14
కొత్త ఊరు, కొత్త మనుషులు, కొత్త జీవితం -- ముమ్మాటికీ కొత్త ప్రపంచం . అన్నిటి కన్నా ఆకాశం కొత్తగా దగ్గిరగా అయినట్టు నవజీవనాన్ని చూస్తున్నట్టు తోచింది కమలాకరానికి. తాను సముద్రానికి దూరమైనాడు ఇటీవల. కాని ఆకాశాన్ని అందుకున్నాడా తను అన్పిస్తుంది. అతనికి అనుభవానికి చేరువైన ఏ మనిషి అంబరాన్ని చుంబించినంత సంబరపడడు? కమలాకరం విషయం లో అదొక సత్య వాక్యం.
పలువురి దృష్టికి విలక్షణంగా కనిపిస్తే తప్ప మనుషులు సుఖ పడరా ఏమిటి విచిత్రమైన ఆంక్షలు విధించి సంఘం సగం మందిని మాత్రమే సవ్యమైన పధంలో నడిపిస్తున్నది. మిగతా వారంతా అడ్డ త్రోవలు త్రోక్కేవారే.
తనది ఎలాంటి తప్పు !-- అని ప్రశ్నించు కున్నాడు కమలాకరం. ఒక్కసారి కాదు. ఆరు నెలల కాలం ! అతనే తనకు తాను సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. తాను బొత్తిగా స్వార్ధపరుడు కాదే! సాధ్యమైనంత వరకు ఒకరి సుఖం కోసమే తను స్వసుఖాన్ని వెనక్కు నెట్టాడు. విసిగి వేసారి పోయి తర్వాత తన త్యాగం బూడిద లో పన్నీరు మాత్రమె అనిపించింది . సరిగ్గా అదే సమయంలో అంతర్గత స్వార్ధం తట్టి లేపినట్టు మేలుకుంది. ఏం చేస్తాడు తను?-- ఆ స్థితిలో సామాన్యుడు అంతకన్న ఏం ఆలోచిస్తాడు?
అదీకాక తను దుర్మార్గుడని కమలాకరం ఎలా అనుకుంటాడు ? అవధులు దాటిన స్వార్ధ పరత్వం కాదు తనది అని మాత్రం అనుకోగలడు, కమలాకరం పంకజం విషయం కన్నతల్లి గురించే ఆలోచించేవాడు , పంకజం జీవితాన్ని ఆవిడ పుట్టింటి వారు ఎలాగో ఒక విధంగా చక్కదిద్ద గలరని అతనికి తెలుసు. ఇకపోతే తల్లీ?-- ఈ ఒక్క ఆలోచన మాత్రం సిగ్గుపడేలా చేస్తుంది అప్పుడప్పుడు .
తన దగ్గర పనిచేసే గుమస్తా -- తల్లిని కంటి రెప్పలా కాపాడుకుంటాడని వినికిడి. అందుకే అతనంటే అలవి కాని గౌరవం. అర్ధం లేని భయమూను తనలో లేని గొప్పదనం అతనిలో ఉన్నందుకు అగౌరవం కావచ్చు. అతని వద్ద తల వంచడం లో భయం వుంది. కమలాకరం ఎలా అయినా ఆత్మ విమర్శ చేసుకునే మనిషి. తప్పులు దాచుకునే ఘరానా బుద్ది లేదు అతన్లో.
ఒక ఏడాది పాటు తల్లి కోసం అమితంగా ఆలోచించాడు కమలాకరం. అటు పిమ్మట తనకు తల్లి లేదు అన్నంత గట్టి పడక పోయినా చాలా వరకు మరువ గలిగాడు.
తను లేకపోయి నంత మాత్రాన అమ్మ ఒంటరి దౌతుందా?-- ఇరుగు పొరుగు లలో సాదు స్వభావులున్నారు. పంతులూ అతగాని కుటుంబం వున్నారు. అన్నాదమ్ము లున్నారు. ఆవిడ దిక్కులేనిది కాదు!-- కాలమే కమలాకరానికి గుండె నిబ్బరం నేర్పింది.
ఇప్పుడు ప్రతిమ ఆరు నెలల గర్బవతి.
15
మన పిల్లలూ! వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మనం చాలా పొడుపు గా జీవించాలి, అంటే శారీరకంగా , ఆర్ధికంగా కూడా!
కమలాకరం ప్రతిమను హెచ్చరించాడు. మన సుఖాలు తగ్గించుకుంటే వాళ్ళ సుఖాలు హెచ్చుతాయి అన్న ధ్వనిని విన్నది ప్రతిమ.
జీవితంలో ప్రతి ఒక్క కోరికా నేరవేరనట్టు ప్రతి ఒక్క గర్బమూ ఫలించదు సాధారణంగా.
ఆరు నెలల పసికందు ను మట్టిలో కలుపుతూ వ్యధను దిగమ్రింగాడు కమలాకరం. దీనిని మించిన క్షోభ ఒకటి కడుపులో లుంగలు చుట్టుకు పోతుంది. తల్లికి కలిగించిన క్షోభ ఎన్ని రేట్లో ఊహించలేక నలిగి పోయాడు.
బాధ కలకాలమూ జీవించని కారణంగా మరుపు సుసాధ్య మైంది. ఏడాది తిరగ్గానే పనసపండు లా పుట్టిన చంద్రం కమలాకరాన్ని అలరించాడు.
అప్పుడు కూడా నీడలా ఒక భావం వెన్నాడక పోలేదు. అమ్మకు మనుమని ముచ్చట్లు చూచుకునే అదృష్టం లేకపోవడానికి మొదట తనే కారకుడు. ఆపైన ఆమె కారకురాలు.
క్రమేణ అతని మనసు ప్రపంచపు తీరు వైపుకు పయనించింది.
తల్లి వున్నవాడికి తండ్రి ఉండదు. తండ్రి వున్నవాడికి తల్లి వుండదు. తల్లీ తండ్రి వున్నవాడు వారికి విలువ యివ్వడు. కొడుకుల్ను కన్నవాడికి కూతురి పై కోరిక. కూతుళ్ళ ను కన్నవారికి కొడుకును చూడాలనే తపన. కొడుకూ కూతుళ్ళ ను ఎత్తినా మనమల నేత్తుకునే రాత ఉండదు. అందరూ వున్నవారికి మనసు లుండవు. ఇంతలా దేవుని అరచేతిలో అడుగూ తనే ఘనుడు అనుకుంటాడు మానవుడు. అణువంత వుండి ఆకాశమంత ఆలోచిస్తాడు. ఆలోచించిన దేదీ జరగదు. ఆలోచనలో లేనిదే అగ్రస్థానానికి వస్తుంది. సృష్టిలో ఎన్ని గమ్మత్తులు ?----- ఎన్ని రంగులు? ఎన్ని తరంగాలు! ఎన్ని సుడిగుండాలు? చిత్రమూ విచిత్రమూ అయిన ప్రపంచం ఒక అనంత చిత్రం.
"నాన్నా-- రామూ వాళ్ళ బామ్మ లాగ, నా బామ్మ కూడా ఎప్పుడో చచ్చి పోయిందా?--"
ఏడేళ్ళ చంద్రం చెంప చెళ్ళు మంది. కమలాకరం ఆనాడు ఎంత మధన పడ్డాడో వర్ణించడం కష్టం. చంద్రాన్ని కొట్టడం లో అర్ధం ఏమిటి? "బామ్మని చంపెశావా?" అని వాడు అడిగినట్లనిపించింది. అలా తనకివినిపించడం వాడి నేరమా? ఆరోజు తల్లికి తెలీకుండా పలాయనం చిత్తగించిన రోజు.... ఆవిడకది చెంప పెట్టు! ఈరోజు కొడుక్కి చెంప దెబ్బ. తనకెవరు చెంపదెబ్బ పెడతారో ? తెలీదు.
అనక ఏడుస్తున్న చంద్రాన్ని ఒడిలోకి లాక్కుని ఓదార్చాడు. ఊహ తెలుస్తున్న చంద్రం బామ్మ పేరు మళ్ళీ ఎత్తలేదు బామ్మ పేరెత్తటం చాలా తప్పు, ;లేకపోతె అమ్మ కన్న మంచి వాడైన నాన్న ఎందుకు కొడతాడని పసివాడి సందేహం.
తల్లి క్షేమంగా వుండాలని వెయ్యి దేముళ్ళ కు మొక్కుకున్నాడు. ఆ రాత్రి నిద్రపట్టని అవస్థలో.
16
వంకాయలు సగం పుచ్చులున్నవే మోసుకొచ్చి నందుకు ప్రతిమ పదేపదే వెటకారం చేస్తుంటే పంకజం జ్ఞాపకం వచ్చింది. ఆమె ధోరణి చాలా ఘాటైనది. డానికి తోడు అందులో కారం కలిసింది.
ఇప్పుడిప్పుడు ప్రతిమ స్త్రీ సహజమైన నోటి దురుసు చూపిస్తుంది. ఒక్కప్పుడు వసంత మాత్రం ఏం తక్కువ తింది?-- తల్లిని దిక్కరించడానికి తాను జంకి పొతే ఎంతగా దులిపేసింది. అందరూ స్త్రీలు అంతేనేమో? 'అతి పరిచయాత్ అనజ్జతా" అన్నట్టు చనువు అనేది సరిహద్దులు దాటేసరికి -- నిరసనో-- చులకనో , అదేదీ కాకపొతే పరిహసమో మితిమీరి పోతాయి. కాని స్త్రీలు వేరు-- తల్లి వేరు కదా?
* * * *
కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని చాలా కాలమైంది -- సరదాగా చూచి వద్దాము ప్రయాణం కమ్మంది ప్రతిమ.
కమలాకరం గుండెలు గుభిల్లు మన్నాయి. విశాఖపట్నానికి, విజయవాడ కీ మధ్య ఉన్నది ఒక దూరమా? అక్కడక్కడే తెలిసిన వారెవరైనా తటస్థ పడితే ------
ప్రతిమ మాటలు విననట్టే ఒక ఆరు నెలల కాలాన్ని నెట్టగలిగాడు. ప్రతిమ అతని నిర్లిప్తతను భరించలేక నిలదీసి అడిగింది. కమలాకరం తన భయాన్ని దాచుకుంటూ "పోనీ కలకత్తా వెళదామా? అక్కడున్నదీ అమ్మవారే కదా?' అన్నాడు.
"అబ్బబ్బ -- మీరెప్పుడూ యింతే! మనిషిని అర్ధం చేసుకోరు కదా? ఇటు వేపు మనుషుల్నీ, ప్రదేశాల్ని చూసి చూసి ఎంత విసిగి పోయానని?" అంది ప్రతిమ విసుగు ఒలకబోసి.
ఈసారి కమలాకరం గట్టిగా అసమ్మతి తెలియజేశాడు.
కాని ప్రతిమ ఘటికుతాలు కాకపొతే కదా? "మీ భయం నాకు తెలుసు, తెలిసినవారు ఎక్కడ కనిపించి పోతారో నని! కనిపితే ఏమైంది -- వాళ్ళు మనల్ని మింగేస్తారటండీ?' అనడిగింది.
"నోటితో మింగకపోయినా , మన వెనుక మాటునే మాటలతో మింగేస్తారు. అయినా నీకేం పట్టింది. నాకు తెలిసినంత మంది నీకు తెలుసా ఏమిటి? అన్నాడు చిరచిర లాడుతూ. ప్రతిమ తగిన సమాధానం చెప్పింది.
17
కమలాకరం కి -- మళ్ళీ ఆ పరిసరాలు , అక్కడి ఆకాశం, అక్కడి ఇళ్ళు చూడాలని కోరిక లేకపోతె ప్రయాణానికి ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. అతన్ని కూడా ఏదో అజ్ఞాత శక్తి అటు వంకకే లాగుతున్నది.
ప్రయాణం దగ్గర పడుతుండగా గడ్డాన్ని కొంచెం గరుకు గరుకుగా పెరగనిచ్చాడు. జుత్తును కొద్ది గా ముందుకు పడేలా దువ్వుకున్నాడు. నల్ల కళ్ళద్దాలు సిద్దం చేసుకున్నాడు.
వేషం వేసిన అతన్ని చూసి ప్రతిమ ఒకటే ఇదిగా నవ్వు పట్టించింది.
"బూచి ఎందుకు పెంచావు నాన్నా?' అన్నాడు చంద్రం అమాయకంగా.
గరుకు గడ్డాన్ని కొడుకు చెంపలకు ఆనించి ముద్దు లాడుతూ "ఇంక బుచీ గీచీ లాంటి మాటలు మాటాడ కూడదురా నాన్నా? పెద్దాడివవుతున్నావు మరి. అంచేత చక్కగా చదువుకుని ఇంగ్లీషు లో తెలుగులో మాట్లాడేయ్యాలి!" అని బోధించాడు.
"ఓ!" అన్నాడు చంద్రం తలాడిస్తూ.
* * * *
ట్రెయిన్ లో అందరూ కునుకుతున్నారేమో గాని కమలాకరానికి ఆ ఊసే లేదు. పలు విధాల పారిపోయే మనసుని అతను వెనక్కు లాగలేక పోతున్నాడు.
శారదమ్మ ఏడాది కి రెండేళ్ళ కి కనకదుర్గమ్మ సందర్శనార్ధం కమలాకరాన్ని తీసుకుని బయలు దేరుతుండేది. భర్త పోయినది మొదలు ఆవిడ కదొక ఆనవాయితీ గా మారింది. ఇంతప్పటి నుంచి అంతవాడైన వరకు ఆవిడ అలవాట్ల కు అలవాటు పడిన కమలాకరం మరువలేడు గత స్మృతులు. మరిచినా ఇలాటి ఘట్టాలు మరిపించే ప్రయత్నం చేస్తాయి గనకనా?
విశాఖపట్టణం లో రైలు ఆగేసరికి తెప్పరిల్లాడు కమలాకరం . సీటులో వెనక్కు తిరిగి పడుకున్నాడు.
ఆ స్టేషనులో నలుగు రైదుగురు ఎక్కారు ఆ పెట్టెలోకి. కాని అపరిచుతులు. ఓరగా గమనించిన కమలాకరం తేలిక పడ్డాడు, ఎందుకైనా మంచిదని మొగానికి పేపరు అడ్డం చేసుకునే వున్నాడు.
విజయవాడ లో రాత్రి దిగడం వల్ల అంత ఇబ్బంది లేకపోయింది.
తెల్లారుతుండగా వెళ్లి ఏదో పేరుపడ్డ హోటల్లో బస ఏర్పాటు చేసుకున్నాడు.
* * * *
కమాలాకరం అనుకున్నట్టే కొండ ఎక్కుతుండగా ఒక పరిచితమైన మొహం ఎదురు పడింది. ఆవిడ మీనాక్షమ్మ గారు, మూర్తి గాడి సవతి తల్లి. ఎప్పుడు వాళ్ళ యింటికి వెళ్ళినా పకోడీ లు పెడుతుండేది. పదేళ్ళ లోనే ఇంత వంగి పొయిందేమిటి చెప్మా? అమ్మ కూడా ఇలాగే .....ఇక ఆలోచించ లేకపోయాడు.
కమలాకరమైతే వెనక్కు తిరిగి తిరిగి మరీ తనవి తీరేలా చూశాడు గాని దృష్టి మంద్యవల్లో , దీపాల నీడల వల్లో ఆమె మీనాక్షమ్మ ఇతన్ని గమనించనే లేదు. ఆవిడ పక్కనే నడుస్తున్న పడుచు పిల్ల మాత్రం హడలిపోయింది ఇతగాని ధోరణికి.
"మా అమ్మను జాగ్రత్తగా చూస్తుండ" మని కమలాకరం కనక దుర్గమ్మ ను కోరుకున్నాడు. కాని డేవి తనని క్షమించి నట్టేమీ కనిపించలేదు. అందరి లాగ పరిశుద్దాత్మతో దైవ సన్నిధిని నిలవ లేకపోతున్నందుకు ఎంతగానో సిగ్గుపడ్డాడు. తన చెవులే గుడి గంటలై, తన గుండెలే భేరీ మృదంగాలైతే, ఆ నాద నినాదాల దెబ్బలకు ఓర్చుకుంటూ ఏకాగ్రత నిలపడం ఎవరి సాధ్యం?--
"అవును నాది మహాపరాధం ? అందుచేత -- నేను దిగేలోగా ఈ కొండను అమాంతం కూల్చి వెయ్యి జగజ్జననీ?" అనుకున్నాడు.
కమలాకరం చివరి మెట్టు దిగుతూ. కొండ అణుమాత్రం చలించనందుకు తృప్తి పడ్డాడెమో. కొంచెం అయినా అతని మేధ ఊరుకోలేదు.
కొండ ఎందుకు కూలుతుంది ?-- ఎక్కి దిగుతున్న వాడు తానొక్కడే కాదు. ఈ భక్త జనులలో మాతృమూర్తుల్ని ప్రాణ సమానంగా ప్రేమించుకునే వారెందరు న్నారో? మాతృద్రోహి అయిన తను వారి నీడలోనే క్షేమంగా కొండ దిగి వచ్చాడు అంతే.....
కమలాకరం నిట్టుర్పు కృష్ణవేణి సమీర తరంగాల్లో సుడులు తిరిగింది
