"కొండదేవుడు గొప్పవాడే కావచ్చు సార్, కానీ, మీ విజయం -"
"ఏంటయ్యా నీ ఇది? ఎవడి బతుకు ఎవడి చేతిలో వుందో నీకేం తెలుసు? లేనిపోని పెత్తనం నెత్తినేసుకు తిరగమాకు ఎల్లెల్లు! యేర్పాట్లు చూడు!" పైడయ్య సుందరాన్ని కసిరికొట్టేడు.
పుట్టెడు బాధతో గదినొదిలి వచ్చేసేడు సుందరం గది వొదిలేసింతర్వాత లోలోపల కసిగా తిట్టుకున్నాడు.
ఇంత చదువుకుని అలలురాని మనిషికి నేను బానిసనైపోయాను. 'ఛీ గాడిదా!' అని ఆ మనిషి కేకలేస్తే నోరు నొక్కుకు చావవలసిన దుర్గతి నా.. 'దేవుని కంటే నువ్వు గొప్పరా తండ్రీ' అని అతన్ని స్తుతిస్తుంటే అర్ధం చేసుకునేపాటి స్తోమత లేకపోయిందితనికి. ఈ జాతి మంత్రితో ఎన్నేళ్ళు ఎన్ని బాధలు పడాలోగదా.
* * *
అదేమంత పెద్ద కొండకాదు. ఆ మాటకొస్తే - అది కొండకానేకాదు. ఆ చుట్టుపక్కల చెప్పుకోదగ్గ కొండలే లేవు. ఒక గుట్ట, పెద్దగుట్ట, కొండేమో నన్న భ్రాంతి కలిగించే సైజులో వున్న దిబ్బ! సరిగ్గా, ఆ దిబ్బ మీదనే వెలిసేడు కొండదేవుడు.
కిటకిటలాడిపోయే జనం. అంగుళం విడవకుండా అంగళ్ళు, టీకొట్లూ, టూరింగ్ సర్కస్ డేరాలూ, గిరగిర తిరిగే రంగుల రాట్నాలూ, కొండదేవుడికి ఆసరాగా ఉన్న చిన్న చిన్న (ఇతర దేవుళ్ళు) గుళ్ళు. ఈ వాతావరణానికి దూరంగా ఊరు.
ముందు మంగళవాద్యాలూ, ఆ వెనక సన్నిహితుల్తో పాటు మంత్రి పైడయ్య నడుస్తున్నాడు. ఆయన భారంగా అడుగులు వేస్తున్నా భక్తిభావంతోనే నడుస్తున్నాడు. రెండు చేతులూ, జోడించి వున్నాడు. పట్టు వస్త్రాలతో ధగధగా మెరిసిపోతున్నాడు. కుడి ఎడమల చూస్తున్నాడు. అప్పుడప్పుడూ - చేతులెత్తి ఆకాశం వేపు అర్ధనిమీలిత నేత్రాల్తో చూస్తో, పెదాల్ని కదుపుతూ ప్ర్రార్ధన లేవో చేస్తున్నాడు.
పైడయ్యది నిండైన విగ్రహం నలుపు రంగైతేనేం చక్కగా నిగనిగలాడుతోంది శరీరం. ఆఫ్రికా అడవుల్లో బాగా బలిసిన నల్లటి దున్న నీటికోసం నడుస్తున్నప్పుడెల్లా వుంటుందో అల్లాగే వున్నాడు. పట్టువస్త్రాలు ధరించి వున్నాడు గనక, ఒకరకమైన పూజ భావం అ ఆమనిషి మీద రుద్ధబడింది.
మంత్రి గుంపు వెనగ్గా జనం గుంపు నడుస్తోంది. ఈ జనం గుంపునుంచి జయజయ నినాదాలు చుట్టు పక్కలంతా మార్మోగుతున్నాయి. కొండదేవుడ్నీ, మంత్రి వర్యుడ్నీ కలిసేసి జాయింటుగా జై కొడుతున్నాడు ప్రజ.
నినాదాలకు పైడయ్య మరింత బరువెక్కి పోతున్నాడు. ఒక్కో 'జై'కి ఒక్కో అడుగు హుందాగా, ఠీవిగా మరియూ బరువుగా పడుతోంది.
సుందరానికి విసుగ్గా ఉంది... చిరాగ్గా వుంది. రోతగా వుండి వళ్ళు మండిపోతోంది. ఈ కొండ దేవుడెవడు? మనుషుల్తోపాటు మంత్రిని సైతం ఆకర్షించే ఈ దేవుడి చరిత్ర ఏమిటి? ఇన్ని ప్రశ్నలు అతని మెదడును తొలుస్తుండగా -జనం కోసం అతను గూడా చేతులు జోడించి నడుస్తున్నాడు.
పైడయ్య కొండ అంచున నిలబడ్డాడు. ఆ తర్వాత సాష్టాంగ ప్రణామం చేసేడు. చుట్టుప్రక్కల జనం కొండదేవుడికి పైడయ్యగారికి, జయజయ నినాదాలు దిక్కులు మార్మోగే విధంగా చేసేరు. పైడయ్యగారి వళ్ళు పులకరించింది. సాష్టాంగ ప్రణామ భంగిమ నుంచి అతి కష్టం మీద లేచి నుంచున్నాడు. అప్పుడాయన, దూడని చంపిన పులిలాగున్నాడు. చుట్టూతా చూసేడు.
ఎందుకోగాని - పైడయ్యగారు అకస్మాత్తుగా నవ్వేసేడు.
సుందరం ఉలిక్కిపడ్డాడు. మంత్రి యింకా నవ్వుతూండడం అతన్ని కలవరపెట్టింది. గబుక్కున మంత్రిగార్ని గిల్లేసాడు.
పైడయ్య నవ్వునాపి సుందరం వేపు చూసేడు. సుందరం తలొంచుకున్నాడు. ఆయన కొండెక్కడం ప్రారంభించేడు. సుందరం అనుసరించేడు. పోలీసులూ, తదితర ముఖ్యమైన వ్యక్తులూ కదిలేరు. ఆ తర్వాత సామాన్యులు కూడా కొండెక్కడం ప్ర్రారంభించేరు.
* * *
ఆ రాత్రి -
రహదారి బంగళాలో పైడయ్య గార్ని వదిలి మనుషులంతా వెళ్ళిపోయిం తర్వాత సుందరం వచ్చి పైడయ్యగార్ని కలుసుకున్నాడు.
"కూకోవయ్యా" అన్నారాయన.
పైడయ్య కళ్ళు ఎర్రగావున్నాయి. ఆయన నల్లటి బుగ్గలు సైతం కందివున్నట్లు లేక ఎరుపు రంగులో తళుక్కుమంటున్నాయి. సోఫాలో కూర్చున్న మనిషి వూగిపోతున్నారు. ఆయన మాంచి ధీమాగా వున్నాడు. కొంచెం భయంకరంగానూ వున్నాడు.
సుందరం కూర్చున్నాడు.
"యేళాపాళాలేకుండా గిల్లెస్తే ఎట్టా?"
"కొండదేవుడి గొప్పేంటో మీరంతా చెప్పేరు. ఆ దేవుడ్ని తక్కువ చేసినందుకు ఉదయం నన్ను మందిలించేరు గూడాను. అలాంటిది కొండెక్కుతూ తమరు నవ్వబోతూంటే భయమేసి గిల్లేను. తప్పయితే మన్నించండి"
సుందరం సంజాయిషీ విని పైడయ్య నవ్వేడు. చాలా సరదాగానే నవ్వేడు. అయితే, అది క్రూరంగా నవ్వినట్టు సుందరం భావించాడు. పైడయ్య గారి నవ్వులు గొప్ప విడ్డూరంగా వుంటాయి. ప్రజల ముందు నవ్వు. పైవారికి విసిరే నవ్వు. ఆత్మీయుల మధ్య వచ్చే నవ్వు. కింది వాళ్ళని మందిలించేప్పుడు ఉపయోగించే నవ్వు. ఇలాగ రకరకాల నవ్వులు ఆయనకీ బాగా తెలుసు.
ఆయన నవ్వు తాలూకు రకాలూ, లక్షణాలూ క్షుణ్ణంగా తెలిసివున్న సుందరం సైతం ఈ నవ్వు ఏ జాతి నవ్వో తెలీక అందోళన చెందేడు. పైపెచ్చు గంట క్రితం పైడయ్యగారి కోపం ఆయన మిత్రుడు మాణిక్యం ఏర్పాటు చేసిన ఘనమైన పార్టీ గుర్తుకురాగా - యింకాస్త భయపడి నోరు మూసుక్కూచున్నాడు సుందరం.
పైడయ్య నవ్వునాపి సుందరాన్ని ప్రశ్నించాడు.
"ఇంతకీ ఈ కొండదేవుడు ఏ పార్టీ వోడో నీకు తెలుసా .... అట్టా తలూపమాకు. ఇనాలని వుంటే నే చెప్పేదంతా ఇను! అంతే!"
సుందరం వింటున్నాడు. పైడయ్య చెబుతున్నాడు.
* * *
కొన్నేళ్ళ క్రితం సంగతి! ఒక ఊరు. ఆ వూళ్ళో డబ్బున్న మనుషులు చాలా తక్కువ. ముందున్నారు. వాళ్ళల్లో ముఖ్యుడు శేషయ్య. ఆ రోజుల్లో కేవలం రొక్కమే వుండేది. రెండు మూడు లక్షలు! స్థిరాస్థి దీనికి రెండింతలు.
డబ్బుగల మనిషికి పొగరెక్కువని సాధారణంగా వింటూంటాం. కానీ, ఈ మనిషి ఈ సిద్దాంతానికి పూర్తిగా విరుద్దం. ఆయనకి బాగా పొగరు లేదు. గర్వం అస్సలు లేదు. కళ్ళు నెత్తిమీదికి రాలేదు. మూసుకుపోలేదు. మంచి చరిత్ర గలవాడు. దయాదాక్షిణ్యాల్లోనూ దాన ధర్మాల్లోనూ, అతనికి అతనే సాటి...
