Previous Page Next Page 
గుళ్ళో వెలిసిన దేవతలు పేజి 7


    "ఇలాటివి మనం సమర్ధిస్తున్నామంటే అందరూ మనని ఆడిపోసుకుంటారు లేని పోనిది..."
    "రేపొద్దున్న మన పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోతే మనని ఆడుకునే వాళ్ళెవరండీ?"
    "అయినా ఆడదన్నాక కాస్త జాగ్రత్తగా ఉండద్దూ! అరిటాకు లాంటిది ఆడదాని బ్రతుకు...."
    -ఇలా చెలరేగాయి విమర్శలు. ఒకరిద్దరు మాత్రమే పావని ఆలోచన బాగుందన్నారు. అన్యాయంగా సంఘానికి బలైపోతున్న అమాయక స్త్రీలను ఆదుకోవలసిందే అన్నారు.
    ఆ ఒకరిద్దరి అండదండలే తనకు చాలనుకుంది పావని. ఒక ఇల్లు అద్దెకు తీసుకుని 'పురోగతి' సమాజాన్ని స్థాపించింది.
    ఆ ఊళ్ళో భాగీరదమ్మని తెలియనివాళ్ళు లేరు. ఆవిడ పూర్వ సువాసిని పెద్దగా చదువుకోలేదు కానీ హరికథలు బాగా చెప్తుంది. జరీ అంచున్న కంచి పట్టుచీర కట్టుకుని, మేడలో పొడుగాటి పువ్వులదండ వేసుకుని చిరతలు చేత్తో పట్టుకుని లయగా అడుగులు వేస్తూ ఆవిడ హరికథ చెప్తోంటే అందరూ ముగ్ధులయిపోతారు. భర్తలు ఉద్యోగాలకు పోగానే ఏమీ తోచని పెద్దగా చదువుకొని గృహిణులు, పూర్వ సువాసినులు, ఆకతాయి అల్లరి పిల్లలు, ఆవిడ హరికథలకి ప్రతిరోజూ హాజరవుతారు. కథ చెప్పటంలో ఆవిడ నేర్పరి. ఒక విధమయిన ఉద్రేకంతో పురాణగాధలన్నీ రసవత్తరంగా చెప్పుకుపోతుంది. తానై సొంతంగా ఏదీ ఆలోచించలేకపోయినా ఆ పురాణాల్లోవి తానే చెప్తున్నట్లు ఆర్భాటం చేస్తుంది. మధ్య మధ్య పురాణాల్లో పిట్టకథల్లాగ సాంఘిక దురన్యాయాలని ఖండిస్తూ కొన్ని నీతికథలు కూడా చెపుతూంది-అక్కడితో తానేదో అభ్యుదయవాదిననే అహంకారం కూడా ఉంది ఆవిడకు.
    ఆ ఊళ్ళో అయిదారు భజన మందిరాలున్నాయి. భాగీరధమ్మ ఏ భజన మందిరంలో హరికథ చెప్తుందో ఆ భజన మందిరానికి ఆనాడు హారతి పళ్ళెంలో బోలెడు డబ్బులు పడతాయి. హారతి పళ్ళెంలో పడే డబ్బులకోసం భజనమందిరాలన్నీ ఆవిడకి అన్నివిషయాల్లోనూ అండగా నిలుస్తాయి. పురాణాల్లో హాస్యంలాగ ఆవిడ ఊళ్ళో అందరినీ విమర్శిస్తుంది. "జానకమ్మ పెళ్ళయినా రెండు జడలేసుకున్నట్లు..." "సుశీలమ్మ లావుగా వున్నా జార్జెట్ చీర కట్టుకున్నట్లు-" అనేస్తుంది తమని కాకుండా మరొకర్ని వెక్కిరించటం అందరికీ హాయిగానే ఉంటుంది గనుక అందరూ నవ్వుతారు. అక్కడితో తను బ్రహ్మాండంగా హాస్యం పోషిస్తున్నానని మురిసిపోతుంది... ఇలా అందరినీ నోటికొచ్చినట్లు దుమ్మెత్తిపోసే భాగీరదమ్మ తనను ఎవరైనా ఏదైనా అంటే మాత్రం ఊరుకోదు.
    "అర్జునుడు మత్స్యయంత్రం కొట్టి సుభద్రణు పెళ్ళిచేసుకున్నాడ"ని, బ్రహ్మాండంగా కథ చెప్పేస్తుంది. ఏదో కాలక్షేపంకోసం కథ వినేవాళ్ళూ, ఓనమాలు తెలియనివాళ్ళూ, ఆవిడ ఏం చెప్పినా తలలూపేస్తారు. కాస్త తెలిసినవాళ్ళు ఎవరైనా "అమ్మా! అర్జునుడు మత్స్యయంత్రం కొట్టి పెళ్ళిచేసుకున్నది ద్రౌపదిని, సుభద్రణు కాదు "అని చెప్పారనుకోండి ఈ మాత్రం విమర్శనుకూడా సహించలేదు.
