
3
గోదావరి జిల్లాలో పల్లె, పట్నమూ కాని సామాన్యమైన వూరు అది.
పదేళ్ల కళ్యాణి 'స్కూలు కి వెళ్లి చదువు కుంటాను' అంటూ మారాం చేసి నప్పుడు 'ఇదేం చోద్యమే' అన్నట్లు బుగ్గలు నొక్కుకుంది వాళ్ళ అమ్మమ్మ కనకవల్లి.
అంతవరకూ ఆ యింటి ఆడపిల్లలు ఇంట్లో మేష్టర్ని పెట్టుకుని కొద్దో గొప్పో చదివిన వారే కాని స్కూల్లో జేరటం పరీక్షలు ప్యాసు కావటం అనేది జరగలేదు -- అలాగే కళ్యాణికి. ఆమె అక్క వల్లికి చదువు చెప్పటానికి ఒక మేష్టర్ని ఏర్పాటు చేశారు . రోజూ వచ్చి, వో గంట సేపు కూర్చుని ఏదో మొక్కు చెల్లించి నట్లు, పురాణం వినిపించినట్లు ఆ మేష్టరు చెప్పే చదువుతో కళ్యాణి తృప్తి పడలేక పోయింది. అసలు, చిన్నతనం నుండీ కళ్యాణి తత్త్వం , అభిరుచులూ ఆ యింటి వాతావరనాని కి , ఆ మనుష్యుల అభిరుచులకీ భిన్నంగానే వుంటూ వుండటమే కాకుండా తను అనుకున్నది జరిగి తీరాలి అనే పట్టుదల కూడా వుండేది ఆ అమ్మాయిలో -- ఆ పట్టుదలే కళ్యాణి స్కూల్లో జేరటం విషయం లో కూడా తల్లి వనజాక్షి చేత సరే అనిపించేలా చేసింది.
వో ఉదయం కళ్యాణి మేనమామ రాఘవులు ఆ పిల్లని వెంట పెట్టుకుని స్కూలు కి తీసుకు వెళ్లాడు. రాఘవులు కూడా కొన్నాళ్ళ క్రిందట ఆ స్కూల్లో చదువు కున్నవాడే -- ఒకటో క్లాసు ఒక ఏడు రెండో క్లాసు రెండేళ్ళు అన్నట్లుగా కొంతకాలం చదివి మానేశాడు మధ్యలోనే -- తన సంగతి తెలియని వాళ్లతో మాత్రం 'ఇక్కడి స్కూలు ఫైనల్ అయిపొయింది --కాలేజీ చదువుకి మరో వూరు పోవటం ఇష్టం లేక చదువ లేదు.' అని గొప్పలు చెప్పుకుంటాడు పాపం --
స్కూలు ని, అక్కడి పిల్లల్ని , చదువు ని గురించి ఏమిటో వూహించుకుంటూ పుస్తకాలు సర్ది పెట్టుకున్న కళ్యాణి కి , అమ్మమ్మ తనకి చేయబోయిన ముస్తాబు విషయం మాత్రం బొత్తిగా నచ్చలేదు-- అయినా చదువు విషయంలో తన పంతం నెగ్గింది కదా అనే తృప్తి తో మరి పేచీ పెట్టకుండా వూరుకుంది-- తమకు కలిగింది పది మందికీ ఆడంబరంగా చూపించుకోవాలి. అనే తహ తహతో మనవరాలికి జానెడు వెడల్పు జరీ అంచు పట్టు పరికిణీ కట్టి మెడలో రెండు వరసల పలకసర్లు చేతులకి ముత్యాలు , కెంపులు పొదిగిన జూకాలు , జడకి బంగారపు జడ గంటలు అన్నీ పెట్టి ముస్తాబు చేసి మరీ పంపించింది కనకవల్లి -----
కొత్తగా జేర్చుకోబోయే ముందు అందరినీ పరీక్ష చేసినట్లే కళ్యాణి కి కూడ అన్ని సబ్జక్టు లలోనూ నాలుగేసి ప్రశ్నలతో, పేపర్లు ఇచ్చారు-- వాటికి కళ్యాణి సమాధానాలు వ్రాయటం , మాష్టర్లు చూసి పాస్ చెయ్యటం , జీతం తీసుకుని రిజిష్టరు లో పేరు వ్రాయించటం అన్నీ అయేసరికి వో పూట గడిచి పోయింది-- మధ్యాహ్నం క్లాసులు ప్రారంభం అవుతూ వుంటే ఫ్యూన్ రామస్వామి కళ్యాణి ని వెంట పెట్టుకుని ఫస్టు ఫారం క్లాసు కి తీసుకు వెళ్లాడు -- అంతకు ముందే తరగతి లోకి వచ్చి పుస్తకం తెరవబోతున్న తెలుగు మేష్టారు కళ్యాణి ని చూసి తెగ ముచ్చట పడిపోతూ ---
'రామ్మా-- ఇలా కూర్చో .' అంటూ చిరునవ్వుతో పలకరించాడు -- తెలుగు మేష్టరు అంటే అపర దుర్వాసుడే అని హడిలి పోతూ అయన క్లాసులోకి రాకముందే అచ్చు పుస్తకాలూ, నోటు పుస్తకాలూ తెరిచి పెట్టుకుని, ఎప్పుడు ఎవరిని ఏ ప్రశ్న వేస్తారో అనుకుంటూ గజ గజలాడి పోతూ కూర్చునే నలభై మంది అబ్బాయిలూ, అమ్మాయిలూ , అయన కోపం సంగతి కూడ మరిచిపోయి ఆ కొత్త అమ్మాయిని చూస్తూ వుండి పోయారు -- బిడియంగా మెల్లిగా లోపలికి వస్తున్న కళ్యాణి ని ఎవరి మట్టుక్కి వారే తమ ప్రక్కన కూర్చో పెట్టుకోవాలి అన్న సరదాతో కాస్త కాస్త సర్దుకుని ప్రక్కన చోటు చూపించ బోయారు అమ్మాయి లంతా -- కాని ఏ ఇద్దరి మధ్యా ఇరుకుగా కూర్చోటం ఇష్టం లేని కళ్యాణి మరి కాస్త ముందుకి వెళ్లి వెనక బెంచీ చివరగా కూర్చుంది . ఆ చివర కూర్చున్న సుమతి కి అందలం ఎక్కినంత సంతోషం కలిగింది.
'కలెక్టరు గారి మనవరాలే మో-- ఊహు కొత్తగా వచ్చిన డాక్టరు గారి అమ్మాయేమో .' అనుకుంటూ వూహలు అల్లుకుంటూ , ఎప్పుడు స్కూలు అయిపోతుందా ఎప్పుడు కళ్యాణి ని గురించి వివరాలు తెలుసుకుందామా అన్న ఆత్రంతో ఆ పూట పాఠాలు కూడా శ్రద్దగా వినటం మానేసి మధ్య మధ్య కళ్యాణి వేపు చూస్తూనే వున్నారు అమ్మాయి లంతా-- చివరికి ఆఖరి పిరియడ్ కూడా అయిపోయి బెల్ మ్రోగింది. మాష్టారు ఇంకా పూర్తిగా గుమ్మం అయినా దాటకుండానే అమ్మాయిలంతా బిలబిల కళ్యాణి చుట్టూ గుమి గూడి పోయారు.
"నువ్వు రోజూ ఇలాగే పట్టుపరికిణి కట్టుకుని, గొలుసు లూ అవన్నీ వేసుకోస్తావా -- మీ అమ్మ వాళ్ళూ ఏమీ అనరా -- చిన్న పిల్లలం ఒక్కళ్ళం వెళ్లి వస్తూ వుంటాం కదూ, దార్లో దొంగ లెవరైనా వుంటే ఎత్తుకు పోతారనీ నా మెడలో వుండే ఆంజనేయులు బిళ్ళ కూడా తీసేసి దాచేసింది మా అమ్మ.' అంది సీతారత్నం అనే అమ్మాయి. కళ్యాణి- బట్టల వంకా- నగల వంకా ఆసక్తిగా చూస్తూ.
'మీ ఇల్లెక్కడ -- ఇదీ నేనూ పెద్ద బజారు లోంచి వెళ్లి వంతెన దాటి వెళ్తాం. మీ ఇల్లు కూడా ఆటే అయితే మాతో కూడా రా.' అంది సావిత్రి అనే అమ్మాయి మరో రెండు జడల అమ్మాయి బుజం మీద చెయ్యి వేస్తూ.
'అసలు -- మీ నాన్నగారి పేరేమిటి -- ఆయనేం వుద్యోగం చేస్తారు. మీరిక్కడకు కొత్తగా వచ్చారా' అంది శమంతక మణి . మిగిలిన వాళ్ళంతా ఈ ముఖ్యమైన ప్రశ్న వదిలేసి ఏమేమిటో అడుగుతున్నారు అన్న ధోరణి లో.
ఒక్కసారి అంతమంది చుట్టూ చేరి అలా ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే బిత్తర పోయినట్లు చూస్తూ నిలబడి పోయిన కళ్యాణి ఈ ఆఖరి ప్రశ్నతో మరీ ఖంగారు పడిపోయింది -- ఆ పిల్ల కళ్ళల్లో నీళ్ళు కూడా తిరగాబోయాయి. 'నాన్న-- నాన్న పేరు వీళ్ళు అడుగుతున్నారు-- తనేం చెప్తుంది -- అమ్మ, అమ్మమ్మా, అక్కయ్య, మామయ్యా తప్పితే నాన్న అని తను ఇంత వరకూ ఎవరినీ నాన్న అని తను ఇంతవరకూ ఎవరినీ పిలవలేదు-- ఆ ప్రశ్నకి సమాధానం ఏం చెప్తుంది.'
