Previous Page Next Page 
అరుణోదయం పేజి 7


    "ఉహూఁ నాకు తెలియదు!" అని తల అటూ యిటూ త్రిప్పసాగింది. ఆమె ముఖం కందగడ్డలా అయింది.
    రాజశేఖరం ఆలస్యం చేయకుండానే, "నేనూ అరుంధతీ కొద్ది రోజులలో వివాహం చేసుకోబోతున్నామనైనా నీకు తెలుసా?" ఆమాట అంటూ చటుక్కున మొఖం పక్కకు త్రిప్పుకున్నాడు.    
    "అక్కా-!" ఒక్క ఉదుటున ఆ మాట ఆమెనుండి వెలువడింది.
    "అవును-అరుంధతీ నేనే!" నొక్కి నొక్కి అన్నాడు-అతడి కంఠంలో ఏదో తేలికదానం గూడా మిళితమైయున్నది.
    సహజంగా మానవుడి ప్రవృత్తి - తన నుండి తన ప్రియమైన వస్తువు ఎవరు దూరం చేస్తున్నారో తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తిని ద్వేషించటం - వీలు చిక్కినప్పుడల్లా మనస్సును గాయపరచటం మాటల్తో చిత్ర హింస చేయటం జరుగుతుంది. అలాగే రాజశేఖరాన్ని-తనకు అరుంధతిని అరుణ దూరం చేస్తున్నది-అవే అపోహ నరనరాన వ్యాపించి వున్నది. అందుకనే ఆమెను అమితంగా ద్వేషిస్తున్నాడు. కసురుకుంటున్నాడు. కోపగిస్తున్నాడు. ఆమె మనస్సును అన్నివిధాలా గాయపరుస్తున్నాడు.
    గాలి రయ్ న వీచింది.
    ఆపైన - వాళ్ళ భావోద్రేకాల నడుమ మాటల నడుమ -మబ్బులు ఎప్పుడు పట్టి నవో - జల్లు విపరీతంగా కొట్టసాగింది.
    వీళ్ళను వంటరిగా వదిలి, చాలాదూరంగా వెళ్ళిన పన్న పరుగెత్తుకుంటూ వచ్చాడు.
    రాజశేఖరం లేచి నిలబడ్డాడు.    
    పాలిపోయిన మొఖంతో, అరుణా అచేతనంగా లేచి నిలబడింది. తూలుతున్నట్లుగా ముందుకు అడుగులు వేయసాగింది.
    రాజశేఖరం అనుసరించాడు.
    వాళ్ళిద్దరూ బండి ఎక్కేటప్పటికే తడిసి ముద్దయ్యారు.
    అరుణ వణుకుతున్న పళ్ళను బిగించి, మోకాళ్ళ మీద గడ్డాన్ని ఆనించి శూన్యం లోకి చూస్తూ కూర్చున్నది.
    రాజశేఖరం మనస్సు ఏదో తెలియని తేలికదనంతో- స్వేచ్చగా హాయిగా తేలిపోతుంది.
    చివరికి కూర్చున్న అతడు తడుస్తున్నట్లినా బాధపడటం లేదు.
    "ఎక్కడైనా ఆపమంటారా బాబూ." గోపన్న అడిగాడు వెనక్కు తిరిగి. "మీరు బాగా తడిసిపోతున్నారల్లే వున్నది!"    "అక్కర్లేదు.. పోనీయి!"
    ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ శరీరాలు నదిలో మునిగి బయటకు వచ్చినట్లు న్నయి.
    తరువాత అరగంటకు తల ఒళ్ళుతుడుచుకొని భోజనానికి ఆయత్త మయ్యాడు రాజశేఖరం!

