
శనివారం రాత్రి ఎనిమిది గంటలకు బడిదగ్గర అంతా కోలాహలంగా ఉంది. రంగురంగుల పరికిణీ లతో, చీరలతో ఆడపిల్లలు వెన్నెలలో పువ్వుల్లాగా మెరిసిపోతున్నారు. ప్రయాణపు ఉత్సాహం ఆ పసిముఖాల్లో తాండవిస్తున్నది. హెడ్ మిస్ట్రెస్ క్రిస్టినా వందనం ఫ్రంట్ సీట్లో దర్జాగా కూర్చొని ప్రాణేశ్వరరావుగారితో ఏదో మాట్లాడుతున్నది. పారిజాతం, సత్యవతి, ఇంకా నలుగురైదుగురు ఉపాధ్యాయినులు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ, పిల్లల కేవో పనులు పురమాయిస్తూ, పిల్లలంతా వచ్చారా లేదా అని చూచుకొంటూ తిరుగుతున్నారు.
ఇంతలోకే చిన్న సూట్ కేస్ పట్టుకొని అనంతలక్ష్మీ, ఆవిడ వెనక ఏడుపులూ, పెడబొబ్బలూ పెట్టుకుంటూ స్వరాజ్యలక్ష్మీ వచ్చారు. వారికి కాస్త దూరంలో మెడకు మఫ్లర్ చుట్టుకొని, సుబ్బారావుకూడా వచ్చి, దూరంగా చెట్లచాటున నిలబడి ఆడపిల్లల వంక తదేకంగా చూస్తున్నాడు.
పారిజాతం సత్యను గిల్లి, "పోతుపేరంటాలు వచ్చింది, చూడు!" అని చెట్లవైపు సైగ చేసింది.
నవ్వింది సత్య.
"ఈ వేళ వాడికి పండగ! దూరంగా ఉన్నాము కాని, దగ్గరకు పోతే లొట్టలుకూడా వేస్తున్న చప్పుడు వినిపిస్తుంది" అని మళ్ళీ అంది పారిజాతం.
"నీ మొహం మండ! నన్ను తీసుకెళ్ళకుండా ఒక్కదానివే చావు! హంపీలో,తుంగభద్రలో బడి చావు! నా లాంటి దరిద్రపు వెధవ పుట్టకూడ దసలు! నూతిలో పడి ఛస్తా చూసుకో! నువ్వేమో కులుకుతూ ఊళ్ళంబడి ఎద్ధల్లే తిరిగితే, నేను ఇంట్లో కూర్చోవాలేం? నీ మొహమీడ్చ!" అంటూ ఏకధాటిగా స్వరాజ్యలక్ష్మి అక్క అనంతలక్ష్మిని తిట్టేతిట్లకు పిల్లలూ, పెద్దలూ ముక్కున వేలేసుకున్నారు! అలవాటయిన ప్రాణేశ్వర రావుగారు మాత్రం నిర్వికారంగా ఉన్నారు.
పారిజాతం- "సహస్రమార్చన పూజ అవుతున్నది! బయలుదేరటానికి మంచి ముహూర్తం!" అని గట్టిగా అంది.
అంతా పడిపడి నవ్వారు. అనంతలక్ష్మి మాత్రం పారిజాతంవైపు తినే టట్లు చూసి, ఏడుపు గొంతుతో, 'బీదవాళ్ళను చూస్తే అందరికీ లోకువ, మేడమ్! అంతా నవ్వులాటగా ఉంటుంది. నా గతి వాళ్ళకు పట్టినప్పుడు గాని తెలిసిరాదు! నాకే పెళ్ళయితే ఇట్లా అనేవాళ్ళా!" అని వాపోయింది.
అనంతలక్ష్మి మాటలకు పిల్లలగుంపులో నుండి 'కిసుక్కు' మన్న ధ్వనులు వినిపించాయి.
"అబ్బబ్బా! పారిజాతం! నీ నోరును ఎట్లా మూయించాలో అర్ధం కాకుండా ఉంది!" అని విసుగుకొన్నది సత్య.
"ఇదిగో, సత్యా! పాపం, అనంతలక్ష్మికి పెళ్ళిమీద వ్యామోహం! అదేమో కాకుండా ఉంది! పోనీ, హంపీలో ఎవడేనా సాహసవీరుడు కనబడతాడేమో, వెయ్యి కళ్ళతో వెదుకుదామా?" అని నవ్వుతూ మెల్లగా అంది పారిజాతం.
సత్య తమాషాగా - "ఎవరికి? నీకా? నాకా?" అని అంది.
"ముసలిదాన్ని నా కెందుకూ? ఎవరి కెవరికి అని అంటున్నావు. నీకే మనసున్నట్లుంది! పోనీ, నీ కోసమే వెదుకుదాం!" పారిజాతం సత్యవతి కన్న చాలా పెద్దది. అయినా, వాళ్ళ స్నేహానికి వయోభేదం అడ్డురాలేదు.
మళ్ళీ పారిజాతం తమాషాగా, "ఎన్నడూ లేనిది ఈవేళ పెండ్లి ప్రసక్తి వచ్చింది. కాలాని కేదో మూడింది!" అంటూ, "కానీయండర్రా! మనం కదిలేవేళకి కోడి కూసేటట్లుంది! ఆబ్సెంట్ అయినవాళ్ళు త్వరగా చేతులెత్తండి!" అని పిల్లలను నవ్వించింది. హెడ్ మిస్ట్రెస్ కూడా నవ్వులో శ్రుతి కలిపింది.
బస్సు స్టార్టయింది. ప్రాణేశ్వరరావుగారు హెడ్ మిస్ట్రెస్ కు నమస్కరించి, దూరంగా నిలుచున్నారు. బస్సు చిన్నగా కదలడం మొదలయ్యేసరికి, స్వరాజ్యలక్ష్మి చతికిలబడి గట్టిగా ఏడవడం, చెట్లచాటున ఉన్న సుబ్బారావు ఆ పిల్లను చెయ్యిపట్టి లేపబోవడం, ఆ పిల్ల కసిక్కిన కోపంతో అతని చేతిని గట్టిగా కొరకడం బస్సులోవాళ్ళకి కనుపించింది.
బస్సులో హెడ్ మిస్ట్రెస్ అనంతలక్ష్మి తో-"మరీ గయ్యాళమ్మా నీ చెల్లెలు! పాపం, కుర్రాణ్ణి ఎంత గట్టిగా కొరికిందో! పిల్లల్ని బాగా పెంచాలి, అనంతలక్ష్మీ! భయం, భక్తీ ఉండాలి. క్రమశిక్షణ బాగా ఉండాలి!" అని అంటున్నది.
"అవును, మేడమ్! మీరు చెప్పింది నిజం. అది మరీ దండుముండయింది!" అని అనంతలక్ష్మి- "సార్ వస్తే బాగుండేది, మేడమ్! ఎంత బతిమాలినా రా నన్నారు. నాకు కోపం వచ్చింది. ఇంక సార్ తో మాట్లాడను! ఎంత బాగుండేది సార్ వస్తే!" అని మురిపెంగా అంది. 'సార్' అంటే హెడ్ మిస్ట్రెస్ మొగుడు వందనం.
"అబ్బే! మీ సార్ కు ఆడపిల్లలతో రావటమంటే భయం, అమ్మా! నేను బతిమాలినా వినలేదు. సార్ సంగతి మీకు బాగా తెలుసుగా!" హెడ్ మిస్ట్రెస్ గట్టిగా అంది, నలుగురూ వినాలని.
