Previous Page Next Page 
గూడు చేరిన పక్షులు పేజి 6


                                      3
    ఆ రోజు నుండి వాణి సలహా పాటించాను. ప్రతిరోజూ కన్న ముందుగా లేచి నిత్యకృత్యాలు పూర్తిచేసుకుని నాన్నగారితో భోజనానికి కూర్చున్నాను. నా ముఖంలోని మార్పును గమనించి నాన్నగారు సంతోషపడ్డారు.
    'ఏమ్మా! ఈ రోజు త్వరగా లేచినట్లుందే!'
    'అవును నాన్నారూ......రోజూ యిలాగే లేస్తాను..'    
    'సంతోషంగా నవ్వుతూ, ప్రేలుతూ హుషారుగా కూడా వున్నావు. ఏమిటమ్మా కారణం....? నీ ముఖంలో ఈ సంతోషం చాలా కాలానికి చూస్తున్నాను.'
    'ఏం లేదు నాన్నారూ! ఊరికే పని లేకుండా ప్రోద్దస్తామానం పడుకోవడం... గదిలో ఒంటరిగా కూర్చుంటూ ఉండడం పిచ్చి పిచ్చి ఆలోచనలతో చీకాకు కలుగుతూ ఉంది. ఈరోజు నుండి మళ్ళీ హాస్పిటల్ కు రావాలను కుంటున్నాను.... మీకు కూడా....' నా మాట పూర్తీ కానివ్వకుండానే అందుకున్నారు నాన్నగారు.
    'తప్పకుండా రా తల్లీ! ప్రసాదు వెళ్లి పోయాడు. అతను వెళ్ళిన దగ్గర నుండి నీవు కూడా రావడం మానేశావు. ఒక్కడినీ యిబ్బంది పడుతున్నాను. నిన్ను యిబ్బంది పెట్టడం యిష్టం లేక ఈ విషయం నీతో చెప్పలేదు. ఇప్పుడు నీ అంతట నీవే వస్తానంటున్నావు. చాలా సంతోషం.... త్వరగా తెములు... వెడదాం....'
    భోజనాలు పూర్తీ చేశాము. నేను బట్టలు మార్చుకొని వచ్చేసరికి నాన్నగారు సిద్దంగా ఉన్నారు. ఇద్దరమూ కారులో మా నర్సింగ్ హోం కు వెళ్ళాము. చాలామంది పేషెంట్లు అప్పటికే డాక్టరు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇద్దరమూ ఎవరి రూములోకి వాళ్ళం వెళ్ళాము. ప్రసాదు ఉండగా జరిగిన ఏర్పాటు యిది. నాన్నగారి రూములో ప్రసాదు నాన్నగారి సలహాలతో ప్రిస్కిప్షను వ్రాయడం . పేషెంట్ల ను ఎగ్జామిన్ చేస్తూ నాన్నగారికి రిపోర్టు చేయడం. మరొక గదిలో నేను ఆడవాళ్ళను చూడడం. నాకు తోచని కేసును నాన్నగారి దగ్గరకు పంపించడం. కొంతకాలం ఈ విధంగా జరిగింది. తదుపరి నాన్నగారు బాధ్యతలన్నీ ప్రసాదు పై ఉంచారు. వారు రావడం కూడా మానేశారు. మేమిద్దరమే వస్తూ ఉండేవాళ్ళం. నాకు అర్ధం కాని కేసుల నన్నింటినీ చురుకుగా తెలియ చెపుతూ ఉండేవారు ప్రసాదు.
    'గుడ్ మార్నింగ్ డాక్టర్! ఒక్కొక్కరినీ లోపలికి పంపించమంటారా?'
    నా ఆలోచనలకూ అంతరాయాన్ని కలిగించింది నర్స్ రాధ. రాధ నాకన్న ఒకటి రెండు సంవత్సరాలు చిన్న. అయినా సహనం, చురుకుతనం, చొరవ ఈ సద్గుణాలన్నీ ఆమె సొత్తు.
    'మార్నింగ్ రాధా! ఏమిటి విశేషాలు?'
    'ఏమున్నాయి? ప్రసాదు గారు వెళ్ళిపోయినప్పటి నుండీ మీరు కూడా హాస్పిటల్ కు రావడం మానివేశారు. వారు వెళ్ళడం ...మీరు మానడం... నాన్నగారికి వత్తిడి ఎక్కువైంది. ఏంతో మంది పేషెంట్లు రావడం మానేశారు; ఆలస్యం జరుగుతూ ఉన్నందువల్ల. ఒక్కరు ఎంతమందిని చూడగలరు? ఈరోజు మీరు మళ్ళీ రావడం మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది. మళ్ళీ హాస్పిటల్ ఎక్కువమంది పేషెంట్ల తో కళకళ లాడుతుందని ఆశిస్తాను.'
    'సరే ఒక్కొక్కరిని లోపలికి పంపించు.'
    రోగులు వరుసగా రాసాగారు. వారిని పరీక్ష చేస్తూ ప్రిస్క్రిప్షన్ వ్రాయడంతో కాలమే తెలియలేదు నాకు. పేషెంట్లు పల్చబడ్డారు. ఒక్క క్షణం విశ్రాంతి గా కుర్చీలో వెనకకు వాలి కూర్చున్నాను. ఇంతలో ఒకమ్మాయి గాభరా పడుతూ లోపలికి వచ్చి నా కాళ్ళు పట్టుకుని భోరున ఏడవసాగింది. ఆ అమ్మాయి వెనకనే రాధ కూడా వేగంగా లోపలికి వచ్చింది.
    'లేమ్మా....సంగతేమిటో చెప్పు. భయపడకు నేనున్నాగా!'
    మెల్లిగా లేవనెత్తి ఎదురుగా కుర్చీలో కూర్చో బెట్టాను. ఏడుపు కొద్దిగా మానింది. ఎక్కిళ్ళు మాత్రం తగ్గలేదు. ఏడ్చి..ఏడ్చి ...నీటితో చారలు కట్టి ఉన్నాయి కళ్ళు. వయసు సుమారు పన్నెండు, పదమూడు మధ్యలో ఉంటుంది. యౌవ్వనం ప్రారంభ దశలో ఉంది. యెర్రని రంగు చింపిరి జుట్టు . మాసిన గుడ్డలు చూడడానికి అసహ్యంగా ఉన్నాయి. అయినా ఆ ముఖంలో మాత్రం కళ ఉట్టిపడుతూ ఉంది, చూడడానికి ముచ్చటగా ఉంది. ఆ అమ్మాయి ఏడ్పు తగ్గిపోయింది. భయం కూడా తగ్గిన సూచనలు కనిపించాయి.
    'ఇక చెప్పమ్మా! ఏం జరిగింది? ఎందుకలా ఏడుస్తున్నావు? తప్పు కదూ! అలా ఎడ్వవచ్చా........?'
    "ఏం చెయ్యమంటారు? అమ్మకేమో జబ్బు ఎక్కువైంది. నాన్నేమో పట్టించుకోడు. పైగా రాత్రిళ్ళు త్రాగి వచ్చి వండలేదని . తను రాగానే వడ్డించలేదనీ తంతాడు. ఈ మధ్య బొత్తిగా నీరసించి పోయింది అమ్మ. మంచం మీద నుండి కూడా సరిగా లేవలేక పోతూ ఉంది. నాన్న రాత్రి కూడా తాగి వచ్చాడు. నేను వంట చేశాను. భోజనానికి కూర్చున్నాడు.... తింటూ తింటూనే కంచం ఎత్తేశాడు; వంటకాలు బాగాలేవని నన్ను తిట్టాడు. అమ్మను మంచం పై నుండి లేపి కాలితో తన్నాడు. ఎటో వెళ్ళిపోయాడు. రాత్రి నుండి అమ్మ మాట్లాడడం లేదు. జ్వరం పేలిపోతూ ఉంది. మీరు రక్షించాలి." ఎక్కిళ్ళు పెడుతూ అంతవరకూ చెప్పి మళ్ళీ కాళ్ళ మీద పడబోయిందా అమ్మాయి. ఆ అమ్మాయి ప్రయత్నాన్ని వారించాను. నాన్నగారితో చెప్పి రాధను వెంట తీసుకొని ఆ అమ్మాయి దారి చూపిస్తూ ఉండగా కారులో వెళ్ళాను.
    అక్కడ పరిస్థితిచూసిన తర్వాత నా మనసు ఎంతో బాధపడింది, జాలితో నిండి పోయింది. ఇల్లు మామూలుగా ఉంది.... పెంకుటిల్లు .....చాలా పాతది. గోడలకు సున్నం ఊడిపోయి మరకలుగా ఉంది. ఇంటి నిండా చెత్త చెదారమూ అంతా అపరిశుభ్రంగా ఉంది. ఒక గది.... ఆ గది ప్రక్కగా యింకొక చిన్నగది. అది బహుశా వంటగది అయి ఉంటుంది. పొగచూరి బూజు వేళ్ళాడుతూ ఉంది. పెద్ద గది మధ్యలో కుక్కి మంచం లో ముప్పై ఏళ్ళు దాటిన పడతి పడి ఉంది. ఆమెనే ఈ అమ్మాయి తల్లి అని ఊహించాను. దగ్గరకు పెళ్ళి చూశాను.... పరీక్ష చేశాను. జ్వరం తీవ్రంగా ఉంది. పైగా గర్భవతి కూడా! నీరసం వల్ల సరైన పోషణ లేక రక్తం తక్కువగా ఉంది. ఆ అమ్మాయి చెప్పినట్లుగా స్పృహ తప్పి పడిపోయి ఉంది. జాగ్రత్తగా పరీక్ష చేసి, ఆ అమ్మాయి వైపు తిరిగి.

             
    'అమ్మాయి....! ఇటు చూడమ్మా....నీ పేరేమిటి?'
    దీనంగా తలవంచుకొని గాభరా వల్ల బాధ పడుతూ ఉన్న ఆ అమ్మాయిని ప్రశ్నించాను.
    'నాపేరు లక్ష్మీ.... అమ్మ పేరు కమల.'
    'చూడమ్మా లక్ష్మీ....! మీ అమ్మకు ప్రాణ భయమేమీ లేదు. ఈ పరిస్థితిలో మీ అమ్మను యిక్కడ ఉంచడం మంచిది కాదు. ఆస్పత్రికి తీసుకు వెడదాం. ఒకటి రెండు రోజులలో నయమౌతుంది. ఏమంటావ్?'
    సూటిగా నా కళ్ళల్లోకి చూడలేక, తల ఒంచుకొని మెల్లిగా డాక్టరు గారూ! మేము పేదవాళ్ళం. ఏమీ యివ్వలేము. మీకు ఆ మాట ఎలా చెప్పాలో తోచడం లేదు.'
    పై మాట లంటూ ఆ అమ్మాయి తన దృష్టిని తల్లిపై ఉంచింది. తల్లి చేతికి ఉన్న జత బంగారు గాజులపై ఆ అమ్మాయి చూపు అకస్మాత్తుగా నిలిచింది. వెంటనే వాటిని ఆమె చేతి నుండి తీసి నా పాదాల ముందు ఉంచింది.
    'వీటిని మించి మా వద్ద ఏమీ లేవు. ఇక మీరే దిక్కు -- మా అమ్మను కాపాడండి. ఇక ఆ భారమంతా మీదే!'
    'ఇప్పుడవన్నీ ఎందుకమ్మా? ముందు అమ్మను అప్సత్రికి చేర్చుదాం. ఆ తర్వాత ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం....'
    రాధ...నేను ఆ అమ్మాయి సహాయంతో కమలను కారులో చేర్చాను. హాస్పిటలు చేరిన తర్వాత స్రైచ్చర్ సహాయంతో ఆమెను బెడ్ పై చేర్చాము. ఆలస్యం జరుగకుండా ఆమెకు చేయవలసిన చికిత్స నాన్నగారి సహాయంతో జరిపి నా గదికి వచ్చాను. లక్ష్మీ నన్ను అనుసరిస్తూ వచ్చి నేను కూర్చోగానే గాజుల జత తీసుకొమ్మని చూపించింది.
    'నీ దగ్గరే ఉంచమ్మా.'
    'వద్దండీ! నా దగ్గర ఉండడం మంచిది కాదు. నాన్న చూస్తె గుంజుకుంటాడు. ఈ ఆపత్సమయంలో మాకు అవి తప్ప ఆస్కారం లేదు. దయచేసి మీ దగ్గరే ఉంచండి.' అని ఒక్క క్షణం ఆగి మళ్ళీ 'అమ్మకు తప్పకుండా నాయమౌతుందంటారా?'ఆ గాజులు నాచేతికిచ్చి బాధగా నన్ను చూస్తూ ప్రశ్నించింది.
    "ఏం ఫర్వాలేదమ్మా! రెండు మూడు గంటలలో తెలివి వచ్చి నీతో మాట్లాడుతుంది కూడా! ఏం భయపడకు ....' గాజుల నందుకుంటూ ధైర్యం చెప్పాను.
    ఒకటి రెండు రోజులలో కమలకు కొద్దిగా కులస చిక్కింది. మరొక నాలుగు రోజులు గడిచాయి. కమలకు క్రమంగా ఆరోగ్యం చెకూర నారంభించింది. ఒకరోజు ఇన్ పేషంట్లను మామూలుగా పరీక్ష చేస్తూ రాధకు మందులు వాడే విధానాన్ని వివరించ సాగాను. కమల ఉన్న గది నుండి ఏవో కేకలు వినిపించి ఆదుర్దాగా అటు వైపు నడిచాను. అక్కడి దృశ్యం హృదయ విదారకంగా కనుపించింది.
    'నీకు రోగం కుదిరింది గదే....! ఇంటికి వచ్చేయ్! నాకేవడు వండి పెడతాడనుకుంటున్నావు? బద్మాష్ ....చంపేస్తాను. ఎమనుకుంటూన్నావో?'
    ఎర్రటి కళ్ళు, చింపిరి జుట్టు, మాసిన గుడ్డలు... అంతా రవుడీ వేషం త్రాగిన మైకం లో మంచం పై ఉన్న కమలను చేయి పట్టి బలవంతంగా లాగుతున్నాడు. అతనిని సీత భర్తగా ఊహించాను. బాగా త్రాగిన మైకం.... తూలుతున్నాడు... వణుకు తున్నాడు. ఎంతమంది పట్టుకున్నా ఆగడం లేదు. అలాగే ఒకటి రెండు నిముషాలు వాగి, వాగి, ఆయాసంతో పడిపోయాడు. నా ప్రక్కనే నిల్చొని ఇదంతా ఆశ్చర్యంగా గమనిస్తూ ఉన్న రాధ 'డాక్టర్! ఈవిధంగా పవర్తించే నరరూప రాక్షసులను భగవంతుడు కూడా క్షమించడు. ఇటువంటి వాళ్ళను చూస్తె నాకు భయం. అసహ్యం . బోయ్ ని పిలిచి బయటికి ఈడ్చేయమంటాను. లక్ష్మీ ఎటుపోయిందో కనుపించడం లేదు.
    'అమ్మా.....! అంత పని చేయకండి. మీకు పుణ్యమంటుంది. నా భర్త చాలా మంచివాడు. త్రాగినప్పుడు మాత్రం ఆ విధంగా ప్రవర్తిస్తాడు. మైకం లో తప్ప ఆ విధంగా మాట్లాడడు. దయ ఉంచి ఆ మైకం ఓదిలేంతవరకు ఆయనగారినేమీ చేయకండి. మీకు దండం పెడతాను.' దీనంగా రాధను చూస్తూ వాపోయింది కమల.
    'రాదా! ఇతని మైకం ఒదిలిన తర్వాత నా దగ్గరకు ఒకసారి తీసుకొనిరా."
    వరుసగా రోగులందరినీ చూసి నా రూముకు వెళ్ళాను. నాకు పై సంఘటన బాధను కలిగించింది. ఎంతమంది సోదరీమణులు యిటువంటి భర్తలతో ఎన్ని బాధలు పడుతున్నారో? ఆ ఆలోచన నా శరీరాన్ని భయంతో జలదరింపచేసింది. రోగులు రావడంతో నా ఆలోచనలు కట్టి పెట్టి వారిని పరీక్షిస్తూ మందులు వ్రాయడం లో ఆ పూట గడిచిపోయింది. హృదయ భారంతో నాన్నగారి తో కలిసి భోజనానికి యింటికి వెళ్ళాను.
    ఒక అరగంట ముందుగానే నర్సింగ్ హోం కు బయలుదేరాను. సాయంత్రం 5 గంటలకే వస్తున్న నన్ను చూసి ఆశ్చర్యపడింది నర్సు రాధ.
    'ఈరోజు యింత త్వరగా వచ్చారేం డాక్టర్?'
    'మరేం లేదు రాధా! కమల భర్తతో మాట్లాడాలని....'
    'మీరు వెళ్ళిన తర్వాత మూడు, మూడున్నర ప్రాంతం లో మేలుకున్నాడా ప్రబుద్దుడు. జరిగినదంతా భార్య ద్వారా విన్నాడు. బాధపడుతున్నాడు. మీతో మాట్లాడి క్షమాపణ కోరిగాని వెళ్ళనంటూ అలాగే మీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు....'
    'అలాగా....! లోపలికి తీసుకురా! మాట్లాడుకుందాం.
    నా గదిలో ఎదురు చూస్తూ కూర్చున్నాను. రాధ అతనిని వెంట తీసుకువచ్చింది. నేలచూపు చూస్తూ, వంచిన తల ఎత్తకుండా ఒక ప్రక్కగా నిలుచున్నాడతను. అతని వైపు జాలిగా చూస్తూ , కూర్చోవలసిందని సంజ్ఞ చేశాను. నా ఎదురుగా కూర్చున్నాడు. నా ముఖం లోకి చూడడానికి నాతొ మాట్లాడడానికి ఎంతగానో బాధపడుతున్నాడు. అతని ముఖంలో పశ్చాత్తాపం స్పుస్టంగా కనుపిస్తూ ఉంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS