అతడు వెళ్లి కరుణ ని తీసుకు వచ్చాడు. పెళ్లి కొడుకు రామకృష్ణ కి కరుణ నచ్చిందని తెలిసిన తరవాత హిమబిందు ని వేరుగా పిలిచి అడిగాడు శ్యామ సుందర్ నెమ్మదిగా --
"ఏమంటున్నది కరుణ?" అని.
"తననే అడుగుదాం ఉండండి! కరుణా........"
"అరె! కరుణ ఎందుకు! బిందూ ! నాతొ చెప్పలేదు. సిగ్గుపడుతుంది!" అంటూ హిమబిందు దారికి అడ్డంగా నిలుచున్నాడతడు.
అంత దగ్గరగా అతడు తన ఎదుట నిలాబడేసరికి బిందు మనస్సు తడబడింది. సూటిగా తన కళ్ళలోకి చూస్తున్న అతని వంక చూడలేక తల వంచుకుంది. వైజాగ్ నుంచి వచ్చినప్పటి నుంచి అతని మాటల తీరు తనకి వింతగాఉంది "బిందూ' అంటూ ఆత్మీయంగా పిలవడం, మాటిమాటికి తన అభిప్రాయం అడగడం, ఏమాత్రం సంకోచం లేకుండా స్నేహితుడి లా మాట్లాడ్డం తనని ఇబ్బందిలో పెడుతున్నాయి. కానీ, ఎందుకో మనస్సు తిరస్కరించలేకపోతున్నది.
"అడిగి చెప్పుతాను! ఉండండి!" అంటూ హిమబిందు లోనికి వెళ్ళింది. తిరిగి వచ్చి కరుణ అంగీకారాన్ని తెలుపగానే అతడా నందంతో ఊగిపోయాడు.
ఆ రోజునే అతడు గుంటూరు వెళ్ళాడు ఆ కబురు తల్లి కందించడానికి. కరుణ కన్న హిమబిందు హృదయాన దిగులు పెరిగి పోయింది.
'కరుణ తో ఇక కలిసి ఉండడం ఎప్పటికో? ఎందుకిలా నా మనస్సు ఊగి పోతుంది? మాటిమాటికి నా కళ్ళలో తడిని పసిగట్టి కోపం తెచ్చుకునే కరుణ నెలా వదలి ఉండాలి? ఎందుకింత స్నేహం పెంచుకున్నాను తనతో! కరుణా, ఇక ఈ బిందు మీద అలిగే దేవరు? పోట్లాడే వాళ్ళేరీ? నా కళ్ళలో నవ్వు మెరిస్తే మనస్సు నిండుగా వెన్నెల నింపుకునే నీకు దూరంగా ఎలా ఉండగలను? నీకూ బాధగానే ఉంటుంది! నాకు తెలుసు? కానీ, కొన్నాళ్ళ కింత బాధ ఉండదు నీలో. తోడుగా మరొక రుంటారు నీకు. ఆ సాహచర్యం లో ఈ హిమబిందు నీ హృదయాన ఎప్పుడో ఓసారి "కరుణా" అని పిలుస్తూ ఈ స్నేహాన్ని జ్ఞప్తి కి తెస్తుంది. కానీ....నాకో? ఎవరున్నారు? ...' లోలోన దిగులు దుఃఖమై వలయం లా తిరుగుతుందామె కు.
మళ్ళీ శ్యామ సుందర్ వచ్చేసరికి మూడు రోజులు పట్టింది. పెళ్ళికి ముహూర్తం నిర్ణయించు కున్నారని నెలాఖరు నే అని, కరుణ నాలుగు రోజుల్లో గుంటూరు వెళ్ళాలని చెప్పాడు. ఆ రోజంతా అన్యమనస్కంగా నే ఉండి పోయారిద్దరూ.
ఏదో మాట్లాడాలని తల ఎత్తుకుంది కరుణ. కానీ, గొంతు పెగిలి రాదు. కళ్ళు తనకు తెలియకుండానే అశ్రు సిక్తాలవుతున్నాయి బిండును చూడగానే. కాలేజీ కి వెళ్ళేవారు. వచ్చేవారు. కానీ, ఎప్పటిలా వాదాలూ, కోపాలూ లేవు.
కరుణ వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది. ఆ రాత్రి కరుణ వెక్కి వెక్కి ఏడ్చింది హిమబిందు మీద వాలిపోయి.
ఎవరి నెవరు ఓదార్చాలో తెలియకుండా పోయింది ఎవరి పెదవులు కదిలినా దుఃఖం తప్ప శబ్దం రావడం లేదు.