'నోరు మూసుకో' అన్నట్లు సత్య తనను గిచ్చుతున్నా, పారిజాతం నెమ్మదిగా, "అమ్మడూ! క్రమశిక్షణ గూర్చి ఎంత ఘాటుగా చెప్పిందో చూశావా! అయ్యగారికి ఆడపిల్లలంటే భయమట! అందుకే ఎవరైనా కనిపిస్తే చాలు, ఈగలు దూరేటట్లు నోరు తెరుచుకొని చూస్తాడు! సోమవారం నుండి వాళ్ళకు ఇన్స్పెక్షన్ అట. అందుకని రాలేదు. పాపం, ఆ జీవుడు ఎంత కొట్టుకుపోతున్నాడో, ఈ సదవకాశం తప్పిందని! వెధవది, ఈ బస్ ఈ వేళ చెడిపోయి, వచ్చే శనివారం వచ్చి ఉండకూడదూ? పోనీ, నువ్వైనా ఆ రోజుదాకా కాచుకోలేకపోయావా! పోనీ, ఆ ఇన్స్పెక్షన్ అయినా వాయిదా పడి ఉండకూడదూ! అబ్బే! ఒక్కరికీ బాధ్యత తెలిసి ఏడవదు!" అంటూ జోక్ విసిరింది.
ఒక సీట్లో కుట్టు టీచర్ కాంతమ్మ అదే సీట్లో కూర్చున్న ఇద్దరు పిల్లలతో ఏదో చెబుతున్నది. బస్సు రొదలో మాటలు వినిపించటం లేదు.
"యథాశక్తి మతబోధ చేస్తూ ఉంటుంది అని అంది పారిజాతం.
"రామరామ! నీకు ఏం నోరు ఇచ్చాడు, బాబూ!" అని విసుకొంది సత్య.
"తిట్టే నోరూ, తిరిగే కాలూ ఊరుకోవని తెలియదూ నీకు! పాపం, చిన్నదానివి, అప్పుడే ఎట్లా తెలుస్తాయిలే!" అని సత్యను నవ్వించింది పారిజాతం.
కాస్సేపటికి బస్సు కుదుపులకు అంతా నిద్రలో పడ్డారు. సత్యవతికూడా పారిజాతం భుజం మీద తల పెట్టి నిద్రపోతున్నది. కాని, పారిజాతానికి నిద్ర రాలేదు వెధవ నిద్ర! రోజూ పోయేదే! కాని ఈ ప్రకృతి పాలవెన్నెలలో పరవశించిన ప్రకృతిని చూస్తూ పారిజాత మైమరిచింది. సన్నగా, తను వ్రాసిన పాటలోని ఓ చరణం పాడింది.
"ఆకాశపు కౌగిలిలో అవని పరవశించు వేళ
ఇంకేమి వలదు నాకు! ఈ క్షణమే శాశ్వతముగ ఇలపై ఇక నిలిచిపోనీ!"
"ఎంత బాగా పాడుతావు, పారిజాతం! ఎక్కడి దీ పాట?" ఎప్పుడు నిద్ర లేచిందో సత్య!
"కసిత్వం కుమారి పారిజాతం! సంగీతం కుమారి పారిజాతం! గాయకి కుమారి పారిజాతం! విన్నది కుమారి సత్యవతి!" అంటూ నవ్వింది పారిజాతం. అంతలోకే, దూరాన వెన్నెలలో మెరిసిపోతున్న కొండ లను చూపిస్తూ, "సత్యా! అటు చూడు. ఇంత అందం ఎక్కడన్నా చూచామా? ప్రతిరోజూ వెన్నెల రాకూడదా! భగవంత ని సృష్టికి వంక లేకపోయేది! అందమైన ప్రతిదాని జీవితం చాలా స్వల్పం చేశాడు! అందమైన బాల్య జీవితం స్వల్పం! అందమైన యౌవన జీవితం స్వల్పం! అందమైన వెన్నెల జీవితం స్వల్పం! అందమైన సంతోషపు జీవితంకూడా స్వల్పమే! ఒకటేమిటి, అన్నీ అంతేగా!" అని అంది.
"చీకటి, వెన్నెలా, దుఃఖమూ, ఆనందమూ, కష్టమూ, సుఖమూ ఒకదాని వెంట ఒకటి అని వినలేదూ! ఎప్పుడూ వెన్నెలైతే, దానిలో ఉన్న అందం మనకు తెలియదు! పైగా ముఖం మొత్తుతుంది. అపురూపంగా వచ్చేది కనకనే దానిమీద మన కంత మోజు! అయినా ఈ వేళ వేదాంతంలో పడ్డామే!" సత్య ప్రశ్న.
"బ్రతుక్కి అర్ధం తెలియని మనకు వేదాంత మంటే ఏం తెలుస్తుంది! తెల్లారుతుంది. నిద్ర లేస్తాము. పనులు చేస్తాము. రాత్రవుతుంది. నిద్రపోతాము. ఎప్పుడో బ్రతుకే తెల్లారుతుంది!" పారిజాతం గొంతు తమాషాగా ఉంది.
నివ్వెరపడింది సత్య. "పారిజాతం! ఈ వేళ నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు!" అని అంది.
"సత్యా! బస్సు కదలికలలో మనస్సు కదులుతుంది. ఏవేవో ఊహలు వస్తాయి. చాలా అపురూపమైన ఊహలు! ఊరికే ఉన్నప్పుడు అవి నిద్రపోతాయేమో! నిజంగా కదిలే బస్సులో కూర్చుని బోలెడు కథలు వ్రాయవచ్చు!" పారిజాతం అంది.
మాటల సందడిలో స్నేహితురాళ్ళు గమనించలేదు కాని, తూర్పు తెలతెలవారుతున్నది.
ఏడు గంటలయేసరికి కమలాపురం ట్రావెలర్స్ బంగళా చేరింది బస్సు.
* * *
బంగళాకు ముందు ఒక జీప్, రెండు కార్లూ ఆగి ఉన్నాయి. జీపు రామనాథంది. ఒక కారు భద్రీ ప్రసాద్ ది. మరొకటి అంతకుముందు బంగళాలో దిగిన వాళ్ళది.
పిల్లలంతా బిలబిల్లాడుతూ సామాను దించ బోయారు. కాని ఇంతలో రామనాథం ఆ గుంపులో చెల్లెల్ని గుర్తుపట్టి, రమ్మని చెయ్యి ఊపాడు.
"ఏం, అన్నా! వదిన బాగుందా?" అంటూ దిగి, "మా అన్న రామనాథరావు. ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ గా ఉంటున్నాడు" అని సత్యవతి హెడ్ మిస్ట్రెస్ కు తన అన్నను పరిచయం చేసింది.
సత్యవతి అన్న హోస్పేటలో ఏదో పనిమీద ఉన్నాడని తెలుసునుగాని, డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉంటున్నా డని హెడ్ మిస్ట్రెస్ కు తెలియదు. ఈ సంగతి మొదటి సారిగా తెలుసుకొన్న హెడ్ మిస్ట్రెస్ కు సత్యవతి మీద అపారమైన ప్రేమ ఏర్పడింది.
రామనాథం టై సద్దుకొని ఇంగ్లీషులో ఇలా అన్నాడు: "సత్యా! నాన్న బాగున్నారా? నీతో తీసుకు రాలేకపోయావా? ఒంటరిగా ఊళ్ళో ఎట్లా ఉంటారు? సరేగాని, పిల్లల్ని సామాన్లు ఇక్కడ దించవద్దను. ఇక్కడ టి. బి. ఖాళీగా లేదు. ఇదుగో, ఈయన భద్రీ ప్రసాద్ గారని నా స్నేహితుడు. ఈయన మేడలో ఏర్పాట్లు చేయించాము. అక్కడ హాయిగా అన్ని వసతులూ ఉన్నాయి."
తరవాత భద్రీ ప్రసాద్ వైపు తిరిగి, "ఇదిగో నయ్యా, మా చెల్లెలు. 'అమ్మణ్ణి, అమ్మణ్ణి' అని కలవరించావుగా! సత్యా! నువ్వు నాతో ఇంటికి రాకూడదూ! వదిన రమ్మంటున్నది" అని అన్నాడు ఇంగ్లీషులోనే ఆయన తెలుగు పూర్తిగా మరిచినట్లున్నాడు.
ఆడపిల్లల నందరినీ కలయజూస్తూ నిండుగా నవ్వాడు భద్రీ ప్రసాద్. "ఏమన్నా చెప్పిడుసు, అమ్మన్ను లుండే అందం సూడీ!" అని అన్నాడు.
'చెప్పిడుసు' అన్న మాటకు పారిజాతం పెదవులు సన్నగా నవ్వాయి. పిల్లలు కొంతమంది కిసుక్కు మన్నారు.
అనుమతి కోసం హెడ్ మిస్ట్రెస్ వైపు చూసింది సత్య.
"కానీయండమ్మా! నీవూ, పారిజాతమ్మా లీడర్లుగా! పోదాం, పదండి. వాళ్ళేమన్నా అనుకోరూ!" అని హెడ్ మిస్ట్రెస్ అంది.
అంతా అదే బస్సులో భద్రీప్రసాద్ గారి మేడ చేరారు. చుట్టూ పూలతోట, మధ్య చక్కని బంగళా చెరువులో వికసించిన పద్మమల్లే ఉంది. పూలమొక్కలు చూస్తూనే పిల్లలు సంతోషంతో కేక లేశారు. హెడ్ మిస్ట్రెస్ అరుస్తున్నా వినిపించుకోలేదు.
నవ్వుతూ అంది పారిజాతం: "అమ్మాయిలూ! అవి ఇంకొకరి పూలమొక్కలు మనవి కావు. ఇంకొకరి పూలమొక్కల మీద చేతులు వేసి, ఈ పిల్లలకు మర్యాద తెలియదని అనిపించకండి. చూసి సంతోషించండి!"
మంత్రించినట్లు పిల్లలంతా వెనక్కి తగ్గారు. భద్రీ ప్రసాద్ కళ్ళూ, రామనాథం కళ్ళూ ఒకేసారి పారిజాతం వైపు తిరిగాయి. భద్రీ ప్రసాద్ కళ్ళలో మెప్పూ, రామనాథం కళ్ళలో ఉత్సుకతా కనుపించాయి. అనంత లక్ష్మి చూపులు మాత్రం రామనాథం మీదినుండి రావటం లేదు. రామనాథం పారిజాతంవైపే చూస్తున్నా డని గ్రహించి, దృష్టిని తనవేపు మరలించటానికి-"అబ్బబ్బా! మేడమ్! ఒళ్లంతా నొప్పులుగా ఉందండీ! తలంతా ఒకే నొప్పి, జ్వరం వచ్చేటట్లు ఉంది. నిలబడలేకుండా ఉన్నాను!" అంటూ చతికిలపడి కూర్చుంది.
భద్రీ ప్రసాద్ కంగారుగా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి, చెయ్యి చూశాడు. కొద్దిగా వెచ్చగా ఉంది ఒళ్ళు. అనంతలక్ష్మి ఒళ్ళెప్పుడూ వెచ్చగానే ఉంటుంది. కాని, ఈ సంగతి భద్రీ ప్రసాద్ గారి కెట్లా తెలుస్తుంది?
రామనాథంకూడా ఆవిడ దగ్గరికి వచ్చి, "లోపల, కాస్సేపు రెస్ట్ తీసుకోండి. తగ్గిపోతుంది. ఇదిగో హఫీజ్! రెండు శారిడాన్ టాబ్లెట్లు పట్టుకురా!" అని తన డ్రైవర్ ను పంపాడు.
