కానీ మనస్సు చెప్తే వినేది కాదు. అదో నియంత.
ఎందుకివ్వరు! మహారాజులా ఇస్తారు. అంది నన్ను ఉత్సాహపరుస్తూ. ఉద్యోగం చేసే మగపిల్లాడు కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా నంటే కాదనే దేవరు? అని దైర్యం చెప్పింది. ఒకనాడు నేనూ జయ మాట్లాడుతూ కూర్చున్నాం. శేషగిరి ప్రశక్తి వచ్చింది.
"నిజంగా నాకు ఆయన్ని చూస్తె భక్తీ, గౌరవం చాలా మంచి నియమాలున్న మనిషి" అంది జయ. నా మనస్సు ఎంతో అసంతృప్తి పడింది.
రాత్రి ఇంటికి వచ్చేక, తర్కించు కున్నాను. జయ నన్ను ప్రేమించిందో లేక శేషగిరి ని ప్రేమించిందో అనే సమస్య వచ్చింది. జయ అతనితో కన్నా నాతోనే ఎక్కువ మాట్లాడేది. అందుకని నన్నే ప్రేమించి ఉంటుందని నిశ్చయించుకున్నాను.
"ఆశయా బాధ్యతే లోకం" అన్నారు. మనిషి ఆశావాది. రేపటికి ఏం జరుగుతుంది , ఏదో జరుగుతుంది అనే ఆశతో జీవిస్తాడు. నాకు మళ్ళీ ఉత్సాహం పుట్టింది. రోజూ సాయంత్రం శేషగిరి ఇంటికి వెళ్ళడం అనేది నిత్యకృత్యం అయ్యింది.
ఇలా కొన్ని నెలలు గడిచి, వేసంగులు వచ్చాయి. జయ బియ్యే ప్యాసయింది. ఆనాడు మా ఇద్దరికీ పార్టీ ఇచ్చింది. నేను ఒక పెన్ను కొని ఆమెకు ఇచ్చాను. నేనిచ్చిన ఆకుపచ్చటి పెన్ను ని చూసి చాలా ముచ్చట పడి, "ఈ రంగంటే నాకెంత ప్రాణమో! మీకెలా తెలుసు నాకీ రంగంటే ఇష్టమని" అంది. నేను నవ్వేసి వూర్కున్నాను. శేషగిరి ఏమీ ప్రజెంటు ఇవ్వలేదు. నాకు భలే ఆనందం కలిగింది. జయ నన్నే ప్రేమించిందని స్థిర పరుచు కున్నాను.
* * * *
ఒకనాటి సాయంత్రం వాళ్ళింటి కి వెళ్లాను. జయ కనపడలేదు. శేషగిరి కూడా లేడు. శేషగిరి వాళ్ళమ్మ గారు ఉంది. "కూర్చో నాయనా . వస్తాడు. అంది." కూర్చున్నాను. జయ వాళ్ళిల్లు తాళం వేసి ఉంది. ఎక్కడికి వెళ్ళారో అనుకున్నాను. శేషగిరి తల్లి కాఫీ పట్టుకొచ్చి ఇచ్చి , "బాబూ! నువ్వు ఒక సహాయం చెయ్యాలి" అంది.
"ఏవిటండి" అన్నాను నేను.
ఆవిడ కన్నీరు పెట్టుకుంది. నాకు విషయం ఏవిటో అర్ధం కాలేదు. "ఏం జరిగింది" అన్నాను.
"ఏం చెప్పమంటావు నాయనా" అంటూ ప్రారంభించింది.
"అతి గారాబం చెయ్యడమే ఒక తప్పను కుంటాను. వాడి చిన్నతనం లోనే వాళ్ళ నాన్నగారు పోయారు. వాడిని అల్లారు ముద్దుగా పెంచాను. కన్నతల్లి నన్నా నా మాట మన్నించాలా!" అంది.
"ఏం? ఏమయ్యింది?" అన్నాను.
కోపంతో ఆవిడ కళ్ళు ఎర్రబడ్డాయి.
"ఏముంది! వెధవ! ప్రేమించాడట. సిగ్గు లేకపోతె సరి. ఆ జయను ప్రేమించాడట. దాన్నే పెళ్లి చేసుకుంటాడుట"అంది.
నా బుర్ర మీద సుత్తితో కొట్టినట్లయింది ఆవిడ చెప్పుకు పోతోంది.
"రత్నం లాంటి మేనమామ కూతురుంది నాయనా చిన్నప్పుడే ----అది పుట్టినప్పుడే అనుకున్నాము. అయన బ్రతికే ఉంటె వీడి వీపు చీరి మరీ కూర్చో పెట్టును. మొన్న వాళ్ళ మామయ్య రాశాడు. ఆ ఉత్తరం చూపించి "ఏరా" అంటే బయట పెట్టాడు, ఆ పిల్లని ప్రేమించాడట. సిగ్గులేని గాడిద -- తల్లితో చెప్పడానికి నోరెలా వచ్చింది? అక్కడా పిల్లని వీడి పెళ్ళాం పెళ్ళాం అని అనడం వల్ల ఆ పిల్ల వూహలు పెంచుకోదయ్యా! దాని నోట్లో మట్టి పోస్తాడనమాట వీడు. నేను ఒప్పుకోను అన్నాను. ఒప్పుకోకపోయినా అంతే అన్నాడు." అందావిడ కళ్ళు తుడుచుకుంటూ.
"గట్టిగా చెప్పి చూడక పోయారా" అన్నాను.
"అన్నీ అయ్యాయి నాయనా. నిన్నంతా ఇంట్లో ఆరని అగ్ని హోత్రం. రోజంతా నేను భోజనం కూడా చేయలేదు. అయితే ఏం? వాడికేం పోయింది. వాడి పట్టు వాడిది---ఆఖరి ప్రయత్నం నువ్వోసారి చెప్పి చూడు. వింటాడనే నమ్మకం లేదనుకో-- అయినా సరే -- ఒక్కసారి నాకోసం చెప్పి చూడు" అంది ఆవిడ "అలాగే నండి" అన్నాను నేను.
రాత్రి ఏడింటికి జయ, శేషగిరి, జయ వాళ్ళమ్మ ముగ్గురూ కలిసి వచ్చారు. ఆ పూట శేషగిరి వాళ్ళింట్లో నే భోజనం చేశాను. భోజనాలయ్యాక, "శేషగిరీ! నా రూముకు వస్తవా? చిన్న పనుంది" అన్నాను. "ఓ యస్! నీతో కూడా వో శుభవార్త చెప్పాలి" అన్నాడు. ఇద్దరం రూముకి చేరాము. నేను చెప్పే లోగా అతనే జయ, తను పెళ్లి చేసుకోబోతున్న విషయం చెప్పి, "మా అమ్మ వప్పుకోటం లేదు. నువ్వు కూడా కొంచెం చెప్పి చూడు. ఆవిడ ఒప్పుకోకపోయినా ఫరవాలేదనుకో" అన్నాడు.
నేను నిట్టుర్చాను.
"ఇదేపనికి మీ అమ్మగారు నన్ను బ్రతిమాలారు. శేషగిరీ -- నా మాట విను. మన మంచి చెడ్డలు మనకి తెలీవు. అవి పెద్ద వాళ్ళకు వదలడం మంచిది. నేను అనుభవం మీద చెప్తున్నాను. నా విషయం లో అలాగే అయ్యింది. మా మేనమామ కూతుర్ని చేసుకో మన్నారు. నేనో పిల్లను ప్రేమించాను. ఆ పిల్లనే చేసుకుంటా నన్నాను. తలిదండ్రులతో వేరుపడి వెళ్ళిపోయాను. తీరా ఆ పిల్ల మరోకతన్ని ప్రేమించిందట. నాతొ అంత చనువుగా ఉండేది. అది ప్రేమ కాదట. అంతే -- అటు నేను తలిదండ్రులకు, ఇటు ఆమె ప్రేమకు, వివాహానికి కూడా దూరమయి పోయాను. మళ్ళీ మా వూరు వెళితే మా నాన్నగారు నా ముఖం చూడ్డానికి నిరాకరించారు. కనుక మనం ఇలాటి విషయాలు పెద్ద వాళ్ళకు వదిల్తే మంచిది" అన్నాను.
శేషగిరి నవ్వాడు.
"ఒరేయ్! శవాన్ని, ఓ రోగిని, ఒక వృద్దుడ్ని చూసేసరికి సిద్దార్ధుడి కి జీవితం మీద విరక్తి కలిగిందట. కానీ అవి చూస్తె ప్రతివాడికీ విరక్తి కలుగు తుందంటావా? సిద్దార్ధుడు అవి చూడక పోయినా విరాగి అయ్యేవాడు. మన ప్రవర్తనలు, చేష్టలు మన నుదుట గీతను బట్టి నడుస్తాయి. దానికి మనం ఏమీ చెయ్యలేము. అంతే --' అన్నాడు.
శేషగిరి చెప్పింది నిజమే!!
మరి కాస్సేపు కూర్చుని , శేషగిరి వెళ్ళిపోయాడు. జీవితంలో ఇంకెన్నడూ ఈ ప్రేమ జోలికి పోకూడదనుకున్నాను. నా బ్రతుకు బండబారి పోయింది. జీవితం మోడై పోయింది.
