శ్యామసుందర్ తో ఎన్నో చెప్పాలనిపించింది. కానీ, అతనికి టైమ్ లేకుండా పోయింది. ఎన్నాళ్ళ కో తన మనస్సుకు నచ్చిన స్నేహితుడు ఎదురైనట్లు మనస్సు ఉప్పొంగి పోయింది ఆనందంతో. తలనొప్పి కూడా మరిచి పోయిందా ఊహల్లో. కానీ, ఆతడు వెళ్ళగానే మళ్ళీ మనస్సు తిరగబడింది. గతంలోకి జారిపోకుండా పట్టుకోవాలని ప్రయత్నించింది.
"బిందూ! " ఎంతో ఆత్మీయంగా పిలిచాడు అతను! అతని ఊహల్లో నేనిం'త సన్నిహితంగా నిలిచి పోయానని నాకు తెలియదే? పరాయి వాణ్ణి కాదంటాడేమిటి? కరుణ హృదయాన నాకోసం తీయని స్నేహ బంధం అల్లుకుని ఉంది? కరుణ ఎంతో తనూ అంతే నాకు!?ఎందుకింత సన్నిహితంగా వస్తున్నాడు అతడు?' ఏ ఊహ క్షణం నిలువడం లేదు.
కరుణ వచ్చేవరకు అలాగే అంతులేనన్ని ఊహలతో సతమత మావుతూనే ఉంది. కోపం తగ్గిపోయింది కరుణకి ఆమెని చూడగానే.
"మధ్యాహ్నం కాగానే వచ్చేశావటగా?" తలనొప్పి తగ్గిందా?' అన్నది.
"తగ్గిపోయిందిప్పుడే! ఓయ్ , జాగ్రత్త! వస్తోంది నా ప్రియమైన నేస్తం! పారిపో! అన్నాను. భయం వేసిందేమో పాపం! నిన్ను చూడగానే తోక ముడిచింది."
చిరునవ్వు మెరిసిందామె పెదవుల పైన బిందు పరిహాసానికి.
"అబద్దం కూడా అందంగా చెబుతావు , బిందూ నువ్వు!"

"మళ్ళీ తిరగానదిందనుకుంటానె కోపం! ఇదిగో, అమ్మాయ్! మరీ ఇంతగా పెంచుకోకు బంధాన్ని! ఆ గాడమైన అనుబంధానికి నిజం కూడా అబద్దం గానే కనిపిస్తుంది. అయినా నాకు తెలియక అడుగుతాను -- ఎందుకిలా సి.ఐ.డి. ల్లా మీ అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ నా మనస్సు క్కూడా కాపలా కాస్తారు? ఏ మూల ఏ ఊహ కదిలినా, మీకు వినిపిస్తుందేమిటి?!"
"ఏం? నీకు నచ్చడం లేదా ఏమిటి మా కాపలా! నన్ను అన్నావు ఒప్పుకుంటాను. అన్నయ్య ను కూడా ముడి వేస్తున్నా వేమిటి? నీతో చనువుగా మాట్లాడిందెప్పుడు తను?"
"నీకు తెలుయదేమో? కొంతమంది ఎక్కువగా మాట్లాడరు. కానీ, లోలోన మాటల్ని మించిన సన్నిహితులౌతారు కావాలనుకున్న వారికి."
'అయితే అన్నయ్యా అంతే నంటావ్?"
:అక్షరాలా!"
:ఏమిటీ వేళ అన్నయ్య మీదికి దండెత్తావ్?"
"ఆ అన్నయ్య నామీద కో దండయాత్ర తెస్తున్నాడని! అమ్మాయి గారిక పెళ్లి కూతురవ్వాలి!"
"ఏమిటా వాగుడు! ఎవరున్నారు నీతో!"
"నేననడం లేదు, తల్లీ! మీ ప్రియమైన అన్నగారే అన్నారు" అంటూ పరిహాసం జోడించి యధార్ధాన్ని వినిపించింది కరుణ కి. ఆమె ఆశ్చర్య పడిందెంత గానో. తల్లి వ్రాసిన జాబులో కొన్ని మాటలు జ్ఞప్తి కి వచ్చాయప్పుడు. 'ఈ వేసవి లో నీ చదువు ఆపితే మంచిదంటున్నాడమ్మా మామయ్య!' అని వ్రాసింది. ఇందుకే కాబోలు అనుకున్న దామె. ఆ మాట విన్నక్షణం నుంచీ కరుణ కు దిగులు పట్టుకుంది.
"అమ్మకీ మధ్య పెళ్లి మీద మరీ బెంగ వచ్చి పడింది. ఇంకా చదువెందుకంటుంది మాటిమాటికీ! నేనేం చేసుకో నసలు!"
"పోనీలే! నువ్వు పెళ్లి చేసుకోవద్దు. ఆ వచ్చే దొరగారు నిన్ను చేసుకుంటాడు లే!"
అంత దిగులూ, కోపం ఆ పరిహాసానికి దూది పింజల్లా ఎగిరి పోయాయి.
"నీ పని మరే పిచ్చి పిచ్చిగా ఉంది! ఇంకేం ? నువ్వు హాయిగా ఉండు! నా పీడ విరగడై పోతున్డిగా ఇక!"
"కోప్పడకే తల్లీ! నేను హాయిగా ఉంటానో , ఉండనో! ఈ ప్రసక్తి తో ఎన్నాళ్ళు నాకోసం పెళ్లి చేసుకోకుండా ఉంటావ్?"
"ఉంటానని నేనేమీ చెప్పలేదే? నీ పెళ్లి ముందు కావాలి!"
"ఓసి పిచ్చిదానా!నీకెలా చెప్పాలి? నాకా! పెళ్ళా! ఇప్పుడా!"
"ఎందుకలా వణికి పోతావ్! ఏం, ముసలి దానివై పోయావా? ఈ అందం చాలదా? నీ అందానికి తగిన వాడు దొరకడనా?"
"కరుణా! ప్లీజ్! ఇక మాట్లాడకు! ఎన్ని ఉన్నా సుఖం ఉండదు కొందరి బ్రతుకుల్లో. నేనూ అదే కోవకి చెండుతానని నీకు తెలియదు. నాకేమీ లోపం లేదు. కానీ, జీవితానికో అర్ధం కల్పించేదే దూరమైంది నాకు. ఏమిటని అడక్కు! నీకు చెప్పలేను. చెప్పి నీ గుండెల్లో నాకోసం మంటని రగిల్చి భరించలేను. నీ ఊహల్లో నేనో గులాబీని. సంపెంగ ని. పున్నమి వెన్నెల నా జీవితం! ఈ భావనే ఉండాలి నీ మనస్సులో నేనంటే! అంతే. నిజం చెప్పి నీ దృష్టి లో అదృష్ట హీనురాలి గా నిలబడ లేను. ఆ నీ క్షోభ నన్ను కాల్చి వేస్తుంది."
"అయితే మన స్నేహాని కిక అర్ధం ఏమిటి? నీ గీతలో నువ్వు, నా........."
"కరుణా! నన్నర్ధం చేసుకో! అందరి మనస్తత్వాలు ఒకే రీతిగా ఉండవు. కొందరు మనస్సు విప్పి చెప్పుకుంటారు. కొందరు కొన్ని దాచుకుంటారు. అంత మాత్రాన అది స్నేహం కాకుండా పోదు. అర్ధవంతం కాకుండా ఉండదు ఆ బంధం! మనస్సులు విప్పి చెప్పుకుంటేనే స్నేహమా ఏమిటి?"
"మరేమీటంటావ్?"
"విసుగెందుకే తల్లీ! స్నేహం లో ఇచ్చి పుచ్చుకోవడాలే ఎక్కువగా ఉండకూడదు. నీ ఊహలు నాకు నచ్చక పోవచ్చు. నా భావాలు నీకు అందంగా ఉండక పోవచ్చు. అది కాదు కావాల్సింది. ప్రతి మనస్సులో మంచి ఉంటుంది. అది తీయనిది. అమృతం కన్నా మించిన తీయనిది. ఆ తీయదనాన్ని పంచుకోవడమే స్నేహం! వెన్నెల కన్నా చల్లగా ఉంటుంది ఆ బంధం."
"ఊ! కానివ్వు! చెప్పు! నీ మాట కాదన్న దెప్పుడు నేను" అన్నది కరుణ.
"ఇంకెన్నాళ్ళు! రెండు మూడు నెలల్లో వేల్లిపోతావు మరో ఇంటికి. అంతవరకూ వినక తప్పదు మరి!"
ఆ మాట కరుణలో ని దిగులు ను ద్విగుణీకృతము చేసింది. ఆ రాత్రి ఇరువురికీ నిదుర లేదు. అయినా ఒకరితో ఒకరు మాట్లాడు కోలేక పోయారు. మాటల కందని బరువు పేరుకు పోయిందా ఇరువరి మనస్సులో. పెదవి విప్పక పోయినా వెలువడుతున్న నిట్టూర్పులు, లోలోన రగులుతున్న బాధని వినిపించుతూనే ఉన్నాయి.
మరునాడు కూడా మౌనమే రాజయింది. ఏదో అవసరమైనప్పుడు మాత్రం పెదవులు కదిలేవు. కాలేజీ నుంచి వచ్చిన తరవాత కొంచెం తేలిక పడ్డాయి మనస్సులు.
రెండు రోజులు అలాగే నిరుత్సాహంగా నడిచి పోయాయి. మూడో రోజున హిమబిందు ముందుగా వచ్చేసింది ఇంటికి. మంచినీళ్ళు తాగి కిచెన్ లో నుంచి వస్తుండగా ఎదురయ్యాడు శ్యామ సుందర్.
"కరుణ ఏం చేస్తోంది ? లోన ఉందా?" అన్నాడు.
"లేదు. ఇంకా రాలేదు. కాలేజీ నుంచి. ఇప్పుడే వస్తున్నా రను కుంటానే! మంచినీళ్ళు తీసుకురమ్మంటారా?"
అతడు తల ఊపాడు కావాలని. ఆమె వెనకే తనూ వెళ్ళాడు కిచెన్ లోకి. వెనుదిరిగి చూసిన బిందు కనులలో ఆశ్చర్యం మెరిసింది.
"కరుణ ని చూడ్డానికి వచ్చాడా వైజాగ్ అబ్బాయి! నా రూం లో ఉన్నాడు!"
"ఇప్పుడా? చూడ్డానికా?"
"ఆ! ఇప్పుడే! అతను అమెరికా వెళతాట్ట రీసెర్చి కి ఈ నెలాఖరు లోనే పెళ్లి చేసుకొని కరుణ ని కూడా వెంట బెట్టుకుని వెళ్లాలని తన అభిప్రాయం. అందుకే ఇంత హడావిడి! నేనువెళ్లి కరుణని తీసుకు వస్తాను. కానీ, ఈలోపల కాస్త కాఫీ కాచి ఇవ్వాలి, బిందూ, నువ్వు! ఆకలి దహించుకు పోతుంది. అతని క్కూడా కాఫీయే చాల్లే!"
"భలే వారే మీరు! కాఫీకి ఇంతగా అడగాలా ఏమిటి! అన్నం ఉంది. పెరుగుతో తినండి. కాఫీ తో ఏం కడుపు నిండుతుంది? అతనికి కాఫీ పెడతాను."
కాఫీ ఇచ్చి భోజనం చేసి కరుణ కోసం వెళుతూ అన్నాడతడు.
"బిందూ ! ఎలా ఉన్నాడు? చూశావుగా?"
"కరుణ అందానికి మెరుగు పెట్టేట్టున్నాడు? సోషల్ గా ఉంటాడనుకుంటానే!"
'అమ్మయ్య ! నీకు నచ్చాడు గదా? ఓ పెద్ద బెంగ తీరిందిక?"
"అదేమిటి? నా అభిప్రాయం ఎందుకు, కరుణ కి నచ్చాలి గాని?"
"నీ కళ్ళల్లో ఏం పరుగేడుతుందో చూసి గాని కరుణ తన ఇష్టం చెప్పదు."
"మొత్తానికి తెలుగు లెక్చరర్ నని రుజువు చేశారు! కరుణ కి ఈ విషయంలో నేనేమీ సలహా లివ్వనండోయ్!" అన్నది హిమబిందు నవ్వుతూ.
"పోనీ, నావైపు నుంచి ఇవ్వు! అతను మంచివాడనే మా ఫ్రెండ్ చెప్పాడు. ఉద్యోగం కూడా మంచిదే! ఫారిన్ వెళుతున్నాడు. కనక నాకోసమైనా కరుణ ని ఒప్పించాలి!"
"తను అంగీకరించనప్పుడు గదా ఈ భారమంతా! ముందు కరుణ ని రానివ్వండి ."