కళ్యాణి ఎంత జాగ్రత్తగా వుందాలను కున్నా ఆ పిల్ల కళ్ళల్లో నీటి పొర కొంత మంది కంట పడనే పడింది. ఆధైన్యాన్ని మరోలా అర్ధం చేసుకున్న ఒకరిద్దరు,
'అయ్యో పాపం -- మీ నాన్నగారు లేరా -- నీ చిన్నప్పుడే చచ్చిపోయారా ' అంటూ సానుభూతి కురిపించబోయారు.
'మనవూరి కలక్టరు గారి అమ్మాయనుకున్నాను, కాదుట.' అని ఒకరు , 'కొత్తగా వచ్చిన డాక్టరు గారి మనవరాలను కున్నాను-- ఉహు . -- పాపం కళ్యాణి నాన్నగారు లేరుట ' అని ఒకరు జాలి వలక బోస్తుంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియని కళ్యాణి కి భోరున ఏడవాలని పించింది -- అతి ప్రయత్నం మీద నిగ్రహించు కుంది. కాని ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవటానికి ధైర్యం చాల లేదు. ఇవాళ తప్పించుకుని వెళ్తుంది. వీలైతే రేపు కూడ తప్పించు కుంటుంది -- కాని, అలా ఎంతకాలం జరుగుతుంది -- ఏదో ఒకనాటి కయినా ఆ ప్రశ్నకి సమాధానం రాబట్టు కోకుండా వూరు కుంటారా? అదే ఏమని చెప్పాలి' అని ఆలోచిస్తుంటే తన అమ్మమ్మ పేరు ఆ వూళ్ళో అందరికీ తెలిసి వుంటుందనీ, ఆమె పేరు చెప్పగానే తను ఫలానా అని వాళ్ళంతా గ్రహించుకో గలరనీ ఆ చిన్నారీ మనస్సులో ఒక నమ్మకం లాంటి భావం కలిగింది. అందుకే మెల్లిగా అంది. ' మా అమ్మమ్మ పేరు కనకవల్లి' అని.
'కనకవల్లా ?' అయిదారు కంఠలు ఒక్కసారే అడిగాయి. 'అంటే ఎవరు, ఎక్కడుంటారు ' ఏ జమీందారిణీ గురించో వినబోతున్నట్లు ఆసక్తిగా కళ్ళు విప్పార్చు కుని మరీ చూశారు.
కానీ అంతకన్నా మరి వివరాలు చెప్పకలిగే శక్తి గాని ఆసక్తి గాని కళ్యాణి కి లేకపోయింది. అందుకే అసలా ప్రశ్నే వినిపించు కొనట్లు, నే వెళుతున్నా ' అంటూ సంచీ బుజాన్న తగిలించుకుని క్లాసు బయటికి వచ్చేసింది.
కొద్ది రోజులలోనే కళ్యాణి ఎవరో ఇంచు మించు అందరికీ తెలిసి పోయింది. ఆ పిల్ల నోరువిప్పి చెప్పుకో అక్కర్లేకుండానే -- మొట్టమొదటి రోజు క్లాసందర్నీ ఆకర్శించుకుని ఆకట్టేసుకున్న కళ్యాణి కి క్రమంగా సరదాగా మాట్లాడే తోడు కూడా కరువయిపోయి నట్లయింది -- కళ్యాణి ఒక జట్టూ మిగిలిన అమ్మాయి లంతా ఒక జట్టుగా చీలిపోయారు -- ఎప్పుడైనా వో కొత్త అమ్మాయి జేరటం తటస్థిస్తే , క్లాసందరి లోకి చుక్కల్లో చంద్రుడి లా మెరిసి పోతున్న కళ్యాణి స్నేహం కోసం తెగ వుబలాట పడిపోయి తనే పలకరించి స్నేహం కలుపుకునేది. కాని కొద్ది రోజుల లోనే మళ్లీ కళ్యాణి పట్ల అయిష్ట త ఏర్పరచుకుని రెండో జట్టులో చేరిపోయేది. వాళ్ళకీ కళ్యాణీ కి మధ్య ఏనాడూ పోట్లాట జరగలేదు. మాటా మాటా పెరగలేదు. కాని, వాళ్ళ చూపులలో నడవడిలో , 'హు , నువ్వు మాతో స్నేహం చెయ్యటానికి అర్హురాలివి కాదు-- మేము పరువూ ప్రతిష్టా కలిగిన గొప్ప కుటుంబాల లోంచి వచ్చిన అమ్మాయిలం -- మాలాంటి మర్యాదస్తులతో నువ్వేకడ సరి తూగగలవు?' అనే భావం కళ్యాణి స్పష్టంగా గుర్తించ గలిగేది. 'నన్ను చూస్తె నే వీళ్ళకి అలుసు, ఏవగింపు-- నాతో ఎవ్వరూ కలవరు.' అనుకుంటూ విలవిల్లాడి పోయేది ఆ పసి మనసు.
ఇంట్లో మనుష్యులన్నా పరిసరాలన్నా కళ్యాణి కి మొదటి నుండీ ఏవగింపె . ఇంక స్కూల్లో వున్న కాస్సేపయినా తనతో సరదాగా కబుర్లు చెప్పి తనని వో స్నేహితురాలిగా అభిమానించే వ్యక్తీ కరువవటం తో మనస్సు ఎంతగానో గాయపడినా, 'నేను బాగా పెద్ద చదువులు చదువు కుంటాను, మంచి వుద్యోగం సంపాదించు కుంటాను. మర్యాదగా ఎంతో గౌరవంగా బ్రతుకుతాను.' అనుకుంటూ భవిష్యత్తు లోకి దృష్టి సారించి చూస్తూ తోటి పిల్లల నిర్లక్ష్యాన్ని అలక్ష్యం చేయటం అలవాటు చేసుకుంది.
స్వతహాగా తెలివి కలది కావటం వల్ల నూ, ఇంటా బయటా స్నేహితులనే వాళ్ళు లేక పుస్తకాలనే ఆప్తులుగా చేసుకుని అస్తమానూ కాలం గడపటం వల్లా కళ్యాణి ఎప్పుడూ క్లాసు లో ఫస్టు గానే వస్తూ వుండేది. అది కూడా మిగిలిన వాళ్ళకి ఒంటికి కారం రాసుకున్నట్లే వుండేది.
కాలం గడుస్తున్న కొలదీ, పిల్లలు పెరిగి పెద్ద వాళ్ళవటం తో పాటు, కొంత మంది మగ పిల్లలు ఆడపిల్లల్ని ఏడిపించే పద్దతి లోనూ మార్పులు వచ్చాయి. వాళ్ళ అల్లరి కూడా అందరి లోకి ఎక్కువగా కళ్యాణే గురి అవుతూ వుండేది-- 'సహాధ్యాయినులని ఇలా ఏడిపించి వాళ్ళు పొందే ఆనందం ఏమిటి? చిన్న క్లాసులలో ఎంతో అమాయికంగా వుంటూ తోటి విద్యార్దునులని తోబుట్టువులలాగే అభిమానిస్తూ వుండే విద్యార్ధులలో కొంత మంది కాస్త వయస్సు వచ్చేసరికి ఇలా అల్లరి మూకలా ఎలా తయారవ గలరు? వాళ్ల తోబుట్టువులని కూడా ఇలాగే ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళకెలా అనిపిస్తుంది.' అనే వాటిని గురించి ఎన్ని సార్లు ఆలోచించినా కళ్యాణి కి సమాధానం దొరికేది కాదు.
ఓ ఉదయం క్లాసు లోకి వచ్చి పుస్తకాలు డస్కు లో పెట్టుకో బోయింది. చేతి కేదో గట్టిగా తగిలినట్లయింది-- పరధ్యానంగా వుండటం వల్ల వులిక్కిపడి కెవ్వుమంది-- మిగిలిన అమ్మాయి లంతా తెల్లబోయి అటు చూశారు-- కళ్యాణి ధైర్యం చేసి చెయ్యి లోపలికి పెట్టి ఆ వస్తువు బైటికి తీసింది-- ఉల్లిపాయల వాసన బట్టి అదో చిన్న పకోడీల పొట్లం అని ఎవరైనా వూహించు కుంటారు-- కళ్యాణి మనస్సు భగ్గుమని మండిపోయినట్లయింది. 'ఏం చెయ్యాలి తనిప్పుడు? ఈ పొట్లం తీసుకు వెళ్లి హెడ్మాస్టారు కి చూపిస్తోనో?' అనే ఆలోచన కూడ వచ్చింది. మళ్లీ అంతలోనే ఆ వుద్దేశ్యమూ మార్చుకుంది. 'సరే, ఇప్పటికి వూరుకుంటాను. రిపోర్తులూ, అవీ చేసి స్కూలంతటి లో అల్లరి పడటం ఎందుకు.' అనుకుంటూ, ఆ పొట్లాన్ని కిటి కి లోంచి గ్రౌండు లోకి విసిరేసింది, చీత్కారం చేస్తూ.