ముప్పయ్యేళ్ళయినా నిండా లేని నా బ్రతుకు ఎందుకిలా అయ్యిందో అని ఏడ్చాను. వెర్రి ఆవేశంతో గోడ నున్న వెంకట రమణుని పటం తీసి నేలకేసి కొట్టాను. పక్క మీది పడి , వెక్కి వెక్కి ఏడ్చాను.
"భగవంతుడా! చీమని దోమని పుట్టించి నట్టు నన్ను కూడా పుట్టించావా? నాకు సుఖ దుఃఖాలు భాగ్య భోగాలు , కర్తవ్యాలు, అవీ లేవా? సంసార జీవితం రాదా? నాకు నా జీవితం సాఫల్యమయిందని ఆనందించే అదృష్టం లేదా అని ఏడ్చాను.
ఇలా యాంత్రిక జీవితం నేనెందుకు గడపాలి? నా అన్నవాళ్లు లేని జీవితం దుర్భరం. దుర్భరమే కాదు. అనవసరం. అటువంటి బ్రతుకు బ్రతికే కన్నా చచ్చిపోడం మేలు. అవును, అదే మేలు.
కానీ చావేలా సాధ్యం.
చావడానికి ధైర్యం కావాలి. ఆ మాటకు వస్తే చావడానికి ధైర్యం లేని పిరికి పందలే ఈ లోకంలో బ్రతికే వాళ్ళందరూ. ధైర్యం ఉన్నవాళ్ళు చావుకి ఎదురు వెళ్తారు. వెళ్తారు. నేనో పిరికి పందని . చావడానికి నాలో సాహసం లేదు.
ఆ రాత్రంతా పక్క మీద దొర్లుతూనే గడిపాను. పిచ్చేక్కినా బాగుండుననుకున్నాను. కానీ ఎక్కదు. అది మరీ అదృష్ట వంతులకు గానీ, ఎక్కదు. అవును-- ఈ లోకం లో చచ్చిపోయిన వాళ్ళ తరవాత పిచ్చి వాళ్ళే అదృష్ట వంతులు.
మళ్ళీ నా యాంత్రిక జీవితం ప్రారంభమయ్యింది.
* * * *
జయా శేషగిరుల వివాహం నిర్విఘ్నంగా జరిగిపోయింది. శేషగిరి నిజంగా అదృష్ట వంతుడే గాక విధిని శాశించినవాడని పించింది నాకు. అలాటి శక్తి కొంతమందికే ఉంటుంది. నాకు లేని శక్తి అది. వెంకట రమణుని పటంఒకటి వాళ్లకి బహుమతి ఇచ్చాను.
పెళ్ళికి వాళ్ళ మేనమామ వచ్చాడు. వచ్చి, నిష్టూరంగా మాట్లాడి వెళ్ళిపోయాడు. అయితేనేం శేషగిరి తను చేయదల్చుకున్నది చేశాడు. పొందదల్చుకున్నది పొందాడు. శేషగిరి తల్లి తన అన్నగారి కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేద్దామను కుంది. "మన పిల్లకి అన్ని విధాలా తగిన వాడు. చక్కగా చదువుకున్నాడు. మనవాడి స్నేహితుడు" అంది. అయన తాచు పాములా లేచాడు. "ఛ...తల్లీ తండ్రి తోడూ నీడా లేని ఏకాకి కిచ్చి పెళ్లి చేస్తే రేపొద్దున్న వాడు ఎవరికీ తెలీకుండా పారిపోతే------అసలతను ఎవరో, వ్యవహారం ఏమిటో కూడా తెలీదు." అన్నాడు. అతని మాటలు నాకు శూలాల్లా గుచ్చుకున్నా సత్య దూరాలు కావని పించింది.
* * * *
మనోవ్యాధి తో శేషగిరి తల్లి నాలుగు నెలలు తీసుకుని చనిపోయింది. మరో రెండు నెలలయ్యే సరికి జయ తల్లి కూడా చనిపోయింది. ఆ రాత్రి నాకు పీడకల వచ్చింది. నాన్నగారిని చూడాలనిపించింది. ఈపాటి కయినా మనస్సు మారదా అనే ఆశ కలిగింది. ఒక వారం శలవు పెట్టి విశాఖపట్టణం వెళ్లాను. అవధాన్లు గారు నన్ను చూసి చాలా ఆనందించారు. "నీ జీవితం ఇంతలో ఇలా అవుతుందను కోలేదు. మీ నాన్నగారి మనస్సు మార్చడం కోసం శత విధాల ప్రయత్నించాను. కానీ లాభం లేకపోయింది. మొన్ననే వచ్చి వెళ్ళారు. ఒక వారం ఇక్కడున్నారు. నిన్ను గురించి ఒక్క ప్రశ్న కూడా వేయలేదు." అన్నారు. నాకు బుర్ర పగల కొట్టుకుని చద్దామని పించింది.
అవధాన్లు గారు నా వివాహ విషయం ప్రసక్తి తెచ్చారు. "పెళ్లి చేసుకోరాదుటయ్యా నువ్వు. మీ మామయ్య కూతుర్ని చేసుకుంటా నన్నావు కదా" అన్నారు. నేను నిర్జీవంగా నవ్వి, "అదొక్కటే తక్కువ. నా జీవితానికి" అన్నాను. అయన ఆ పైన మాట్లాడలేదు. ఆరోజు అక్కడ ఉండి మర్నాడు బయల్దేరివచ్చేశాను.
* * * *
నాకు శేషగిరి, జయ, బంధువులు ఆప్తులు అయ్యారు. రోజూ వాళ్ళింటికి వెళ్ళేవాడిని. వాళ్ళతో కబుర్లు చెప్పేవాడిని. కాల గమనం లో కొంత ఉత్సాహం వచ్చింది. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు "రాజు! పెళ్లి చేసుకోకూడదు నువ్వు" అనేవారు. కానీ నేను ఆ విషయాన్ని జీవితం లో ఎన్నడూ ఆలోచించ కూడదను కున్నాను.
ఓ సంవత్సరం గడిచింది.
జయకి కూతురు పుట్టింది. ఆనాడు శేషగిరి నాకు పెద్ద పెట్టున పార్టీ ఇచ్చాడు. "మీ మేనగోడలు ఇదిగో. పేరూ అవి మీరే పెట్టాలి' అంది జయ. ఉయ్యాలలో పాపని చూశాను. అచ్చు జయ పోలికే ననిపించింది. "పేరు మనం పెట్టేకన్నా వాళ్ళకే వదిలేస్తే నయం. "పాపా' అని మనం పిలిస్తే వాళ్ళు పెద్దవాళ్ళ య్యాక వాళ్ళ పేరు వాళ్ళు పెట్టుకుంటారు" అన్నాను. శేషగిరి కూడా నా మాటని బలపరిచాడు.
గుడ్డిలో మెల్ల అన్నట్టు నాకు నా ఉద్యోగం లో కొంత ప్రమోషను వచ్చింది. ఎందుకు? ఆ డబ్బు ఎవరు తినను/ ఆఫీసులో అయిదవడం తోనే లేచి రూముకు వెళ్ళాలి అనే ఆత్రం ఉండేది కాదు. నాకోసం కాచుకునే వాళ్ళెవరు? అందరికీ అయితే తల్లీ తండ్రో, భార్యా, పిల్లలో , మరోకల్లో ఎదురు చూసే వాళ్ళుంటారు. నాకు ఎవరూ లేరు. అందుకు ఎక్కువకాలం ఆఫీసులోనే గడిపే వాణ్ణి. దాని వల్ల నేను చక్కగా వోర్పుగా పని చేస్తాననే నమ్మకం కుదిరి, పై ఉద్యోగానికి నన్ను మార్చారు. శేషగిరి జయ మాత్రం ఆనందించారు. వాళ్లానందం నన్నానంద పరిచింది.
కాలచక్రం మరో కొన్ని నెలలు తిరిగేసరికి శేషగిరి లో మార్పు కనుపించింది. ఏమిటో ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు. అతను ఎప్పుడూ ఆలోచిస్తూ కూర్చునేవాడు. జయ చక్కగా ముస్తాబయి, ఏవేవో సంఘ కార్యాలన్నీ మీద వేసుకుని తిరిగేది. ఒక్కొక్కప్పుడు పోరుగురూ కూడా వెళ్ళేది. నాలుగయిదు రోజులయ్యాక గాని వచ్చేది కాదు.
జయ పెళ్లి కాక ముందు నుంచీ కూడా జలసాగా తిరిగిన మనిషి. అందరితోనూ అరమరికే లేకుండా, చక్కగా మాట్లాడేది. శేషగిరి మితబాషి. అతనికి ఆ రకాలు గిట్టవు. అందుకని అలా ఉన్నాడనుకున్నాను.
ఒకనాడు అడిగాను. శేషగిరి నిస్పృహగా నవ్వాడు. "కారణం ఏమీ లేదురా. ఏమిటో.....ప్చ్" అన్నాడు. ఆ తరవాత మళ్ళీ ఆ ప్రసక్తి తేలేదు నేను.