"నిన్ను చూడకుండా ఎలా ఉండాలి , బిందూ!"'ఇప్పుడిలాగే ఉంటుంది, కరుణా! కొన్నాళ్ళ కి తెరుకుంటావు! అరే! ఇంకా ఏడుస్తున్నావా? పద! బస్సు టై మయిందట! ఉత్తరాలు వ్రాయనా ఏమిటి?" అంటూ హిమబిందు తన దిగులుని అణచుకుని ప్రయాణానికి తోడుపడింది.
బస్సు కదిలి వెళ్లి పోయింది. బిందు హృదయం శూన్యం అయిపోయినట్లు తోచింది. నిరుత్సాహంగా రిక్షాలో కూర్చుంది. ఇల్లు చేరిన తరవాత ఒంటరితనం తనని మరింత క్రుంగ దీసింది. అందుకే వెంటనే రికార్డు తీసుకొని హాస్టలు కి వెళ్ళిపోయింది. అక్కడ కొంతసేపు నలుగురితో కూర్చుని మాట్లాడితే మనసు కొంత తేరుకుంటుందన్న ఊహతో వెళ్ళింది.
తన జీవితాన ఓ మధురమైన , మరుపురాని అధ్యాయం ముగిసి నట్లయింది. స్నేహం ఇంకా గాడమైనట్లు తోచిందామె కా సంఘటనతో.
'స్నేహానికి దగ్గర, దూరం అనవసరం. క్షణం లో కరుణ తో మాట్లాడే మనస్సుంది. కరుణా! అమెరికాలో కాదు, నువ్వు జపాన్ లో ఉన్నా మన స్నేహం మాసిపోదు. దూరాన్ని దగ్గర చేసే వంతేనే స్నేహం అని తెలిసీ ఎందుకో మనస్సు సమాధాన పడలేక పోతుంది!' అనుకున్న దామె పడుకుంటూ.
* * * *
శ్యామసుందర్ తిరిగి వచ్చాడు మళ్ళీ కాలేజీ లో సెలవు లేనందు వలన. అతనిని చూడగానే హిమబిందు కి కరుణ ఎదుటే ఉన్నట్లని పించింది.
"ఏమన్నది కరుణ!" అన్నది ఎదురు వెళ్లి.
"నీకోసం ఎదురు చూస్తోంది. ఈ ఆదివారమే రమ్మని చెప్పమంది! రాకపోతే తనే వస్తుందట!" అన్నాడతడు.
"అంత పని చేస్తుంది నిజంగా! వెళ్ళకపోతే ! మొండి ఘటం!"
ఇంకా ఎంతో వివరంగా కరుణ తన గురించి ఎమన్నదీ తెలుసుకోవాలన్న ఉత్కంట బయలుదేరిందామె లో. కానీ, శ్యామసుందర్ నవ్వుతాడేమోనని ఆ కుతూహలాన్ని అణిచి వేసింది.
కరుణ లేని ఆ ఇంట్లో గడవడం తనకెంతో దుర్బరంగా ఉంది. ఒక్కో క్షణం లో మళ్ళీ హాస్టలు కి వెళ్ళిపోతే బాగుంటుంది. . అని మనస్సు మొండిగా చెబుతుంది. కానీ, ఇంతలోనే హాస్టలు కి వెళ్ళడం నచ్చడం లేదు. వార్డెన్ 'మళ్ళీ వెళ్లి పోవు గదా?' అంటుంది అనుకున్నది.
కానీ, ఈ ఒంటరితనం తన మనస్సుని కోసి వేస్తున్నది. చికాకు తప్ప, ఆసక్తే కనిపించడం లేదు చదువులో. కొన్ని సార్లు విరక్తి కెరటం లా విరుచుకు పడుతున్నది తన మీద తనకే.
శ్యామసుందర్ ఒకటి రెండు సార్లు హోటల్లో భోజనం చేసి వచ్చాడు. అది ఆమె కెంతో కోపాన్ని కలిగించింది. అతనికని వండిన అన్నం కూరా వృధాగా పోయాయి. రావడానికి టైం లేక అలా చేయవలసి వచ్చిందని అతడు చెప్పినా ఆమె కోపం తగ్గలేదు. ఆ కోపంతో ఆ రాత్రికి కిచెన్ తలుపులు తెరవనే లేదు.
ప్రొద్దుపోయి వచ్చిన శ్యామ సుందర్ కిచెన్ లోకి వెళ్లి చూశాడు. ప్రాత్రలన్నీ బోర్లించి ఉన్నాయి. అతనికి ఆశ్చర్యం వేసింది. వెంటనే బయటికి వచ్చి బిందుని పిలిచాడు.
"ఉపవాసం ఉందామా , బిందూ , ఈ వేళ?' అన్నాడు.
