Previous Page Next Page 
సంపెంగ పొదలు పేజి 6


    ఆరొజు హరి ఇంటి నుండి అలా అకస్మాత్తుగా లేచి వచ్చేసిన తరువాత , గిరికి , తన మనసు ఏ దారిన పరుగేడుతుందో బాగా అర్ధం కాసాగింది. అతనికి భయం వేసింది. తేలిగ్గా త్రోసి పారేయ్యాలని ప్రయత్నించీ, ఈ అనుభూతి నంత తేలిగ్గా, త్రోసి వెయ్యలేక పోయాడు. కొన్నాళ్ళు ఉమకు దూరంగా ఉంటె మంచిదని ప్రయత్న పూర్వకంగా దానిని సాధించాడు. కానీ, ఆ ఏకాంతం అతనిని మరింత బాధించింది. తన మనసుకి చికాకుగా ఉన్న ఈ స్థితి లో స్వాంతన కోసం శంకర్ ను రమ్మని వైరిచ్చాడు.
    శంకర్, గిరి , ఇంటికి వచ్చేసరికి, గిరి ఇంట్లో, ఉమ, దుర్గ, హరి, కూర్చుని ఉన్నారు. ఏ ప్రలోభాన్నుంచి తప్పించుకు పోవాలని ప్రయత్నిస్తూన్నాడో, సరిగా అదే తన ఎదుట నిచ్చేసరికి, గిరి చలి జ్వరం వచ్చినట్లు లోలోన వణికాడు-- అయినా అందరినీ చిరునవ్వు తో పలుకరించాడు. శంకర్ అక్కడున్న వ్యక్తులకు క్రొత్త కాకపోయినా అతనితో ఎవ్వరికీ అంత చనువు లేదు. శంకర్ డి నలుగురితో కలిసి మెలిసి తిరిగే స్వభావం కాదు. ఒక్క గిరితో తప్ప, అతడేవరి తోనూ , ఎక్కువగా మాట్లాడడు. శంకర్ పరిసూచాకంగా నవ్వేసి, అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
    హరి కృత్రిమ కోపంతో "ఇన్నాళ్ళ నుండీ నాకు కనబడటం లేదేం?' అన్నాడు.
    గిరి నవ్వుతూ 'డామిట్! నేను మీ ఇంటికి రానందుకు థాంక్స్ చెప్పక తిడుతున్నావా? ఇదే, కృతజ్ఞత, అంటే౧" అన్నాడు. ఆ మాట అంటూ అతడు ఉమ వంక చూడకుండా ఉండలేక పోయాడు. ఆ క్షణం లో ఉమ కూడా అతని వంకే చూస్తుంది. ఉమ కళ్ళలో తన కళ్ళు కలపగానే, తనలో నిలువెల్లా ఏదో విద్యుత్తు ప్రవహించి నట్లయి చటుక్కున కళ్ళు తిప్పుకున్నాడు.
    ఉమ వెంటనే నవ్వుతూ, "ఓ! స్నేహితులంటే ! స్నేహ ధర్మాలన్నీ, ఈయన దగ్గరే నేర్చుకోవాలి." అంది. ఉమ మాటలు కేవలం నవ్వుతూ అన్నా, గిరికి మాత్రం వాడి బల్లెం లాగ గుచ్చుకున్నాయి. తల ఎత్తి హరి ముఖంలోకి చూసే సాహసం కూడా లేకపోయిందతనికి. హరి తను కూర్చున్న చోటు నుంచి లేచి గిరి భుజం తట్టుతూ , "ఏదెలా ఉన్నా, నువ్వు కనబడకపోతే నాకు పిచ్చిగా ఉంటుందిరా! అది సరే! ఇవాళ మేమంతా కలిసి వచ్చిందెందుకో తెలుసునా?' అన్నాడు.
    "ఏదో పిక్చర్ ప్రోగ్రాం" అన్నాడు గిరి నిరుత్సాహంగా.
    "కాదు. పిక్నిక్ ప్రోగ్రాం, రేపు మన తోట లోకి."
    "ఏమిటి విశేషం?"
