ఆ సాయంకాలం నంద యింటికి వచ్చేసరికి సుందరమ్మ ఏదో వస్తువులు బాగుచేసుకుంటూ కూర్చుంది. అల్లంతదూరం నుంచే విప్పారిన ముఖంతో "మమ్మీ!" అంటూ వచ్చింది నంద.
నేరుగా వచ్చి తల్లిమెడ వాటేసుకుని "యు ఆర్ గ్రేట్ మమ్మీ! రియల్లీ అయామ్ ఫ్రోడ్ ఆఫ్ యూ!" అంది ఆనందంగా.
"ఏమిటమ్మా ఈ వరద" కూతుర్ని లాలిస్తూ అడిగిందామె.
"వరదకాదు మమ్మీ? ఏప్రీసియేషన్! ఈ రోజేం జరిగిందో తెలుసా?"
"టెస్టు పెట్టారా? నువ్వు ఫస్టు వచ్చావా?"
"ఊహుఁ అదేం కాదు- ఈ రోజు మా స్కూలు డి.ఇ.వో. నాగభూషణంగారు వచ్చారు. ఆయన తెలుగులో ఎమ్మేట! మా క్లాసుకి వచ్చారు. ప్రశ్నలు వేశారు. దేన్లో అనుకున్నావ్? నువ్వు ఉదయం పాఠం చెప్పావే! ఆ రుక్మిణీ సందేశంలో! నేను అన్నీ దమాయించి చెప్పాను. నన్ను అడిగినవే కాక క్లాసులో ఎవరు చెప్పలేకపోయినా నే లేచి చెప్పాను. అయిదారు ప్రశ్నలయ్యాక ఇక నన్ను అన్నీ తప్పని సరిగా అడగడం ప్రారంభించారు. నేను తడుముకోకుండా చెప్పాను!"
సుందరమ్మ కళ్ళు ఆనందంతో మెరిశాయి ఇంకా?"
"తర్వాత నన్ను పద్యం చదవమన్నారు!"
"చదివావా?"
"నువ్వు ఉదయం చదివావే ఆ స్టెయిల్లోనే చదివా!"
"ఊఁ" నవ్వుతో, పొంగుకొస్తున్న గర్వంతో ఊకొట్టిందామె.
"ఆయనెంత మెచ్చుకున్నారనుకున్నావు. నిన్ను ఆకాశానికి ఎత్తేశారు!"
"ఎందుకట?"
"ఎందుకేమిటి? ప్రతి తల్లీ నీలాగే శ్రద్ద తీసుకుని తన పిల్లలని చదివించి వాళ్ళకి పాఠాలు చెబితే ప్రతి విద్యార్ధి తప్పకుండా పాసవుతారట! దాంతో అక్షరాస్యత వృద్దిపొంది మన రాష్ట్రంకూడా కేరళలాగే అభివృద్ధి పొందుతుందట! అమ్మా! ఆయనింకా ఏమన్నారో తెలుసా?
"ఏమన్నారమ్మా" కుతూహలంగా అడిగింది.
"మాతృదేవోభవ! అన్నారు మనవాళ్ళు. తల్లి కనిపించే దైవం. తర్వాతే తండ్రి! మూడోవాడు ఉపాధ్యాయుడు! ఆచార్యుడు! ఈ ముగ్గురూ మార్గంలో పెడితే పిల్లలు బావుపడతారన్నారు!" ఆయన చెప్పిన మాటలు తు.చ. తప్పకుండా ఆరిందలా అప్పగించింది.
సుందరమ్మగారికి ఆనందమైంది. లేచివెళ్ళి చాక్ లెట్స్ కూతురి చేతిలో పెట్టింది.
"ఎందుకమ్మా! న్యాయానికివి నీకే చెందాలి! నాకు స్కూల్లో ప్రజెంటేషను ఇచ్చారు! ఇదిగో పెన్! ఇదీ నీకే దక్కాలి?"
ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి!" నాకెందుకమ్మా ఈ పెన్! నువ్వే జాగ్రత్తగా దాచుకో! నీ చదువయ్యేదాకా వాడుకో! ఉద్యోగం చెయ్! నీ పిల్లల్ని బాగా చదివించుకో వాళ్ళకివ్వు ఈ పెన్!"
ఆ మాటలకి సిగ్గుపడింది నంద. ఏదో ఆలోచనల్లో మునిగిపోయింది.
"నందా!!" అన్న పిలుపుకి ఉలికిపడింది.
5
"నందా!" మళ్ళీ పిలుపు ఉలికిపడింది నంద. ఆ పిలుపుకి చప్పున తన ఆలోచనలనుంచి బయటపడింది. బలహీనంగా పిలుస్తున్నాడు తండ్రి నారాయణ.
"ఏం నాన్నా!" ఆప్యాయత నిండిన కంఠంతో అడిగింది.
"కాఫీ అయిందమ్మా!" అదోలా చూస్తూ అడిగాడు.
"నీళ్ళు మరిగాయి. పాలు వచ్చాయి! ఒక్క నిమిషంలో డికాక్షన్ తయారుచేసి, కాఫీ కలిపి ఇస్తాను ఉండండి నాన్నా!" సాంత్వనంగా చెప్పిందామె! ఆకలిగొన్న కొడుక్కి తల్లి చెప్పినట్లుగా చెప్పిందామె.
