ఆ మాటలు పావనికి నచ్చలేదు. మనం చెయ్యగలిగింది ఏమీ లేదా? చాలా ఉంది కానీ, చెయ్యటంలేదు.
ఎంత ప్రయత్నించినా నిద్రరాలేదు. లేచి వెళ్ళి మావగారికోసం ఉంచిన స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని పడుకుంది.
స్లీపింగ్ టాబ్లెట్స్ బాటిల్ తమ పడకగదిలో చూసి విఠల్ ఆశ్చర్యంగా "ఇది మన గదిలో కెందుకు వచ్చింది?" అన్నాడు.
"రాత్రి నిద్రపట్టక ఒకటి వేసుకున్నాను."
విఠల్ కి చాలా కోపం వచ్చింది.
"ఇలా నీ ఆరోగ్యం పాడుచేసుకుంటే నేను ఊరుకోను ముందు ఆ సీసా నాన్నగారి గదిలో పెట్టెయ్యి."
పావని నవ్వి "అబ్బా ఎంత ప్రేమ ఈ ప్రేమ నేను ఏం చేసినా ఉంటుందా?" అంది.
"నాకు కోపం వచ్చే పనులు నువ్వెందుకు చేస్తావూ?"
"అంతే మొగబుద్ధి..."
"అదే మరి, పాడు మొగబుద్ధి. అమ్మాయిగారు కాస్త మూతి ముడుచుకున్నా, తల్లడిల్లిపోతాయి పాడుప్రాణాలు..."
పకపక నవ్వింది పావని.
ఆ రోజు ఎవరో ఇద్దరు అమ్మాయిలు "పావనిగారి ఇల్లు ఇదేనా" అని వెతుక్కుంటూ వచ్చారు.
పావని తనను తణు తెలుపుకుని వాళ్ళను కూచోబెట్టి వచ్చిన కారణం అడిగింది.
ఆ పిల్లలిద్దరి వయసూ ఇరవై లోపే ఉంటుంది. చిన్నపిల్ల వయసు మరీ పదిహేనేళ్ళకంటే ఎక్కువ ఉండదనిపిస్తోంది. పెద్దమ్మాయి మాట్లాడింది.
"మీ రవి మా చెల్లెలిని రోడ్డుమీద జడపట్టుకు లాగి అల్లరిపెడుతున్నాడండీ! మీరు బుద్దిచెప్పుకోండి లేకపోతే మేమే తగినవిధంగా బుద్ధిచెప్పవలసి వస్తుంది."
విస్తుపోయింది పావని. రవికి పట్టుమని పదిహేనేళ్ళు లేవు. చదువుతున్నది ఇంటర్....అప్పుడే...
కలవరపాటునుంచి తేరుకుని "నేను రవికి చెప్తాను లెండి. ఇంకమీదట వాడు మీ జోలికి రాడు." అని నచ్చజెప్పి పంపేసింది.
రవి రాగానే కోపంగా "ఏం రవీ? ఆడపిల్లలను ఏడిపించేటంత పెద్దవాడి వయ్యవా?" అంది.
వదిన కోపానికి రవి భయపడ్డాడు. కానీ, అతని ముఖంలో తప్పుచేసి నందుకు సంకోచం కనపడలేదు.
"ఓ! ఆ మొగున్నొదిలేసినదాని కూతుళ్ళు నీ దగ్గిర కొచ్చారా?" అన్నాడు నిర్లక్ష్యంగా...
మరింత విస్తుపోయింది పావని...
"తిన్నగా మాట్లాడు రవీ! ఏవిటా మాటలు మర్యాద లేకుండా...."
"వాళ్ళు మర్యాదస్తులు కారు వదినా వాళ్ళ అమ్మ మొగున్నొదిలి ఒక్కత్తీ కథ నడిపిస్తోంది. వీళ్ళు అంతకంటే ... ఇది మహా మంచిదనుకున్నావా? మొన్న ఆ ప్రకాష్ గాడితో సినిమా కెళ్ళటం నేను కళ్ళారా చూసాను..."
మతిపోతోంది పావనికి. ఆ ఇల్లాలు తన సంసారం ఎందుకు వదులుకోవలసి వచ్చిందో, ఏ బాధలున్నాయో...భర్తను వదిలినంతమాత్రాన సంఘానికి ఆ స్త్రీ బజారు మనిషి అయిపోయింది. ఆవిడ పిల్లలు కూడా అలుసయిపోయారు. ఆ అమ్మాయి తన స్నేహితుడితో సినిమాకు వెళ్ళినంతమాత్రాన నడిరోడ్డుమీద జడపట్టుకు లాగే హక్కు తనకు వచ్చిందనుకుంటున్నాడు రవి!
స్త్రీపట్ల సాంఘిక దృక్పథమంతా రవిలో బీటరూపంలో కనిపిస్తోంది...భరించలేకపోయింది పావని. 'నోరు మూసుకో! వాళ్ళెవరో, ఏమిటో నీ కానవసరం! నువ్వు మాత్రం నీ హద్దుల్లో ఉండు. మరోసారి ఇలా ప్రవర్తిస్తే వాళ్ళదాకా పోకుండా నేనే నీకు బుద్ధిచెప్తాను..."
వదిన ఉగ్రరూపంచూసి ఇంకేం వాదించకుండా చల్లగా జారుకున్నాడు రవి.
అనుపమకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. కట్నాల సమస్య మామూలే! రూపమూ గుణమూ, చదువూ అన్నీ ఉన్న అనుపమను భార్యగా స్వీకరించటానికి ఇరవై వేలవరకూ కట్నాలు అడుగుతున్నారు.
జగన్నాథానికి కొడుకులు లేరు. అతడు ఎవరినీ పెంచుకోనూ లేదు పెళ్ళిలోనే పావని పేర పది ఎకరాల పొలం పెట్టాడు ఆ పొలం పేరుకి పావనిదే అయినా దానిమీద వచ్చే అయివేజంతా విఠల్ దగ్గిరే ఉంటుంది. ఆ డబ్బు గురించి పావని ఏ నాడూ లెక్కలు అడగలేదు. సరికదా లెక్చరర్ గా తనకు వచ్చే జీతంకూడా అత్తగారి చేతికి ఇచ్చేది. అలా అని పావని ఏనాడూ డబ్బు కిబ్బందిపడలేదు పావని ఏది కావాలన్నా విఠల్ ఏనాడూ కాదనడు.
.jpg)
"నా పొలం ఉందిగా! అందులో కొంత అమ్మేసి అనుపమకు కట్నంగా ఇచ్చేద్దాం!" అంది పావని.
విఠల్ ఒప్పుకోలేదు.
"అంత అవసర మేమొచ్చింది నేనే ఏదో చూస్తాలే అన్నాడు.
పొలం అమ్మటానికి పద్మావతికూడా అంత సుముఖంగా లేకపోవటంతో పావని ఊరుకోవలసి వచ్చింది.
నళిని బి.ఏ విద్యార్ధినులందరిలోనూ చాలా చక్కగా ఉంటుంది. బాగా నాట్యం చేస్తుంది. కాలేజీలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏం జరిగినా నళిని నాట్యం తప్పకుండా ఉంటుంది. స్టూడెంట్స్ యూనియన్ కి పావని అడ్వైజర్ కావటం వల్ల నళినికి పావని దగ్గిర బాగా చనువు ఉంది.
ఎప్పటిలా కాలేజ్ డే ఫంక్షన్ కి నళినిని డాన్స్ చెయ్యమని అడిగింది పావని.
"నేను చెయ్యలేను మేడమ్! నా మనస్సు ఏం బాగులేదు." అంది నళిని.
"అదేం?"
"పై వారమే మా అక్కయ్య పెళ్ళి."
"అక్కయ్యకి పెళ్ళవుతుంటే మరింత హుషారుగా ఉండాలికాని, దిగులు దేనికి?"
"ఈ పెళ్ళిలో దిగులేకాని, హుషారులేదు మేడమ్! మా అక్కయ్య స్నేహితురాలు సుశీల సుశీల కోసమని వాళ్ళింటికీ వెళ్ళింది. దాని ఖర్మకాలి సమయానికి వాళ్ళింట్లో ఎవరూలేరు. సుశీల అన్నయ్య అక్కయ్యని బలవంతంగా లొంగ దీసుకున్నాడు. అక్కయ్యకి నెల తప్పింది. విధిలేక అమ్మా నాన్నా ఆ దౌర్భాగ్యుడికే పదివేల కట్నంతో సహా అక్కయ్యనిచ్చి పెళ్ళిచేస్తున్నారు. అక్కయ్య కుమిలి కుమిలి ఏడుస్తోంది పాపం అది చెయ్యని తప్పుకు ఇక బ్రతికున్నంత కాలమూ ఏడవవలసిందే!"
వినలేకపోయింది పావని.
"అది చెయ్యని తప్పుకు ఇక బ్రతికున్నంతకాలమూ ఏడవవలసిందే!" అన్న నళిని మాటలు సరళణు గుర్తుచేస్తున్నాయి. ఏ లోకంలోనో ఉన్న సరళ ? "అక్కయ్యా! నాలాంటి అభాగ్యులను ఆదుకోవూ?" అని అడుగుతున్నట్లే తోచింది.
ఒక నిశ్చయానికి వచ్చి విఠల్ తో చెప్పేసింది.
"నేను ఆడవాళ్ళకి ఒక సమాజం స్థాపించాలనుకున్నాను దానికి పురోగామి అని పేరు పెడతాను. బాగుంటుందా?"
విఠల్ ఒక్కసారి ఆవులించి "ఇంటి పనులూ, కాలేజీ పనులూ సరిపోవటం లేదా, నీ యిష్టం." అన్నాడు పెద్దగా పట్టించుకోకుండా.
పద్మావతితో కూడా తన సంకల్పం చెప్పింది పావని.
"సమాజమా? నాటకాలూ అవీ వేస్తారుకదూ! నువ్వు మాత్రం వెయ్యకు. బాగుండదు అయితే సినిమాస్టార్లని కూడా పిలుస్తారా?" కుతూహలంగా అడిగింది పద్మావతి.
అత్తగారితో తన సంకల్ప్తాన్ని అంతకంటే వివరించటం అనవసరం అనుకుంది. ఆవిడ మంచి మనిషే కాని అన్ని విషయాలూ అర్ధంచేసుకోలేదు. ఒక పరిధిని దాటి ఆలోచించలేదు.
తన కొలీగ్స్ తోకూడా ఈ విషయం చర్చించింది పావని.
"ప్రకృతి ఒక వరంగా ప్రసాదించిన మాతృత్వం కొన్ని సందర్భాలలో స్త్రీకి శాపంగా మారుతోంది. తమ తప్పులేకపోయినా కొందరు అమాయకులు ఈ శాపానికి బలికావలసి వస్తోంది. సంఘంలో ఈ దృక్పథాన్ని మార్చాలి. ఈ కార్యసాధనకు మనమంతా ఒక ఉద్యమంలా కృషి చెయ్యాలి!" అంది.
బాగా చదువుకున్న స్త్రీలలో చాలామంది పావని అభిప్రాయాన్ని ఆమోదించలేదు. "ఏమిటండీ మీరనేది. పాడైపోయినా ఫరవాలేదంటే అందరూ పాడైపోరూ?"