"నాకు ఆకలిగా లేదు. ముందు వండే ఓపిక లేదు. హోటలుంది గా మీకు!"
చిన్నపిల్లలా ఖచ్చితంగా చెబుతున్న ఆమె మాటలకతనికి నవ్వు వచ్చింది. ఆ హటం తనకి ఆశ్చర్యాన్ని కలిగించింది. తలుపులు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ.
"అవును! నాకోసం బాధపడ్డానికి తనేమైనా కరుణా? వెళ్లి హాయిగా హోటల్లో భోజనం చేస్తాడు. నా పిచ్చి గాని అతని కేందుకుండా లి నా గురించి శ్రద్ధ?' విరక్తిగా నవ్వుకుంది.
లైటు వెలుగుతూనే ఉంది. ఆకలి నిద్రని నేట్టేస్తున్నది. అలాగే నీరసంగా కళ్ళు మూసుకుని పడుకుంది.
కిచెన్ తాళం తీసిన చప్పుడైంది. అతడు వచ్చాడెమో అనుకుంది. అయిదారు నిమిషాల తరవాత తలుపు తట్టాడతడు.
"అన్నం తిందాం రా, బిందూ! నీకెంతో ఇష్టమైన వంకాయ వేపుడు , సాంబారు తెచ్చాను. చల్లారి పొతే తినలెం!" అంటూ మృదువుగా పిలిచాడు.
తను హోటలు నుంచి అన్నం తీసుకు వచ్చాడని తెలియగానే ఆమె మనస్సు తేలిక పడింది. తెలియని సందడి లోలోన ఆరంభమైంది. అతని వెనకే వెళ్ళింది మరో మాట మాట్లాడకుండా.
భోజనాలు ముగిసిన తరవాత అతడింకా కిచెన్ ;లోనే కూర్చుండి పోయాడు. హిమబిందు పాత్రలన్నీ కడిగి, సర్దేవరకు ఏవో కబుర్లు చెప్పాడు. తాళం వేసిన తరువాత అన్నాడు :
"కోపం వస్తే ఉపవాసం ఉండాలా, బిందూ?"
"నా కెందుకు కోపం! ఎవరి మీద? కరుణ ఉంటె అవన్నీ?"
"అయితే నేను ఉన్నా లేనట్లే నన్నమాట!"
"అని నేననలేదే?"
"పైకి చెప్పలేదనుకో! కానీ, నువ్వు చేస్తున్న దేమిటి చెప్పు! మాట్లాడించినా మాట్లాడవు కొన్ని సార్లు. పిలిచినా, వినిపించు కునీ, వినిపించనట్లు తలెత్తి కూడా చూడవు. కరుణ వెళ్ళింది. కనీసం ఒక్కసారైనా నాతొ నవ్వుతూ మాట్లాడేవేమో చెప్పు ? పోనీ నేనిక్కడ ఉండడం ఇష్టం లేకుంటే చెప్పు, బిందూ! మరోచోటికి వెళ్ళిపోతాను."
"భలేవారే మీరు మొత్తానికి. మీరు ఉండడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏముంది? నేనెందుకంటా నా మాట?"
"అనలేవని తెలుసు. కానీ నాకు అనుమానంగా ఉంది. నేనెంత దగ్గరగా రావాలను కుంటున్నానో నువ్వంత దూరంగా ఉంటున్నావు!"
ఆమె కళ్ళలో విస్మయం నిండు కొచ్చిందా మాట వినగానే. ఉన్నట్లుండి ఆకస్మికంగా సంభాషణ కొత్త మలుపు తిరిగే సరికి తన అభిప్రాయం ఆమెకి అర్ధం కాలేదు.
"మీరంటున్నది నాకర్ధం కావడం లేదు!"
"అర్ధం చేసుకోవాలని నువ్వు ప్రయత్నించనిదె ఎలా అర్ధం అవుతుంది?"
మరింత ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. ఆ కళ్ళలో తన పైన గాడనురాగం ఉన్నట్లు తోచింది. ఆ అనురాగం మెరుపులా మెరుస్తుంది. ఆ మెరుపు తన హృదయం లోకి దూసుకు పోయింది. క్షణం సేపు ఎన్నో ఊహలతో ఊగిపోయింది.
ఆ తరువాత అతడేమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు.
'తనకి కోపం వచ్చినట్లుంది. నాకు దగ్గరగా వస్తున్నాడా? అలా అన్నాడెందుకు? ఏం ఉంది అతని మనస్సులో? లోలోని ఊహల్ని మేలు కొలుపుతాడేమిటినా నేనవర్ని? తానెవరు? నేను మాట్లాదనంత మాత్రాన? తన కొచ్చిన నష్టం ఏమిటో?' అన్ని ఊహలతోనే ఆ రాత్రి ఆమె ప్రశాంతంగా నిదుర పోయింది. ఆ ఊహ లామె మనస్సుని జోకోట్టాయి. లేచి పడుతున్న దిగుల్ని అణిచి వేశాయి.
ఉదయం లేచేసరికి ప్రోద్దేక్కింది. నవ్వుతూ పలుకరించాడతడు.
"రాత్రి బాగా నిద్ర పట్టిందను కుంటాను! బిందూ, కరుణ కలలోకి వచ్చి ఉంటుంది! అవునా?"
చిరు మందహాసం మెరిసిందామె పెదవుల పైన కూడా కరుణ పేరు వినేసరికి. హడావిడి గా వంట ముగించి కాలేజీ కి వెళ్ళిపోయింది.
సాయంత్రం శ్యామ సుందర్ ఇంటికి వచ్చేసరికి ఆమె రూం లో పడుకుని ఉంది. అతడు పిలిచినా పలకలేదు. దగ్గరగా వచ్చి చూశాడతడు.
"బిందూ! పడుకున్నా వేమిటి? తల నొప్పిగా ఉందా?" అన్నాడు కుర్చీలో కూర్చుని.
కుర్చీ లాగిన చప్పుడు కామెకి మెలకువ వచ్చింది కళ్ళు జ్యోతుల్లా ఎర్రబారాయి.
"తలనొప్పి! కొంచెం టెంపరేచర్ ఉన్నట్లుంది!" నీరసంగా వినిపించింది కంఠం.
"టెంపరెచరుందా? ఏదీ?' అంటూ నుదుటి మీద చేయి ఉంచి చూశాడు. ఆ వేడి భరించలేక వెంటనే చేయి తీసివేశాడు.
"కొంచెం ఏం ఖర్మ! మండి పోతోంది! ఉండు, డాక్టర్ని పిలుచుకు వస్తాను" అని వెళ్ళిపోయాడు వెంటనే.

డాక్టర్ వచ్చి పరీక్షించి ఇంజక్షన్ ఇచ్చాడు. టాబ్లెట్స్ ఇచ్చి బయటికి వచ్చిన తరవాత అన్నాడు శ్యామ సుందర్ తో.
"టెంపరేచర్ తల్లవారే లోపల తగ్గిపోతుంది దానికేం కంగారు పడనవసరం లేదు. కానీ, చాలా వీక్ గా ఉందోయ్ మీ మిసెస్! టానిక్ లు వాడాలి. లేకపోతె ఈ వీక్ నేస్సే మరో రోగానికి దారి తీయవచ్చు."
శ్యామసుందర్ నోట మాట రాలేదు డాక్టర్ 'మిసెస్' అనగానే. కాదని చెప్పాలని కూడా తోచలేదతని కా క్షణంలో. ఆ మాట బిందు క్కూడా వినబడుతుందని అతనికి తెలుసు. అందుకే అలా నిలుచుండి పోయాడతడు విగ్రహంలా క్షణ మాత్రం. డాక్టర్ వెళ్ళిపోయిన తరవాత కూడా అతడు చాలాసేపటి వరకు లోనికి వెళ్ళలేక పోయాడు. చేతిలో ఉన్న టాబ్లెట్స్ వంక చూసి లోనికి వెళ్ళాడు ఇవ్వడానికి.
అటువైపు తిరిగి ఉన్నదామే. మంచి నీళ్ళు వంచాడు కూజా లో నుంచి గ్లాసు లోకి. ఆ శబ్దానికి ఇటు వైపు తిరిగి టాబ్లెట్స్ అందుకుని మౌనంగా మంచినీళ్ళు త్రాగి పడుకుంది. ఆమె ముఖం వాడిపోయింది. ఆ మాట విన్నదని తెలిసిపోయింది పూర్తిగా.
హోటలు కి వెళ్లి కాఫీ తెచ్చాడు కొంతసేపటికి.
"కాఫీ ఇవ్వనా బిందూ?" అన్నాడు.
"ఇప్పుడు లెవలేను. అక్కడుంచండి , టేబిల్ మీద తరవాత తాగుతాను" అన్నదామె గోడ వైపు నుంచి ముఖం తిప్పకుండానే. ఓ నిమిషం అలాగే నిలబడ్డాడతను. ఆ తరవాత నెమ్మదిగా తలుపులు వేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు.
రాత్రి భోజనానికి కూడా వెళ్ళ లేదతడు. పది గంటలకి వచ్చి చూశాడు. అతని పాదాల చప్పుడు వినిపించి కళ్ళు మూసుకున్నదామె. నిదురబోతున్న దన్న ఊహతో వంగి నుదుటి మీద చేయి ఉంచి చూశాడు.
