Previous Page Next Page 
అరుణోదయం పేజి 6

   
    "అని నా ఉద్దేశ్యంకాదు!" అన్నదా.
    ఆలస్యం చేయకుండానే, "అయితే మీ అక్కయ్య ఉద్దేశ్యమా." అన్నాడు.
    "అవును!" అంటుందేమోనని ఆత్రంగా చూచాడు. అలా అనివుంటే కలుషితమైన ఆ సమయంలో గూడా తనకు తృప్తి అనిపించేలావున్నది మనస్సు.
    "కాదు!" అన్నది అరుణ నిశ్చలంగా శూన్యంలోకి చూస్తూ.
    ఇక ఒక్క క్షణం కూడా అక్కడ వుండకుండా లోపలికి వెళ్ళిపోయింది.
    విసురుగా తలను అటూ యిటూ త్రిప్పసాగాడు. కర్రను చంక కిందను జేర్చుకున్నాడు. ఆమెను వెంబడిస్తున్నట్టుగా ఆమె గదిలోకి పరుగెత్తాడు.
    "ట్యూషన్ కు వెళ్ళు... నీవు ఇక్కడ ఒక్కగంట లేనంతనే నేనేమీ చచ్చి పోను!" అన్నాడు అగ్నికి ఆజ్యం వేస్తున్నట్టుగా-ఆమె ముఖానికి మరింత వేదనను తోడుజేస్తూ.
    అరుణ భయంతో-అతడి ప్రవర్తన వలన కలిగిన భయంతో గిలగిలలాడి పోసాగింది.
    మొఖం పక్కకు తిప్పుకొని ఏడ్వసాగింది.
    "ఇదొకటి మాటకు ముందు ఆ ఏడుపు దేనికి? నేను నిన్నే మైన కొడుతున్నావా, తిడుతున్నావా?" రంయ్ న లేచాడు.
    ఆమె రెండు చేతులతోనూ మొఖాన్ని కప్పుకున్నది. ఆమె ఏడుపు మరింత ఎక్కువ అయింది.
    "ఏమిటీ వ్యక్తి" ఆమె విస్తుపోసాగింది.
    ఆయన ఆ గృహంలో కాలుపెట్టిన వాటి నుండి ఎప్పుడూ క్రితం సాయంత్రం నుండి ప్రవర్తిస్తున్నట్లుగా ప్రవర్తించలేడు!
    తనేం చేసింది?
    తను చేసిన తప్పేమిటి?
    అతడి ప్రవర్తనకు - అలాంటి ప్రవర్తనకు హేతువేమిటి?
    ఈలాంటి మనిషితోటి - తన జీవితం తన అక్కయ్య ఉదేశ్యం అలా - ముడి బడ బోతున్నది?
    భగవాన్!
    ఆమె కళ్ళు తిరగసాగినయ్!
    మంచంకోడు పట్టుకొని అక్కడే చెమటలు కక్కుతూ నిలబడిపోయింది.
    ఆమె అటూ యిటూ వూగిపోతున్నది.
    మరోక్షణంలో ఆమె అక్కడే కుప్పలా కూలిపోతుందనగా రాజశేఖరం ముందుకు దూకుతున్నట్లుగా అడుగులేసి, ఆమెను పట్టుకున్నాడు. బలంగా పక్కకు లాగి మంచంమీద పడుకోబెట్టాడు.
    అంతటితో రాజశేఖరం ఆవేశమంతా చప్పగా చల్లారిపోయింది! కోపాన్నంతా మర్చిపోయాడు...
    వడివడిగా వంట యింట్లోకి వెళ్ళి మంచినీళ్ళ గ్లాసుతో ఆమె దగ్గరకు వచ్చాడు.
    జాలి నిండిన గుండెతో ఆమెకు సపర్యలు చేయసాగాడు!

                                     *    *    *

    "గోపన్న! సాయింత్రం గనుక ఖాళీగా వుంటే పెందరాళే ఇంటికిరా... ఎటైనా వెళ్దాం!"
    "అలాగే బాబు!"    
    కాస్త ఆ యింటికి, అంది నా అరుణకు దూరంగా తిరగాలనిపిస్తోంది రాజశేఖరానికి.
    "అరుంధతి ఎప్పుడు వస్తుందో ఏమో" అని ఒక్కరోజులోనే చికాకుపడసాగాడు.
    ఐదుగంటలకే గోపన్న బండిని తీసుకు వచ్చాడు.
    ఆ వూరు వచ్చిన తరువాత మొట్టమొదటి సారిగా ఆ యింటినుండి బయట కాలుపెడుతున్నాము. ఏదో స్వేచ్చ కావాలన్నట్లు ఏదో స్వేచ్చ పొందబోతున్నట్లు.
    గుడ్డలు మార్చుకుంటుండగా గోపన్న వచ్చి, "చిన్నమ్మ గారిని కూడా తీసుకు వెళ్దామా బాబూ!" అడిగాడు.
    "ఎందుకు" అన్నాడు నుదురు ముడి వేసి. మరుక్షణంలోనే అతడి ముందు తేలికవ్వటం ఇష్టంలేక, "నేనేదో నాలుగు రోడ్లూ వూరికే తిరిగి వద్దామనుకుంటున్నాను.. అనవసరంగా ఆమె ఎందుకు?" అని నవ్వాడు.
    "కాదులే బాబు! లంకంత కొంపలో ఆమె మాత్రం ఒక్కతెలా వుంటుంది?....అరుంధతమ్మ గారు గూడా ఎన్నడూ ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళలేదు!" అన్నాడు.
    చాలా చొరవ తీసుకుంటున్నట్లుగా.
    రాజశేఖరానికి చికాకు వేసింది అతడి అసంగతమైన ప్రసంగానికి.
    "అయితే అడుగు.... వస్తే నాకు, మాత్రమే మభ్యంతరం " అన్నాడు విసుక్కుంటున్నట్లుగా - కాస్త గంభీరతను గూఢా మిళాయించి.
    తనేదో కాస్త తేలిగ్గా వూపిరి పీల్చు కుందామని బయటకు వెళుతుంటే ఈ గోపన్న వ్యవహారమేమిటి మధ్యలో - అసలు ఎవరికీ ఇంట్లో అంతగా చనువివ్వ గూడదు- అరుంధతి రాగానే చెప్పాలి!
    గోపన్న వెళ్ళి వచ్చాడు.
    "వస్తున్నదా" ఆత్రంగా అడిగాడు.
    "రానన్నది బాబూ!"
    తేలిగ్గా శ్వాస పీల్చుకున్నాడు రాజశేఖరం.
    "మీరు రమ్మంటే గాని రాదు బాబూ.....ఆమెకు అసలే అభిమానం జాస్తీ!"
    అతడి మాటలు తలా తోక లేకుండా వున్నట్లనిపించగా ముళ్ళ మీద మల్చున్న ట్లుగా గిలగిలలాడాడు రాజశేఖరం.
    "ఆమె రానంటుంటే నన్నేం చేయమంటావ్?" చిరాగ్గా అన్నాడు.
    గోపన్న జంకుతూనే - "మీరు రమ్మనమనండి!..వస్తుంది!" అన్నాడు నసుగుతున్నట్లుగా.
    కోపంతో విసురుగా చేతిలో వున్న దువ్వెనను టేబుల్ మీదకు విసిరివేసి ఆమె గదిలోకి వెళ్ళాడు.
    "ఇతరుల ముందు గూడా నన్ను తక్కువ చేయాలనుకుంటున్నావా?.. లేక బ్రతిమాలించుకోవటం నీకు సరదానా?.. బయల్దేరు! వెంటనే బయల్దేరు!"
    "నేను రాను!"
    "ఎందుకని?"    
    "మీ కిష్టం లేనప్పుడు నాకు రావాల్సిన పనేఁ వున్నది?    
    "అంటే నీ ఉద్దేశ్యం- మనస్సులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి అంటున్నాననా?..... నీవు రావడం ఇష్టం లేకపోతే ఎందుకు రమ్మంటాను?" అతడి అభిమానం దెబ్బతిన్నది ఆమె సూటియైన ప్రశ్న నుండి అతడు ఎటూ తప్పుకోలేకపోయాడు.
    "ఏమో.. అవన్నీ నాకు తెలియవు." అన్నది తలెత్తకుండానే.
    "ఏమో.. అవన్నీ నాకూ తెలియవు! ఐదు నిముషాల్లో తయారయి నాతోపాటు రావాలి!" అంటూనే వెనక్కు తిరిగి బయటకు వచ్చేశాడు ఆమె గదిలో నుండి.
    రాజశేఖరానికి గోపన్న ముందు వోడి పోతానేమోనని పౌరుష మొచ్చింది. ఆమెను ఎలాగైనా తనతో పాటు తీసుకువెళ్ళాలనే పట్టుదలా హెచ్చింది.
    తరువాత పది నిముషాలకు-రాజశేఖరం కారులో ఎక్కి కూర్చొన్న తరువాత- అరుణ బయటకు వచ్చింది.
    క్షణం ఆమెను చూస్తూనే విభ్రాంతి జెందాడు రాజశేఖరం. ఇంతవరకు ఆమెను ఎన్నడూ అలాంటి ఆకారంలోనూ, అలాంటి అందంతోనూ చూడలేదు. లైటు గులాబీ రంగు టెర్లిన్ చీరె కట్టుకున్నది. అదే రంగు జాకెట్టు పక్కపాపిడి తీసుకున్న వత్తైన జుట్టులో ఎడంవైపుగా వోగులాబీ. నుదుట పొడుగ్గా దోస గింజలా తిలకం బొట్టు.. క్షణం సర్వం మరిచి ఆమెనూ, ఆమె నడకనూ చూస్తూ కూర్చుండి పోయాడు రాజశేఖరం.
    మరుక్షణంలోనే అరుంధతి గుర్తుకు వచ్చింది. మొఖమంతా రంగులు మారగా చెమటలుపట్టసాగింది.
    బిగుసుకు కూర్చొని- శూన్యంలోకి చూడసాగాడు.
    గోపన్న వెనగ్గా ఇంటికి తాళం వేసివచ్చి అరుణ ఎక్కినా తరువాత తనూ ఎక్కి బండిని కదిలించాడు.
    అతడి కళ్ళు గర్వంతో మెరుస్తున్నాయి.
    దానికీ కారణం వున్నది- అరుంధతి వెళుతూ వెళుతూ అతడితో చెప్పింది-ఈ రోజున రాజశేఖరం అలాంటి కోరిక కోరి వుండకపోయినా అతడే వాళ్ళిద్దరూ కలసి అలా షికారుకు వెళ్ళేటందుకు ప్రతిపాదన చేసి వుండేవాడు.
    వూళ్ళో నాలుగు రోడ్లూ తిరిగారు.
    ఇద్దరూ- రైల్లో ప్రయాణీకుల్లా ఒకళ్ళకు ఒకళ్ళు తెలియని వాళ్ళలా-వాళ్ళకు వాళ్ళే ఏవేమో వూహించుకుంటూ కూర్చుండిపోయారు.
    రోడ్లన్నీ జనంతో నిండి-ఆ సాయింత్రం ఏదో నిండుగా, గంభీరంగా - వాళ్ళ మనస్సుల్లాగానే వున్నట్లనిపించింది.
    "ఏదైనా సినిమాహాలుకు తీసుకువెళ్ళమంటారా బాబు!" గోపన్న అడిగాడు.
    "వద్దు.. వద్దు!" రాజశేఖరం అరుణా ఒక్కసారే అన్నారు.
    అలా అంటూనే ఒకళ్ళ మొఖంలోకి ఒకళ్ళు విచిత్రంగా చూసుకున్నారు.
    ఇద్ధరికీ నిప్పుల మీద కూర్చున్నట్లు గానే వున్నది.
    "వద్దు.. ఎక్కడనైనా.. మనుష్యులు అంతగా తిరగి ప్రదేశంలోకి తీసుకువెళ్ళు..విశ్రాంతిగాకాస్సేపు కూర్చొని వద్దాం!"
    బండిని అమరావతీ రోడ్డు మీదకు తిప్పాడు.
    -ఇప్పుడు "కాదూ-వెనక్కు తిరిగి ఇంటికి వెళ్దాం అనుకున్నా"- గోపన్న ముందు ఏదో తప్పు చేసినట్లుగా మొఖం పెట్టవలసి వస్తోంది.
    అలా రెండుమైళ్ళు - కాలేజీ హాస్టల్స్ దాటేంతవరకు వాళ్ళకు మౌనమే శరణ్యమయింది.
    అక్కడ రోడ్డు ప్రక్కన గడ్డిని చూస్తూనే-"కాసేపు బండి ఆపు గోపన్నా..ఇక్కడ కూర్చుంటాం!" అన్నాడు.
    బండి ఆగింది.
    సూర్యుణ్ణి కొండలు కడుపులో దాచుకున్నయి.
    "అరుణా. దిగు.. కాసేపు ఇక్కడ కూర్చుందాం!" చాలా సహజంగానూ, సాత్వికంగాను వున్నది కంఠం.
    అరుణ దిగింది.
    రాజశేఖరం దిగుతుంటే "పట్టుకోమంటారా?" అని అడగబోతుండగానే ఆమె బుజం మీద చేయి వేసి క్రిందకు దిగాడు.
    ఆమె రోడ్డు ప్రక్కగా నడవసాగింది.    
    రోడ్డుకు అటూ యిటూగా వున్న పచ్చటి గడ్డి కూర్చోమన్నట్లుగా ఆహ్వానిస్తోంది. ఆ చల్లని వాతావరణంలో దూరంగా ఫ్యాక్టరీ గొట్టాలలోనుండి వస్తున్న పొగ వికృతంగా వున్నది. దూరాన రోడ్లను కప్పేస్తున్నట్లుగా వున్న ఒకటి రెండు మర్రిచెట్లు ఏదో భయంకరంగా అటు పోయే ప్రయాణీకుల్ని తమ ఒళ్ళోకి లాక్కుంటున్నట్లుగా వున్నయి.
    రాజశేఖరం గడ్డిలో కూర్చొని ఒక్కసారి నలుమూలలా చూచాడు. దూరంగానున్న రేడియో స్థంభాల మీద ఒక్క క్షణం చూపు నిలిచింది. ఆపైన మంగళ గిరికొండ.. దాని మీద అందంగా తెల్లగా మెరుస్తున్న పానకాల స్వామి దేవాలయం..
    "మంగళగిరి ఎప్పుడైనా వెళ్ళావా అరుణా?"
    "లేదు!"    
    "అమరావతి?"    
    "లేదు..." తల అడ్డంగా తిప్పింది.
    అటు పోతున్న ఒకళ్ళిద్దరు వీళ్ళిద్దర్ని వింతగా చూస్తూ ముందు కడుగులు వేస్తున్నారు.        
    "నీవు ఎన్నాళ్ళయింది అరుంధతి దగ్గరకు వచ్చి?"
    "సంవత్సరం దాటిందేమో.."
    ఒక్కక్షణం ఏవేవో తెలియని ఆలోచనలు అతడిని ఉక్కిరిబిక్కిరి చేసి మరో ప్రపంచంలో పడవేసినయి. అయోమయంగా అర్ధరహితంగా ఆమె మొఖంలోకి కన్నార్పకుండా చూస్తూ "అరుంధతి నిన్ను ఎందుకు తీసుకువచ్చుకున్నదోనీకు తెలుసా?" అడిగాడు.
    ఆత్రంగా గుండెలు బిగపట్టుకొని ఆమె సమాధానం కోసరం చూడసాగాడు.
    "జాలితో.."
    "దేనికి?"
    "నేను ఎవ్వరూలేని అనాధను గనుక....!"
    "సరే! అలాగే అనుకుందాం.. మరి నన్నెందుకు తీసుకువచ్చిందో నీకు తెలుసా?"
    అరుణ బిత్తరపోతూ అతడి వంక కన్నార్పకుండా చూడసాగింది.
    తరువాత కొద్దిక్షణాలకు కళ్ళు బరువుగా సగం వాల్చి, వేళ్ళతో గడ్డిని అటూ యిటూ కదుపుతూ, "ఏఁవో.. నాకేం తెలుసు!" అన్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS