ఏలిక
రహదారి బంగళాలో తెల్లవారే సరికి ఉదయం ఎనిమిదన్నరయింది.
ఊళ్ళో మాత్రం మామూలుగా అయిదున్నరకే తెల్లవారింది. అందువల్ల ఊళ్ళో పెద్దలు కొందరు రహదారి బంగళాను చేరి గత రెండు మూడు గంటలుగా పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళనక్కడికి చేరవేసిన అందమైన కార్లు కొన్ని ఆ రహదారి బంగళాను చుట్టి వున్నాయి. ఆ చుట్టుప్రక్కలంతా కాళీ ప్రదేశం కావడంతో ఆ రహదారి బంగళా ఒక గులాబీ పువ్వులాగుండి అక్కడ చేరిన హంగుల పొంగు ఆ పువ్వుని దాస్తున్న రెమ్మల్లాగా వున్నాయి.
ఆ రెమ్మలు బంగళా వద్ద అల్లాడిపోతుండగా-
సుందరం టై సర్దుకుంటూ గదినుంచి బయటికి వచ్చి నిలబడ్డాడు. అతను ఎర్రగా పొడుగ్గా వుండి, బక్కగా అందంగా వున్నాడు. ఉంగరాల జుత్తు నల్లగా మెరుస్తోంది. అతని పెద్ద పెద్ద కళ్ళు కళ్ళద్దాలోంచి తళతళా మెరుస్తున్నాయి. నున్నగా గడ్డం చేసుకోవడం వల్ల, ఆమేరంతా పచ్చగా కనిపిస్తోంది. అతి నేర్పుగా, ఓపిగ్గా, చూడముచ్చటగా దిద్దుకున్నాడు - మీసాన్ని, మీసాలు చేసుకున్నందుకే పడుతుంది ఒక గంట కాలం.
అతను బయటకొచ్చి సిగరెట్టు ముట్టించుకున్నాడు.
రెమ్మలు అతని చుట్టూతా చేరాయి.
"బాస్ నిద్రలేచే వేళయింది?" అన్నాడు సుందరం జనాంతికంగా.
"ఇది నా విజిటింగ్ కార్డ్ వారి కివ్వండి" అన్నాడొక పెద్ద.
పుచ్చుకుంటూ అన్నాడు సుందరం
"ష్యూర్..... ష్యూర్..."
"లంచ్ ఏర్పాట్లు మా కంపెనీలోనే చేస్తున్నాం..." అని కూడా అన్నాడు పెద్ద.
"కోళ్ళూ, నల్ల చేపలూ తినరు" సుందరం కంగారుగా అనేసేడు.
"ఈ ఊరోళ్ళకి ఆయనలవాట్లన్నీ తెలుసులెండి" అన్నాడొక వృద్ధుడు.
ఖద్దరు బట్టల్లో నిండుగా వున్న పెద్ద మనిషొకాయన, సుందరానికి చేత్తో సైగ చేసేడు. ఈ పిలుపు సుందరానికి నచ్చింది కాదు. కానీ, ఏ పుట్టలో ఏ పాముంటుందోనని చెప్పి అటువేపు కదిలి వెళ్ళాడు. సుందరం రావడం చూసిన ఆ ఖద్దరు శాల్తీ -జనానికి కొంచెం దూరంగా నడిచివెళ్ళి నించున్నాడు. సుందరం అతన్ని చేరుకున్నాడు.
మొహాన్ని చిరునవ్వు పులుముకుని తనని తాను పరిచయం చేసుకున్నాడు ఖద్దరు మనిషి-
"నా పేరు మాణిక్యం"
సుందరం ఉలిక్కిపడ్డాడు. అయినా సిగరెట్టు కాల్చడం మానలేదు. పొగని మాత్రం పక్కకి వదిలేడు.
ఆయన చెప్పుకు పోతున్నాడు.
"లారీలూ, సిటీ సర్వీసులూ...."
"రైస్ మిల్లూ, ఇంకా చెప్పకండి సార్! బాస్ మీ గురించి చాలా తడవలు చెప్పేరు"
మాణిక్యం ముసిముసిగా నవ్వి అన్నాడు.
"ఇంతప్పట్నుంచీ మా స్నేహం. మంత్రి అయ్యింతర్వాత మేమిద్దరం కలుసుకోనేలేదు. పాత ప్రభుత్వం పడిపోయిందని పేపర్లో చదవగానే అనుకున్నాను - మా పైడయ్య దశ మారిపోతుందని! అంతా మా కొండ దేవుడి దయ!"
దేవుడి మాట చెవి పడటంతోటే సుందరం మొహం మాడ్చుకున్నాడు. రాళ్ళని దేవుళ్ళుగా కొలవడం అతని కిష్టం లేదు. పైడయ్యగార్తో అతనిక్కడికి వచ్చింది ఆ రకమైన దేవుడి కొరకేనని అతనికి బాగా తెలుసు. అయితే, ఇప్పుడుదేవుడి ప్రసక్తి తెచ్చింది పైడయ్యగారు కాదు కదా! అంచేత, తన బక్క కోపానికి, వేడిని జతచేసి అన్నాడు -
"కొండ దేవుడెవడండీ? ఆఫ్టరాల్ స్టోన్! పదవికొచ్చిన మనిషి నొదిలేసి చలనం లేని రాయిని పొగుడ్తారే?"
మాణిక్యం ఖిన్నుడయ్యాడు. అతని స్థితి గమనించి సుందరం ప్లేటు మార్చేసేడు.
"అఫ్ కోర్సు. ఇది మీకు పిడివాదం గానే కనిపించవచ్చు. మనిషి బలాన్ని గౌరవించడం నాకిష్టం."
'ఈ మాట మా పైడయ్య దగ్గిరన్నావు కాదు. కొండ దేవుడి తిరణాలు చూసేవా? ఇవాళ తొమ్మిదోరోజు. ఇసకేస్తే రాలడం లేదు. అంత జనం. ఇంతమంది నమ్మి కొలిచే దేవుడ్ని రాయంటున్నావు గందా. ఏం చూసి అంత తేలిగ్గా అన్నావు అసలు. పైడయ్య ఇక్కడి కెందుకొచ్చేడు? ఈ దేవుడ్ని చూసి పోదామనేగా? అతని కూడా వచ్చిన వాడవి. ఎన్ని గుండెల్తో రాయంటున్నావ్? పైడయ్యని కొండదేవుడు చల్లగా చూడకపోతే అయ్యేవాడే - మంత్రి! చదువా, చట్టుబండలా? ఏదీ, పిలు.... నిలబెట్టి కనుక్కుంటాను. అతనూ ఈ దేవుడ్ని రాయంటే వచ్చే ఎన్నికల్లో అతనికేం పడతాయో గూడా చెబుతాను. ఏమనుకుంటున్నాడో....."
మాణిక్యం మంట మీద గబగబా మాట్లాడేస్తున్నాడు. అనరాని మాటలంటున్నాడు. దూరంగా నిలబడి వున్న మనుషులు ఒక్కొక్కరూ అక్కడికి చేరుకోవడం స్పష్టంగా చూసేడు. సుందరం చోటు మార్చేయడం మంచిదనుకున్నాడు. ఇక్కడి మనుషులకి మంత్రి కంటే దేవుడు బలవంతుడనే ధోరణి పరిసరాల్లో ప్రవహిస్తుందని పసిగట్టేశాడు. స్వామిభక్తి చాటే ప్రయత్నంలో పైడయ్యను వెనకేసుకు వస్తే పుట్టగతులుండవని నమ్మేడు. అందుచేత, అతను అక్కడ్నుంచి కదిలి మంత్రి గారి గదిలోకి జారుకోవడం ప్ర్రారంభించేడు - టై సర్దుకుంటూను.
తన వెనకాల గుంపులోంచి ఎవరో దేశవాళి భాషలో సుందరాన్ని తిడుతున్నారు.
సుందరం నడకవేగం పెంచి మంత్రి గదిలోకి వెళ్ళిపోయేడు. మంత్రి ఆ క్షణంలోనే కళ్ళువిప్పి చేతికున్న ఉంగరాన్ని కళ్ళకద్దుకుంటున్నాడు. ఆ ఉంగరంలో కొండదేవుడి ప్రతిమ అందంగా పొదిగి వున్న వైనం సుందరానికి మునుపే తెలుసు.
"గుడ్మార్నింగ్ సార్!"
"అద్సరే! ఆళ్ళతో ఏంటీ గొడవ"
ఉలిక్కిపడ్డాడు సుందరం.
"చిన్న పొరపాటు జరిగిందండీ!"
"కొండదేవుడ్ని తిట్టి చిన్న పొరపాటంటావేంటయ్యా? దేవుడ్ని తిడితే ఈ ఊరోళ్ళు నిన్ను ఉరేస్తారు జాగ్రత్త!"