    "విశేషమేముందీ? ఉమకు ఎం.బి.బి.ఎస్ సీటు వచ్చింది. ఇంకో రెండు రోజుల్లో తను హైదరాబాదు వెళ్ళిపోతుంది. తను వెళ్లబోయే ముందు అందరం ఒక్కరోజు సరదాగా గడుపుదామని."
    ఉమ వెళ్లి పోతుందనే వార్త వినగానే గిరి హృదయం కలుక్కుమంది. వీలుగా ఉమ వంక చూశాడు. ఉమ విప్పారిత నేత్రాలతో, అర్ద్రమైన చిరునవ్వుతో గిరికి తన ఆహ్వానాన్ని అందజేసింది.
    గిరి కనులు వాల్చుకుని "నన్ను క్షమించు హరీ! నాకు రేపు చాలా పనులున్నాయి. నేను రాలేను." అన్నాడు.
    ఉమ నిస్సహాయంగా దుర్గ వంక చూసింది. ఎందుకనో ఉమ ఇదివరకటిలా గిరితో, చనువుగా మాట్లాడలేక పోతుంది. ఉమ చూపులందుకున్న దుర్గ "నువ్వు రాకపోతే , వీల్లేదు గిరి! అసలు మేమేవ్వరమూ బయలుదేరం." అంది.
    "ఇష్టం లేక కాదు దుర్గా! కానీ నాకు....." అంటూ మధ్యలో తలెత్తిన గిరి వాక్ప్రవాహానికి ప్రార్ధన పూర్వకమైన ఉమ చూపులు ఆనకట్ట వేశాయి.
    "సరే వస్తాను." అనకుండా ఉండలేక పోయాడు. ఉమ గర్వంగా నవ్వుకుంది. దుర్గ హుషారుగా చప్పట్లు కొట్టింది. హరి ఉల్లాసంగా నవ్వి "నాకు తెలుసు, రానని నువ్వు బ్రతక గలవా?' అన్నాడు.
    గిరి కదోలా అయింది. ఏం విచిత్రమో. ఇది వరకు చాలా సాధారణంగా వినిపించే ప్రతి మాటా,  ఇప్పుడేవో క్రొత్త అర్ధాలతో వినిపిస్తుంది అతనికి----
    "శంకర్ కూడా వస్తాడు' అన్నాడు గిరి.
    అందరూ ఏక కంఠం తో సంతోషంతో అంగీకారం తెలిపారు. హరి వెంటనే లేచి "వెళ్దామా? వెళ్దామా?' అన్నాడు. ఉమకు అక్కడి నుండి వెళ్లాలని లేదు.
    "ఇంటికి వెళ్లి ఏం చేయాలి? కాస్సేపు పెకాడుకుందాం." అంది అలవాటుగా స్వంతంత్రంగా లోపలకు వెళ్ళిన దుర్గ అక్కడ కుర్చీలో కూర్చుని చదువు కుంటున్న శంకర్ ను చూసి తడబడింది. శంకర్ మర్యాదగా లేచి "ఏం కావాలీ?' అన్నాడు. "పేక" అంది. తల వంచుకుని -- శంకర్ డ్రాయరు లాగి పేక తీసి దుర్గ కు అందించడు" యధాలాపంగా దుర్గ "మీరు రండి పేకాటకి." అంది.
    ఆశించని ఈ ఆహ్వానం , శంకర్ కు ఆనందాన్ని కలిగించింది. అయినా మొహమాటంగా "నాకు సరిగ్గా రాదు." అన్నాడు.
    "ఫరవాలేదు. మీకే కాదు. ఎవ్వరికీ రాదు.' అంది దుర్గ.
    ఒకరి ప్రక్కన ఒకరు నడిచి వస్తున్న దుర్గ శంకర్ లను చూసేసరికి గిరి, మనసులో, అంతకు ముందెన్నడూ కలుగని ఆలోచన మెరిసింది.
    తన క్రొత్త ఆలోచన కలిగించిన ఉత్సాహంతో హుషారుగా పేక కలిపి వేశాడు. చీకటి పడేవరకూ కులాసాగా పేకాట తో గడిచిన తర్వాత , అంతా లేచారు. ఉమ కనుసైగ తో దుర్గ , గిరిని మరునాటి పిక్నిక్ ప్రోగ్రాం గురించి మరోసారి హెచ్చరించింది. హరి శంకర్ ను కూడా రమ్మని మరీ మరీ చెప్పిన తరువాత శంకర్ కూడా అంగీకరించాడు.

                         
    ఉమా, దుర్గా, హరి వెళ్ళిపోయారు. శంకర్ అలా పార్కు కేసి వెళ్దాం రమ్మన్నాడు -- గిరి తనకు బద్దకంగా ఉన్నదంటే శంకర్ ఒక్కడే వెళ్ళిపోయాడు.
    గిరి బద్దకంగా సోఫా లోంచి కూడా లేవకుండా అక్కడే జేరగిల బడి కళ్ళు మూసుకున్నాడు.
    "ఉమ ఇవాళంతా తనతో ఏమీ మాట్లాడలేదు. కానీ, చాలా మాట్లాడింది. ఉహు! ఆమె మాట్లాడలేదు. ఆమె కళ్ళు మాట్లాడాయి. ఉమ కళ్ళు ఎంత అందమైనవీ? క్షణ క్షణానికీ , చిత్ర విచిత్రమైన భావాలతో కదలాడి పోతూ , నీటి కెరటాలతో గెంతులు వేసే చేప పిలల్లా మిలమిల లాడుతుంటాయి. ఆమె కళ్ళతో అంత చక్కగా మాట్లాడగలదని , తన కంతకు ముందు తెలియదు. ఆజ్ఞలు, లాలన లు, ప్రార్ధన లు , అలకలు అన్నీ పెదవి కదల్పక తన కనురెప్పల కదలికలతో తెలియ జెప్పింది. ఆ కళ్ళలోకి చూస్తూ కూర్చుంటే చాలు యావత్ప్రపంచాన్ని మరచి పోవచ్చు.
    ఇంత అనురాగాన్నీ ఎలా అణచి ఉంచటం? తన హృదయం , శరీరమూ "ఉమా, ఉమా!" అని ప్రతి ధ్వనిస్తుంటే కాదని తనను తాను మోసం చేసుకోవటం సాధ్యమా?
    అయినా, ఇది కేవలం మనసుకు సంబంధించింది . అమితమైన ఆకర్షణ తో ఉమ వైపుకు పరుగెత్తి పోయే మనసును మరల్చటం తన వశం కాదు. అసలు మరల్చవలసిన అవసరం మాత్రం ఏముందీ? తన అంతరాంతరాలలో నిండి, తన అనుభూతి లోకి మాత్రం వచ్చే ఈ విషయం వల్ల ఎవరికి మాత్రం ఏం నష్టం?  తన కెవ్వరి పట్లా ద్రోహ చింత లేదు-- ఎవ్వరికీ తాను అన్యాయం తల పెట్టడు. తన వల్ల తన ప్రాణ మిత్రుడు హరికి గానీ, అతని ప్రణయిని ఉమకు గానీ, తనకు స్నేహితురాలూ, సహోదరీతుల్య దుర్గ కు కానీ ఎన్నడూ ఏ విధమయినా క్లేశమూ కలుగదు. ప్రకృతి సిద్దమూ, అత్యంత మధురమూ అయిన ఈ ఆకర్షణ నుండి తప్పించుకోవటం సాధారణ మానవులకు అసాధ్యం -- సృష్టి, చరిత్ర ప్రారంభం నుండి స్త్రీ పురుషుల నిష్కల్మషానురాగమే సృష్టి స్థితికి మూలమై, మానవ జీవిత మాధుర్యమై నిలిచింది. నిర్మల మయిన ఈ అనురాగాన్ని ఈర్ష్యా ద్వేషాలతో, కాంక్షలతో మలినం చేసినపుడు మాత్రమే, అది క్షుద్రమవుతుంది. అప్పుడే వాతావరణం కలుషిత మవుతుంది.
    అసలిటువంటి అనుభూతి పొందగలిగే అదృష్టం మాత్రం ఎందరికీ? ఇది జీవితానికీ వరము. శాపము కాదు.
    ప్రయత్నం మీద సాధించి అలవరచుకున్న తన మనో సంయమనం తో చాలా రోజుల తరువాత, గిరి నిశ్చింతగా , హాయిగా నిద్రపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS