Previous Page Next Page 
మరుపులో మెరుపులు పేజి 6

 

                                                               8
    బాగా చీకటి పడింది . మబ్బుల్లో చంద్రుడు వెన్నెల మసగమసగ్గా వుంది. రోడ్డు మీద సందది బాగా తగ్గిపోయింది. దూరంగా కారాపి  కాలినడకన వచ్చి దూరంగా చిన్న హోటల్ లో కూర్చుని ఎదురు చూస్తున్న ప్రభాకర్ క్షణక్షణానికి వాచ్ చూసుకోసాగాడు విసుగ్గా. సంతోషంగా వున్నప్పుడు గంటలు క్షణాలుగా గడిచి పోయే సమయం. స్తంభించి పోయిందా అనిపిస్తుంది. ఆత్రుతగా ఎదురు చూచేటప్పుడు.
    అప్పటికి చాలా సేపటి నుంచి అటు వైపే చూస్తున్న ప్రభాకర్ చటుక్కున లేచి నుంచున్నాడు. చీకట్లో చకచకా కదిలిపోతున్న రూపాన్ని చూడం గానే. ఒక్కసారి బాధగా నిట్టూర్చాడు. అంతవరకూ ఆమె అన్న అనుమానం మనసులో వున్నా తన అనుమానం నిజమై, ప్రత్యేక్షంగా కనుపించేటప్పటికి అతనికి చాలా బాధ అనిపించింది. ఏమిటి కుసుమ చేస్తున్న పని? యీ వయసులో డబ్బుతో -- తన జీవితంతోనే ఎందుకీ చెలగాటం? ఏం బద్దలవుతున్నాయి ఆమె హృదయంలో ? జాలిగా అనుకున్నాడు.
    కుసుమ ఆఫీసు లోపలికి వెళ్ళేంత వరకు చూచి గబగబా కారు దగ్గరికి వెళ్ళి స్టార్టు చేశాడు. ఆఫీసు వెనక వైపు మెట్ల నుండి బయటకు వున్న దోవ దగ్గరకు పోనిచ్చి కారాపాడు. ఆమె అటు వైపు వస్తుందన్న నమ్మకంతో కారులో కూర్చుని నిరీక్షించసాగాడు.
    తల వంచుకుని చేతిలో హ్యాండ్ బాగ్ పట్టుకుని గబగబా బయటకు వచ్చిన కుసుమ మసగ వెల్తుర్లో టాపు తెరుచుకుని, నోరు తెరుచుకున్న రాక్షసుడి లా నల్లగా మెరుస్తున్న కారు -- కారులో మనిషిని చూచి నిర్ఘాంత పోయింది . దాదాపు కొయ్యబారి పోయింది.
    ఆమె వంక ఏ భావం లేకుండా చూచి, కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు. కదలకుండా నిశ్చేష్టురాలైన ఆమె భుజం మీద చేయి వేసి, మెల్లిగా నడిపించి కారేక్కించి తలుపేశాడు. ముందు నుంచి తిరిగి వచ్చి కారెక్కి స్టార్టు చేశాడు-- కొంతదూరం తీసుకొచ్చాక .
    "కుసుమా..... " పిలిచాడు.
    తలయెత్తి చూచింది. కటిక రాయిలా, కఠినంగా వున్న ఆమె ముఖం వంక చూచి, ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసి నొక్కాడు.
    "షాకింగ్ గా వుందా?"
    లేనట్టు తల వూపింది.
    చాలాసేపు మౌనంగా డ్రైవ్ చేశాడు. ఎక్కడికి వెడుతున్నది అతనికే తెలియనట్లు.
    "నేను వూరు వెళ్ళాల్సిన అవసరం తప్పిపోవడం ఎంత అదృష్టం?" అన్నాడు.
    "ఎంత దురదృష్టం" అంది పెదిమలు బిగబట్టి.
    "ఏం? నేను రాకపోతే, ముఖర్జీ సెక్రటరీ లా అంతర్దానమాయిపోయే దానివి. మళ్ళీ జన్మలో చూడగలిగే వాడిని కాదు."
    వులిక్కిపడింది , పక్కన పిడుగు పడ్డట్లుగా.
    "మీకు తెలుసా-? " అడిగింది తడబడుతూ
    చిన్నగా నవ్వాడు.
    "తెలిసే నాకు వుద్యోగం యిచ్చారా?" అడిగింది అనుమానంగా.
    "నువ్వు వుద్యోగం లో చేరేనాటికి నాకేమీ తెలియదు. కాని ఎక్కడో చూశానని పించింది. నీ మోహాన్ని చూస్తె వుద్యోగం యివ్వాలనిపించింది. ముఖర్జీ కేసు విషయం పేపర్లో చదివాను. ఇవాళ డ్రాయర్లో తాళాలు కనుపించక పోయేటప్పటికి గాని, ఆ విషయం నాకు జ్ఞాపకమే రాలేదు. అన్ని విషయాలు సమన్వయపరచుకుంటే నీకు తప్ప ఎవరికీ అవకాశం వున్నట్లు కనుపించలేదు."
    బరువుగా శ్వాస వదులుతూ సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. అదురుతున్న పెదిమలు అదిమి పెడుతున్న ఆవేశాన్ని తెలుపుతున్నాయి.
    "ఒక్క విషయం చెప్పు ముఖర్జీ ఆఫీసు లోంచి డబ్బు తీసుకున్నది నువ్వేనా?"
    తల వూగించింది , ఔన్నన్నట్లు.
    "నువ్వు చేస్తున్నది ఎంత ప్రమాదకరమయినదో నీకేమయినా తెలుసా?"
    మౌనంగా ఉండిపోయిన ఆమె వంక సానుభూతిగా చూశాడు. "అ డబ్బంతా ఖర్చయి పోయిందా?"
    "లేదు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు."
    "మరి మళ్ళీ ఎందుకీ పని?"
    "ఏమో నాకే తెలియదు. చిన్నప్పుడేప్పుడో ఒకసారి నేలమీద చిందర వందర గా పడేసిన డబ్బును చూసినట్లు గుర్తు. ఆ తరువాత ఎప్పుడు డబ్బును చూసినా నా మనసు ఎందుకు చలిస్తుందో నాకు తెలియదు. నాకు వూహ తెలిసినప్పటి నుండి కటిక దరిద్రాన్ని తప్ప మరొకటి అనుభవించలేదు.... యిప్పుడా డబ్బు అవసరం నాకు లేకపోయినా తీసుకోవాలనే కోరిక నాకేందుకుందో అర్ధం కాదు." అంది జలజలా కన్నీళ్లు రాలి పడుతూ వుంటే అపుకోవాలని ప్రయత్నిస్తూ తన చేతిలో వున్న హేండ్ బాగ్ తీసి అతనికి దగ్గరగా పెట్టింది.
    "నీ మనసు యిలాంటి పని మీదకు మళ్ళీ దారి తీయకుండా వుంటుందంటే అది నాకు తిరిగి యివ్వనక్కర లేదు."
    ఎటువంటి సమాధానం యివ్వకుండా దృష్టి బయటకు సారించింది.
    "ఎంత చిత్రం?' అంది చాలాసేపటికి? "మీ దగ్గర నుంచి వీలయినంత త్వరగా పారి పోదామనుకుంటున్నాను . ఆఖరికి మీ చేతుల్లోనే పట్టుపడ్డాను."
    "కొన్ని విచిత్రంగానే వుంటాయి. యిన్నేళ్ళయినా పెళ్ళి చేసుకోవాలనే అనిపించని నాకు నిన్ను చూడం గానే ఆ కోరిక కలగడం  ఏమిటి చెప్పు" ఆమె వంక చూసి మృదువుగా నవ్వుతూ అన్నాడు.
    వులిక్కిపడింది.
    "అందుకనేగా నువ్వు పారిపోవాలనుకుంది?'
    ".........."
    "చేసే ప్రతి చర్యకు ఏదో ఒక కారణం వుండి తీరాలి. నా దగ్గర నుంచి పారిపోవాలన్నంత భయం నీకెందుకు కలిగింది?"
    "మనం వుండాల్సినట్లు వుండటం లేదు."
    'అంటే....."
    కళ్ళెత్తి చూసింది సూటిగా ..... "మీరు బాస్ గా.... నేను....."
    "ఆ సంబంధం అలా వుండనంత మాత్రాన పారిపోవాల్సినంత అవసర మేమిటి?"
    "అది ఏవిధంగానూ మంచిది కాదు-"
    "ఎవరికి.....నీకా....నాకా?"
    "యిద్దరికీను."
    "నా మంచి చెడ్డలు నేను చూసుకోగలను గాని.... నీకు ఎందుకు మంచిది కాదను కున్నావు?"
    "........."
    "మరేవరయినా.....నీకు.....' మధ్యలోనే ఆగిపోయాడు. లేదన్నట్లు ఖచ్చితంగా తలూపింది.
    "మరి?"
    "........"
    "ఒకమాట అనగలిగినప్పుడు దాని వెనక వుద్దేశం కూడా చెప్పగలగాలి."
    "మనిద్దరిని వెనక  వదిలిన జీవితం పెరిగిన పరిసరాలు ఏ విధంగానూ ఒక స్థాయికి చేరవు."
    కుసుమ ముఖం వంక సూటిగా చూశాడు.
    'అంటే యింత గొప్ప యింట్లో పుట్టి పెరిగి యిన్ని పేరు ప్రతిష్టలు సంపాదించుకుని, నీలాంటి ఒక అనామకురాలితో సరదా వున్నన్నాళ్ళు సరస సల్లాపాలాడి నా దారిన నేను పోతాననుకున్నావు. అంతేనా...." అతని కంఠం లో కోపం స్పష్టంగా వినిపించింది.
    "అది కాదు...."
    "ఒక్క విషయం నీకేప్పుడయినా స్పురించిందా యిన్ని నెలల్లోనూ...."
    "........."
    "నువ్వంటే నాకెంతో యిష్టమని. నీకు కూడా నా మీద యిష్టం కలగజేయడానికి ప్రయత్నిస్తున్నానని."
    మనసులోనే నిట్టూర్చింది. అది గ్రహించకపొతే తను పారిపోవదమెందుకు? ఆక్షణం లో కుసుమకు తను పట్టుబడిందాని కంటే -- అతని మాటలు ఎక్కువగా కలవరపెట్టడం మొదలెట్టాయి. ఏదో జరగబోతున్న భావం మనసంతా ఆక్రమించింది.
    ఏమీ మాట్లాడకుండా బయటకు చూస్తూ వుండిపోయింది. కారులో చాలా దూరం వచ్చినట్లున్నారు. లైట్ల వెలుతురు పలచబడి పోయి రోడ్లన్నీ మసగ మసగ్గా కనుపిస్తున్నాయి. అతి నిశ్శబ్దంగా నిదానంగా వున్నా, ఆమె హృదయంలో భయాలు గొంతెత్తి అరుస్తున్నాయి ఎలా యితని దగ్గర నుంచి తప్పించుకోవడం? యితని వ్యవహారం చూస్తె పోలీసుల్ని పిలిచేట్లు  లేదు కాని....."
    "యిప్పుడెం చేద్దామని" అడిగాడు ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ.
    ఎర్రగా కందిపోయి వున్న కళ్ళెత్తి చూచింది. ఏం చేయాలో చెప్పమన్నట్లు.
    "ఆ వర్షం పడిన రోజే నాకు తెలుసు. నీకేవో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వున్నాయని, కాని అవి ఎంత సీరియస్ వో నాకు తెలియలేదు. నువ్వు తెలుసుకునేందుకు అవకాశం యివ్వలేదు."
    "నీలాంటి సమస్యలున్న వాళ్ళను వంటరిగా  వదిలెయ్యడం శ్రేయస్కరం కాదు. నువ్వు నా దగ్గరో..... పోలీస్ కస్టడీ లోనో వుండాలి" ఆగిపోయాడు.
    ".........."
    ఎంతకు సమాధానం యివ్వని ఆమె ముఖం లోకి సూటిగా ఎలాంటి భావం కనిపించ నీయకుండా "నువ్వు నా దగ్గర వుండాలి. నిన్ను పెళ్ళి చేసుకుంటాను, వెంటనే....." అన్నాడు.
    అదిరిపడింది. వెంటనే సర్దుకుంటూ, "యిది తమాషా కి సమయం కాదు." అంది కోపంగా.
    "నీకు తమాషా గా కనిపిస్తుందేమో? నేను సీరియస్ గానే చెప్తున్నాను. నీకు సరిగ్గా వినిపించిందో లేదో. నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను , రేపే!" అన్నాడు గంబీరంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS