Previous Page Next Page 
చదరంగం పేజి 6


    స్టేషన్ జనంతో క్రిక్కిరిసి పోయింది. ఫ్లాట్ ఫారమ్ మరీ సందడిగా ఉంది. రమ పెట్టిన చీర కట్టుకొంది భారతి, జయ తల దించుకొని టైము చూసుకొంటూంది. అది రాము ఇంటి గుర్తుగా భారతి ఇచ్చిందని జయ మనసుకే తెలుసు.
    బెంచీ మీద కూర్చొని బిస్కట్లు ఫలహారం చేస్తున్నాడు రవి. వేణుగోపాల్, జయ తండ్రి చేతులు కలిసి ఏదో ధారాళంగా చర్చిస్తున్నారు. భారతి ఉండి ఉండి కళ్ళు తుడుచుకొంటూంది.
    రాము ఒక్కడూ ఎవరికీ సంబంధం లేకుండా దూరంగా నిలబడ్డాడు. చేతులు కట్టుకొని ఆకాశం విపూ, భూమి వైపూ దృష్టిని మారుస్తూ జయ వంక నిండు వాత్సల్యాన్ని కురిపిస్తూ సందేశాలు పంపుతున్నాడు.
    రైలు రాక సూచిస్తూ గంట కొట్టారు, రెండుసార్లు. ఐదు నిమిషాల్లో పొగలు కక్కుతూ వచ్చి పెద్ద శబ్దం చేస్తూ ఆగింది. రైలు ఆగడం ఆలస్యం సామానంతా కూలీలు సర్దేస్తున్నారు హడావిడిగా. జయ కళ్ళు అగ్నిశిఖల్లా మెరిసిపోతున్నాయి. ఇద్దరి మూగ మనసుల బాధ తెలిసిన వ్యక్తుల్లో ఒకడు రవి అయితే, రెండో వ్యక్తి భారతి.
    "చేరగానే ఉత్తరం వ్రాయండి." ఇంగ్లీషులో అంటున్నాడు జయ తండ్రి.
    "భారతీ, మరిచిపోకు." రమ హెచ్చరిస్తూంది.
    రామూ, రవీ చేతులు జోడించి నమస్కారం చేశారు రమాదేవి దంపతులకు. జయ శూన్యంగా రాము కళ్ళలోకి గుచ్చి చూస్తూంది. కిటికీకి దగ్గరగా కూర్చున్నాడు రాముతోబాటు రవి. రైలు క్షణంలో జంటను విడదీస్తూ కెవ్వుమంది. అంతే. మలుపు తిరిగిన రైలు మరో మజిలీకి దారి తీస్తూంది.
    ఫ్లాట్ ఫారమ్ నిండా పులుము కొన్న పొగను చీలుస్తూ కళ్ళను జయ కోసం తిప్పాడు రాము. రైలు సాగగానే వెనుతిరిగి చూసిన జయ తల్లితండ్రులతోబాటు చేయి ఊపింది.

                               *    *    *

    వర్షాకాలం, ఆ వెనక శీతాకాలం, తరవాత వేసవి-ఇలా క్రమం తప్పకుండా కాలం చక్రాలు దొర్లించేస్తూంది. ఎన్నో రోజులు నలిగిపోయయై. ఎనిమిదేళ్ళు దాటి పోయినా భారతికి మొన్న మొన్న ధవళేశ్వరంలో అక్కనూ, బావనూ వదిలి వచ్చినట్లనిపిస్తూంది.
    లేచినప్పటినుంచీ ఒకటే హడావిడి పడిపోతున్నాడు వేణుగోపాల్. "ఏమోయ్, భారతీ! ఇలా రా" అంటూ పిలిచాడు.
    కుంపటి అంటిస్తున్న భారతి విసినికర్ర వదిలేసి మేడమెట్ల మీద తన కోసం ఆగిన భర్త దగ్గర హాజరుగా నిలబడింది.
    "ఈవేళ రిజల్ట్స్ వస్తాయేమో. ఒక స్వీటూ, ఒక హాటూ!"
    భారతి నవ్వులు కురిపిస్తూ వేళాకోళం ఆడింది: "గొప్ప జ్యోతిష్కులే. మీ పిల్లలు పాసయినప్పుడు కదా?"
    వేణుగోపాల్ కు నిజంగానే కోపం వచ్చింది. "శుభమా అని రిజల్ట్సు వస్తూంటే ఏమిటది, భారతీ? రావడం కాదు, నా పిల్లలు ఫస్టు క్లాసులో పాసవుతారు."
    వేణుగోపాల్ కోపంలో మరింత అందంగా ఉంటడు. అది చూడాలనే, "ఒకవేళ కాకపోతే?" అంది.
    భారతి తనను ఆట పట్టిస్తూందని గ్రహించాడు. "మనం నల్లకోటు వేసుకోవడం మానేసి తమకి వేస్తాం."
    "మీ కోతుకీ, మీకూ నమస్కారం. సరే, మీరు ఏది చేయమంటే అది చేస్తాను. ఏం కావాలి?" నడుం మీద చేతులు వేసుకొని మెట్లమీదే నిలబడిన భర్తను చూస్తూ అడిగింది.
    పక్క గదిలో ఇంకా నిద్రపోతూనే ఉన్నారు పిల్ల లిద్దరూ.
    "ఏరా, రామూ, రవీ! పేపరు వచ్చేసింది, నంబర్లు చూసుకోండి." పొద్దున్నే పిల్లలు లేవాలని చిన్న అబద్ధం ఆడేశాడు.
    పక్కమీద నుంచి చెంగుణ క్రిందికి దూకి, 'ఏది, నాన్నగారూ?" అన్నారు ఏకకంఠంతో.
    "మొహం కడుక్కుని కాఫీ తాగి రండి, చూపిస్తాను."
    పిల్లలు బాత్ రూమ్ వైపు దారి తీశారు.
    పేపరు కుర్రాడు ఏడు గంటలు దాటుతూనే పేపరిచ్చి వెళ్ళిపోయాడు 'బెల్' కొట్టుకుంటూ.