                                     *    *    *

    రాత్రి నిద్రలేని అరుణకు చాలా ఆలస్యంగా మెలకువ వచ్చింది. ఆమె కళ్ళు ఎర్రబడి మొఖమంతా పీక్కుపోయి వున్నది.క్షణక్షణానికి ఆమెను దహించివేసే ప్రశ్న- 'ఎందుకిలా జరిగింది?' అనే!    
    కిటికీలో నుండి తొంగి చూస్తున్న సూర్యుడు మరింత కలవరపరిచాడు.
    వడివడిగా లేచింది.
    "కాఫీ అయినా పెట్టలేదు! ఆయన ఏం చేస్తున్నారు?"
    రాజశేఖరం పడుకున్న గదిలోకి వచ్చి విభ్రాంతి జెందింది. ఇంకా అతడు లేవనే లేదు!
    ఇంకొద్దిగా ముందుకు వచ్చి దోమతెర తొలగించి చూచింది.
    అతడు, అలికిడయినా కప్పుకున్న దుప్పటయినా తీయలేదు. పెద్దగా ఒక్కసారి మూలిగి, పక్కకు ఒత్తిగిల్లి మాత్రం పడుకున్నాడు.
    "ఏవిటి? ఏవైంది?.. లేవండి!" అన్నది ఆత్రంగా కాస్త ముందుకు వంగి.
    దుప్పటి తొలగించి పేలవంగా అరుణ మొఖంలోకి చూస్తూ, "వళ్ళంతా నొప్పులుగా వున్నది.. తలంతా బరువుగా...ఏమి టోగా వున్నది!" అని మొఖం పక్కకు తిప్పుకోబోయాడు.
    "జ్వరంగాని రాలేదు గదా?"
    రాజశేఖరం చేయెత్తాడు. "చూడు!"
    అరుణ అతడి చేయి తాకి చూచింది.
    "మాడిపోతున్నది!" అన్నది భయం భయంగా అతడి మొఖంలోకి చూస్తూ!
    "రాత్రి రెండుసార్లు వాంతులు గూడా అయినయి!"
    "ఎందుకని?
    "ఏమో!" చిన్నగా నవ్వటానికి ప్రయత్నించాడు.
    "నన్నెందుకు లేపలేదు." నుదురు ముడి వేసి అడిగింది.
    "..అంతగా అవసరం అనిపించలేదు!" నిర్లిప్తంగా అని పక్కకు తిరిగి పడుకొని ముసుగు కప్పుకున్నాడు. "కాఫీ తయారవ్వగానే లేపు.. మొఖం కడుక్కొని త్రాగుతాను!"
    ...డాక్టర్ కు కబురంప వద్దా?"
    "నాకు అంత పెద్ద రోగవేమీ లేదుగాని అనవసరంగా నీవు గాభరా పడి నన్ను గాభరా పెట్టబోకు!" విసుగ్గా, విసురు వచ్చి నయి ఆ మాటలు.    
    అరుణ క్షణం ముందుకు వంగి ఏదో కోపంతో అనబోయింది. కాని నిగ్రహం జయించటంతో, ఒక్క నిట్టూర్పు విడిచి వెనక్కు తిరిగి వంట యింట్లోకి వెళ్ళి, కాఫీకి నీళ్ళు స్టౌ మీద పడవేయటంతో నిమగ్నురాలయిపోయింది!
    కాఫీ తయారయ్యేటప్పటికి యిరవై నిముషాలు పట్టింది.
    ఆమె తిరిగి పేస్టూ, నీళ్ళూ తీసుకొని వచ్చేటప్పటికి లేచి తల పట్టుకొని కూర్చొని వున్నాడు రాజశేఖరం.
    "కండ్లు తిరుగుతున్నయ్యా?"
    "లేదు!"
    "బాత్ రూంలోకి రాగలరా... ఇక్కడే బేసిన్ తెచ్చి పెట్టమంటా?"
    అతడు ఆమె మాటలను వినిపించుకొకుండానే, "గోపన్నను పిలువు" అన్నాడు.
    "దేనికి?... ఏం కావాలో చెప్పండి!"
    "నన్ను అనవసరంగా విసిగించబోకమని నీకు లక్షసార్లు చెప్పాను!!! నేను చెప్పిన పని చేయటమే నీ వంతు!" తీవ్రంగా అన్నాడు తలెత్తి.
    అతడి మాటలకు ఆమె మొఖం జేవురించింది. కోపం గుండెల్ని రక్కింది. విసురుగా బయటకు నడిచి పక్కగా వున్న గోపన్న గుడిసె దగ్గరకు అడుగులు వేసింది.

                                 *    *    *

                                         3

     
    పదకొండు గంటలయింది.
    కోపంతో వున్న అరుణకు రాజశేఖరం గదిలో కాలు పెట్టటం అంటేనే అసహ్యమేసింది. 'ఎందుకు అలాంటి వ్యక్తి కోసరం తను తాపత్రయపడాలి' అనుకున్నది.
    కాని-సూర్యుడు నడినెత్తి మీద కొస్తున్న కొలది ఆమెలోని కోపం మంచులా కరిగిపోయి దానిస్థానే జాలి ఉద్భవించసాగింది.
    దానికి తోడు డాక్టర్ వెళుతూ వెళుతూ రాజశేఖరానికి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చినయ్. బాగా తడవటంతో జలుబు మీద జ్వరం వచ్చింది... చాలా జాగ్రత్తగా వుండండి.. అవి ఇవి తిని ఏ న్యుమోనియా లోకో దింపించుకున్నారంటే తరువాత ఎక్కువ రోజులు బాధపడవలసి వస్తుంది!"    
    ఒక్కక్షణం-అక్కయ్యను రమ్మనమని వ్రాద్దామా-అని అనుకున్నది.
    అక్కడ ఆమెకు ఎలా వున్నదో?
    అతడి గదిలో కాలుపెట్టి, "ఆకలవుతున్నదా?" అని అడిగింది.
    "ఇప్పుడు టైం ఎంతయిందో నీకు తెలుసా?" తీక్షణంగా చూస్తూ అడిగాడు రాజశేఖరం.
    "పదకొండు గంటలయి వుంటుంది!"
    "పదకొండు గంటలయినా ఆకలి గాకుండా ఎలా వుంటుందనుకున్నావ్?"
    "ఆకలయినప్పుడు అడగవచ్చు గదా?" నుదురు చిట్లించి అన్నది.
    "అడగందే యివ్వదలుచుకోలేదా?"
    "అడగందే మీకేం కావాలో నాకెలా తెలుస్తుంది?"
    "రోగిష్టి మారి వాడికి ఏం కావాలో తెలుసుకునేటంత లోకజ్ఞానం గూడా నీకు లేదా?" మంచం మీద కోపంతో లేవబోయాడు.    
    అతడిని గంట పట్టి కడుపులో పేగులు కొరుక్కు తింటున్నయి.
    కాని అరుణను పిలిచి అడగటానికి అహం అడ్డుపడింది. ఆమె లేనిదే, ఆమె ఆసరా లేనిదే ఒక్కక్షణం గడవదనే అపోహ ఎక్కడ ఆమె పడుతుందో నని!
    కాని ఆమె బాధ అతడికి అర్ధంగాదు.
    అరుణ గిరుక్కున వెనక్కు తిరిగింది.
    ఫ్లాస్కోలో కాఫీ గాజుగ్లాసులోకి వంచి తీసుకువచ్చి రాజశేఖరం మంచం పక్కకు స్టూలు లాగి దాని మీద మోత అయ్యేలా పెట్టింది.
    అతడు లేచి కూర్చొని త్రాగసాగాడు.
    "అక్కయ్యను రమ్మనమని వ్రాద్దామనుకుంటున్నాను!" అరుణ తలవంచుకొని అన్నది.
    పెదాల దగ్గర పెట్టుకోబోతున్న గాజు గ్లాసును వెనక్కు తీసుకొని, తలెత్తి, కళ్ళు పెద్దవి చేసుకొని ఆమె మొఖంలోకి చూస్తూ "నీకు ఇలాంటి పనులు చేయాలంటే బాధగా వున్నదా? చెప్పు అరుణా!.. చెప్పు!....నాకు ఎవరి ఆసరా అక్కరలేదు... నీ కంత కష్టంగా వుంటే చెప్పు.. ఏ ధర్మాసుపత్రిలోనైనా జేరుతాను.. అంతేగాని..!"అతడి మొఖం కందగడ్డలా మారింది. అతడి పెదాలు వణుకుతున్నయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS