అతని కాళ్ళు కరీమ్ చాచా ఇంటి దారిపట్టాయి. అతను వెళ్ళేసరికే ఖాదర్, అతని భార్య, శ్వేత, కరీమ్ కొడుకు, కోడలు పిల్లలు గోలగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
"రా బేటా-రా" కరీమ్ పిలిచాడు.
శ్వేత అదే చిరునవ్వుతో "హలో" అన్నది.
" హల్లో"అని నవ్వి, అందరికీ 'సలామ్'అంటూ తలవంచి అభివాదం చేశాడు.
వెళ్ళి వాళ్ళతో కూర్చున్నాడు.
"పాసయినవ్ పార్టీ ఇవ్వాలి బేటా."కరీమ్ భార్య అన్నది.
"తప్పకుండా చాచీ..." అని, శ్వేతవంక చూచాడు.ఆమె నవ్వింది. ఆ నవ్వులో స్నేహం ఉట్టిపడుతోంది.
తెల్ల ఆర్గండి చీరపై నల్ల చుక్కలున్న చీరకట్టుకుంది. ఒదులుగా జడ అల్లుకుంది. నల్లని చుక్కబొట్టు పెట్టి, నల్లని క్రిస్టల్స్ హారం మెడలో వేసుకుంది. ఆ క్రిస్టల్స్ వేళ్ళాడదీసినా రింగులు పెట్టుకుంది.
"సారీ శ్వేతా!" అన్నాడు మెల్లగా ఆమెకే వినిపించేటట్టు.
" సారీ దేనికి? నా ప్రయెజనం కోసం చేసినా, పొరపాటే కదా. మనవారు తొందరపడి పెళ్ళిళ్ళు నిర్ణయించేస్తారు. కాదనటానికీ వీలు లేదు! నా చదువు అంతా నాన్న స్నేహితుడి దయవల్ల జరిగింది"అన్నది.
"ఆ విషయం మరిచిపో,ఆ నిముషంలో నన్ను నేను మరిచి పోయాను."
"ఉత్తరాలు రాస్తారుగా?"
" సమయముంటే రాస్తాను."
"అయితే ఇంకా నాపై కోపంగా ఉన్నారనుకోనా!"
"అబ్బే ? అదేంలేదు ఈ పరిస్థితులలో ఇంకా మనస్నేహం కొనసాగించాలంటారా!" అన్నాడు సూటిగా చూస్తూ. ఆమె జవాబు చెప్పలేదు.
"మీరు ఎంతదూరంలో వున్నా, నా హృదయానికి దగ్గరగానే వుంటారు."అన్నాడు ఆమె నొక్కుతూ.
"ఇంకా మీ కేసు మామ్లా అయిపోతే బేబీ! బిస్మిల్లా అందామా?" అన్నాడు కరీమ్.
"ఎక్కడ తీరుతుంది చాచా! ముఖ్యసాక్షిని నేను. నన్ను చంపాలా వద్దా తేల్చుకుంటున్నారు. మా సాంఘిక దురాచారుల ముఠా." అన్నాడు.
"తోబా !తోబా! అవేం మాటలు బేటా..."ఆయన నొచ్చుకున్నాడు.
అందరూ భోజనానికి లేచారు!
వాళ్ళు ఒక బల్లచుట్టూ అందరూ కూర్చున్నారు. బల్ల అడుగుఎత్తే ఉంది. దానిపై తెల్లని గుడ్డ పరిచారు. దాన్ని వారు, "దస్తర్ ఖానీ" అంటారు.అందమైన పింగాణి ప్లేట్లు, తళ తళలాడే గాజుగ్లాసులు అమర్చారు.
అందరూ వెళ్ళి కూర్చున్నారు.
"శ్వేతా బేటీ! దీని తరువాత "ఖానా" మీ పెండ్లిని....." అన్నాడు.
ఆమె ముఖం ఎఱ్ఱగా మారిపోయింది.
" అదేం మాట చాచా! ఆమె మానూరికి డ్యూటీపై వచ్చింది. మిమ్మల్ని బాబాయి. అనుకుంది., మీరు బాబాయి అవుతారా!నన్ను ప్రేమించి నట్టునటించింది. అంతమాత్రం చేత మాకు పెండ్లా?" సిద్దార్థ కట్ చేశాడు
" ఏమిటి!శ్వేతాబేటి డ్యూటీమీద వచ్చిందా!"
"అవును. ఆమె సి.ఐ.డి. ఆఫీసరు. శంకరి పూర్తి చరిత్ర తెలుసుకోవాలంటే స్త్ర్రీలవతో స్నేహం పెంచుకోవాలని ఆమెను ఈ ఊరు పంపారు. ఒంటరిగా ఉండడం యెలా అనుకుంటుంటే, మీరు దయగల వారని మీ అడ్రసు నేనేఇచ్చాను." అన్నాడు ఖాదర్.
"యా అల్లా!భలే టోకరా ఇచ్చావు బేటీ...."
శ్వేత చిన్నగా నవ్వింది.
అందరూ భోజనానికి ఉపక్రమించారు. వారు దస్తర్ భావ ఎంత శుభ్రంగా ఉంచుతారో ,అంత చిరాకు కల్గిస్తారు.ఎంగిలి పాటించరు.అది శ్వేతకు గొంతు పట్టినట్టుంది.
నవ్వుతూ , త్రుళ్ళుతూ భోజనాలు చేశారు.
చాచీ స్పేషల్ కిళ్ళీలు కట్టి ఇచ్చింది.
"నాకు కిళ్ళీలు కట్టటం నేర్పు ఆంటీ."అన్నది శ్వేత.
