"అతను ఊరవతల ఇల్లు కొనుక్కున్నాడు" అన్నాడు.
"మనకెందుకురా..... వెళ్దాంరా" రాంబాబు పిలిచాడు.
"ఉండరా! ఇదేమిటో తేల్చుకుందాం" అని వెళ్ళి, తలుపు సందులోనుండి తొంగి చూచాడు.
సిద్దార్థ వెన్ను జలదరించింది.
ఒక అజాను బాహుడయిన వ్యక్తి నట్టింట నిల్చున్నాడు. అతని నోట్లో జంతువు కాలేయం పట్టి ఉంది నుదుట రూపాయికాస్తంత ఎఱ్ఱని బొట్టుంది.
పసుపు పచ్చ నార ధోవతు కట్టాడు. నల్లని బనియన్ వేసాడు. ముంజేతులకు, దండలకు రంగు, రంగు పూసలున్నాయి.
ముందుకు పొడుచుకు వచ్చిన పొట్ట. ముక్కు చూస్తే భయం వేస్తుంది. అతను లయబద్ధంగా ఎడమకు కుడికి ఊగుతున్నాడు. అతని తలపై బాలరాజు బాబాయ్ నీళ్ళు పోస్తున్నాడు. దూరంగా నిలబడిన భార్య పిల్లలను పెట్టుకుని బిక్కున చూస్తోంది.
"ఊ..... "అన్నాడు మంత్రకాడు.
కుటుంబ సభ్యులంతా వినమ్రులయి అతని ముందు మోకరిల్లారు.
"ఓం...బేతాళా..... వీరభద్రా....? అని గట్టిగా అరిచి మంత్రాలు చదువుతున్నాడు.
"అదేమో చూడాలని ఉంది.
"సిద్దూ..... వద్దురా...." రాంబాబు లాక్కుపోయాడు.
"పిరికి సన్యాసి."
" నువ్వేమయినా అను. మా మామ ఒకడు, చేతబడి దించుతుడంగా వెళ్ళి రక్తం కక్కుకుని చచ్చిపోయాడు."
" నువ్వు చూచావా"!
"అక్కడే ఉన్నాను. అతని శవం మాయం అయిది తెలుసా."
అతని మాటలు యెంతవరకు నమ్మాలో అర్థం కాలేదు. నిజంగా రాబంబు వాలకం రక్తం కక్కుకునేలా ఉన్నాడు.
వాళ్ళు కాంపౌండు దాటి బయటికి రాగానే భళ్ళున ఇంటి తలుపులు తెరుచుకున్నాయి.
ఆవేశంగా మంత్రకాడు మంత్రాలు వల్లిస్తూ ఇంటి చూట్టూ మూడు సార్లు తిరిగి, ఇండటిముందు నిల్చున్నాడు.
అంతే మళ్ళీ అతనికి నీళ్ళు కుమ్మరించారు.
"పదరా." రాంబాబు బలవంతంగా లాక్కుపోయాడు.
ఇద్దరూ ఇంటికి తిరిగి వ్చచారు.
అయిదు నిమిషాల్లో రాంబాబు గుర్రు కొడుతూ నిదురపోయాడు సిద్దార్థకు నిదుర రాలేదు.
మనిషి ఎందుకింత వలాయన వాదంతో బ్రతుకుతున్నాడు!
ఏది నిజం! ఆలోచిస్తూ తెల్లవారు జామున నిదురపోయాడు.
20
రాధిక శ్రీనివాస్ ను మరిచిపోలేదు గాని, అతని ధ్యానంనుండి బయటపడి చదువు మొదలు పెట్టింది. ఆరోజు ఇంగ్లీష్ పొయెట్రీ తీయగానే అందులో ఉత్తరం బయటపడింది.
రాధికా!
అబ్బ! నీ అక్షరాలు ఒకవైపు కు వంగి ఠీవిగా ఉంటాయి. రేపు పెద్ద ఆఫీసరువు అయితే నువ్వు అలాగే ఉండాలని నాకోరిక. రవీంద్రుడి కవితలు చదివావా? చదువు.ఐ.ఏ ఎస్. గారూ! అప్పాయింట్ మెంట్ తీసుకుని రావాలా...?"
ఇక చదువలేక కళ్ళు మూసుకుంది.
బాధగా ఆమె హృదయం శ్రీనూ.....శ్రీనూ అన్నది 'నీకోసం చదువుతాను శ్రీనూ 'అనుకున్నది.
మనసంతా వికలమయింది. లేచి వాకిట్లోకి వచ్చింది.యెదురింట్లో తిరిగే మనుష్యులకు బదులు కొత్తవారు కనిపించారు.
కొంతలో కొంత నయం! ఆ దుర్మార్గుడికి శిక్ష పడింది అనుకుంది.ఆమెకు తండ్రి జీపు అగడంతో కాస్త స్పృహ వచ్చినట్టు అయింది.
ఆమె చటుక్కున లోపలికి పోబోయి ఆగిపోయింది. జీపు దిగుతున్న పురుషోత్తమరావు తూలిబోయాడు.