    వేణుగోపాల్ మోహంలో ఒకసారి కోటి మెర్క్యురీ లైట్లు వెలిగాయి. తన పిల్లల నంబర్లు ఫస్టు క్లాసులోనే ఉన్నాయి. తండ్రి మొహం చూస్తూనే వంగి నమస్కరించారు పిల్ల లిద్దరూ. వేణుగోపాల్ నేత్రాలు చలించాయి. "చూశావా, భారతీ! ఇప్పుడు చెప్పు, నీ పిల్లలా, నా పిల్లలా?"
    పద్దెనిమిదేళ్ళ పెద్దతనంతో పక్కకు జరిగి తల్లి తండ్రుల మాటలు స్వతహాగా వచ్చిన గాంభీర్యంతో వింటూ ముఖముఖాలు చూసుకొని చిన్నగా నవ్వుకొన్నారు రామూ, రవీ.
    "మీ పిల్లలే మీ దయే లేకపోతే, ఈ పిల్లలు బికారివెధవలై...."
    "భారతీ!" వేణుగోపాల్ నిర్ఘాంతపోయాడు.
    "రాధ అన్న మాటలు మనసులో ఉంచుకొన్నావా? రాధ నీ చెల్లెలైతే క్షమించక పోయేదానివా?"
    "లేదు. ఆవిడ అన్న దాంట్లో తప్పేమీ లేదు. అక్కయ్యే ఉంటే సంతోషించేదో, లేదో తెలియదు కానీ ఆ లోకంలోంచి మీ దయకు ఆశీర్వదిస్తుంది."
    "మనకి పిల్లలు లేరనే విచారం నాకు లేదు, భారతీ! మన బ్రతుక్కి ఒక అర్ధం చూపించే భగవంతున్ని నేను నమ్ముతాను. ఈ పిల్లల బాధ్యత నాది. ఈ విషయం మాటిమాటికీ నువ్వు అంటూంటే నాకూ పిల్లలకీ మధ్య అగాధం ఉన్నట్లనిపిస్తూంది. నువ్వు రాధ మాటలు పూర్తిగా మరిచిపో."
    భారతి కృతజ్ఞతాభావంతో భర్త కళ్ళలోకి చూసింది. కొంచెంసేపు ఆగి, "స్వీటూ, హాటూ ఏం చేయమన్నారో కనుక్కోండి మీ పిల్లల్ని" అని మాట మారుస్తూ అంది.
    "ఏరా, రవీ! ఇవాళ సిగ్గు పడకూడదు. చెప్పరా, రామూ!"
    "స్వీట్ గులాబ్ జామ్, నాన్నగారూ!" రవి అన్నాడు.
    "మరి, హాటూ?" రాము ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఈ వార్త జయకు తెలిస్తే ఎంత ఆనందిస్తుంది! తనకు పులిహోర ఇష్టం అని టిఫిన్ లో తీసుకు వచ్చి ఇంటర్ వెల్ లో పెట్టేది. ఒక ఉత్తరం వ్రాస్తే...రాము మనసు భయంతో కుంచించుకు పోయింది.
    "అమ్మా, అన్నయ్యకి పులిహోర ఇష్టం కదమ్మా!" రవి పూర్తి చేశాడు.
    ఆ రోజంతా పిల్లల నవ్వులతో ఇల్లు కలకలలాడి పోతూంటే భారతి, వేణుగోపాల్ ల మనసులు ఊర్ధ్వ లోకాల్లో విహరించాయి.
    
                             *    *    *

    బాట్ చేతిలో పట్టుకొన్నాడు రవి. రాము అనుసరించాడు. పిల్లల్ని ఇద్దర్నీ పిలిచి విచారవదనంతో ప్రారంభించాడు వేణుగోపాల్. "నేను ఎంత ప్రేమగా చూడాలనుకొన్నా ప్రపంచం దృష్టిలో పెంపుడు తండ్రినే. మిమ్మల్ని ఆజ్ఞాపించే శక్తి కూడా నాకు లేదు" అన్నాడు.
    టేబిల్ మీద ఆట సామానంతా పెట్టేసి నిశితంగా చూశారు ఇద్దరూ. "మీ రలా అంటే ఒప్పుకోం, నాన్నగారూ." రాము చేతులు కట్టుకొని నిలబడ్డాడు.

                                   
    "నాన్నగారిని పూర్తిగా ఎరగం మేము. వీథి బళ్ళో నాలుగో క్లాసు చదవడం వరకే మాకు తెలుసు. కాన్వెంటు చదువులూ, ఉన్నత విద్యలూ కలలో కూడా ఊహించలేదు." రవికి మాటలు దొరకలేదు.
    "మేం చదివిన ఈ చదువులో గ్రహించింది ఒకటే, నాన్నగారూ! మీరు మమ్మల్ని ఆదిరించకపోతే నామరూపాల్లేకుండా కొట్టుకు పోయేవాళ్ళం. మీరు మమ్మల్ని ఆజ్ఞాపించండి."
    వేణుగోపాల్ ఆలోచిస్తూ క్షణం తరవాత పిల్లల వైపు పరిశీలనగా చూస్తూండి పోయాడు. చక్కటి మీసకట్టుతో నిన్న మొన్నటి పిల్లలు ఇంతవారై న్యాయాన్యాయాల గురించి న్యాయవేత్త దగ్గర మాట్లాడుతున్నారు. బిడ్డలు లేని పిత్రు హృదయానికి ఏనాడూ అశాంతి చూపించలేదు. 'లాయర్ వేణు గోపాల్ పిల్లు బుద్దిమంతులోయ్' అనడం స్పష్టంగా ఎన్నోసార్లు విన్నాడతను. అందుకే పిల్లల పట్ల తను పెంచాననే ధీమా చూపించలేకపోయాడు. పైగా, పిల్లలంటే అతని హృదయానికి బాగా అర్ధమైంది. అప్పటి భారతి వేదన కూడా అర్ధం చేసుకొన్నాడు.
    "రామూ, నిన్ను మెడిసిన్ కి మద్రాసు పంపిస్తాను."
    వేణుగోపాల్ వాక్యం పూర్తి కాలేదు. రాము మనసు సంతోషంతో ఉరకలు వేస్తూంది. మద్రాసులో తన జయ ఉంది. ఇప్పుడు తను జయను దూరం చేసుకోకూడదు,
    "రవీ, నీకేం చదవాలనుందిరా?" వేణుగోపాల్ చిన్న కొడుకును ప్రశ్నించాడు. రవి చూపులు నేల మీదకు పోయాయి. 'ఇంజనీరింగ్ అంటే తన కెంత ఇష్టం!' క్షణం ఆగి తండ్రి వైపు చూస్తూ అన్నాడు:     "ఇంజనీరింగ్, నాన్నగారూ."
    పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకొంటూ అన్నాడు: "మీరు చదివి నా పేరు నిలబెట్టండోయ్. అంతేచాలు."
    అప్పుడే హాల్లోకి వచ్చి తండ్రీ కొడుకుల సంభాషణ విని ఆనందంతో చూస్తూండి పోయింది భారతి. "మీకు రెక్కలొచ్చాయి. ఎగిరే ప్రయత్నంలో తప్ప టడుగు వేయకండి. అప్రతిష్ట పనులు చేసి నాన్నగారి పేరు మట్టిలో కొట్టుకు పోనీయకండి." భారతి హెచ్చరించింది.

                             *    *    *

    మద్రాసు మెడికల్ కాలేజీలో రాముకు, కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో రవికి సులభంగా సీట్లు దొరికాయి.
    ఇద్దర్నీ కౌగిలించుకొని భారతి కంట తడిపెట్టింది.
    "నీకేం పిచ్చా, భారతీ! పిల్లలు నీ దగ్గరే ఉండాలంటే ఎలా? నాకు మాత్రం బాధగా లేదూ? మనం నిమిత్త మాత్రులం. మన స్వార్ధంతో మన ప్రేమ పాశాన్ని వాళ్ళిద్దరి చుట్టూ బిగిస్తే భవిష్యత్తు పాడు చేసిన వాళ్ళం అవుతాం. గాలిపటం మనదై నప్పుడు దాని తాడెప్పుడూ మన చేతిలోనే ఉంటుంది. గాలిపటాన్ని నడిపించడమే మనకర్తవ్యం." వేణుగోపాల్ కంటి నీరు కంటిలోనే ఇంకిపోయింది. తల్లితండ్రులిద్దరికీ వంగి నమస్కారం చేశారు. "మీకు అపఖ్యాతి కలిగించే పనులు మేం చెయ్యం. అమ్మా! నువ్వు బాధ పడకు. ఐదారేళ్ళు ఇట్టే తిరిగి వస్తాయి. సెలవులకు ఎలాగూ వస్తూనే ఉంటాం కదమ్మా!" తల్లి భుజాల మీద చేతులు వేశారు.
    భారతి నిట్టూర్చింది.
    ఎంతోమందిని మోసుకు వస్తున్న రైలు ఇద్దర్నీ చెరో దారికీ తీసుకుపోతూంటే మమతను చంపుకోలేని భారతి బరువెక్కిన హృదయంతో నిండు మనసుతో తన బిడ్డల్ని ఆశీర్వదించమని భగవంతున్ని కోరుకుంది.

