సెకండ్ షోలకి వెళ్ళి ఆలస్యంగా పడుకుని ప్రొద్దెక్కి లేస్తారు. బద్దకాన్నంతా నెత్తిన వేసుకుంటారు. దాంతో ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు- దరిద్రాన్ని కొని తెచ్చుకుంటారు.
మొదటినుంచి నారాయణ అలా పెరిగాడు. క్రమశిక్షణతో బ్రతకటంపుట్టుకతో అబ్బిందతనికి తన సోదరీ సోదరుల్ని తండ్రి అలా పెంచాడు. తల్లి అలా తీర్చిదిద్దింది.
అంచేత మధ్య తరగతిలో మధ్యతరగతి మనిషి నారాయణ. తనూ అదే పద్దతి అవలంబించాడు. తన భార్యని ఆ మార్గానికి మళ్ళించుకున్నాడు. ఆమెకీ ఆ అలవాటు నేర్పించాడు. ఆమెతో పాటు పిల్లలకీ ఆ అలవాటే నేర్పాడు.
ఆ రోజు సుందరమ్మ వేకువనే లేచి కొంత యింటిపనులు ముగించుకొని లేవగొట్టాలని గదిలోకి వచ్చింది.
ఆ సరికే నారాయణ నిద్రలేచి స్నానంచేసి పూజచేసుకుంటున్నాడు.
"నందా! నందా!" మృదువుగా పిలిచింది సుందరమ్మ కూతుర్ని నాజుగ్గా తడుతూ. ఆమె గొంతులో ప్రేమ తరం గాలుగా జాలువారుతోంది.
బద్దకంగా కళ్ళు విప్పింది నంద.
చిరునవ్వుతో తల్లికి "గుడ్ మార్నింగ్" చెప్పింది. తిరిగి కళ్ళు మూసుకుంది.
తల్లి పక్కకి వెళితే అటు తిరిగి యింకాస్తసేపు పడుకోవాలని ఆమె ఆశ! అయితే సుందరమ్మ వెళ్ళిపోలేదు. "లే నందా! ఆరైంది! ఈ రోజు గంట లేటు! కాఫీ తయారయిపోయింది!" అంది మృదువుగా.
"నిద్ర వస్తోంది మమ్మీ!" గారాముగా అంది నంద.
"ఇంకా ఏం నిద్రమ్మా! మళ్ళీ చీకటి పడదా? మళ్ళీ నిద్రపోవా? అంతగా అయితే యీ రోజు నో అరగంట పడుకుందువు కానీలే!"
"ఉహు" నసిగింది నంద.
"ఈ రోజు క్లాస్ టెస్ట్ వుందన్నావు?"
"అవును మమ్మీ!" కళ్ళు మూసుకునే జవాబిచ్చింది.
"దేనిలో?"
"తెలుగు మమ్మీ! వేకువనే నీతో పాటేలేచి చదువు కోవాలని టెక్స్ట్ కూడా తలదిండు క్రిందే పెట్టుకున్నాను. అయినా మెలుకువ రాలేదు. పైగా ఇప్పుడు బద్దకంగా వుంది."కళ్ళు తెరవకుండానే అంది నంద.
"ఇంకా నిద్రమత్తుగా వుందా?"
'ఊ' గారాబంగా అంది.
"నా కిప్పుడేం పనిలేదు. కానీ "వో పని చేయనా?"
"ఏంటి మమ్మీ! పడుకోనివ్వకుండా డిస్ట్రబెన్స్"
"నీ పాఠం నే చదవనా?" మురిపెంగా అడిగింది ఆమె.
"ఓయస్! చదువుకో -"
"ఒకరికి ఆకలవుతే ఇంకొకరు తింటే కడుపు నిండుతుందా? ఒకరికి నిద్ర వస్తుంటే మరొకరు నిద్రపోతే అవుతుందా? నే చదువుకుంటే నీకేం లాభమే తల్లీ! చదివి విని పిస్తాను! లేవకుంటే మానె! కళ్ళూ తెరవకుంటే మానె! శ్రద్దగా విను! పరీక్ష అంటున్నావుగా!" అని తన శ్రావ్య మైన కంఠంతో చదవసాగింది.
శివకామసుందరిలో ఉత్సాహం పొంగుకు వచ్చింది.
అది భాగవతం! రుక్మిణి కళ్యాణఘట్టం!
ఆమె తన చదువు ముగిశాక తండ్రి ప్రోద్భలం మీద కళ్యాణ ఘడియ త్వరగా కలసిరావడానికి నిత్యం పారాయణం చేసిన ఘట్టం!
పెళ్ళయిపోయినా, అనుకూలుడైన భర్త వచ్చినా, సత్సంతానం కలిగినా యింకా ఆమెకి ఆ ఘట్టం మరుపులో పడలేదు. కూతురి పుస్తకం తీసుకోగానే "రుక్మిణి సందేశం" అని చూడగానే ఆమెకి పురాస్మృతుల్లా ఒక్కో పద్యమే గుర్తుకు రాసాగింది.
తెల్లవారబోయే ఆ ప్రశాంత ప్రకృతిలో అలసట ఎరుగని మనస్సుతో పొంగులువారుతున్న పుత్రికా వాత్సల్యంతో ఆర్ద్రమైన గొంతుకతో లోగొంతుకలో మృదుమధురంగా ఆ ఘట్టం చదివింది.
నందకి ఎంతో గొప్పగా అనిపిస్తోంది.
ఏనాడూ తల్లి ధీ చేతబట్టి చదవగా ఆమె చూళ్ళేదు.
తల్లీ చదువుకున్నది. ఆ రోజుల్లో ఆ కుటుంబానికి తగ్గట్టు చదువుకున్నది. అని మాత్రం తెలుసు కానీ భాగవతాన్ని తన పద్య భాగాన్ని యింత మధురంగా చదవగలదు అని ఆమెకి తెలియదు.
అంచేత ఆశ్చర్యంగా కళ్ళు తెరిచింది నంద.
జోల పాలలాటి ఆ పఠనానికీ నిద్రపోవలసిన నంద కళ్ళు తెరుచుకు చూసింది గొప్పగా దానికీ సమాధానంగా చిరునవ్వు నవ్వింది సుందరమ్మ తిరిగి ఒక్కో పద్యం చదువుతూ అర్ధం విడమరచి చెప్పసాగింది.
అసలే తెలివిగల పిల్ల! అందులోనూ టీచర్ గొప్పగా చెప్పారు.
ఇప్పుడు తల్లి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా చదివి చెబుతూ వుంటే మనస్సులో ముద్ర పడిపోయాయి ఆ పద్యాలు అన్నీ.
పాఠం పూర్తయింది.
"ఇక లేస్తావా?" నవ్వుతూ అడిగింది ఆమె.
"థాంక్యూ మమ్మీ! ఇక చూస్కో! ఈ రోజు టెస్టులో దంచేస్తాను. క్లాస్ ఫస్టు నేనే!" గర్వంగా చెప్పింది నంద.
"చాలా సంతోషమమ్మా! ఇకనైనా ముఖం కడుక్కొని వస్తావా?"
"అలాగే మమ్మీ! ఒక సందేహం!" పెదాలు బిగించి తమాషాగా అడిగింది.
"ఏమిటి?"
"నీవు తెలుగు యింత బాగా ఎలా చెప్ప గలిగావు?" ఆరాధనగా చూస్తూ అడిగింది.
సమాధానం యివ్వకుండా "నాకు పనుందమ్మా! నీతో కబుర్లు పెట్టుకుంటూ కూర్చుంటే అయినట్టే! మళ్ళీ తొమ్మిదింటికల్లా మీకు కంచాల్లో వడ్డించాలి! ఒక్కరంటే ఒక్కరయినా చేతి సాయం రారు!" అంది లేస్తూ.
నంద ఇంకేమీ అనలేదు.
వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానంచేసి, దేవుడికి దండం పెట్టుకుంది. తల్లి యిచ్చిన కాఫీ తాగింది.
పుస్తకాలు ముందేసుకుని కూర్చుని హోం వర్క్ పూర్తి చేసుకుంది. తర్వాత భోజనం చేసి స్కూలుకు వెళ్ళిపోయింది.