కూతురి వెంట వంటింటిలోకి వచ్చాడు నారాయణ. అటూ యిటూ చూశాడు నెమ్మదిగా పైన టవల్ కప్పుకుని పీట వాల్చుకుని కూర్చున్నాడు. ఎప్పుడెప్పుడు కాఫీ అవుతుందా అన్నట్టున్నాడు. నిర్వ్యాసారంగా బ్రతకడం ఎంత కష్టమో ఆయన్ని చూస్తూనే అర్ధమవుతోంది.
గాజుకప్పులో తండ్రికి కలిపి యిచ్చింది నంద! ఆవురావురు మంటున్నట్లుగా అందుకున్నాడాయన. ఆ కాఫీ తాగి వేస్తే రోజూ జీవితంలో ఓ ఘట్టం ముగిసిందని పిస్తుందాయనకి.
మరో గ్లాసులో వంపుకుని తల్లికోసం ఆమె గదిలోకి వెళ్ళింది నంద. గదిలోకి వెళ్ళేసరికి అదోలా అన్పించింది. సుందరమ్మ మంచాన్ని ఆశ్రయించుకుంది చాలా ఏళ్ళుగా. భోజనాలకి కాలకృత్యాలకి తప్ప లేచిరాదు. పేరు తెలియని రోగం ఏదో ఆమెని నిర్వీర్యురాలిని చేసింది. "మాయదారి రోగం ప్రాణం పోదు! బాగు కాదు!" అంటూ తననితానే శపించుకుంటుంది ఆమె.
ఎప్పుడూ వాల్చి వుండే ఆ రెండు మంచాల్లో ఇప్పుడు నారాయణ మంచం ఖాళీగా వుంది. కూతురు గదిలోకి ప్రవేశించటంచూసి మెల్లిగా లేచి కూర్చుని కాఫీ కోసమే కాచుకున్నట్టు, కూతురి చేతితో కాఫీ అందుకుని నిర్లిప్తంగా తాగేసింది. తిరిగి నంద చేతికి అందించింది ఖాళీ గ్లాసు.
వెళ్ళబోతున్న నందని "అన్నయ్య తాగేడా?" అని అడిగింది సుందరమ్మ.
"ఊహుఁ! ఇంకా నిద్ర లేవలా!"
"లేవగొట్టి కాఫీ ఇవ్వరాదుటే!" నిష్టూరంగా అందామె.
'ఊ' వెళ్ళిపోయింది నంద.
వంటింటిలోకి వెళ్ళి తను తాగేసరికి శశికాంత్; విమల వస్తే వాళ్ళకి యిచ్చింది. వాళ్ళూ ఆబగా తాగేశారు. రాత్రి చేసిన భోజనం ఖాళీ అయితే దాన్ని కాఫీతో నింపుకున్నట్టుగా వుంది. విమల కాఫీ పాత్రలు తీసుకుని వెళ్ళింది. వాటిని శుభ్రంచేసి తిరిగి వంట గదిలోకి వచ్చింది. రవికాంత్ భాగం ప్లాస్కులో వంచి వుంచింది.
"ఏవయినా తరిగిపెట్టాలా అక్కాయ్!"
"నీకేం పని లేదా?"
"లేకేం హోంవర్క్ వుంది!"
"ఏమిటి? లెక్కాలా? సైన్సా?"
"రెండూనూ! చెరో అరగంట చాలు! ఇంగ్లీషు చదివేశాగా!"
"అయితే ఆ కాయలు తగిరివ్వు!"
"కుంపటిపై నీళ్ళు పెడతావా?"
"ఊఁ" అని కుంపటిపై నీళ్ళు వేసి వెళ్ళింది. నంద అటుగా.
ఆమె వెళ్ళగానే విమల వచ్చింది గ్లాసులు, గిన్నె వో వారగా పెట్టింది.
అన్నయ్య కూరగాయలు తరుగుతూ వుంటే తను బియ్యం కడిగింది.
నంద వెళ్ళేసరికి చాపపై అస్తవ్యస్తంగా పడుకుని వున్నాడు రవికాంత్.
పాతికేళ్ళ వయస్సు అతనిది.
ఈ సరికి చదువు పూర్తయిపోయి, ఉద్యోగంలో చేరి, పెళ్ళి చేసుకుని హాయిగా కాపురం చేస్తూ వుండవలసింది.
కానీ భగవంతుడు చిన్న చూపు చూడటంవల్ల యిలా పడివున్నాడు.
అతన్నలా చూడగానే కడుపులో దుఃఖం సుళ్ళు తిరిగి ఒక్క పెట్టున పొంగి వచ్చింది. భోరున ఏడవాలనిపించింది.
"భగవాన్! మేం ఏం తప్పు చేశాం! మా ఘోరమైన నేరం ఏమిటి? మా కుటుంబాన్ని ఎందుకిలా శపించావ్? తండ్రి అలా! తల్లి అలా! అన్నయ్య ఇలా! తన బ్రతుకు ఇలా! మా సమస్యలకి పరిష్కారం లేదా?" ని లేసి అడగాలని పించింది భగవంతుడిని.