                                  *    *    *

    "మన పిల్లలు ఇద్దరూ చెరో మూలకీ వెళ్ళి పోయారు. ఎందుకొచ్చిన చదువులు! మీరు నాకు వాళ్ళని దూరం చేశారు." భారతి కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగి చెంపలమీద పడ్డాయి.
       వేణుగోపాల్ మొహం గంభీరంగా మారిపోయింది. "చూడు, బారతీ వాళ్ళేం పసిపిల్లలు కారు మనం బంధిస్తే ఒక మూల కూర్చోడానికి. ఈ కాలంలో మెట్రిక్ చదివిన వాడిని ఎవరు చూస్తున్నారు? చేజేతులా వాళ్ళ దోవకు అడ్డు నిలుచోవడం నాకు ఇష్టం లేదు." కఠినంగా రాళ్ళను బద్దలు చేసేట్లుంది అతని స్వరం.
    "పోన్లెండి. ఎందుకంత కోపగించుకుంటారు? ఒక డాక్టరుకీ, మరో ఇంజనీరుకీ తల్లితండ్రులం అంటే నాకూ గర్వమే!" భారతి నవ్వింది వేణుగోపాల్ కోపాన్ని ఎగరగొట్టేస్తూ.
    
                             *    *    *

    "ముందు చూసుకొని నడుస్తే బాగుంటుంది కదురా, తమ్ముడూ!" వైదేహి నవ్వింది. రామకృష్ణ కూడా నవ్వాడు.
    గదిలో అడుగు పెట్టి పుస్తకాలు ఒక మూలకు విసిరేశాడు రవి. అతని మనసులో ప్రతిరోజూ అవే మాటలు రింగుమంటూ వినిపిస్తాయి. అవేం పట్టించుకొనట్లు నటిస్తాడు. ఈ మధ్య ఆ మాటలు అంత కంతకు తీవ్రరూపం దాల్చి రవి మనసును పూర్తిగా ఆక్రమించుకొంటున్నాయి.
    వైదేహి ఇంటివా రమ్మాయి. బి. ఎస్ సి. చదువు తూందో, చదివిందో తెలియదు కానీ ఏదైనా తెలియని విషయలు అంటే స్వయంగా రెండుమూడు సార్లు రవి గదికి వచ్చి అడిగింది. తల్లి లేదనే సానుభూతితో ఇంటి యజమాని కోరికమీద ఎన్నో సంగతులు చెప్పే వాడు. తన దగ్గరకు వచ్చినప్పుడు నెమ్మదిగా, సౌమ్యంగా ఉన్న ఆ పిల్ల, వెనకనుంచి ఇలా సతాయించడం ఒక్కో సారి రవికి చిరాకు తెప్పిస్తుంది.
    ఎన్నోసార్లు వైదేహిని మందలించాలని అనుకొన్నాడు కానీ, ఆ పిల్ల కళ్ళలో ఏదో అయస్కాంత శక్తి కట్టడి చేసేయడంతో నోరు మూసుకొనేవాడు. రవి ఒక్కోసారి మరో విధంగా కూడా అనుకొనే వాడు, ఆ పిల్లను దగ్గర వరకూ రానిచ్చి గట్టిగా ఆ పిల్ల మొత్తుకొన్నా వినకుండా తన కౌగిట్లో బంధించి వదిలేస్తే ఇక ఈ గది మొహం చూడదని. కానీ, రవి కా సాహసం లేదు. ఆలోచిస్తూంటేనే భ్యం ఆవరించి గజగజ వణికించేసేది. తల్లి ప్రత్యక్షమై నిలదీసి అడిగినట్లుండేది. ఏమైనాసరే వైదేహితో తెగతెంపులు చేసుకోవాలి లేకపోతే చదువుకు ఎగనామం పెట్టాలి, ఆ పిల్ల పిచ్చి అందంలో పడి దృఢనిశ్చయానికి వచ్చేశాడు.
    'అమ్మ ఏం చేస్తూందో?' రవి మంచంమీద వెల్లకిలా పడుకొని ఎదురుగా కిటికీలోంచి ఆకాశం గుండా తల్లి దగ్గరికి పంపిస్తున్నాడు తలుపులన్నీ "పేరు ప్రతిష్ఠలకు భంగం అయే ఏ పనులూ చేయం." అన్నదమ్ములిద్దరూ ఏకకంఠంతో అన్నారు. ఆనాటి మాటలు తను కలలో కూడా మరిచి పోగలడా?   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS