Previous Page Next Page 
మేఘమాల పేజి 6


    మైసూరుపాకును పంటితో కొరుకుతూ, 'నా శుభాకాంక్షలు స్వీకరించండి!' అన్నాడు.
    'కృతజ్ఞురాలిని!'
    'ముంద్గుగా చెప్పలేదేం?'
    'ప్రజంటేషన్ తెచ్చేవారా?' కిసుక్కున నవ్వింది.
    శకుంతలతో వచ్చిన చిక్కే అది-మొఖంమీద అడిగేస్తుంది!
    'ఏం తేగూడదా?'
    -ఇంకా డొంక తిరుగుడు దేనికి?
    'తేగూడదనేమున్నది?- నేను స్వీకరించాలే గాని!'
    'మీకు అభ్యంతరమా?'
    'అభ్యంతరం లేకపోవచ్చుగాని- అనవసరం! అంతే-అందుకే-అలాంటిది అనుమానించే ముందుగా చెప్పలేదు!'    
    శకుంతల వ్యక్తిత్వం అలాంటిది!
    -మరోసారి తనలాంటిదాన్నని చెప్పుకొన్నది!
    కాఫీ త్రాగాడు.
    స్నానంచేసి గుడ్డలు వేసుకునేటప్పటికి సాయంత్రం అయిదు గంటలయింది.
    బయటకు వస్తూ ఒక్కక్షణం సంశయించినా, 'ఈ రోజున మీ పుట్టిన రోజు పండుగన్నారు..... సరదాగా కాలక్షేపం చేద్దాం.....అలా బయటకు వస్తారా?' అడిగాడు-చాలా తగ్గుస్వరంలో.
    ఆమె చటుక్కున తలెత్తింది.
    తీక్షణంగా అతడి మొఖంలోకి చూస్తూ, 'అమ్మాయిలను వెంటవేసుకు తిరగటం మీకు సరదా అవ్వవచ్చు... కాని, ఆడవాళ్ళంతా మీరూహించినట్లు గానే వుంటారని కలలు మాత్రం కనబోకండి ... అందుకే మీ మొగాళ్ళంటే నాకు పరమ అసహ్యం... కాస్త చనువిస్తే చాలు...' గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది.
    సరిగ్గా ఆ సమయంలోనే-
    లోపలనుండి సన్నని రోదనస్వరం వినబడసాగింది!
    అలా ఏడుస్తున్నది-ప్రకాశం తల్లి! ఎందుకేడుస్తున్నది ఇప్పుడు?    
    -తను అలా ఆహ్వానించటాన్ని అనుమానించా?
    -రెండు నెలలక్రితం అకస్మాత్తుగా చనిపోయిన తమ కాధారమయిన పుత్రుడు ప్రకాశం గుర్తుకు వచ్చా?
    లేక-    
    ఇంటిలో అంత దుర్ఘటన జరిగి, ఇంకా ఆ విషాద వీచికలు ఆ యింటినుండి వీడకుండానే- తలంటుకొని, తీపి కొని తెచ్చుకొని తింటూ ఉల్లాసంగా తిరుగుతూ, అమాయకురాల్లా కనబడుతున్న కూతురు శకుంతల్ని జూచా?
    -తమ ముందు జీవితాన్ని గురించి భయంతోనా?
    ఏవో...
    త్యాగరాజు మొఖం నల్లగా మాడిపోయింది.
    'తొందరపడ్డాను!' గొణుక్కుంటూ మెట్లు దిగాడు.
    రోడ్డుమీదకు అయోమయంగా చూస్తూ -జరిగిన అవమానం నెత్తిమీద పడిన బరువైన బండలా అనిపించగా-భారంగా అడుగులు వేయసాగాడు!
    'ఛీ! ఛీ!... సిగ్గు లేకుండా... పరాయి స్త్రీని అలా అడగటంలో ఎంతో తొందర పడ్డాను!'
    ఆ క్షణంలో-ఈ ఊరు విడిచివచ్చిన తరువాత ఇన్నిరోజులకుగాను రాజేశ్వరి కళ్ళ ముందు కదిలింది.
    మనిషి తడబడ్డాడు...
    ఏదో చేయరాని అపరాధం చేసినట్లుగా కలవరపడిపోయాడు.
    'ఇన్నాళ్ళూ రాజేశ్వరి ఎందుకు గుర్తుకురాలేదు?' తనని తాను ప్రశ్నించుకున్నాడు.
    -అందుకు చాలా సిగ్గు పడ్డాడు గూడా!    
    తను రావటం-ప్రకాశం అకాల మృత్యువు- జాలిగొలిపే అతడి తల్లి చూపులూ-ఎటూ అర్ధంగాని శకుంతల-తీక్షణంగా రాజేశ్వరిని గురించి ఆలోచించకుండా చేసినయి- అప్పుడప్పుడూ వో క్షణం, అరక్షణం కళ్ళముందు మెదలినా!
    ఈ రోజున రాజేశ్వరికి జాబు వ్రాయాలి!    
    అనుకున్నదే తడవుగా వో కిళ్ళీ కొట్లో ఇన్ లాండ్ లెటర్ కొని మడిచి జేబులో పెట్టుకున్నాడు!
    అప్పుడు అతను కోటీలో వున్నాడు.
    హిన్నగా నడుస్తున్నాడు తలవంచుకొని.
    -రాజేశ్వరి ఎంతో బాధపడుతూ వుండి వుంటుంది!
    నిజంగా దానికి తానే బాధ్యుడు!
    క్షమాపణలతో వెంటనే జాబు వ్రాయాలి.
    పక్కగా జర్రున వెళ్ళినకారు షడన్ బ్రేక్ తో ఆగింది.
    'హలో మిస్టర్ త్యాగరాజూ!'
    -తాను ఉద్యోగం చేయబోయే కంపెనీ యజమాని!    
    'ఆలోచించకుండా తలుపుతీసుకు ముందుసీట్లో ఎక్కి కూర్చున్నాడు:
    కారు ముందుకు కదిలింది.
    'ఎప్పుడు జేరుదామనుకుంటున్నారు మీరు?'
    'రేపు ప
దిగంటలకు వద్దమనుకుంటున్నాను-మంచిది గూడా అప్పుడు!'
    'సరే! మంచిది.....ఇప్పుడు ఎక్కడ నుండి వస్తున్నారేం మీరు?'
    చిన్నగా నవ్వాడు త్యాగరాజు: 'ఏఁవీ తోచక గాలికి తిరుగుతున్నాను!....ఇంతలో మీరు కలిశారు!' ఒక్కక్షణం ఆగి, 'ఏ పనీ లేకపోయినా పొద్దుపోవటమూ కష్టమే!' మరోసారి నవ్వాడు.
    ఆయన నవ్వాడు.
    'క్షమించాలి....ఇంతవరకూ మీపేరు నాకు తెలియదు!'
    'జయరాం!'
    యాబిడ్స్ సెంటర్ ను కారు దాటింది
    'హైద్రాబాద్ కు కొత్తగా వచ్చాం మీరు?'
    'అవునండీ!'
    'అయితే చూడవాల్సిన వన్నీ చూచారా?'
    'ఇంకా లేదండీ!'
    త్యాగరాజు చిన్నగా నవ్వాడు.
    'జయరాం చాలా మంచివాడిలా వున్నాడు!' -త్యాగరాజును ఆ ఆలోచన మత్తెక్కించింది.
    అనుకోకుండా వో స్త్రీ ఏడుస్తున్న శబ్దం వినపడింది. ఎంతోసేపటినుండి దుఃఖిస్తున్నట్లున్న ఆమెకు 'ఎక్కు'వచ్చి పెద్దగా శబ్దమయింది...
    ముందు కూర్చున్న ఇద్దరూ వులిక్కిపడి ఒక్కసారిగా వెనక్కు తిరిగారు.
    -వో స్త్రీ మొఖంనిండా గుడ్డ కప్పుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది.
    'ఏఁవిటది? ఎందుకు ఏడుస్తున్నావు?' ఆదుర్దాగా అడిగాడు జయరాం.
    ఆ స్త్రీ మెడ మ్రోత అయ్యలా తల ప్రక్కకు తిప్పింది.
    అలా తిప్పటంలో మొఖంమీదగా కప్పుకున్న గచ్చకాయరంగు టెర్లిన్ చీర కొద్దిగా పక్కకు తొలిగింది ఒక్కక్షణం!
    ఆ ఒక్కక్షణంలోనే త్యాగరాజు నెత్తిన పిడుగుపడింది!
    అతడికి వళ్ళంతా చెమటలు పట్టింది.
    -ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్లనిపించింది.
    'జయరాంగారూ! కారు ఆపండి నేను దిగుతాను!' అన్నాడు త్యాగరాజు-మరేం చేయాలో తోచక!
    జయరాం అయోమయంగా కారు పక్కకు తీసి ఆపి వింతగా వారిద్దరివంకా చూస్తూ వుండిపోయాడు.
    త్యాగరాజు బిగుసుకుపోయిన మొఖంతో కారు దిగి పెద్ద పెద్ద అంగలువేయసాగాడు.
    -అలా అతడు కారు దిగుతున్నప్పుడు లోపల వెనుకగావున్న ఆ స్త్రీ ఏడుపు మరింత పెద్దదయింది...
    త్యాగరాజు మరో ప్రపంచంలో నడుస్తున్నాడు!...
    -రాణి ఇక్కడెలా వున్నది?

                                   4

    త్యాగరాజు - ఎటు నడుస్తున్నాడో గూడా ఆలోచించకుండా, పరిసరాలు గమనించకుండా ముందుకు నడుస్తున్నాడు. మనిషి కాళ్ళ ఆధీనంలోకి దిగజారి పోయాడు- అతడి గమనం అతడికే తెలియటం లేదు!
    మత్తులో ముణిగిపోయిన మనిషికి-పరిసరాలే గుర్తులేనట్లు -త్యాగరాజు మత్తుగా భయంగా ముందుకు నడుస్తున్నాడు...
    చంపల తాకుతూ దొర్లుకుపోతున్న చల్లనిగాలికి త్యాగరాజు ఉలిక్కిపడ్డాడు.
    -మరుక్షణంలోనే నల్లని ఆకాశం చిల్లులు పడ్డట్లుగావున్న నక్షత్రాలు, ఎక్కడో లీలగా మ్రోగుతున్న గజ్జల మ్రోతలా హుస్సేన్ సాగర్ అలల కదలిక, రోడ్లకు తెల్లటిరంగు పులుముతున్న మెర్క్యురీ లైట్లు-పరిసరాలను అతడికి గుర్తుచేసినయి.
    ఆ టాంక్ బండ్ మీద-పేవు మెంటు మీదగా కొంత దూరం నడిచి, ఖాళీగా వున్న నో కొయ్య బెంచీమీద కూర్చొని -మెలికలు తిరిగిపోతున్న ఎర్రని నియాన్ లైట్లను నీళ్ళ అలల్లోచూస్తూ ఉండిపోయాడు త్యాగరాజు.
    రాణికి జయరాంకుఉన్న సంబంధ మేఁవిటి?
    సుందరమూర్తి ఏఁవయ్యాడు?
    ఆ- ప్రశ్నలు త్యాగరాజును ఉక్కిర బిక్కిరి చేస్తున్నయి!
    ఎంతగామర్చిపోదామనుకున్నా, గుండెను ఎంతగా నిబ్బరపరుచుకుందామనుకున్నా-అంతకు క్రితం జయరాం కారులో, ముసుగు కప్పుకొని ఏడుస్తూ కనబడిన రాణిని మర్చిపోలేక పోతున్నాడు!
    అంతకుముందు అటుగా రెండుసార్లు తిరిగిన బీటు కానిస్టేబుల్-పన్నెండు గంటలయినా కదలని త్యాగరాజునుచూచి అతడేఁవయినా అఘాయిత్యానికి తలపడతాడేఁవోననే అనుమానం కలగగా అతడికి దగ్గరగా వచ్చి బుజం తట్టాడు.
    త్యాగరాజు ఉలిక్కిపడి లేచి నిల్చున్నాడు.
    ...క్యాసాబ్.....క్యోంభైఠాయిధర్?...
    త్యాగరాజుకు అర్ధం కాలేదు.
    -కాని ఏదో తెలుసుకున్నవాడిలా వడి వాడిగా రోడ్డుదాటి కోటీ వైపుకు వెళుతూ అప్పుడే ఆగిన డబుల్ డెక్కర్ బస్సులో ఎక్కి కూర్చొని - ఒక్కసారి తనను తట్టిలేపిన పోలీసు జనాన్ని, తన చేతి గడియారాన్ని చూచుకొని ఉలిక్కిపడ్డాడు.
    అయింది పన్నెండు గంటలు!
    ఇప్పుడు శకుంతలను లేపాలి!
    శకుంతల అనుకునేటప్పటికల్లా - అతడు యింటినుండి బయల్దేరేటప్పుడు జరిగిన సంఘటనా - ఆ పైన అప్పటి శకుంతల మొఖమూ గుర్తుకువచ్చినయి- అతడు మరింతగా నీరసపడిపోయాడు!
    కోటీలో ఎక్కుతున్న జనాన్ని తోసుకుంటూ బస్సు దిగాడు.
    అప్పుడు మళ్ళా ఇంటికివెళ్ళే బస్సు కోసరం నిరీక్షించలేకపోయాడు.
    పోతున్న రిక్షాను ఆపి ఎక్కి కూర్చున్నాడు.
    వెలుగుతున్న లైటును చూస్తూ - వింత వింత ఆలోచనలతో- వెళ్ళి తలుపు తట్టాడు.
    ఇంకా శకుంతల మెళుకువతోనే వున్నదా?
    అతడి ఊహ నూరుపాళ్ళూ నిజమయింది!
    శకుంతల తలుపు తీసింది.
    పక్కకు ఒత్తిగిల్లుతూ, 'పిక్చర్ కు వెళ్ళారా?' చాలా సౌమ్యంగా అడిగింది.
    'లేదు!' తలెత్తకుండానే జవాబిచ్చాడు.
    'నామీద కోపంతో రోడ్లన్నీ తిరిగారన్నమాట!' నవ్వింది చిన్నగా.
    'దేనికి?'
    'మరేం చేయాలో తోచక!'
    తడబడ్డాడు త్యాగరాజు.
    'మీమీద నాకు కోపం దేనికి?' అన్నాడు. మొఖం చిట్లించి ఆమె ముఖంలోకి చూస్తూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS