కానీ ఎక్కడున్నాడు ఆ దేవుడు?
దారి చిక్కితేనా?
ఉప్పెనలా వస్తున్న ఆలోచనల్ని పారద్రోలి! రవీ! రవీ!" అంటూ పిలిచింది మృదువుగా.
ఏ కళ నున్నాడో చప్పున కళ్ళు తెరిచాడు.
"లే! ముఖం కడుక్కో! కాఫీ అయింది!"
మరమనిషికి మాటలు చెబితే పనిచేసినట్టు కూర్చున్నాడు.
"లే! ముఖం కడుక్కో!"
అతను లేవగానే చాప చుట్టింది. అది తీసికెళ్ళి బయట ఆరవేసింది. దుప్పటి ఇంట్లోనే వో త్రాడుపై ఆరవేసింది.
ఇంత వయస్సు వచ్చినా అతనికి నిద్రలో లేచి కాలకృత్యాలు తీర్చుకోవటం తెలియదు. ప్రతిరోజూ అంతే!
కొన్నేళ్ళుగా జరిగే ఆ నిత్యకృత్యంలో మార్పు లేదు.
'పద!' అతన్ని నడిపించుకుంటూ వెళ్ళి టిన్ తో నీళ్ళిచ్చి లోపలికి పంపింది.
అయిదు నిమిషాల తర్వాత అతడు కాలకృత్యాలు తీర్చుకుని రాగానే ;చేయిపట్టు!' అని టూత్ పౌడర్ వేసింది. ముఖం కడుక్కో!' అంది.
ముఖం కడుక్కోగానే బకెట్ లో అప్పటికే తొలచిన నీళ్ళతో "స్నానం చెయ్!" అని చెప్పి చేయించింది.
టవల్ తో తుడుచుకోమంది.
లోపలికి వెళ్ళు "పైజామా మార్చుకో!" మంది, తెచ్చి యిచ్చింది. అక్షరాలా పాటించాడు.
వంటింట్లోకి ఆమె వెంటే నడిచాడు. కాఫీ యిస్తే తాగేసి బావుంది అన్నట్టుగా చూశాడు.
అంతటి స్థితిలోనూ ఆమెకి నవ్వు వచ్చింది.
"భగవంతుడి సృష్టి ఎంత చిత్రమైంది!" ఇంత దౌర్భాగ్యంలోనూ, ఏ పనీ స్వంతంగా చేసుకోలేని యీ స్థితిలోనూ యితనికి రుచి తెలుస్తుంది! అనుకుంది.
కప్పు అక్కడ పెట్టేసి హాల్లోకి వెళ్ళేడు.
"బయటికి వెడుతున్నావా?"
లేదన్నట్టుగా అడ్డంగా తలూపాడు. అతనొక్కోసారి అలా బయటికి వెళ్ళి కొన్ని గంటల సేపు తిరిగి తిరిగి వస్తాడు.
అతని విషయం తెలిసి ఎవరూ ఏమీ అనరు!
అతన్ని యిబ్బంది పెట్టరు!
కానయితే అలాంటి రోజున అతనికి తిండి దొరకదు చిత్రం!
ఆకలి అని కూడా ఆక్రోశించలేడు.
నిట్టూర్చింది సునంద.
ఆ యాక్సిడెంటు జరగకముందు ఇతనెంత బావుండేవాడు.
ఆ తెలివి! ఆ నేర్పు! ఆ చాక చక్యం! ఆ హుషారు ఆ నేర్పు వోర్పు! అందుకేనేమో భగవంతుడివి అన్నీ నిర్దాక్షిణ్యంగా అన్నీ తీసుకున్నాడు.
భోగి రోగి లేదా యోగి అయినట్టుగా అనుభవించి వాళ్ళకి చివరికి ఏమీ మిగలదేమో!"
ఆమెకి తన సోదరుడు మతి స్థిమితం కోల్పోకముందు రోజులు కళ్ళెదుట తిరిగినట్టుగా అనిపించింది ఎంత మంచికాలం అది!
6
ఆ రోజుల్లో యింటిముందు పెద్ద బయలు వుందే అలాగే వెనుకవైపు విశాలమైన పెరడూ వుండేది.
పెరడంతా చక్కగా తవ్వేవాళ్ళు నలుగురు పిల్లలూ
ఆదివారాల్లో సెలవుదినాల్లో ఒక్కొక్కప్పుడు సాయంకాలాల్లోనూ నారాయణ కూడా తోడ్పడేవాడు.
వెనుక కాంపౌండుచుట్టూ ఒక్కోరకం చెట్టు పెంచారు. మామిడి, నిమ్మ, దానిమ్మ, పనస, సీతాఫలం, వేపచెట్లూ వుండేవి.
బాదం చెట్టు బావిగట్టున వుండేది.
నంద కోరిక మీద గోరింటాకు కూడా పెంచేరు.
ఇంటిముందు గేటు కిరువైపులానేకాక పెరట్లో కూడా రెండో మూడో కొబ్బరిచెట్లు వుండేవి.
జామ చెట్లుకూడా రెండు వుండేవి.
పెరట్లో ఏ సీజన్ లో పండే కూరగాయలు ఆ సీజన్ లో సమృద్దిగా పండేవి.
తాము తృప్తిగా తిని నలుగిరికీ పెట్టేటంతగా కాసేవి పాదులు.
దొండ పాదు ఎప్పుడూ వుండేది.
కరివేపాకు చెట్టు నవనవలాడుతూ రెమ్మలు బాగా విచ్చి విరిసి ఘుమఘుమ లాడుతూ వాసనలు రోడ్డుపైకి విరజిమ్మేవి. అడిగిన వాళ్ళకంతా పెట్టేవారు.
ఇంటిముందు భాగంలో గోడవారగా రకరకాల పూల మొక్కలు పెంచేవారు.
వీటి అన్నిటికి నీరు పెట్టాలంటే చాలా శ్రమ అయ్యేది.
టాప్ కి వో రబ్బరు గొట్టాన్ని అమర్చిపెట్టేవారు.
పెరటికి చాలా మట్టుక్కి స్నానాల నీళ్ళు, గుడ్డలుతుక్కునే నీళ్ళు సరిపోయేవి.
బయటి భాగంలో ప్లే గ్రౌండ్ తయారుచేశాడు రవీంద్ర.
వాడికి చదువంటే ఎంత శ్రద్దో, ఆటపాటలన్నా అంత శ్రద్ద వుండేవి.
ప్రతిరోజూ ఉదయం వ్యాయాయం తనుచేసి తమ్ముడితో చెల్లాయితో చేయించేవాడు!
రోజూ ముగ్గురూ బాడ్మింటన్ ఆడేవాళ్ళు.
ఎప్పుడూ నంద, శశి ఓ జట్టు, రవి, విమల ఓ జట్టు,
చెస్ లో, కేరమ్స్ కూడా అంతే!
చదువు భంగం అయ్యే ప్రసక్తి లేనేలేదు.
నారాయణ చేసిన అలవాటు వలన ఏ రోజూ పాఠాలు ఆ రోజు పూర్తిగా చదివేసిన వాళ్ళు.
తెలియకపోతే రవి చెప్పేవాడు.
లేదా సుందరమ్మ లేదా నారాయణ!
ఓ రోజు జిల్లా స్థాయిలో పోటీలని డబుల్స్ ఆట్టానికి వెళ్ళేరు రవి, నంద.
వాళ్ళ మాట తీరు, నవ్వులు, జోక్స్ స్వంత అన్నా చెల్లెళ్ళని అనుకునేట్టుగా లేదు.
ఫ్రెండ్లీగా ఉన్నారిద్దరూ.
ఎదుటి జట్టులోని వో అబ్బాయి అక్కడి ఎం.ఎల్, ఏ గారి అబ్బాయి.
