ఊరుకుని వెళ్ళిపోయాడు. వుప్పాల రాముడొచ్చి వీరన్న చెవిలో యేదో గొణిగాడు.
"మనుసుల మనసెవడు కొనగలడు?" అన్నాడు వీరన్న.
"తనమాటకి తలూపే వాళ్ళు తనకు ఓటో యిచ్చినట్టట. అలాగా యెవరుకి యెచ్చు నోటోలు వస్తే వాళ్ళే పెద్దట. నాకు చిట్టిరాజు కెయ్యమని దువ్వుతున్నారులే. నీ లో కక్కుర్తి లేదు. స్వంతంకి ఒకమాట. పరాయికింకో మాటాలేదు. గుంపంతకీ కోపం వచ్చినా నాయమైన మాటే ఆడతావు, నాయంగా నడుస్తావు. ఓటోలంటూ వస్తే నీకే యెత్తాను."
ఆసనాల వీరన్న కుయిది కొత్తగా అనిపించింది. కులపెద్ద అంటే ముల్లకిరీటం గానీ దూది ఎరుపు కాదే. ఈ గుంపును గౌరంగా పోయినట్లు సూసినోడు యెపుడైతే నేమి? ఆడికే యీ కిరీటం తగిలించడానికి తనుసయ్యేఁ. దానికి తగువెందుకు. లంచాలెందుకు? దీనికి పన్నాగాలెందుకు!
ఇన్ని అనుకున్న వారంరోజులనాడే ఒక గొడవ జరిగింది. మళ్ళీ అందులో అమాయకుడు రాముడే దెబ్బతిన్నాడు. ఈసారి చిట్టిరాజు కోటమ్మ ఒంటిగా నీలాటిరేవు దగ్గర వుండటం చూసి వెళ్ళాడు. అసలు వయసులో వున్న ఆడది నీలాటి రేవులో ఒంటిగా వున్నప్పుడు వెళ్ళటమే తప్పు. వికటం ఆడితే మరీ తప్పు. ముట్టుకుంటే మహాతప్పు. చిట్టిరాజు వెళ్ళాడు. వికటం ఆడితే కోటమ్మ మాట విసిరిందని చెయ్యి చేసుకున్నాడు.
"ఇదంతా అబద్ధం" అన్నాడు చిట్టిరాజు.
"అదే నాకు పిల్చింది. యెళ్ళాను. ఇంతలో మొగుడ్ని చూసి యిలాగ యెత్తేసింద"న్నాడు.
ఏమైనా రాముడుకోరిక వీరన్న కాదన లేదు. పంచాయతీ పెట్టాడు. చిట్టిరాజు వచ్చాడు. వీరన్న న్యాయమూర్తిలానే వుండి, కొడుకును ముద్దాయి లాగే చూసాడు. కాని కొడుకు న్యాయమూర్తిపై పెద్ద న్యాయమూర్తిగా వ్యవహరించాడు. మొదట్లో పెడసరం జవాబులు వస్తుంటే ముద్దాయిని మందలించాడు.
"అదే పిల్చిందంటున్నావు. అది పిల్చినప్పుడు యెవరైనా చూసారా?"
"ఆడది నలుగురు చూస్తున్నప్పుడు పిలుస్తాదేమిటి?"
"ఎక్కడికి రమ్మన్నాదీ?"
"నీలాటి రేవుకి..."
"ఎప్పుడు?"
"అది పిల్చినప్పుడే యెళ్ళాను."
"పెళ్ళయిన ఆడది పట్టపగలు నీలాటి రేవుకి నిన్ను రమ్మని సైగ చేసిందా"
"అవును నేనంటున్నాను అదే. మొగుడుండగా నాకు చనువిచ్చింది. మీ ఆచారం ప్రకారం దానిది తప్పో లేదో తెలుసుకోండి."
"ఏం చెయ్యమంటావో చెప్పు?"
"మీ ఆచారం ప్రకారం మూడుమానికలు మంచినూనె, కొత్తకుండ, బంగారం వుంగరం తెచ్చి - మరుగుతున్న నూనెలోని వుంగరం దానిచేత తియ్యించండి. కాల్తే అది నంగనాచి కాదుకదా -- కాలకపోతే నాదే తప్పు.
వీరన్న నవ్వాడు. "మాంచి సులువే. ముందు నీచేత తీయించాలి. ఎంచేతంటే అటు ప్రక్క వాళ్ళు నివ్వు తప్పు చేశావని ముందు మా యెదట నాయం కోసం నిలబడ్డారు. ఏం కొత్తకుండ తెప్పించమంటావా?"
"అదెలాగ. అలనాడు సీత అగ్గిలో దూకింది గానీ రాముడు దూకాడా?"
"అలా తోవలోనికి రా. ఏమర్రా అందరూ యినండి. కోటమ్మకి మొగుడున్నాడని యీడికి తెలుసును. ఆడన్నట్టు అది పిలిసిందే అనుకోండి. పిలిస్తే మన నీతి ప్రకారం దాన్ని మందలించాలి. అంతగా యిద్దరి మనసులు కలిసిపోతే ముందా మొగుడన్నోడి సెవులో యేసి యిడాకులు తెంపు కున్నాక యీ యిద్దరూ మన కులాచారం పెకారం పెళ్ళాడి ఒకటవ్వాల. అదేం నేకండా యీసిట్టి రాజు యెర్రగా బుర్రగా వుందని యెదుటోడి పెళ్ళాన్ని నీలాటి రేవు దగ్గర యికట మాడాడు. అది యెర్రి యేసాలు యెయ్యమోకు అందని అడదానిమీద సెయ్యేసాడు. ఇన్ని తప్పులు సేసాడు. దీనికి శిచ్చ వందరూపాయలు తప్పు. వారం రోజుల్లో యిచ్చుకోకపోతే గుంపులో ఒకడింటిలో పొయ్యిలో అగ్గివ్వకూడదు. ముంతతో నీరివ్వకూడదు. ఈడికి పిల్లను యెవరూ యివ్వరు. సమ్మందాలుండవు. కులంలో యెలే-ఈ బంధంలో చిక్కొడకండా తప్పించుకో..."
చిట్టిరాజు పౌరుషంతో వెటకారంతో చూసాడు. "ఇదిగో డబ్బు - ఏం చేస్తావ్" అని నోట్లు ఆడించాడు.
"నీ తప్పుతో యిక్కడికులం అంతా యిరకాటాన పడింది.
"ఇది యింటింటికి పంచిపెట్తాను."
"పంచిపెట్టి..."
ఎవడు త్రాగుతాడు. ఎవడు పంది నేను కుంటాడు. యెవడు దాచుకుంటాడు. వాడి యిష్టం."
"అంత అమాయకుడ్ని కాదు." అంటూ చిన్న విషల్ వేశాడు.
"చిట్టిరాజు డబ్బుకట్టక" పొట్ట తడుముకుంటూ పొట్టయ్య అనగానే కోలాహలం బయలుదేరింది. చిట్టిరాజు ప్రక్క గోలచేసేవాళ్ళు యెక్కువయ్యారు. వీరన్న యెంత ప్రయత్నించినా లాభంలేక పోయింది. రాముడు మరి నలుగురు యిటుప్రక్క వాదించినా, వినిపించకందడా చేస్తున్నారు. చిట్టిరాజుకు జైకొట్తున్నారు.
"ఆగండి....ఆగండి" చిట్టిరాజు నవ్వుకుంటూ ముందుకొచ్చాడు.
"ఏనాడైతే ఆసనాల వీరన్న ఆడి కూతురు వయసు ఆడదాన్ని తెచ్చాడో, ఆనాడే ఆడిలో నీతి వచ్చింది."
వీరన్న కొడుకునోటే యీ మాటలు వినగానే అలా కాలు చాపేసాడు. చిట్టిరాజు తనను పైకెత్తిన తన సహచరులను వుద్దేశిస్తూ "ఈ కట్టుబాట్లు, ఈ వేషాలు అన్నీ పాతైపోయాయి. పట్నంలో కోర్టులున్నాయి. పోలీసులున్నారు. పోలీసులు పట్టుకొని కేసు పెట్టిస్తే- ప్లీడర్లున్నారయ్యా. ఆలు అసలు తెలివైనోళ్ళు. పోలీసోలకి ఠారు కొట్టిస్తారు. ఆ తీర్పు సెప్పిన పెద్దకి యెన్ని లా పోయినట్లు తెలుసు. ఈ యీరన్నకేం తెలుసు? పంచాయితీ అంటే ఆ డొక్కడి మాటేంటి? పదుగురి మాట- పదుగురు మాటమీద రాజ్యమేలు తున్నప్పుడు ఒక్కడి మాటమీద ఈ గుంపుని యేలేస్తాడా? రమ్మను బలాబలాలు వోట్లుతో తేల్చుకుందాం!"
అంటూ ఒకసారి నవ్వుతూ చుట్టూచూసి "మీకు పెద్దగా యెవరు కావాల?" అనగానే "చిట్టి రాజే" అన్న గోల యువకులంతా చేశారు. వీరన్న లేవబోతే "కూర్చో - నివ్వు మా కొద్ద"ని ఆ కుర్రాలే గోల చేసారు.
వీరన్న తలపాగా తీశాడు. ముందుకువచ్చి అందర్నీ గోలచెయ్యొద్దని చేతులు జోడించి ప్రార్దించాడు. సద్దుమనిగాక-
"ఈ సెణంనించీ మీరెంచుకున్న సిట్టిరాజే మీ పెద్ద. ఆడే పంచాయితీ జరిపిస్తాడు. మీకే కష్టాలు, యిబ్బందులు వచ్చినా ఆడిదగ్గరకే ఎల్లండి." జరిగి కొడుకు దగ్గరకు వచ్చాడు. చేతితో ఒకసారి తలనిమిరి "చూడునాయనా.... మనిషి తాలూకా మెదడు. కళ్ళు. చెవులూ, ముక్కూ, నోరూ అన్నీ యీ బుర్రలోనే వుండి ఒళ్ళును సరిగ్గావుస్తున్నయ్ అలాగే నివ్వు యిప్పటినించి యీ గుంపుకి బుర్రలాంటోడివి. సరిగ్గా వుంచు."
మెల్లగా అక్కడనించి కదలిపోయాడు.
6
చీరిచూస్తే నేతిచుక్కలేని నేతి బీరకాయలా రాజు పెద్దరికం చలా యిస్తున్నాడు. పెద్ద కుండ వలసిన విషయ పరిజ్ఞానం. హుందా పెద్ద మనిషి లక్షణాలు వీడికి లేవు. ఆవేశం మాత్రం కొండంత వుంది. గుంపునంతా అలంకరించాలని ఆవేశ పడుతున్నాడు. మనుషులు కొంగల్లా జపం చేసి చేపలు పట్టుకునేటటువంటి బ్రతుకులు వాడికి యిష్టంలేదు. కడుపే కైలాసంకాదు. ఉప్పుంటే సరా వూరగాయకు?
బంగారంతోపాటు సింగారం వుంటే గుంపంతా కొత్తనీరువచ్చి పాతనీరుని కొట్టుకొని పోతుంది. నసిలితే పనులుకావు. ఈ కట్టుబాట్లతో కట్టివేస్తే మనుషులు మంత్రించిన పాములైపోతారు. పాముల్లా పడగలెత్తి బుసలుకొట్తూ యిటూ అటూ పరుగెత్తాలి. శనిపట్టిన మనుషుల్లా వుంటే యేం లాభం? పిట్టకు రెక్కల్లాంటి మనసు మనిషికున్న ప్పుడు స్వేచ్చగా యెగరాలి.
* * *