    "చూసారా! నేనంటే ఈర్ష్యతో కళ్ళుకుట్టి నన్ను ఆడిపోసుకుంటున్నారు. సుభద్ర అయితేనేం? ద్రౌపది అయితేనేం? నేను కథ రక్తిగా చెప్పానా లేదా?" అని విరుచుకుపడుతుంది.
    ఆవిడ నోటికీ, ధాటికీ భయపడి చాలామంది ఆవిడకి అల్లంతదూరంలోనే తప్పుకుంటారు...
    అలాంటి భాగీరదమ్మ తన ఇంటికి వచ్చిందనగానే పద్మావతి గుండెలు దడ దడలాడాయి. ఏదో ఒక పెంట సృష్టించడానికి తప్ప భాగీరదమ్మ రాదు.
    ఒక్క బొట్టుతప్ప మిగిలిన అలంకారాలన్నీ అన్ని వేళలా ఉంటాయి భాగీరదమ్మకి....కంచిపట్టుచీర పొడుగాటి చంద్రహారాలు-ఆ పైన ఒక రాళ్ళనెక్లెస్-మోచేతివరకూ గాజులు....జుట్టుజారుముడి వేసుకుంటుంది ఆ వేసుకోవటంలో జుట్టంతా వదులుగా ముఖంమీద పడేలా స్టైల్ గా వేసుకుంటుంది. ఆ వయసులో ఆ అలంకరణ ఎబ్బెట్టుగా తోచి అందరూ లోలోపల నవ్వుకుంటారు.
    "రండి! రండి! కూచోండి!" అని కంగారుగా ఆహ్వానించింది పద్మావతి.
    పద్మావతి చూపించిన కుర్చీలో పట్టుచీర కుచ్చెళ్లు నలక్కుండా నిండుగా కూచుంది భాగీరధమ్మ.
    పద్మావతి హడావుడి పడుతూ కాఫీ తయారుచేసి తీసుకొచ్చింది.
    ఆ కాఫీ కప్పు చేతిలోకి తీసుకుని "ఇంతకూ ఇవి గేదె పాలేనా? బూత్ మిల్క్ తో కాఫీ నేను తాగను." అంది దర్పంగా భాగీరధమ్మ.
    "అయ్యో! గేదెపాలే! పొడుగున పిండిన పాలు!"
    విన్న వించుకుంది పద్మావతి.
    కాఫీ ఒక్కొక్క చుక్క తాగుతూ ప్రారంభించింది భాగీరధమ్మ...
    "అందరూ అంటూంటే నమ్మలేకపోయాను. ఎలా నమ్ముతాను? నాకు మీ కుటుంబం చిన్నప్పటినుండీ తెలుసు! ఎలాంటి సంప్రదాయం! అలాంటిది మీ కోడలేమిటి? ఇలా చెయ్యటమేమిటి?"
    పద్మావతికి చెమటలు పడుతున్నాయి.
    "మా కోడలా? పావని...అది చాలా మంచిది-" అంది తడబడుతూ.
    "ఏం మంచండీ? గెడమంచి? చెడిపోయినా తప్పులేదని బాహాటంగా చాటుతూ చెడిపోయినవాళ్ళకోసం సమాజంకూడా పెడుతోంటే?? హవ్వ! ఎక్కడైనా ఉందాఅండీ ఇది" లోకంలో ఇంక వీటి నియమాలు నిలుస్తాయా? లోకం సమగతి వదిలెయ్యండి అగ్నిహోత్రంలాంటి కుటుంబం. మీ కుటుంబానికి ఇలాంటి మచ్చ" మీ ఇంటికోడలు 'ఆడది చెడిపోయినా ఫరవాలేదు. చెడతిరిగినా తప్పులేదు' అని సమాజాలు స్థాపిస్తోంటే మీ అనుపమ నెవడు పెళ్ళిచేసుకుంటాడండీ? ఇంక ఊళ్ళో మీరు తలెత్తుకు తిరగ్గలరా? రామ! రామ!"
    పద్మావతికి మతిపోయింది. మాట రావటంలేదు.
    "మీరు నాకు మొదటినుంచీ తెలుసు. అందుకని పనికట్టుకొచ్చి చెప్పాను. లేకపోతే ఎవరెలాపోతే నాకేం? వస్తానండీ!" అని వెళ్ళిపోయింది భగీరదమ్మ.
