Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 77

    "వద్దయ్యా.... వద్దు.... మా  మానావ మమ్మల్ని వది లెయ్యండి." అన్నాడు.

    "అది కాదు.... నీ పేరేమిటి?"

    "వల్లకాట్లో రామయ్య. మీరు వెళ్ళిపోతే నాకెంతో మేలు చేసిన వాడవు అవుతావు." రెండు చేతులు జోడించాడు.

    యెంత ప్రయత్నించినా, అతనిచేత ఒక్కమాట మాట్లాడించలేక పోయాడు. అతను  విసిగిపోయి తలుపు వేసుకున్నాడు.

    "సిద్దార్థ చేసేదిలేక, వెనుతిరిగాడు.

    "నేను  చెప్పలేదా బాబూ!" అన్నాడు సాయిలు.

    సిద్దార్థకు ఎంత వెళ్ళిపోదామన్న కాళ్ళు ఆడటం లేదు, కాని వెళ్ళక తప్పదు. తనకు డ్యూటీ వున్నది.
   
    ఇంటికి వస్తూనే డ్యూటీకి వెళ్ళాడు. మర్నాడు సాయంత్రం మళ్ళి బాలరాజు గుర్తుకు వచ్చాడు. అతను బట్టలు మార్చుకుంటుండగా రాంబాబు వచ్చాడు

    "యెలా వుందిరా ఫ్యాక్టరీ?"

    "ఫ్యాక్టరీ గురించి ఏం అడుగుతావ్?"బ్రహ్మాండంగా  వుంది. ఆర్డర్స్ సప్లయ్ చేయగలమా అన్న అనుమానం వస్తోంది"అన్నాడు.   

    " ఈ మధ్య బాలరాజు కలిసాడా!"

    " కలిసాడు పూర్తిగా మారిపోయాడు. గడ్డం పెంచాడు , రాజేంద్ర కూడా అతనితో తిరుగుతున్నాడు. కేరళలో అయిదు  నెలలు కఠోరమైన దీక్ష పూని మంత్రాలు నేర్చుకు  వచ్చాడట."అన్నాడు.

    "బాలును, రాజును చూద్దాం పద."

    "వద్దురా! అ మంత్రాలవారికి చాలా దూరం వుండాలి. వారికి యెవ్వరూ కనిపించకపోతే ఎదుట కనిపించినవారిపై మంత్రప్రయోగం చేస్తారట." అన్నాడు

    "ఈ  యుగంలో కూడా మంత్రశక్తి వుందని నమ్ముతావా!"

    "ఏ యుగంలోనయినా వున్నాయి."

    "ఆడవారు భయపడినట్టు కాదు. వెళ్దాంపద-" బలవంతంగా రాంబాబును తీసుకుని, బాలరాజు ఇంటికి వెళ్ళాడు. వాళ్ళంతా లేనట్టున్నారు. ఇంటికి తాళం వుంది.   

    ఏమయిందో అర్ధంకాక కాసేపు తచ్చాడాడు. అతనికి పెద్దగా ఇంటోనుండి మంత్రాలు  చదువటం వినిపించాయి. ఆగిపోయాడు.అవి జంగయ్య తమ్ముడు ఇంట్లోనుండి వినిపిస్తున్నాయి!

    "యెవరూ?"

    " నేను బాబూ! బాబయ్యకు,  ఇక్కడ ఏం జేస్తున్నారు?"సిద్దార్థ అతడిని గుర్తించాడు . చిన్నప్పుడు తను తల ఇవ్వకపోయినా, ఇల్లంతా తిరిగి క్రాపు చేసే బాబయ్య.

    " బాలు.....అదే బాలరాజుకోసం వచ్చాను."

    "మీ వుప్పుతిని బ్రతికిన బాంచను. ఆ బాలరాజు మంత్ర, తంత్రాలు నేర్చుకుని వచ్చిండు.
అల్ల చిన్నాయన బిడ్డమీదనే మంత్రం వేసిండు. అన్నాయంగార పోరి సచ్చిపోయింది."  అన్నాడు భయంగా చూస్తూ.

    "నిజంగా చాతబడి చేస్తేనే చూచారా, మంత్రం వెయ్యటమా!

    "ఒట్టయ్య అందరం చూస్తుండగ రక్తం కక్కింది."

    "ఆ పిల్ల రక్తం కక్కంటంచూచారా, మంత్రం వెయ్యటమా!"

    "మంత్రం వెయ్యటం యెవరయినా చూస్తారా!"

    "మరి మీకెలా తెలుసు!"

    "గట్లరా- ఆరాత్రి ఆల్లు కొట్లాడుకుంటున్నారు. నీపని చేస్తే అన్నడయ్య"అన్నాడు.

    "అంటే చాతబడి చేసినట్టేనా?"

    "అయ్యో సోజ్జమా! ఇకెట్లా చెప్తు....

    "మరిప్పుడేం చేస్తున్నారు.?"

    " దించిపిస్తున్నారు. గదే మిగిలిన పోరలు మంత్రం పారకుండా జేస్తున్నారు బాంచను. మా దగ్గర ఏమున్నాయి! ఏదో పెండ్లము కమ్మలు అమ్మి కర్సు పెడుండు." అన్నాడు

    "సిద్దార్థకు కుతూహలం పెరిగింది.

    "బాలరాజు లేడా!"
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS