Previous Page Next Page 
అదివిష్ణు నవలు -2 పేజి 7

 

    "స్వాములవారికివాళ ఆఫీసులో అక్షతలేమైనా పడ్డాయేమో!"
    "నోర్మూయ్ సీతా! ఇంటి దగ్గిర ఆఫీసు సంగతి ఎత్తకు. ముందు సంజాయిషీ చెప్పుకో!"
    సీత మిర్రున శ్రీనివాసరావు వేపు చూచి ,  చాలా ఖచ్చితంగా అనేసింది.
    "నేనన్నదాంట్లో తప్పులేదు."
    "లేదూ?"
    "లేదు!"
    "వెధవ మొండితనం నువ్వూనూ. ఓప్పుకోవే బాబూ! తప్పని ఒప్పుకో. నువ్వూ నన్ను గెలిచి పారేద్దామని ప్రయత్నించకు."
    "సర్లెండి, ముందీ కాఫీ తాగండి."
    "నాకొద్దు"
    "నేనన్నమాట తప్పే. ఒప్పుకున్నానుగా. ఈ తప్పుని మన్నించి కాఫీ తాగండి."
    ఆ మాటకి శ్రీనివాసరావు ఉబ్బితబ్బిబ్బైపోయేడు.
    "అయితే కాఫీ యివ్వు."
    అతను కాఫీ తాగుతుండగా సీత మరో చురక వడ్డించింది.
    "రేపటి నుంచి ఈ ఇంట్లో టీ గాని, కాఫీ గాని ఉండవు."
    "అదేం పాపం?"
    "పంచదార లేదు."
    "అయితే కష్టమొచ్చి పడిందన్నమాటే! మా స్టోర్స్ కి రాలేదు."
    "ఈ ఇంట్లో టీలూ, కాఫీలూ సేవించేది మీరొక్కరే"
    "సీతా ప్లీజ్ ....నన్ను చంపకు."
    "నన్నేం చేయమంటారండీ?"
    "పక్కింటివాళ్ళ దగ్గర అప్పు చెయ్యి."
    "డబ్బు అప్పుగా యిస్తుందేమో గాని పంచదార చస్తే యివ్వదు. మునుపటి రోజులనుకుంటున్నారాల్లె ఉంది."
    "చచ్చాం పో!"
    "బహువచనం వాడకండి."
    "రేపు నేనే ఆఫీసులో వాకబు చేస్తాను."
    అతను పంచదార గురించే ఆలోచిస్తూ కొంచెం కాఫీ గ్లాసులో వదిలేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు.
    సీత నొచ్చుకుంది.
    భోజనం దగ్గిర బియ్యం సంగతి కదిలింది. ముగ్గురి పిల్లల వేపూ చేసేడతను. వాళ్ళ పోషణ మీద శ్రీనివాసరావుకి తృప్తి కలగలేదు. చంటికి, చిన్నాకీ చెబుతూ కధలు చాలా అన్నం వాళ్ళకే ఖర్చు పెట్టేడు.
    నాన్న యిస్తున్న చనువు చూచి బుజ్జి చిన్న సైకిల్ కొనాలనే తీర్మానం తమ్ముళ్ళకి నివేదించి దాన్ని బలంగా తయారు చేసేడు.
    శ్రీనివాసరావు బెంగపడిపోయాడు.
    ఈ గడ్డు రోజుల్లో వీళ్ళకి చిన్న సైకిల్ కొనే తాహతు తనకు లేదంటే లేదు. ముష్టి పదహారు రూపాయల్లేక రేన్నెల్ల నుంచీ అమ్మకి మందుసీసా కొనలేక తన తాహతు, ఎబైలూ, అరవైలూ పోసి సైకిల్ కొనేందుకు పనికొస్తుంది? ఈ చంటి వెధవలకి బుద్ది ఎప్పుడొస్తుందో గాని , మరీ అజ్ఞానంలో బతుకుతున్నారు వీళ్ళు!
    రాత్రి తోమ్మిదన్నరకి యిల్లు సద్దుమణిగింది. బైట గదిలో శ్రీనివాసరావు తల్లి చంటిని పెట్టుకుని పడుకుంది. లోన గదిలో బుజ్జి చిన్నా ఒక మంచం మ్మీదా , శ్రీనివాసరావు ఒక్కడూ ఒక మంచం మీదా, సీతమ్మ చాప మీద నడుములు వాల్చేరు.
    సీత కళ్ళు మూసుకుని అరగంటైపోయింది.
    అరగంట నుంచి శ్రీనివాసరావు సీత తాలూకు జాలి జీవితం పట్ల సానుభూతి ప్రదర్శిస్తూనే ఉన్నాడు.
    (లాభం లేదు నేను చవటనై పోతున్నాను. నన్ను కట్టుకున్న మనిషి జీవితంలో నా మూలంగా థ్రిల్స్ లేవు. సుఖం లేదు. పాపం - కటిక నేలమీద పడుకుంది. బహుశా అర్ధాకలితోనే కంచాన్ని అవతలికి నెట్టేస్తుంది కాబోలు! సరైన చీరే లేదు. సీత వయస్సెంత? నాకన్నా మూడేళ్ళు చిన్నది. అప్త్రరాల్! ఇరవై నాలుగేళ్ళ సీతకి జీవితమ్మీద విరక్తి కలిగే రోజులే తెలుసు గాని హాయిగా జీవించే అవకాశం లేదు. ఐయామ్ ఫూల్ సీతా! ఐయామ ఫూల్ .
    శ్రీనివాసరావు యింటికప్పు కేసి ద్రుష్టి నిలిపి మెల్లగా అన్నాడు -
    "సీతా! నిద్ర పోతున్నావా?"
    "లేదండి ....." అన్నది సీత కళ్ళు మూసుకునే.
    "నిన్ను చూస్తుంటే సీతా, నా గుండె తరుక్కుపోతుంది!"
    "ఇప్పుడా మాటలెందుకేలెండి!"
    "నేనేది మాటాడినా సిన్సియర్ గా మాటాడతాను. అనుకున్న మాట అనకపోతే దిగులు నాకు. కనీసం నేనేమనుకుంటున్నానో నువ్వు తెలుసుకునే అవకాశాన్నయినా ఇవ్వు."
    "సర్లెండి , ఇంక పడుకోండి. మీరు ఆలోచనలు మేసే మనుషులైపోతున్నారు. అస్తమానం  ఆలోచనలు వస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. నిశ్చింతగా నిద్రపోండి"
    "నువ్వూ నిశ్చింతగా నిద్రపోగలవా?"
    "అబ్బబ్బ! నా గురించి మీరేం బాధపడక్కర్లేదండి బాబూ! నే నిక్షేపంగా నిద్రపోగలను. మీరూ నిద్ర పొండి ముందు."
    రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచేయి. శ్రీనివాసరావు సీత పడుకున్న వేపు ఒరిగి సీత చేతిని తీసుకుంటూ అన్నాడు.
    "సీతా ....నా మంచమ్మీదకి రా! నేలమీద నీకు నిద్రపట్టదు."
    సీత తన చేతిని విడిపించుకుని అటువేపు తిరిగి అన్నది"
    "బాగానే వుంది వ్యవహారం. నేలమీద పడుకోడం నాకేం కొత్త కాదు గానీ మీరు నిద్రపోండింక."
    "రమ్మంటుంటే"
    "పిల్లలు లేస్తారు . అల్లరి చేయకండి. నిద్రపోండి.
    "నాకు నిద్ర రావడం లేదు."
    "నాకొస్తుంది"
    "ప్లీజ్"
    "నన్ను విసిగించకండి."
    శ్రీనివాసరావ్ మంచం మీద లేచి కూర్చున్నప్పుడు  సీత ఒళ్ళంతా దుప్పటితో కప్పుకున్నది. శ్రీనివాసరావు మెల్లిగా నవ్వాడు.
    "ఒక నిజం చెబుతున్నాను విను. నా వల్ల నువ్వు కేవలం కష్టాలే అనుభావించేవు గాని సుఖపడలేదు. నేను నీవల్ల ఏ కష్టము లేకుండానే సుఖపడుతున్నాను. ఇది స్వార్ధం గాదూ?"
    "ఏమిటా మాటలు? ఎవరైనా వింటే నవ్వుతారు. గాని యింక పడుకోండి. స్వార్ధంట. స్వార్ధం. మీ కష్ట సుఖాలు నావికావూ"
    అప్పుడు శ్రీనివాసరావు మరింత బిగ్గరగా నవ్వి అన్నాడు.
    "మనం జీవిస్తున్నాం సీతా! నాటకంలో పాత్రలు గావు మనవి. నేను చెప్పింది ఒప్పుకో. అంతే . నేను ఉత్త స్వార్ధపరుణ్ణి."
    "ఇప్పుడీ గోలంతా ఎందుకు?"
    శ్రీనివాసరావు హటాత్తుగా అనేశాడు.
    "నాకు ప్రేమ గుర్తొస్తోంది సీతా!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS