పేదల పార్టీలో సభ్యుడు గనక పేదగా బతకాలని నిర్ణయించుకున్నారు. తండ్రీ తాత లిచ్చింది, స్వయంగా (కష్టించి?) సంపాయించిందీ ప్రజల కళ్ళల్లో పడకుండా మూసి పెట్టి-
"నేను పేదను. నా వెనుకున్న ప్రజావాహిని పేద- మా కష్టాలు తొలగించుకునే రోజుకోసం మేమంతా కష్టపడతాం. ఈ కష్ట పడటంలోనే నాకు సుఖముంది, ఈ కష్టపడటంలోనే నా మనస్సుకి తృప్తి వుంది." లాటి నినాదాలు ప్ర్రారంభించేరు.
శ్రీవారు తమ దర్జానూ, హుందానూ మనసులోనే దాచుకుని పేదల కష్టాలను తొలగించబోయే మహత్తర వ్యక్తి అని బోర్డు తగిలించుకున్నారు.
నెమ్మదిగా చిన్న సింహాసనం సంపాయించేరు. ఇప్పుడు వారు పుర పాలకులకు ప్రభువు-లేదూ-పుర ప్రభువు. చేతనైన సేవ చేస్తూనే వున్నారు.
ఆ మధ్య- అనగా- అయిదారేళ్ళ క్రితం శ్రీవారు తమ జాతి పెద్ద నాయకులొకర్ని, ఆ నాయకులింటి దగ్గిర కలుసుకోడం జరిగింది.
ఆ నాయకులంగారిది యిల్లుగాదు- ఖరీదైన భవంతి. ఆ భవంతిలో చాపలూ, పీటలూ, కావిడిపెట్టెలూ కనుపించలేదు. సోఫాలూ, ఫేనులూ, ఫ్రిజిడేర్లూ, ఫోనులూ, రేడియోగ్రాంలూ కనుపించేయి.
ఆ రోజక్కడ పెద్ద విందు కూడా జరిగింది. విందులో ఖరీదైన మందుని చూచి, విందు నవతలకి తోసేరు హాజరైన అతిథులు. అక్కడ వాళ్ళంతా హాయిగా, కులాసాగా గడిపేరు.
శ్రీవారు మనసులో కొంచెం 'ఇది' ఫీలయ్యేరు. పేదల పార్టీ నాయకులకు భవంతులుండుట, విందులు కుడుచుట, వినోదాలలో తేలుట తప్పుకాదేమోనని కించిత్తు యోచించేరు.
ఆ భవంతి నుంచి బయట పడ్డ తర్వాత తన పక్కనున్న మనిషిని నాయకులంగారి భోగట్టా తెలుపవలసిందిగా కోరేరు.
ఆ మనిషి అతివినయంగా మనవి చేసేరు-
"నాయకులెవరనుకున్నారు? పెద్ద భూకామందులు. నాయకులు గారి పిల్లలిక్కడ లేరు. ఇద్దరూ అమెరికాలో వున్నారు. పెద్ద అల్లుడు గూడా అక్కడే చదివి, ఇక్కడ మన దేశంలో డాక్టరీ చేస్తున్నారు. నాయకులుగారి పూర్వీకులు మోతుబరులు. పార్టీ నిమిత్తం యిలాంటి భవంతులు పదో పదహారో దానంచేసినట్టు విన్నాను. అవి దానం చేయగా మిగిలింది యిదొక్కటే! ఈ ఒక్క దాంతోనే పాపం ఎల్లాగో సర్దుకొస్తున్నారు.......ఎంత త్యాగం చేశారో మీకేం తెలుసు మహ ప్రభో!......వారు దీనజనోద్దారకులే మరి!
ఇంతవిన్న శ్రీవారు తెలివితక్కువ మనిషికాదు. శ్రీవారు నాయకులుంగారి గురించి ఆలోచించేరు-
"ఈ నాయకుడు కడు సమర్ధుడు. ఈ నాయకుడు సోఫాలమీద విశ్రాంతి తీసుకోడం తెలిసినవాడు, అయితేనేం రాళ్ళెత్తే కూలీలని గురించి బాగా చెప్పగలడు. ఈ నాయకుడు ఎయిర్ కండిషన్డు గదుల్లో గడుపుతున్నవాడు, అయితేనేం ఎండల్లో మలమలామాడే పేదల వాధలు తెలుసుకున్నవాడు. ఈ నాయకుడు కారుల్లో తిరిగేవాడు. అయితేనేం గాక పీడిత ప్రజల నరాల అశక్తతకి కంటతడి పెట్టగలడు. ఈ నాయకుడు విదేశీయ మత్తు పానీయ సేవనలో సిద్దహస్తుడు, అంత మాత్రాన తోటి దీనులకు దొరకని గంజికోసం చింతించడం తెలీని వాడుకాడు. భళిరా భళి..... ఎత్తుగడలలో పెద్దవాడిని. పేద పార్టీ నాయకులలో ఉత్తముడివి?
ఆ నాటినుంచి శ్రీవారు మానసికంగానూ, భౌతికంగానూ మారిపోయేరు. కూడబెట్టిన ధనం, దాచుకున్న సరదాలూ బైటికిలాగి చాలా పబ్లిక్కుగా "ఎంజాయ్" చేయడం ప్ర్రారంభించేరు. మాటకు ముందు ఆ పెద్ద నాయకుడితో పోల్చుకోడం చేస్తున్నారు. శ్రీవారి పూర్వీకులు గూడా దొరబాబులనే నగ్నసత్యాన్ని తమ మనుషుల ద్వారా ప్రచారంలోకి తెచ్చే ఏర్పాటు చేసేరు.
అప్పుడుగూడ తిమ్మాపురవాసులకు శ్రీవారివల్ల గౌరవాభిమానాలు దినదిన ప్రవర్ధమానమయ్యేయేగాని కించిత్తు గూడ తగ్గలేదు; శ్రీవారిని శంకించనూ లేదు.
ఈ మధ్య శ్రీవారి రాజకీయ జీవితంలో కొన్ని చికాకు లేర్పడ్డాయి. శ్రీవారి చేతికింద బతికే మనుషులగ్గూడా శ్రీవారి లక్షణాలు వంటబడుతూన్నట్టు గ్రహించగలిగేరు.
తిమ్మాపురాన్ని ఏలుబడి చేస్తున్న తమ పార్టీలో వర్గాలు సైతం ప్రవేశించేయి. శ్రీవారికి తలపోటొచ్చి పడింది. ప్రజాసేవకి ఈ వర్గాలేమిటి?
ఇప్పుడిప్పుడే శ్రీవారు ప్లేటు మార్చేటందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
పార్టీరహిత ప్రజాసేవ చాలా ఉత్తమమైనదని శ్రీవారు కొన్ని సభల్లో సూచాయగా సెలవిచ్చేరు. అది విన్న తమ పార్టీ మనుషుల్తోపాటు ప్రజలూ ముక్కులమీద వేల్లేసుకున్నప్పుడు-
"తప్పు! మీరలా ఆశ్చర్యపడకూడదు. నేన్నిజమే చెబుతున్నాను. మన తిమ్మాపురానికి పార్టీలొద్దు. పార్టీలెన్ని వున్నా ప్రజాసేవకే కదా! అలాంటప్పుడు ఇన్ని పార్టీ లెందుకు? అసలు పార్టీ ఏమిటి బొత్తిగా? పార్టీలున్న దగ్గిర్నుంచీ వర్గాలనీ, పిండా కూడు ముఠాలనీ ఎక్కువై, నాయకుల్లో తగూలెక్కువై, ప్రజాసేవ తక్కువై పోతుందేమోనని నా భయం. అందుచేత వర్గరహిత, ముఠారహిత, పార్టీరహిత ప్రజాసేవే ఉత్తమోత్తమైనదని నేనిప్పుడు భావించక తప్పడంలేదు. అయితే దీనికి కొంతకాలం పడుతుంది. అంతవరకూ వేచివుందాం," అని సముదాయించేరు.
రాను రాను ప్రజల్లో దైవ చింతన అధికమవడం -మొదట్లో శ్రీవారికి ఆశ్చర్యం కలిగించింది. వారికేమీ పట్టనట్టు మౌనం వహించేరు. పూజలూ, వ్రతాలూ, భజనలూ తిమ్మాపురంలో వృద్ధిచెందుతున్నాయి. సరిగ్గా అప్పుడే - ఈ పార్టీలకూ, రాజకీయాలకూ దూరంగా బతుకుతూ, మనిషిలో గూడుకట్టుకున్న అజ్ఞాన తిమిరాన్ని తొలిగించే స్వచ్చంద సేవతో స్వాములు రాక లెక్కువయ్యేయి.
ప్రజలు ప్రభువుని మరిచి స్వాములకి భజనలు చేయడం కళ్ళారా చూసేరు రామదాసు. వళ్ళుమండిపోయింది శ్రీవారికి. ఈ ప్రజలందరూ కళ్ళు పోగొట్టుకొని - ఎవడో స్వామి వెంటబడటమేమిటి, వేలంవెర్రని చెప్పి విసుక్కున్నారు. కాని, ప్రజల్లో స్వామి భక్తి మరింత పేట్రేగి పోయిందిగాని అదుపులో లేకపోయింది.