    భాగీరధమ్మకి పావని అంటే ఒళ్ళుమంట....పావని ఏనాడూ భాగీరధమ్మ హరికథలను మెచ్చుకోదు. పైపెచ్చు ఆ హరికథల్లో ఆవిడ చెప్పే అస్తవ్యస్తాలన్నీ అందరికీ చెప్పి నవ్వుతుంది. పావనిపైన తన కసి తీర్చుకోవాలని భాగీరధమ్మ మనసు ఎంత ఉడికిపోతున్నా, ఇన్నాళ్ళుగా అవకాశంరాలేదు. హాస్యంలో పెట్టి విమర్శిద్దామన్నా వీలుకాలేదు. తానొకటంటే అదే మాటను తనమీదకే తిప్పి వెక్కిరించగలిగే చమత్కారం ఉంది పావనిలో...అందుకే కాస్త తగ్గింది ఇన్నాళ్ళూ .... ఇప్పుడు దొరికిన ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలనుకుంది. సమాజం దేన్నైనా సహిస్తుంది. కానీ తన నియమాలణు బాహాటంగా ధిక్కరించిన వాళ్ళను మాత్రం క్షమించదు. ఈ సమాజపు అండతో పావనిని సర్వనాశనం చెయ్యవచ్చును.
    పావని రాగానే విరుచుకుపడింది పద్మావతి...
    "ఏమిటే? ఈ ఇంటి పరువు ప్రతిష్టలు మంటగలిపి కాని నిద్రపోవా?"
    సాధారణంగా తనను ఒక్కమాట అనని అత్తగారు తనమీద ఇలా విరుచుకుపడేసరికి పావని తెల్లబోయింది. ఆవిడ సహజంగా ఇలా మాట్లాడదు ఎవరో రెచ్చగొట్టి ఉండాలి.
    "భాగీరధమ్మ వచ్చిందా ఇక్కడికి?"
    "ఎవరొస్తేనేం? ముందిది చెప్పు? ఆడవాళ్ళు చెడిపోయినా ఫరవాలేదని అంటున్నావుట? అలా చెడిపోయిన వాళ్ళకోసమే సమాజం పెట్టావుట!..ఇదిటే. నువ్వు పెట్టిన సమాజం?"
    "ఆడవాళ్ళు చెడిపోయినా ఫరవాలేదని నేను ఆనలే దత్తయ్యా! పరిస్థితుల ప్రాబల్యంవల్ల కొందరు, కొందరు తమ తప్పేమీ లేకపోయినా సమాజం ముందు దోషుల్లా నిలవవలసి వస్తోంది అలాంటి వాళ్ళను సమాజం బారినుండి రక్షించాలనీ, అసలు సామాజిక దృక్పధంలోనే మార్పుతేవాలనీ నే నంటున్నాను..."
    పావని చెప్పిన మాటలు ఏ మాత్రం అర్ధంకాలేదు పద్మావతికి...
    "మొత్తంమీద నీ సమాజంలో ఉండేది చెడిపోయిన వాళ్ళేగా!" అంది కోపంగా...
    ఆవిడకు ఎలా వివరించాలో పావనికి అర్ధం కాలేదు.
    "వాళ్ళు, పాపం మంచివాళ్ళే అత్తయ్యా!"
    "పెళ్ళికాకుండా కడుపులు తెచ్చుకున్నవాళ్ళూ మొగున్నొదిలి బయటికొచ్చినవాళ్ళూ మంచివాళ్ళెలా అవుతారు పిచ్చిదానా! ఏదో తెలిసీ తెలియక వెధవ సమాజం పెట్టావులే కాని, రేపటినుంచే ఆ సమాజం మూసిపారెయ్యి. మనలాంటిసంసారుల కిలాంటివి బాగుండవు."
    తేల్చి చెప్పేసింది పద్మావతి పావని సమాధానం చెప్పలేదు. కానీ సమాజంలో తాను ఎదుర్కోబోయే సంఘర్షణ ఇంట్లోనే ప్రారంభమయిందని అర్ధంచేసుకుంది...
    దేనినైనా ఎదుర్కోవాలని ఎలాంటి త్యాగానికైనా సిద్దపడాలనీ స్థిరంగా సంకల్పించుకుంది పావని....విఠల్ రాకకోసం ఆరాటంగా ఎదురుచూస్తూ కూచుంది.... తన మనసులో కలతలన్నీ విఠల్ కు చెప్పుకుంటే కొంత ఊరట కలుగుతుంది.
    విఠల్ ఆ రోజు రావటమే చికాగ్గా వచ్చాడు. అతడి ముఖంచూసి తన సమస్యలు చెప్పుకోవటానికి భయపడింది. భోజనాలవీ అయాక పడకగదిలో విఠల్ కరుగ్గా అడిగాడు...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS