Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 5


    "ఉహూ అంత పెద్ద విషయమా?'
    'నేనొక కధ చెప్తాను వింటారా ?'
    'అబ్బ ఇప్పుడా -- ముందు నేను ఇందాక అడిగిన దానికి సమాధానం చెప్పు ఆ తరువాత ఒకటి కాదు, వంద కధలు వింటాను.'
    'అలా తొందర పడితే ఎలా మరి -- ఈ కధ విని మీరు చెప్పబోయే సమాధానం మీద ఆధారపడి వుంటుంది నా సమాధానం!
    'ఉహూ?'
    'అనగా, అనగా ఒక అమ్మాయి....' మెల్లిగా మొదలు పెట్టిన కళ్యాణి, చెప్పటం ఆపి ఒక్కసారి అతని కళ్ళల్లో కి చూసింది.
    'నువ్వు చెప్పబోయేది నాకు తెలుసు లేవోయ్ -- నాకు ఈ కులాలతో నిమిత్తం లేదు. నా నిర్ణయం వింటే నీ భయం గియం అన్నీ యెగిరి పోతాయి ' అన్నట్లు ధీమాగా చిరునవ్వుతో మెరిసిపోతున్నాయి అతని కళ్ళు ....ఆ మెరుపు చూడటాని కే ధైర్యం చాలనట్లు చటుక్కున తల వాల్చేసు కుంది -- ఆ తరువాత ఒక్కొక్క అక్షరమే కూడ బలుక్కుంటూన్నట్లు దిగజారిపోతున్న ధైర్యాన్ని కూడ దీసు కుంటున్నట్లు అతి నెమ్మదిగా చెప్పటం మొదలు పెట్టింది.
    'ఆ అమ్మాయి....ఆ అమ్మాయి....పుట్టింది....బోగం వాళ్ళ యింట్లో...'
    అప్రతిభుడై పోయాడు మురళీ -- ఆ ఒక్కమాట ఒక్కసారిగా సర్వ ప్రకృతి ని స్తంభిం ప జేసి తనని శిలగా మార్చి వేసినట్లయింది ....అసలు చలనమే లేదనుకున్న అతని అణువణువులో, 'కళ్యాణి , వేశ్య కూతురు-- వేశ్య కూతురు కళ్యాణి' అనే రెండు మాటలే లెక్క లేనన్నిసార్లు ప్రతిధ్వనిస్తూ భయంకరంగా వినిపిస్తుంటే కోపంతో వో విధమైన భయంతో అతని సర్వాంగాలూ కంపించి నట్లయింది-- ఒక్క క్షణం సేపు కొట్టు కోవటమే మానేసింది అనుకున్న అతని గుండె మితిమీరిపోయిన భయోద్వేగాలతో దడదడ లాడిపోవటం మొదలు పెట్టింది.
    తనలోని సంస్కారానికి కళ్యాణి మురిసి పోవాలనీ, ఇన్నాళ్ళూ తను చేసిన  స్నేహం ఒట్టి, కాలక్షేపానికి మాత్రమె కాకుండా, దానిని శాశ్వతమైన బంధంగా మార్చుకోటానికి తనెంత సహసమైనా చేస్తాననీ.....ఎన్నో ఎన్నెన్నో చెప్పాలనున్న మురళీ పెదవి విప్పి మాట్లాడటమే మరిచిపోయిన వాడిలా, రెప్పకూడా వాల్చకుండా అలా చూస్తూ కూర్చుండి పోయాడు.
    కాని కళ్యాణి పరిస్థితి అందుకు పూర్తిగా వ్యతిరేకంగా వుంది....ఆ మొదటి ఒక్క వాక్యం చెప్పటానికి తన ఒంట్లో శక్తి అంతా ధారపోస్తూ విలవిల్లాడి పోయింది. ఆ మాటలు తన నోటితో వుచ్చరించ లేని అశక్తతతో బిగుసుకు పోయింది. తనని చూసి తనే అసహ్యిన్చుకుంటున్నట్లు , జాలి పడుతున్నట్లు మొహం మీద కత్తి వేతులు నెత్తురు చుక్క లేకుండా పాలిపోయింది.....కాని చివరికి ఎలాగో ఆ ఒక్క మాట చెప్పేసిన తరువాత ఆమెలో ఎక్కడ లేని ధైర్యమూ చొరవా, మొండి తనమూ చోటు చేసుకున్నాయి. వినేవాళ్ళుంటే తన కధ అంతా అప్పటి కప్పుడు చెప్పేయాలి అన్నంత ఆత్రంగా వుంది....అయినా అది....ఆ కధ ....తనంత తానుగా మొదలు పెట్టటం కాక ,
    'ఊ.....ఆ తరువాత ? ఏమిటి? నీ కధంతా వినాలని వుంది నాకు.' అన్న మాటలు అతని నుంచి వినాలని వెర్రి ఆశతో కోరికతో నిరీక్షిస్తూ కూర్చుంది ...కాని, క్షణాలు అతి నిశ్శబ్దంగా గడిచి పోతున్నాయి -- ఆమెకి అర్ధం అయింది ....అయినప్పటికీ....
    మురళీ మౌనం, గాంభీర్యం గ్రహించి కూడ కళ్యాణి చలించలేదు -- 'ఇందులో వింత ఏమీ లేదు. ఈ పరిస్థితి నేను వూహించినదే .' అనుకుని కొద్ది క్షణాలు ఆగి మళ్లీ మొదలు పెట్టింది తల వాల్చుకునే --
    'నాకు జ్ఞానం వచ్చినప్పటి నుండి ఒకే ఒక్క కోరిక నా అణువణువు లోనూ నిండి పోయింది -- అహో రాత్రాలు ఒకే ఆలోచన ఒకే ధ్యాస నా గుండెల నిండా ఆక్రమించుకుంది-- ఆడదాన్ని గా పుట్టినందుకు ఒకరి భార్యగా, పిల్లల తల్లిగా నిండయినా సంసారం లో బ్రతుకుతూ గర్వంగా సంతోషంగా పది మందిలోనూ తల ఎత్తుకు తిరగాలనేదే నా ఆశయం ....నాది ఎంత పవిత్రమైన కోరిక అయినా అది నా పట్ల దురాశే అవుతుందనీ, ఎంతో మంది ఆడవాళ్ళ కి అడగకుండా నే అందుబాటు లోకి వచ్చే ఆ అదృష్టం నాకు గగన కుసుమమ అవుతుందని నేను గ్రహించుకోక పోలేదు...అయినా ఆ కోరికని చంపు కోటం నా వశం కాలేదు. రోజులు గడిచిన కొద్దీ ఆ కాంక్ష అంత కంతకూ బలవత్తరమై అదే నా వూపిరిగా , అదే నా ప్రాణంగా అయిపొయింది.....అంతే కాదు, ఏదో ఒకనాటికి నా కోరిక తప్పక నెరవేరుతుంది అనే ఆశాభావం కూడా నా అంతరంగంలో పాటమరించసాగింది -- ఆ ప్రలోభాన్ని, బలహీనత ను జయించటం నా శక్యం కాలేదు...అందుకే.....అందుచేతనే ...మీకు మీ మాత్రం దగ్గరగా రావటానికి సాహసించాను .' - చెప్పటం ఆపి ఒక్కసారి కళ్ళు ఎత్తి మురళీ మొహంలోకి చూసింది-- ఒక్క క్షణం వారి చూపులు కలుసుకున్నాయి-- అంతే -- అప్పటిదాకా రెప్ప వాల్చటం కూడా మరిచిపోయిన వాడిలా కళ్యాణి నే చూస్తున్న మురళీ  ఆమె తలయెత్తిన మరుక్షణం లోనే చటుక్కున చూపులు ప్రక్కకి తిప్పేసుకున్నాడు--
    అతని చూపులలోని భావం -- అది తనపట్ల ఆగ్రహమూ, అసహ్యమూ ఉదాసీనతా ముప్పేట లుగా అల్లుకుని అదో విధమైన కరుకుదనాన్ని నింపుకుంది....
    మనస్సు చివుక్కుమన్నా మౌనంగా ఉండలేక్జ మళ్లీ చెప్పటం మొదలు పెట్టింది.
    'నాకు తెలుసు -- మీకు....మీకే అని ఏమిటి ? ఈ పరిస్థితిలో వున్న ఏ వ్యక్తీ కయినా నామీద కోపం వస్తుంది. మొదట్లో నేనా సంగతి చెప్పకపోవటం పొరబాటే ఏమో ...నిజం చెప్పాలంటే -- నేను ఎన్నోసార్లు నా చరిత్రంతా మీకు చెప్పాలని ఎంతగానో ఆరాట పడ్డాను. కాని, అంతలోనే నాకు అనిపించేది అది విన్న తక్షణం మీరు నాకు దూరంగా వెళ్ళిపోతారు. జన్మలో మరి నా మొహం కూడా చూడరు. ఆ భయంతోతే మిమ్మల్ని వదులుకోలేని పేరాశతో టే ఎప్పటి కప్పుడు ఇవాళ కాదు, మరోనాడు చెప్తాను అనుకుంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చాను....ఎంతో సంతోషంగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తున్న సమయంలో వినటానికే జుగుస్ప కలిగించే నిజాన్ని చెప్పి మనమధ్య వాతావరణా న్ని కలుషితం చెయ్యటం ఇష్టం లేకనే నోటి చివరి దాకా వచ్చిన మాటలని కూడా అంతలోనే వెనక్కి తీసుకుంటూండే దాన్ని....అంతే కాని మిమ్మల్ని మభ్యపెట్టి ఎలాగో అలా మీ జీవితంలో చోటు చేసుకోవాలనే దురుద్దేశ్యం నాకు ఏనాడూ లేదు-- మన పరిచయం లో, స్నేహంలో ప్రతీ క్షణాన్ని ఎంతో అపురూపంగా చూసుకునే నేను మిమ్మల్ని మోసం చెయ్యాలని ఎప్పుడూ అనుకోలేదు....మొట్టమొదటి గా మీ మనస్సు అర్ధం చేసుకో గలిగిన క్షణం లో నేనెంత పరవశించి పోయానో, నా అంతటి అదృష్టవంతురాలు మరెవ్వరూ వుండరన్నట్లు ఎంతగా మురిసి పోయానో -- అది మాటలలో చెప్పటం నాకు చేతకాదు. అయితే ఆ స్థితిలో కూడా నా స్థానాన్ని నేను మరిచి పోలేదు. ఏదో ఒక నాడు యదార్ధాన్ని మీకు తెలియ జేయ్యాలనీ, అది విన్న తరువాత , మీ నిర్ణయం ఎలాంటి దయినా సరే సంతోషంగా దాన్ని ఆమోదించాలనీ నేను ఆనాడే నిర్ణయించు కున్నాను. ఇంక ఎలాంటి వాయిదాలు వెయ్యకుండా నా సంగతంతా మీకు చెప్పాల్సిన అవసరం, అవకాశం ఇవాళ నాకు వచ్చింది. ఎలాంటి సంకోచమూ లేకుండా ఏ విషయమూ మరుగు పరచకుండా నా చరిత్ర అంతా మీకు చెప్తాను. అదంతా విన్న తరువాత నా కోరిక న్యాయమైనది అవునో కాదో మీరే నిర్ణయించండి.
    కళ్యాణి గొంతులో గాద్గద్యం , చూపులలో దైన్యం ఆమె అంతరంగం లోని ఆవేదనని స్పష్టం చేస్తున్నాయి. అయితే మురళీ మనస్సు ఏ విషయాన్ని గమనించ గలిగే స్థితిలో లేదు. 'ఏమిటిది? ఎందుకిలా అయింది?' అని ఆలోచిస్తున్న కొద్దీ అతనిలో ఆగ్రహమూ, ఆవేదనా, కూడా పెల్లుబికి వస్తున్నాయి. ఏ మాట మాట్లాడ టానికీ , వినటానికి కూడా అతని మనస్సు ఇచ్చగించటం లేదు.
    అతని పరిస్థితిని అర్ధం చేసుకున్న కళ్యాణి తన ఆరాటాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ అర్దిస్తున్నట్లే అంది -- 'నన్ను క్షమించండి. మీ మనస్సు కి చాలా కష్టం కలిగించాను....కాని నా కధంతా వింటే.'
    'ఊహూ -- ఇప్పుడు కాదు.....మరోసారెప్పుడైనా వింటాను' ఎలాగో ఆ రెండు మాటలూ అనేసి చరచరా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు మురళీ -- అలా వెళ్లిపోతున్న అతన్ని చూస్తుంటే కళ్యాణి కళ్ళు చమర్చి రెండు అశ్రు బిందువులు చెంపల మీదికి జారిపడ్డాయి.
    'మరోసారి వింటారా మురళీ -- నాకు తెలుసు ఆ మరోసారి అనేది మన జీవితంలో ఇంక రాదు.' అనుకుంటూ విరక్తిగా నవ్వుకుని, కొంగుతో చెంపలు తుడుచుకుని పార్కు దాటి ఇంటి వేపుకి బయలు దేరింది మెల్లిగా .

                              *    *    *    *
    ఇల్లు చేరుకొని తాళం తీసుకుని తలుపులు తెరుచుకుని గదిలో మంచం మీద వాలి పోయింది కళ్యాణి -- ఇంతసేపూ నిగ్రహించు కుంటూ వచ్చిన దుఃఖము ఒక్క సారి పొంగి వచ్చి, కన్నీళ్లు జలజలా రాలి చెంపలని తడిపేస్తుంటే కొంగుతో అద్దుకుంటూ.
    'ఏమిటిది ? ఎందుకు నాకీ దుఃఖం .....ఇలాంటి పరిస్థితే ఎదురవు తుందే మోనని నేను ఎన్నోసార్లు అనుకున్నదే కదా -- ఇక అలాంటి నేను, ఇవాళ మురళీ ప్రవర్తనకి కొత్తగా బాధపడటం ఏమిటి? ఏదో జరగకూడనిదిజరిగినట్లు ఇంతగా కుమిలి పోవటం ఏమిటి?' అని తనని తనే మందలించు కుని మనస్సు ని అదుపులోకి తెచ్చుకోవాలని ప్రయత్నించింది.
    ఇన్ని రోజులూ యదార్ధం అనేది ఎదురుగా నిలబడి కొరడా జళిపిస్తూ కళ్యాణి వూహలకి కళ్ళెం వేస్తున్నా ఆమె అంతరాంతరాల్లో వో చిన్న ఆశా రేఖ మినుకు మినుకు మంటూ మెరవటం మానలేదు --
    'సంఘంలో మా మా స్థానాలని మా మధ్య గల దూరాన్ని నేనెప్పుడూ మరిచిపోలేదు-- ఒక మహాపర్వతపు ఉన్నత శుఖరం మీద మురళీ నిలబడి వుంటే క్రింద అగాధం లాంటి లోయలో నేను వున్నాను-- అయినా అతను దీర్ఘమైన బాహువులు చాచి నన్ను అందుకుంటాడనీ తనచేయి ఆసరాతో నన్ను కూడ ఆ శిఖరం మీదికి జేర్చు కుంటాడనీ అనిపించేది -- కళ్యాణి , నీ చరిత్ర ఏదైనా కానీ, నీ తల్లి తండ్రులు ఎవరైనా కాని వాటితో నాకేమీ నిమిత్తం లేదు. నాకు కావలసింది నువ్వు....అర్హత ని మించి ఆశలు పెంచుకున్నాను అనే మాట నువ్విక అంటే నేను వూరుకొను -- నా భార్యగా నీతో జీవితం పంచు కోగలిగే అర్హతలన్నీ నీకు వున్నాయి. అంటూ అనురాగంతో అక్కున జేర్చుకుంటాడు అనుకున్న మురళీ నా చరిత్ర వింటేనే పాపం చుట్టూకుంటుంది అన్నట్లుగా పరుగెత్తి పారిపోయాడు -- నా చేయి అందుకోవాలని చాపబోయిన చేతిని గబుక్కున వెనక్కి లాక్కుని నీ బ్రతుకంతా ఈ అగాధం లోనే గడపాలి , నువ్వు పైకి రాలేవు, నీ ఖర్మ యింతే -- అన్నట్లుగా వెళ్లి  పోయాడు. ' ....ఆలోచిస్తున్న కొద్ది కళ్యాణి అంతరంగం గిలగిల కొట్టుకు పోతోంది.
    మురళీ చూపుల్లో అతని మాటల్లో, అలా గిరుక్కున వెనక్కి తిరిగి గబగబా నడిచి వెళ్లి పోవటంలో స్పష్టంగా కనిపించిన తిరస్కారం ఆ నిరాదరణ ఎంత మరిచి పోవాలనుకున్న మరుపు రాకుండా తనని వెక్కిరిస్తూ బాధిస్తూ వెంటాడు తున్నట్లే వుంది.
    మూడంకేలా ముడుచుకుపోయి అదే ధ్యాసగా పడుకున్న కళ్యాణి కాస్సేపటి తరువాత పేలవంగా నవ్వుకుంది -- ' హు-- బాధ-- నిరాదరణ-- తనకి వూహ తెలిసి నప్పటి నుండి ఈ విధమైన నిరాదరణ కి అలవాటు పడిపోయే వుంది-- ఇది మరో కొత్త అనుభవం '...కళ్యాణి మనస్సు, ఆలోచనలు గతాన్ని నెమరు వేసుకోటం లో మునిగి పోయాయి.......


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS