "ఉన్నాడు గదిలో అమ్మాయ్ నాకేమిటో భయంగా ఉంది. వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఉద్యోగం మానేసి ఇక్కడ వుండి పోతానని చెప్పు. ఎల్లాగో కాపురం నిలబెట్టుకో తల్లీ." నెమ్మదిగా అంది జానకమ్మ.
    మొహం కడిగి జానకమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ "కనీసం ఒక్కమాటైనా నాతో చెప్పకుండా. పోనీ వచ్చాక ఇన్నాళ్ళవరకూ ఓ ఉత్తర మైనా వ్రాయకుండా ఏమిటత్తయ్యా ఆయన ఉద్దేశం? నేను చచ్చినా బ్రతికినా మీ కెవ్వరికీ అక్కర్లేదన్నమాట నేనేం తప్పు చేశానని? నామీద అంత కోపం?" ఆమె గొంతు వణికింది దుఃఖంతో.
    "నెమ్మది..అంతా నీ పొరపాటని ఇవాళ ఒప్పేసుకో అమ్మాయ్ నా మాట విని......నువ్వేం అలా నీరసంగా కనిపిస్తున్నావ్.....వంట్లో బాగుందా?" ఆమెవైపు పరిశీలనగా చూస్తూ ఆతృతఃగా అడిగింది జానకమ్మ.
    "ఏమిటోలా ఉంటోంది నీరసంగా" అంటూ తలవాల్చింది రమ.
    "అబ్బాయి ఈ ఊరు వచ్చి ఎన్ని రోజులైందంటావ్ వాడేమీ చెప్పలేదే! ఇప్పుడెన్నో మాసం?" ఆమె గొంతులో ఏదో సంతోషం.
    "ఐదు......ఆయనవచ్చి నాలుగు నెలలైంది"
    తెలివి తక్కువ దానా? ఇద్దరిమధ్యా సఖ్యత లేకపోయినప్పుడు ఇలాంటి పరిస్థితిలో వాడికి దూరంగా ఉంటావా? వెళ్ళు వాడేమన్న ఎదురు వాదించరు. హెచ్చరించింది జానకమ్మ.
    తల్లీ, భార్యా ఇద్దరి సంభాషణా జాగ్రత్తగా పొంచివింటున్న శ్రీనివాసరావు. ఐదు.....ఆయన వచ్చి నాలుగు నెలలయింది" అన్న రమ గొంతువిని త్రుళ్ళిపడ్డాడు. తమ తండ్రి కాబోతున్నాడా? తళుక్కున మెరుపులా ఒక్కసారి అతని హృదయంలో పులకింతకలిగి మాయ మైంది. మళ్ళీ తన గత జీవితంవైపు పరుగులు తీసిన అతని మనసు ఉడికిపోయింది క్రోధంతో. లేదు. పిల్లా ఒద్దు జల్లావద్దు. ఇప్పుడే దన్నా ఉపాయంతో ఈమెను వదిలించుకోకపోతే జీవితాంతం భరించాల్సి వస్తుంది. రమతో తన జీవితం క్షణక్షణం నరకం అనుకున్న శ్రీనివాసరావు. త్వరత్వరగా ఆలోచించి ఏదో నిశ్చయానికి వచ్చాడు. పాపభీతితో అతని గుండెలు పీచుపీచుమన్నాయి.
    
                                   *    *    *

 

            

    గడపదాటి అడుగు లోపలికి పెట్టబోతున్న రమవైపు చూసి శ్రీనివాసరావు హృదయం చిన్నగా చలించి. మళ్ళీ కర్కశంగా మారిపోయింది. చివాలున వెనుదిరిగి కిటికీ ఊచలు పటుక నిల్చున్నాడు ఎటో శూన్యంలోకి చూస్తూ.
    "ఇన్ని రోజులు..... మీకు నన్ను చూడాలని పించలేదా?" అతని వైపొక్కసారి చూసి తలవాల్చింది 'ఆ గొంతులో నిష్ఠూరం. వ్యధ- అతను ఊపిరి బరువుగా వదిలాడు.
    "నన్ను వదిలి ఇన్నిరోజులు ఉండగలరని నేను అనుకోలేదు."
    కొన్ని క్షణాలిద్దరి మధ్యా భరించరాని మౌనం.
    "ఎందుకండీ అంత కోపం?" అంటూ అతన్ని ఆమె సమీపిస్తూంది. అతను విసురుగా పక్కకు నడిచాడు. టక్కున అతని చెయ్యిపట్టు కుంటూ "ఏదీ నావైపు ఒక్కసారి చూడండి. చాలా వీక్ గా ఉంది నా వంట్లో. బాబొ పాపో పుట్టాక మళ్ళీ సరదాగా పోట్లాడుకుందాం. మీ కోపం తాపం భరించే ఓపిక లేదు నా వంట్లో" అంది రమ నవ్వబోతూ.
    వారి దాంపత్య జీవితంలో ఆమె తల్లి కాబోతుందని విని. తాను తండ్రి కాబోతున్నాడని గర్వించే తియ్యని మధురమైన క్షణాలు విష పూరితాలై పోయాయ్. అతని మనస్సులో ఏర్పడిన కక్షా ప్రతీకార వాంఛా ఫలితంగా! వణికే గుండెల్ని చిక్కబట్టుకుని ఏదో ధైర్యాన్ని పుంజుకుంటూ. "నీకు పుట్టేబిడ్డ నా బిడ్డకాదు. వెళ్ళు నాకు నీ మొహం చూపించకు" అన్నాడు కటువుగా కాని సన్నగా ఆ గొంతు చలించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS