హోటల్ వుమా శంకర్లోంచి హిందీ సినిమా తాలుకూ పాటేదో వినిపిస్తుంది. అదెంతో హాయిగా , మత్తుగా వుంది.
(బాష - హిందీ అయితేనేం - హిందీ అధికారపు బాష - వద్దు -- కావాలి -- గోల - కొట్లాటలు . హింస - ఇవన్నీ అవతలకి నేట్టేద్డెం . పార్లమెంట్ మహాశయులెం చేస్తే అది ఘనకార్యం! మనకెందుకీ బెడద. ఐ యామ్ ఎబోవ్ -- ఇంగ్లీషులో అంటే తంతారేమో! తెలుగులో , ప్రాంతీయ బాషలో అనుకుందాం. మనకీ బాషల గొడవ వద్దు. మనం ఈ రగడకి అతీతులం. కొట్టుకోండి, చంపుకోండి , నాకేం? అయినా జనం! ఈ చిల్లర సమస్యలే ముఖ్యమా మీకు - భాబోయ్ నేను ఉపన్యాసం యివ్వను. నేనేవణ్ణి ? అప్త్రరాల్ గుమస్తాగాడిని, ఏదో బాష తాలుకు సినిమాలో పాట బావుందని అంటున్నానంతే. ఈ సినిమాకి వెళ్ళాలంటున్నాను. సినిమాకే -- నోర్మియ్ వెధవా! ఇంటికి తొరగా నడు)
ఇల్లు - అతనికి యింత దూరాన కనబడటంతోనే కాళ్ళు చల్లబడ్డాయి. మనసంతా దిగులుతో నిండిపోయింది. ఏమిటో వెధవ దారిద్రగొట్టు దడ ప్రారంభమయింది. వచ్చేసింది ఇల్లు! ఇంకెంత దూరం? గట్టిగా పిలుస్తే పెద్దాడు పరుగెత్తుకుంటూ వచ్చేస్తాడు.
పెద్ద కొడుకు పేరు బుజ్జి. బుజ్జి తండ్రి నంత దూరం లేనే చూచి విచిత్రంగా అన్నాడు.
"నాన్నా - గాల్లేదా బలేబలె . నాన్నోచ్చేడు చిన్నా, చంటి! నాన్న సికిల్లో గాల్లేదు . రండి రండి."
సరిగ్గా లెక్కకడితే ఆ వెధవకి నాలుగేళ్ళు నిండాయేమో! అరిందలా తననే ఎగతాళి చేస్తున్నాడు.
(రేయ్ బుజ్జిగా౧ నీ వయస్సులో నేను మా నాన్న భుజాన్నేక్కి తిరిగేవాడిని తెలుసా? నీ కర్మకాలి మీ నన్నగాడు వెధవయ్యెడు గనక ఇప్పుడు గాల్లేని సైకిల్ని లాక్కుంటూ వచ్చేడ్రా ఫూల్! ఇప్పుడు వాళ్ళిద్దర్నీ పిలుస్తావెందుకురా బాబూ! నువ్వోక్కడివీ చాలవూ . నన్ను తినేందుకు! అబ్బబ్బ ఏం పిల్లల్ల్రా నా తండ్రీ! అద్గదీ ముగ్గురూ చేరేరూ , రండి బాబూ , రండి . ఒరేయ్ ఒరేయ్ చంటి - నువ్వూ రావాలా పడుతూ లేస్తూనూ? నా బాబే! ఇలా ర నాయనా. నీ పుట్టుకతోనైనా నా దశ మారి మహారాజయోగం పడుతుందనుకున్నాను. వచ్చే వచ్చే ప్రమోషను గూడా వెనక్కి పోయింది. ఇంకా నయం - రిట్రేంచ్ మెంట్ గాడి కళ్ళల్లో పళ్ళేదు నేను. ఉద్యోగికి గ్యారెంటీ లేదురా బాబూ! లేదు. రారా తండ్రి! నెమ్మదిగా రా!
రెండేళ్ళ చంటిగాణ్ణి ఎత్తుకుని ఒక చేత్తో సైకిల్ నడుపు తుండగా మూడేళ్ళు చిన్నాగాడు నాన్న తనని ఎత్తుకోలేదని రాగాలు తీస్తుండగా, పెద్ద కొడుకు బుజ్జిగాడు తండ్రి చేత లాగబడుతున్న సైకిల్ని ఎక్కేందుకు శతవిధాల ప్రయత్నిస్తుండగా, శ్రీ శ్రీ శ్రీ సగటు మానవుడు శ్రీనివాసరావు ఇల్లు చేరేను.
సైకిల్ స్టా ండ్ వేసి, ముగ్గురు పిల్లల్ని ముద్దాడుతూ యింట్లో అడుగు పెట్టిన శ్రీనివసరావుకి దుఃఖదేవత ఎదురయ్యింది. ఆ దుఃఖదేవత అతని కన్నా తల్లి! అతని కన్నతండ్రి పోగా తనిల్లు చేరిన ప్రాణి.
చంటి వెధవని దించి మ చిన్నా నేత్తుకున్నాడు శ్రీనివాసరావు. బుజ్జి వాళ్ళమ్మ దగ్గరికి (వంటగదిలో) నిష్కమించేడు. భుజం దిగిన బామ్మ కొంగుపట్టి లాగుతున్నప్పుడు బామ్మకి చీకాకు కలిగింది. ఎన్నడూ లేనిది యివాళింత అలాస్యంగా ఇల్లు చేరిన కొడుకుని పరామర్శించాలానే అభిప్రాయం ఆ చీకాకుని దూరం చేసింది.
"ఇంతా ఆలస్యమైందేరా శీను?"
"సైకిల్లెదూ - అదేనా ......అనుకుంటూనే ఉన్నా ఇవాళ ముందు చక్రంలో గాలి పూర్తిగా పోయింది."
"గాలిపోతే , ఎక్కడైనా గాలి కొట్టించకపోయేవూ?"
"లాభం లేదే అమ్మా!"
"అదేమిట్రా విడ్డూరం! గాలి కొట్టేందుకు సైకిల్ షాపులే కరువయ్యాయిట్రా?"
"అదికాదె బాబూ! ఇంక ఆ ట్యూబులు , టైర్లులూ పనికి రావు. గాలి కొడితే పగిలిపోతాయి. అందుచేత యేమిటంటే .....కొత్త టైరూ , ట్యూబూ కొని గాని ఈ సైకిల్ వాడరాదని చెప్పి ఇవాళ నడిచేవచ్చాను."
ట్యూబ్ మాట వినబడగానే ఆ ముసలమ్మాకి తను తాగే మందు విషయం గుర్తుకి వచ్చింది. ఒక సీసా వాడి పూర్తిగా నెలరోజులు గడిచి పోయింది. ఆ సీసా యింట్లో లేకపోతే నీ సుస్తీ నిన్ను మింగగలదని డాక్టరు బాబు హామీ యిచ్చాడు. అందుచేత, ఆవిడ గమనిస్తూనే అడిగేసింది.
"అన్నట్టు నాయనా! ఇవాళైనా మందు వచ్చిందట్రా."
శ్రీనివాసరావుకి పై ప్రాణం పైనే పోయింది. పదహారున్నర రూపాయ లుంటేగాని ఆ మందు యింటికి రాదు. అది అమ్మకి తెలుసు. కాకపోతే , చాదస్తం కొద్దీ రోజూ అడిగి భంగపడుతుంది.
(ఫస్టనే పండగ దగ్గిర పడిందే అమ్మా! మరేం ఫరవాలేదు. నా సైకిల్ కి ట్యూబూ , టైర్లతో పాటు నీకు మందూ కోనేస్తాను డోంట్ వర్రీ)
"మందోచ్చిందిగా నమ్మా డబ్బు లేదు. నాలుగైదు రోజుల్లో కొనేస్తాను. అవునే అమ్మా! అన్నయ్య ఉత్తరం రాసేడా?"
"ఇంకా నయం మందుకి డబ్బు పంపేడా అని అడిగేవు కాదు."
"నేనామాట అన్లేదు గదుటే"
"నాకు తెలుసులేరా శీనూ!"
(అమ్మ కేమితో తెలుసుట , తెలుసు . ఏం తెలుసో నా గురించి ఎంత తెలుసుకుందో ఒన్ ఫైన్ మార్నింగ్ అడిగేయాలి. తెలుసు తెలుసనీ నన్నదర గొట్టేస్తుంది రోజూ. ఈ తెలుసనే సస్పెన్స్ తో నేను నోరుమూసుకుని కుచోలేనింక. ఈ తెలుసులో నేనెంతవరకు బాధ్యుడ్నో తెలీడం లేదు. ఆ తెలుసులో నా అసలు రంగేమిటో తెలీదు. ఎప్పుడో తడవ అడిగేస్తాను -- 'అమ్మా! నాగురించేమిటో తెలుసనీ ఇన్నాళ్ళూ కంగారు పెట్టేవే, ఆ తెలిసిందేమిటో యివాళ చెప్పేయంతే అని డబాయించి పారేస్తే గాని నాకు సుఖం లేదు.)
అతను మెల్లిగా వంటగది వేపు వెళ్ళేడు. అక్కడా గదిలో పొయ్యి దగ్గిర పొగని భరించలేక కళ్ళట్టుకుంటున్న అర్ధాంగి కనిపించిందతనికి. లోపల అడుగు పెట్టినవాడు కాస్తా అర్ధాంగి ఒకే కేకతో బయటి కేగిరి పడ్డాడు.
"రామ రామ! వీధులన్నీ తిరిగివచ్చిన కాళ్ళతో వంటగదిలోకి తిన్నగా వచ్చేయడమేనా? కాళ్ళు కడుక్కు రాకూడదూ?"
దొడ్లో కాళ్ళు కడుక్కుంటూ అతను మెల్లిగా సణుక్కోవడం ప్రారంభించేడు."
"వీధులన్నీ తిరిగొచ్చేనుట. ఇది నన్నింత విసుక్కుంటుంది ఏమిటి కదా? వీదిలన్నీ తిరిగేందుకు నేనేమైనా బెలూన్లు అమ్ముకునే మనిషినా? ఎంతో హోదా గల - చెక్కులు రాసే ఉద్యోగిని నేను. నా అంతటివాణ్ణి పట్టుకుని వీధులు తిరిగే బికారి వెధవనంటుందేమిటిది? కాళ్ళు కడుక్కోలేదంటే అది వేరే విషయం."
పాద ప్రక్షళన ముగిసిన తరవాత విసురుగా వంట గదిలోకి వచ్చి అరిచేడు.
"అవునే సీతా! నేనెన్ని వీధులు తిరుగుంటావని నీ ఉద్దేశం? ముందా మాట విత్ డ్రా చేసుకో!"
"వేళాకోళాని కేమొచ్చే గానీండి . అక్కడ కూచోండి కాఫీ యిస్తాను."
"పైగా , వేళాకోళమంటావేమిటే? నీ పుణ్యమాయిరి ఒక్క మాటను - నేను వీధులు తిరిగే జడ్జి ఉద్యోగం చేయలేదని ఒప్పుకో. నా మనసు బాగుండదు నువ్వు ఒప్పుకోపొతే."
"ఇది బడాయి కాదూ?"
"ఎంతమాత్రం కాదు. చాలా సీరియస్ గానే అంటున్నాను. ముందు నీనోటి తొందరికి ఆపాలజీ చెప్పుకో!"
