ఓ ఆదివారం పొద్దుటే ఆడుకోవటానికి వచ్చింది పద్మజ. వీధి వరండాలో లక్క పిడతల బుట్ట దిమ్మరించుకుని కూర్చున్నారిద్దరూ. పార్వతి తమ్ముడు సూరి కూడా ఆటలోకి వచ్చి కలిశాడు.
"నన్ను వంట చేసుకోనివ్వటం లేదు. రుక్కు ని కూడా తీసికెళ్ళవే , పారూ!' అంటూ కేక పెట్టింది సావిత్రి. రానని మారం చేస్తూ కాళ్ళు రెండు నేలకేసి బాదుకుంటున్న చెల్లెలిని బలవంతంగా వీధి వరండా లోకి లాక్కు వచ్చింది పార్వతి. ఓ చిన్న పటిక బెల్లం పిసరు రుక్కు నోట్లో పడేసింది పద్మజ. టక్కున ఏడుపు ఆపేసి, బెల్లం ముక్క తియ్య తియ్యగా చప్పరిస్తూ కూర్చుంది రుక్మిణి. రెండు మూడు లక్క పిడతలు దాని ముందుకు విసిరింది పార్వతి.
అట జోరుగా సాగుతున్నది.
అన్నం ఉడికింది. చారు, వేపడం కూడా అయ్యాయి. మడిగానే పచ్చడి రుబ్బుతున్నది పార్వతి. గోడకు చేరబడి వాలు కుర్చీలో కూర్చుని పేపరు చదువుతూ భోజనం కోసం హడావిడి పడుతున్నది పద్మజ. లక్క పిడతలో ఉడుకుతున్న కంది పప్పు తింటానని ఎగబడుతున్నది రుక్మిణి.
"అంటుకోకే, వెర్రి పీనుగా! వంటలన్నీ అంటు చేసేలా ఉన్నావు!" అంటూ గద్దించింది పార్వతి అరిందలా.
ఓసారి నాలుగు వైపులా చూసి బావురుమంది రుక్కు.
"అబ్బ! అంటూ లేదు, గింటూ లేదు. కాస్త పప్పు పడేద్దూ! అది ఏడ్చిందంటే ఊరుకోదు" అంది పద్మజ విసుగ్గా.
మళ్ళీ ఏడుపు మానేసి కంది బద్దలు ఏరుకు తింటూ కూర్చుంది రుక్మిణి. ఏడుపు మొహం పెట్టి ఎక్కాలు చదువుతూ దిక్కులు చూస్తున్నాడు సూర్యం.
"వంటయింది . లేచి మడి కట్టుకుంటారూ?" అంటూ దీర్ఘం తీసింది పార్వతి, గోడ కుర్చీలో పడుకున్న భర్త గారి నుద్దేశించి.
"ఆ వచ్చే, వచ్చే! వడ్డన కానీ!" అంటూ బద్దకంగా లేచింది పద్మజ.
ఒక్కసారిగా వీధిలో బస్సు హారన్ ల మోత వినవచ్చింది. మడీ దడీ చాలించి బయటికి పరిగెత్తింది పద్మజ. వంటా గింటా ఆపేసి వెనకే దారితీసింది పార్వతి. పటిక బెల్లం పెచ్చు దొరక బుచ్చుకుని ఉడాయించాడు సూర్యం. వంట తప్పాలాలన్నీ చెల్లాచెదురు చేస్తూ కేరింతలు కొట్టింది రుక్మిణి.
పార్వతీ వాళ్ళ ఇంటి ఎదర మేడలోకి ఎవరో కొత్తగా దిగినట్లున్నారు. నాలుగైదు లారీలు నిండుగా సామాన తో వచ్చి ..రోడ్డు కడ్డంగా నిలబడ్డాయి. మనుష్యులు మాత్రం క్రితం రాత్రే వచ్చినట్టున్నారు. గేటు లో నుంచి పరిగెత్తుకు వచ్చాడో కొత్త కుర్రాడు. పద్మజా, పార్వతీ కూడా కుతూహలంగా దింపుతున్న సామాన్లు చూస్తూ నించున్నారు. లారీల దగ్గరికి రాబొయిన ఆ అబ్బాయి చటుక్కున ఆగిపోయి ముఖం తిప్పుకుని ఎటో చూస్తూ నిలబడి పోయాడు.
వదులుగా వెళ్ళాడుతున్న పొడుగు లాగూ, పసుపు రంగు సిల్కు చొక్కా , కంటే మెడలో సన్నటి గొలుసూ, రెండు చేతుల వెళ్ళకూ ఉంగరాలు, దుబ్బులా ముఖం మీదికి పడుతున్న ఒత్తు జుట్టూ. బాగా తెల్లగా, బొద్దుగా ఉన్న ఆ అబ్బాయిని వింతగా చూస్తూ అంది పద్మజ; 'చూడు , పారూ! ఆ అబ్బాయి గమ్మత్తుగా లేడూ?"
పార్వతి కూడా చూస్తూనే ఉంది. ఏమంత గమ్మత్తుగా కనిపించలేదా అబ్బాయి.
పద్మజ నవ్వుతూ అంది. "మనం అ అబ్బాయితో మాట్లాడదామా?"
'అమ్మో ! వద్దు బాబూ!" బెరుగ్గా చూసింది పార్వతి.
"ఏం? ఏం భయం?"
"ఊహూ! వద్దు. అసలా అబ్బాయి మనతో మాట్లాడతాడో లేదో!"
తిరస్కారంగా చూసింది పద్మజ. "మాట్లాడడూ? అయితే రా. వెళ్ళి అడుగుదాము."
పద్మజ చకచకా పోతుంటే వెనకే వెళ్ళక తప్పలేదు పార్వతికి. గేటు దగ్గరే నిలబడి లారీ లలో నుంచి దిగుతున్న బల్లల కేసి, కుర్చీల కేసీ చూస్తున్న ఆ అబ్బాయి, తన ముందుకు వచ్చి ఇద్దరు ఆడపిల్లలు నిలబడడంతో ఉలిక్కిపడి చూశాడు. ఎదురుగా నించున్న పద్మజ తిన్నగా ఆ అబ్బాయి ముఖంలోకి చూడటానికి ప్రయత్నిస్తూ ఆడిగింది , "నీ పేరేమిటి ?"
కంగారుగా కళ్ళు మిలమిలలాడించాడా అబ్బాయి.
"ఏం? నిజంగా మాట్లాడవూ? నీ పేరేమిటో చెబితే ఏం పోతుంది? ప్రసాదా?"
"ఊహూ!" బిక్క మొహం వేసి నసుగుతూ అన్నాడు; "రఘు....రఘుబాబు."
"రఘు బాబు!' విజయగర్వంతో చూసింది పద్మజ పార్వతి కేసి. మళ్ళీ మాటలు పొడిగిస్తూ అంది. 'నువ్వేం చదువుతున్నావు, రఘుబాబూ?"ఎనిమిదవ క్లాసా?"
తెల్లబోయాడు రఘుబాబు. తల అడ్డంగా ఊపాడు . "ఊహూ! అరవ క్లాసే!"
'అరవ క్లాసే! ఇంకా!" ఆశ్చర్యపడింది పద్మజ.
సిగ్గు పడిపోయాడు రఘుబాబు.
జాలివేసింది పార్వతికి.
పద్మజ మళ్ళీ అంది. "నువ్వు నాకన్నా పెద్ద వాడివి కావూ? కావాలంటే మాస్టారిని అడుగుదాము. నేనూ అరవ క్లాసే , పార్వతీ అరవ క్లాసే. నా పేరు పద్మజలే. మా చెల్లాయి పేరేమో సుజాత. పాపా అనే పిలుస్తుంది మా అమ్మ. అయితే రఘుబాబూ, మనం అందరం జట్టుగా ఉందామా?"
రఘుబాబు తల దించేసుకున్నాడు.
"ఏం? మాట్లాడవేం? ఎంచక్కా పార్వతి మీ ఇంటి ఎడురగానే ఉంటుంది. వాళ్ళ తమ్ముడూ, చెల్లాయి కూడా ఉన్నారు. నేనూ మా చెల్లాయి ని తీసుకొస్తాను. మనం అందరం కలిసి మీ చోటలో ఆడుకుంటే బాగుండదూ?"
ఆశగా చూసింది పార్వతి.
నెమ్మది నెమ్మదిగా తలెత్తి పద్మజ వెనకగా నిలబడి వున్న పార్వతి కేసి చూశాడు రఘుబాబు. తనతో మాట్లాడుతున్న పద్మజ కన్నా మంచి పిల్లలా కనిపించింది పార్వతి. అంత మంచి పిల్లతో జట్టు ఉండి ఆడుకుంటే ఎందుకు బాగుండదూ! రఘుబాబు ముఖంలో కొంచెం నవ్వు కనిపించింది. "నేను మీ అందరి జట్టూ ఉంటాను" అన్నాడు.
(1).jpg)
పార్వతి ముఖం వికసించింది. నవ్వుతూ చూసింది పద్మజ కేసి.
"అయితే రఘుబాబూ! నువ్వు ఆడపిల్లలా గొలుసు వేసుకున్నావెం?' కుతూహలంగా అడిగింది పద్మజ.
విని వినిపించనంత నెమ్మదిగా అన్నాడు రఘుబాబు. "ఏమో, మరి! మా అమ్మే వేస్తుంది."
"మరి నీకు సిగ్గు కాదూ?"
జవాబు చెప్పకుండా దీనంగా చూశాడు రఘుబాబు.
'పోనీ గొలుసు మీ చెల్లాయి కిచ్చేయ్యి." నోరు పెగుల్చుకుని మాట్లాడింది పార్వతి.
దాదాపు ఎడ్చేవాడిలా అన్నాడు రఘుబాబు; "చెల్లాయి లేదుగా?చచ్చిపోయింది."
జాలిగా చూసింది పార్వతి. "తమ్ముడో?"
"ఊహూ! ఎవ్వరూ లేరు. నేను ఒక్కడ్నే."
"పోనీలే , రఘుబాబూ! ఏడవకు. మేమందరం ఆడుకుంటాముగా నీతో?' సానుభూతిగా ఒదార్చింది.
ఏడుపు రాబోయినా పార్వతిని చూస్తూ ఊరుకున్నాడు.
"నాయనా, రఘూ! ఎందుకలా ఎండలో నించున్నావు?" మేడ వరండా మీదనుంచి గట్టిగా కేకపెట్టింది అన్నపూర్ణమ్మ.
'ఆవిడ ఎవరు, రఘు బాబూ? మీ అమ్మేనా?" పద్మజ అంది.
"ఊ. మా అమ్మే! నన్ను ఎండలో నించోవద్దని కేకలేస్తోంది."
"ఏం? ఎండలో నించుంటే ఏమవుతుంది?"
"జబ్బు చేయ్యదూ?" విస్మయంగా చూశాడు రఘుబాబూ.
"జబ్బు చేస్తుందా?' మరీ విస్మయంగా చూసింది పద్మజ. "వానలో తడిస్తే జబ్బు చేస్తుంది గానీ, ఎండలో నించుంటే ఎందుకు జబ్బు చేస్తుంది? అయితే నువ్వు ఎండలో బడి కెళ్ళి రావూ?"
"మా నాన్నగారు బడికి పంపించరుగా? ఇంటి దగ్గరే ప్రయివేటు చదువు కుంటాను."
ఆశ్చర్యంగా చూసింది పార్వతి.
"బడికి వెళ్తే కూడా జబ్బు చేస్తుందా నీకు?" జాలిగా అడిగింది పద్మజ. అస్తమానూ జవాబులు చెప్పాలంటే విసుగేసింది రఘుబాబు కు. మాట్లాడకుండా నించున్నాడు.
"లోపలికి రా, నాయనా! రఘుపతీ!" మళ్ళీ కేకపెట్టింది అన్నపూర్ణమ్మ.
"మనం ఇంటికి, పోదామా, పద్మా?" అంది పార్వతి.
రఘుబాబు కొంచెం ధైర్యంగా పార్వతి ముఖంలోకి ఆశగా చూశాడు. "ఒక్కసారి మా ఇంట్లోకి రాకూడదూ? మా అమ్మకి ఆడపిల్ల లంటే చాలా ఇష్టం."
ఆ ఆహ్వానం కోసమే ఎదురు చూస్తున్నదానిలా ముందే దారి తీసింది పద్మజ.
సామాను సర్దుకుంటున్న హడావుడి లో ఉన్నా అన్నపూర్ణమ్మ ముచ్చట వేస్తున్న ఆడపిల్లలను చూసి సంబరంగా పలకరించింది. పార్వతీ ఎదురింటివారి అమ్మాయేనని తెలుసుకుని దగ్గరికి తీసుకుని తల కూడా నిమిరింది. "రోజూ వస్తూ ఉండమ్మా, మా ఇంటికి" అంది నవ్వుతూ. కాస్సేపు మేడ అంతా చూసి వచ్చేస్తుంటే ఇద్దరినీ వెనక్కు పిలిచి చెరో లడ్డూ ఇచ్చింది. ఆ లడ్డూలు నేతి వాసన వస్తూ కమ్మకమ్మగా ఉన్నాయి. కొంచెం కొరికి మిగతాది పరికిణి లో దాచుకుంది పార్వతి.
"ఏం? తినవూ?"
"మా రుక్కుకీ, సూరీకి ఇస్తాను."
"అయితే నా లడ్డు లో పెడతాను నీకు" అంటూ పద్మజ సగం ముక్క విరిచి పార్వతి కి ఇచ్చింది. రఘుబాబు కూడా ఓ లడ్డూ తింటూ ఎండలోకి రాకుండా వరండా మీదే నించున్నాడు. పద్మజ పార్వతి చెవిలో నోరు పెట్టి రహస్యంలా అంది. "రఘుబాబు చాలా పిరికి వాడు. కాదూ?"
పార్వతి ఏదో మాట్లాడే లోపునే -- "నేను పోతున్నానోయ్! రేపు మళ్ళీ వస్తాగా?" అంటూ రోడ్డు మీదికి పరుగు తీసింది పద్మజ. వెనక్కు తిరిగి ఓ సారి రఘుబాబు కేసి చూసి చటుక్కున తల దించుకుని రోడ్డు దాటి ఇంట్లో జొరబడింది పార్వతి.
* * * *
"ఎండ వేళ. కాస్సేపు పడుకోకూడదుటే, పారూ? ఎందుకలా కొరివిలా కూర్చున్నావు?" అప్పటికి నాలుగైదు సార్లయినా పిలిచింది సావిత్రి.
అన్నం తిన్న దగ్గర నుంచీ ఎదర మేడ కేసి చూస్తూ వీధి అరుగు మీదే కూర్చుంది పార్వతి. తల్లి కేకలతో అయిష్టంగానే కదిలి లోపలికి వెళ్ళి రుక్కు పక్కనే పడుకుంది చాప మీద. కళ్ళు బలవంతంగా మూసుకున్నా ఉండటం లేదు. వాటంతట అవే తెరిపిళ్ళు పడి సూటిగా పై కప్పులోకి చొచ్చుకుపోతున్నాయి. ఎత్తుగా పైన దూలాల నిండా బూజూ, సాలె గూళ్ళూ , గాలికి సన్న సన్నగా రాలుతున్న దుమ్మూ!
"అమ్మా! మన ఇల్లు బాగా లేదు కదే?"
పాతచీర కుట్టుకుంటున్న సావిత్రి సూది గుచ్చటం ఆపుచేసి విచిత్రంగా చూసింది. "ఏం? ఎందుకు బాగాలేదు?"
"ఎంచక్కా మేడలాగా లేదుగా?"
"ఇదేమిటేవ్ , ఇవ్వాళ కొత్త కబుర్లు పుట్టుకొస్తున్నాయి?"
"నిజమేనమ్మా! రఘుబాబు వాళ్ళ మేడ పద్మజా వాళ్ళ మేడ కన్నా బాగుంది."
"రఘుబాబెవరు?"
చటుక్కున లేచి కూర్చుంది పార్వతి. "మన ఇంటి ముందు మేడ లోకి కొత్తగా రాలా, పొద్దున
? బోలెడు కుర్చీలూ, అవీ వచ్చాయి!"
"వాళ్ళ కుర్రాడా ఏమిటీ? వాళ్ళింటి కెప్పుడేళ్ళావు?"
పద్మజ కూడా వచ్చింది. వాళ్ళమ్మ ఎంత మంచిదనుకున్నావు? ఓ ;లడ్డూ ఇచ్చింది తినటానికి. రుక్కుకీ, సూరి కి కూడా పెట్టాను నేను."
"బాగుంది . పొద్దుట వచ్చారో లేదో, అప్పుడే వాళ్ళింటి మీదికి ఎగబడడం ఏమిటి? వాళ్ళెం చిరాకు పడతారో-- మరెప్పుడూ వెళ్ళకు."
పార్వతి సంతోషమంతా చచ్చిపోయింది. మళ్ళీ ఇంటి కప్పు కేసి చూస్తూ పడుకొంది.
"పోనీ, నిద్ర రాకపోతే లేచి చదువు కొరాదూ? ఎందుకలా గుడ్లప్పగించి చూస్తావు?" కూతురి వైఖరి కనిపెట్టి అంది సావిత్రి. గమ్మున లేచి సంచీ తెచ్చుకు కూర్చుంది పార్వతి.
సాయంత్రం నీరెండ లో సన్నజాజి పందిరి కింద కూనిరాగం తీస్తూ పువ్వులు మాల కడుతూ కూర్చున్న తల్లి దగ్గర నెమ్మదిగా చేరింది పార్వతి. "ఇవ్వాళ పువ్వులు చాలా పూశాయి కాదమ్మా?"
"రోజూ శ్రద్దగా నీళ్ళు పోయ్యవే అంటే వింటున్నావు ? మరిన్ని పూసేవిగా?"
"రేపటి నుంచీ తప్పకుండా పోస్తానమ్మా!"
"ఆ -- పోశావులే ." మళ్ళీ కూనిరాగం అందుకొంది సావిత్రి.
"అమ్మా!"
"ఏం? ఏమిటా నసుగుడు?"
"పువ్వులు చాలా ఉన్నాయి కదమ్మా! రఘుబాబు వాళ్ళ అమ్మకి కాసిన్ని ఇస్తేనో!"
"రఘు బాబేవరే?..... ఎదర మేడలో కొచ్చిన వాళ్ళా?"
"అవునమ్మా! పొద్దున్న ఓ లడ్డూ కూడా ఇచ్చింది వాళ్ళమ్మా.
"పోనీ తీసు కేల్దువుగానిలే. మాల కట్టనీ!"
