"పో ! అల్లరి దానా! మరీ ఇంత దారుణంగా మాట్లాడావంటే , నీ నోరు నోక్కేస్తాను. దాని మాటలు లక్ష్య పెట్టకు రవీ! శుద్దీ బద్దం లేకుండా వాగుతుంది. నువ్వు కూడా రా!"
రవి మొహం వాల్చుకొన్నాడు.
"మీరు వెళ్ళండి అక్కయ్యగారూ! నాకింకా పని ఉంది." నెమ్మదిగా అన్నాడు.
బయటి నుంచి ప్రకాశరావు కేక పెట్టాడు. అరుంధతి వెళ్ళిపోయింది.
కొద్ది క్షణాలా గదిని నిశ్శబ్దం ఆవరించింది.
తార లేచి "వెడుతున్నాను. మా యింటికి రా! నా బట్ట లిస్తాను" అంది.
తార తన నేకవచనంలో సంబోధించడం గమనించాడు రవి.
ఆమె వంక గ్రుచ్చి చూస్తూ "ఎప్పుడు రమ్మంటారూ?' అన్నాడు. "రూ" దగ్గిర వత్తి పలుకుతూ.
"నీ యిష్టం! సారీ! నిన్నేకవచనం లో పిలుస్తున్నాను కదూ! నువ్వు మాత్రం నన్ను మీరనే మన్నించు. ఎందుకంటె, నువ్వు నాకంటే చాలా తక్కువ వాడివి. ఒక్క నా కంటేనే ఏమిటీ? లోకంలో అందరి కంటే తక్కువ వాడివి."
రవి కళ్ళు రోషంతో భగ్గుమన్నాయి. అతి ప్రయత్నం మీద కూడగట్టుకొన్న అతని సహనం నశించింది. ఆ ప్రయత్నంగా ఒకడుగు ముందుకు వేసి నేను మిమ్మల్ని "మీరు" అని పిలవను. "ఒసేయ్!" అని పిలుస్తాను." అన్నాడు.
ఆ ప్రయత్నంగా తన నోటి నుండి వెలువడిన ఈ మాటలకు తనే హడలి పోయాడు రవి. బెంబేలుగా తార వంక చూశాడు. ఆ కళ్ళు నవ్వుతున్నాయి. అందంగా, ఎంతో అందంగా, అందాలన్నింటి కంటే అందంగా నవ్వుతున్నాయి. ఆ కళ్ళలోకి చూస్తూ తనను తానూ మర్చిపోయాడు.
"ఈ జన్మలోనే?!" ఆశ్చర్యం నటిస్తూ అంది తార.
రవి తలవంచుకున్నాడు. అతని కళ్ళలో అకారణంగా నీళ్ళు నిన్డుకోన్నాయి.
"నన్ను క్షమించండి తారాదేవీ!" దీనంగా అన్నాడు. ఆ స్వరమూ, నీళ్ళు నిండుకొన్న కళ్ళూ, తారకు కనీసం అభినయం కూడా సాధ్యం కాకుండా చేసాయి. ఆర్ద్రస్వరంతో "ఇందులో క్షమార్పణ ప్రసక్తి ఏముందీ? మీ తప్పేముంది?" అంది.
రవికి తనేం మాట్లాడుతున్నాడో తనకు తెలియలేదు. "దేవకన్యలు మీరు! మీ పాదాలు పూజించటానికైనా అర్హత లేనివాడిని. మిమ్మల్ని అపహసించటమా?"
తనపట్ల అతని ఆరాధనా భావానికి తార విస్తుపోయింది. కరుణ నిండిన స్వరంతో "దేవతలూ, దెయ్యాలూ పసిపిల్లల కధల్లోకి వస్తారు. మనుష్యులలో దేవతలనో, దెయ్యాలనో చూసేవారు. పసిపిల్లల స్థాయి నుంచి పెరగలేదన్న మాట! ఆత్మ గౌరవం లేని మంచితనం బూడిద లో పోసిన పన్నీరు, చేతకాని తనానికి రూపాంతరమయిన ఆ మంచితనం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే! ఎదుటి వ్యక్తుల్ని గౌరవించటమంటే , వాళ్ళకు బానిసలు కావటం కాదు. అది మనసు మనం అవమానించు కోవటం !" అంది.
రవి బరువుగా నిట్టూర్చాడు.
"మీరు చెప్పిన మాటలన్నీ కడుపు చల్లబడిన తరువాత వచ్చే ఆలోచనలు! కడుపు నక నకలాడుతుంటే, అన్నం తప్ప ఇంకేదీ గుర్తు రాదు."
"ఆత్మగౌరవాన్ని వెల పెట్టి కడుపు నింపుకొనే కంటే, ఆకలితో మాడటమే , వెయ్యి రెట్లు నయం."
"ఆకలి , బాధ తెలియని మీతో వాదించి ప్రయోజాన మేమిటీ?"
తార దీనమైన అతని కళ్ళలోకి చూసింది. ఆడవాళ్ళ కళ్ళని బెదరిన లేడి చూపులతో వర్ణిస్తారు. రవి కళ్ళు అచ్చంగా అలా ఉంటాయి. నిండైన అతని విగ్రహం ఆ చూపులలోని లాలిత్యాన్ని క్రమ్మివేసేటంత దృడమైంది. అతని నూనూగు మీసాలాతని చిరునవ్వు లోని మెత్తదనాన్ని కనపడనీయవు.
"అయినా , ఆకలితో మాదవలసిన అవసరమేముందీ? మీఅత్మగౌరవానికీ భంగం కలగ కుండా మీ ఉద్యోగం మీరు చేసికోలేరా?"
"తారాదేవీ! మీరు తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో అర్ధంచేసుకో లేకుండా ఉన్నాను. ఎప్పుడయినా, ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ చేంజి ఆఫీస్ చూసారా? ఎంత పెద్ద క్యూ ఉంటుందో? బి.ఏ లూ, ఏం.ఏ లూ నిరుద్యోగులుగా ఉండి , చివరకు విసిగి చిన్న ఉద్యోగాలకు కూడా సిద్దపడ్తున్న రోజులలో మెట్రిక్ గాడి నెవరు చూస్తారండీ? ఈ ఉద్యోగానికి నాతొ పాటు ఇంకో యాభై మంది వచ్చారు. అందులో బి.ఏ లు కూడా వున్నారు. ఎంతో బ్రాతిమాలిన మీదట, ప్రకాశరావు గారు కొంత అయిష్టంగానే , నాకీ ఉద్యోగమిచ్చారు. నాకీ ఉద్యోగ మెంత అపురూపమో అయనకు తెలుసు! అందుకే నన్ను పూర్తిగా ఉపయోగించుకొంటున్నారు. ఇందుకు నేను బాధపడనా? కానీ, బాధ పది ప్రయోజన మేముందీ? ఈసృష్టిలో కొందరు అదృష్ట వంతులు, మరికొందరు దురదృష్టవంతులు , కొందరు భాగ్యవంతులు, మరి కొందరు దౌర్భాగ్యులు ఉండడం సహజమే కదా!"
తార మనసు బాగా వికల మయింది. గద్ద్గద స్వరంతో "మీరు మెట్రిక్ తో ఎందుకు ఆపేశారు? అదీ ఒక చదువేనా?" అంది.
ఇంతసేపటికి రవికి తార దగ్గిర జంకు పూర్తిగా తగ్గిపోయింది.
"గొంతెమ్మ కోరికల గాలిమేడలు నిర్మించటం నాకు మొదటి నుంచీ అలవాటు లేదు. ఎంద రెందరినో ఆశ్రయించి, ఎన్నెన్నో మాటలు పడి తిని తినక ఇంతవరకూ వచ్చాను. ఇంక పై చదువు సంగతి అసలు ఆలోచించ లేదు. ఏదో ఒక ఉద్యోగమూ దొరికితే, చాలనుకోన్నాను. కానీ, నా ఉద్యోగం మీరు చూస్తున్నారు కదా? చదువుకొనేటంత తీరిక దొరకటం , పూర్తిగా అసంభవం. పైగా నాకు జీవితంలో అంత ఆసక్తి కూడా లేదు."
"ఎందుకు లేదు?"
"జీవితమంటే ఏమిటీ? ఒక్కడూ, ఏ ఎడారి లొనొ ఉంటె, అసలతని జీవితానికి అర్ధమే లేదు కదా! ఒక వ్యక్తీ తన పరిసర వ్యక్తులతో ఏర్పరచుకొన్న వివిధానుబందాల విన్యాసమే కదా, జీవిత చిత్రం! మరి ఈ జీవితం పట్ల నాకు ఆసక్తి ఎలా ఉంటుంది? నేను అందరికీ ఎంత ఒదిగి ఉంటున్నానో, అంత అజ్ఞాపిస్తున్నారు. ఎంత గౌరవిస్తున్నానో , అంత అసహ్యించుకొంటున్నారు. అందరూ అంతే! చివరకు.... చివరకు మీరు కూడా నన్ను అసహ్యించు కొంటున్నారు." తార మృదువుగా నవ్వింది.
"ఇలా చూసి చెప్పండి! నేను మిమ్మల్ని అసహ్యించుకొంటున్నానా? నావల్ల నీ మనసు కంత బాధ కలుగుతుందా?"
రవి తార వంక చూసాడు. ఎంత కాంతితో మెరిసిపోయే ఆమె కళ్ళు తనలో ఏదో శక్తిని నింపుతున్నాయా, అనిపించింది.
"మీ మాటలు నా మనసును చిత్రవద చేస్తాయి. అయినా, మీ సాన్నిధ్యం కోరకుండా ఉండలేను."
"ఇదేమిటి?"
"నేను చెప్పలేను. మీలో ఏదో ఉంది."
"హమ్మయ్య! ఏదో ఉందని అర్ధం చేసుకున్నారు కదా? ఆ ఏదో, ఏమిటో నేను చెపుతాను వినండి. అది మీ పట్ల నా సానుభూతి."
రవి స్తబ్ధుడై చూస్తుండగానే తార నవ్వుతూ వెళ్ళిపోయింది.
3
మనోరంజని , సుందర్రావు స్వయంగా వచ్చి మనోరంజని పుట్టిన రోజు పార్టీకి , అరుంధతీ ప్రకాశరావు లకు ఆహ్వానాలిచ్చి వెళ్ళారు. మనోరంజని వారం రోజుల కొకసారయినా , ఏదో వంకతో పార్టీ ఏర్పాటు చేస్తుంది. లేకపోతె వీరువాల నిండా మూలుగు తున్న ఆవిడ ఖరీదైన చీరలకూ, పెట్టెల నిండా మూలుగు తున్న ఆవిడ నగలకూ సార్ధక్య మెలాగ?
ఒక్కసారి వెళ్ళేసరికే పూర్తీ పాశ్చాత్యపద్దతిలో నడిచే ఈ రకం పార్టీలంటే అరుంధతికి మొహం మొత్తెసింది. కానీ, ప్రకాశరావు కు ఈ రకమైన పార్టీలంటే చాలా ఇష్టం. భర్త బలవంతం మీద అప్పుడప్పుడు వెళ్ళినా, చాలావరకు మానెయ్యడానికి ప్రయత్నించేది అరుంధతి.
ఈసారి తప్పక రావాలని మరి, మరి చెప్పారు మనోరంజని, సుందర్రావులు. అరుంధతి ఏదో కధ వ్రాసుకొంటుంది. మధ్యలో విడిచి, వెళ్లాలని లేదు.
"ఏమిటి? కాగితాలు ముందేసుకుని కూర్చున్నావా?" తొందరగా బయలుదేరు!"
తొందరపెడ్తూ అన్నాడు ప్రకాశరావు.
అరుంధతి విసుగ్గా చూసింది. "ఆ వెధవ పార్టీకి నేను రాకపోతేనేం?" మీరు వెళ్లివద్దురు"
"ఏమ్మన్నావ్! వెధవ పార్తీయా? సుందర్రావు ఎప్పుడూ వెధవ పార్టీ లియ్యడు. ఈసారి కాక్ టెయిల్ కూడా ఉంటుందన్నాడు. తాందూర చికెన్, లిడో నుంచి తెప్పిస్తున్నాడుట! కొంతమంది కి ప్రత్యేకం!"
"ఆ పేర్లు వింటేనే, కడుపు లో తిప్పుతుంది"
"నువ్వు తినకు! కేక్స్, గులాబ్ జాం , కాజా పకోడీ...."
'అబ్బ! నాకేమీ వద్దు. రెండు మూడు గంటల సేపు నాకాలాన్ని వాటి కోసం వృధా చేసికొనేటంత అపురూపమైనవి కావు నాకవి".
ప్రకాశరావు కు కోప మోచ్చింది.
"కాలం! కాలం! ఏం చేస్తావు నువ్వు కాలంతో? ఈ లేనిపోని చెత్తంతా వ్రాయటమే కదా? ఏమొస్తుంది నీకు ఈ వ్రాతలలో , ఆ పాతికో, పరకో నేనిచ్చుకొంటానులే?"
"డబ్బు కోసం ఎవరూ వ్రాయరు? నా సంతోషం కోసం నేను వ్రాసుకొంటాను."
"అక్కడ హాయిగా నలుగురితో సంతోషంగా గడపకుండా ఇక్కడ ఒక్కదానివీ కూర్చొని గీకుతుంటే, సంతోషమా? ఆ వ్రాసింది కాస్తా తిరిగొస్తే, ఏడుస్తూ కూర్చున్నప్పుడు, ఆ సంతోషం ఇంకా మజాగా ఉంటుంది." వెక్కిరిస్తూ అన్నాడు ప్రకాశరావు.
అరుంధతికి ఒళ్ళు మండింది. "ఒక్కొక్కరికి ఒక్కొక్క దానితో సంతోషం ఉంటుంది. కొన్ని కొన్ని ఏడుపులు కూడా హాయిగానే ఉంటాయి వాటిల్లో ఇదొకటి!"
ప్రకాశరావు కు చిరాకేక్కువయింది.
"నేను చెప్తున్నాను ఆరూ! నువ్వివాళ నాతో రావాలి. అక్కడికి చాలామంది వస్తున్నారు. వాళ్ళందరికీ నిన్నుసగర్వంగా పరిచయం చెయ్యాలనుకొంటున్నాను. ప్లీజ్!" అంటూనే అరుంధతి ముందున్న కాగితాలు తీసేసి ద్రాయర్లో సర్దేసి, అరుంధతిని చెయ్యి పట్టుకొని లేవదీసాడు . అరుంధతి కి బయలుదేరక తప్పలేదు.
