"ఎలాగొస్తాది?"
"రేపు యేగిరం యెలిపొద్దాం, తక్కువుంటే వీరన్నబాబుని అడుగుదాం."
"ఆడిదగ్గర పిల్లిగవ్వ వుంచనివ్వదు బోడమ్మ."
"ఆడాళ్ళమీద తెగులు చూపించి ఆడుకోవాలని సూస్తన్నాడు. ఆ యెదవకి, సివరికి పీకడానికి వుత్తిటంకే మిగుల్తాది. దేముడికి మొక్కినాను. దెయ్యమై పట్టుకోడు. ఇల్లు వెరపడు, చూపుచూసి మనకు మేలు కలుగజేస్తాడు."
ఆదివారం వచ్చేసింది. ఆ రోజు ఆర్జన అంతగాలేదు. ఇద్దరూ పొలంగట్టుదగ్గర కలుసుకున్నారు. రెండే కొంగలు ఆకాశాన యెగిరి పోతున్నాయ్. అవి వాలితే బాగున్నవి పైకి చూస్తున్నాడు రాముడు.
"రాముడూ!" - పిలుపు వినిపించింది. త్రుళ్ళి పడి చూశాడు.
"తే - నా మూడు రూపాయలు తే..."
"ఏం బాబో"?
"నీ మందు పనిచెయ్యలేదురా!"
కళ్ళు తేలవేస్తున్న రామునివేపు చూసి కోటమ్మ "ఏదో అసత్యం సేసుంటారు. మందు సిసలైన మందు. పది పుటాలేసిన మందు, నా సేతులతో యిచ్చినాను. ఎందరికి ధాతుపుష్టి వచ్చి పిల్లల్ని గన్నారు!"
"అలాగా....ఎళ్ళండి....ఎళ్ళండి."
రాముడు మెల్లగా వణుక్కుంటూ అడుగువేస్తుంటే.
"ఒరే..."
"బాబ్బాబు..." ఆగి వెనుకకు తిరగలేదు.
"ఇద నీ బహుమానం... రెండు పదులు........నేనే యింటికి వస్తుంటే కనిపించావు. సులువుగా వుంది, మళ్ళీ మందియ్యి."
ఆ రెండు పదులు పట్టుకుని యేడుస్తూ "బాబో ఈ రెండు పదులు.... నాకు కొండంత బాబో....నాకేం వైద్యుగుం రాదు - నా పెళ్ళం సెప్పినట్లు సెప్పి యిచ్చినాను. మీరు నమ్మినారు. బాగైనాది- దాన్ని మంచి మనసు, మంచి సెయ్యి బాబు. ఈ డబ్బుతో అప్పు తీర్చుకుంటాను. నా పెళ్ళం నా దగ్గరుంటాది."
కాస్సేపయ్యాక అతను కథంతా విని జాలి పొందాడు. "ఇంకా అవసరం వస్తే నన్ను చూడు" అన్నాడు. గెంతు వేసుకుంటూ, వూలవేసుకుంటూ పెళ్ళంవంక చూస్తూ కుప్పిగంతులు వేసుకుంటూ యింటివేపు వెళ్ళిపోయాడు.

5
చిట్టిరాజు వచ్చి నెల దాటింది. మొదట యీ పాకల్లో బతుకు బరువనిపించినా రానురాను అలవాటు పడ్డాడు. ఇక్కడ తను మెసలివచ్చిన వూర్లో వున్నవెన్నో లేవు. ఐనా అవి లేనిలోటు గురించి యిక్కడ తనలో నిత్యం మండుతున్న కామపుమంట ఆలోచించనివ్వలేదు.
"ఎప్పటికైనా కోటమ్మని అంకించుకోకపోతే వీడు చిట్టిరాజే" కాడని లేని మీసం తిప్పి పలికిన మాటలు పుప్పాల రాముడు చెవిలోనికి వెళ్ళాయి. ఆ మాటలు విన్న దగ్గరనించీ వాడి గుండెలో గునపం నాటింది. చిట్టిరాజునూ, తననూ సరిపోల్చుకునే వుంటున్నాడు. వాడి దగ్గర రూపులోనూ, బలంలోనూ, డబ్బులోనూ, దేనిలో తను గొప్ప వాడుకాడు. విసరగా విసరగా ఒకరాయి తగిలినట్లు చిట్టిరాజు దీనియెంటపడి యెంటపడి సివరికి మనసు విరిసేస్తాడనే ఆవేదనపట్టుకున్నది. తనతో కోటమ్మకి మిగిలిందేమిటి? దరిద్రం గంజితాగి తను వయ్యారం సూపిస్తే సెభాష్ అన్నవాల్లెవారు? చిట్టిరాజులో ఆ తళుకు, కులుకు లచ్చణాలు లచ్చిమి తెచ్చింది.
"అప్పు తీర్చావు కదా? ఏల అలాగున్నావు?" అంది కోటమ్మ.
అలా అనగానే రాముడు వెక్కి వెక్కి యేడవటానికి మొదలు పెట్టాడు. చిన్న పిల్లాడిని ఓ దార్చినట్లు వాడితలను గుండెకు ఆన్చుకుని బోధ చేసింది. చివరకు యెలాగో ఆమె దగ్గర అసలు విషయం కక్కేసాడు.
"యెదవ. ఆడి ఒళ్ళుతీపరం నాను తీస్తానులే. కట్టుకున్నావు. యెంటవచ్చినాను. ఇన్నాళ్ళు జబ్బులో వున్నావు. ఎవురైనా యేలుచూపించి నారా? ఇంకా నన్ను నమ్మ వెందుకు?"
నమ్ముతానే కోటమ్మా... నమ్ముతానే..." కోటమ్మను నలిపివేసి యేడ్చేశాడు. దీనితో మళ్ళీ ఆరోగ్యం ఒకదారిలో పడింది. కష్టపడి కడుపు నింపు కుంటున్నారు. కలిగితే లేనోడికింత యిస్తున్నారు. కష్టసుఖాలకని మిగిలింది వుస్తున్నారు.
ఒకనాడు వీరన్నకంట్లో పడేవరకూ గుంపులో పరిస్థితులు యింత తారుమారయ్యాయని అనుకోలేదు. కొడుకు తనయీడు పదిమందిచేత సిగరెట్లు కాల్పిస్తున్నాడు.
"ఎక్కడివంటే?"
"కొన్నాం" అన్నాడు.
"ఈవేళ వూరకనే యిచ్చినావు. మరిగినోడు రేపు యెక్కడ నించి తెస్తాడు?"
"కరువాఁ" అన్నాడు కొడుకు నిర్లక్ష్యంగా.
"మనం మందళోలం. మనకి కరువు వుంటేనే మంచిది."
"అని పాతకాలపు మాటలు. ఇది కొత్త నీరు. ఈలందర్నీ రేపే నాలాగ వంట్లాములు, బుష్ కోట్లూ తొడిగిస్తాను."
"డబ్బు?"
"లేనోలు దోచుకోడానికే కదా వున్నోలు దాస్తారు?"
"ఆఁ -- దొంగతనమా?"
లేనోడి దగ్గర దోస్తే దొంగతనం. ఉన్నోడి దగ్గర లేనోడు దోస్తే నాయం."
"ఒళ్ళు వొంగని పని అది. బతుకంటే అంత సులువనుకున్నావా?"
"హాఁ..." అంటూనే బ్రాందీబుడ్డీని ఒక్కోక్కడూ నోట్లో యింతవేసుకుని ప్రక్కవాడికి అందిస్తున్నాడు.
"ఇదెక్కడిది?"
"తోవకాసి యిస్తావా - ఛస్తావా - అంటే బతుకు మీద తీపితో యిచ్చి దండమెట్టే వెళ్ళాడు."
అంతా పకపక నవ్వారు.
"ఈ పువ్వుల్లాంటివాళ్ళని..."
"ఆ పువ్వులు....కాయితం పువ్వులు..... వాన నెక్కడ్నించివస్తాది. నే నొచ్చి వీళ్ళకి సెంటురాసి వాసన తెచ్చాను".
వీరన్న కోపంతో ఆ బ్రాందీ బుడ్డీ లాక్కుని దూరాన్న విసిరేశాడు. అది రాయిమీదపడి బ్రద్దలయ్యింది. చిట్టిరాజు పౌరుషంతో లేచాడు.
"ఎందుకలా చేశావ్?"
"అది దొంగసొమ్ము"
"ఇందులో దొంగలు కానివారెవ్వరు?"
"పెద్దమాటలెందుకురా నీకు?"
"నాకొద్దా ? ఆ వయసినదాన్ని దానిష్టం లేకుండా మా అమ్మ మీదకు తెచ్చావు. నివ్వు దొంగవుకాదా?"
"పెళ్ళాడాను!"
"నీకోరిక లేలాంటివో-మావీ అంతే ఇక్కడే యీజాగానే మేం మాదంటాం, దీనిమీద మిద్దెలు కట్తాం. ఎప్పుడూ ఇక్కడే హాయిగా వుండిపోతాం. గాడిదలను గుర్రాలిని చేస్తాం".
"మంచిదేనానాయనా. కాకుల్ని హంసల్ని చెయ్యండి. కాదంటానా?"
"నివ్వు కాదంటే ఆగిపోతాదా? లోకమంతా జిగాలుమంటుంటే, నివ్వు యీల్ని యింకా కుల తప్పులు, కట్టుబాట్లుబెట్టి చీకట్లో పాతిపెట్టేసావు. కడుపులు మాడ్చేసి నీతి అని కబుర్లతో కడుపు నింపుతున్నావు. వీళ్ళంతా వుత్తి అమాయకులు. కాబట్టే నివ్వు ఆడినది ఆట పాడినదిపాట అయ్యింది. ఇక యీ కుర్రవాళ్ళంతా లేచారు. కుళ్ళును కడిగి వదుల్తారు. ఇన్నాళ్ళు పెద్దగా యేంచేశావో మాకు తెలుసు."

"ఏంజేశానో చెప్పలేను. ఎందుకు చేశానో చెప్తాను?" వీరన్న గొంతుక పట్టుకపోయింది. కాస్త సవరించుకొని-
"ఈ కట్టుబాట్లు, కుల తప్పులు అన్నీ తెలివి గల పెద్దలు పెట్టేశాడు. వాళ్ళకంటే మనం గొప్ప తెలివోలమైతేగానీ మార్చలేంకదా! కులపెద్దగా యీ కట్టుబాట్లు గుంపులో అంతా పాలించినట్లు సూడ్డమే. పాలించనోడికి తప్పేసి మంచిమార్గం లోనికి తేవడమే. అలా సేస్తే గుంపు గుమ్మనంగా వుంటాది. మనం కుక్కలం-యిశ్వాసంతో బతకాలి: గాడిదలం-కష్టపడాలి! పందులం- కంగాలిగా బతికినా ఒకరికి పనికొస్తాం - ఓరే అయ్యల్లారా! మనం పిచ్చికుక్కలం, కాళ్ళు విరిగిన గాడిదలం, సచ్చినపందులం కాకూడదరా? ఏలండి యెవురొద్దన్నారని" వీరన్న అక్కడనించి కదలి పోయాడు.
మర్రిచెట్టు క్రింద కూర్చున్నాడు. మనసు మండి పడుతున్నా ఒక మూలనించి నీరూరుతోంది. ఆ నీరు కళ్ళల్లో పేరుకున్నట్లు తెలుసుకున్నాడు. ఈ కొడుకు మీద యెంతో ఆశ పెట్టుకున్నాడు. వీడేదో పెద్దవాడై తన పేరు నిలబెడ్తాడనుకున్నాడు. చదివిస్తే క్రొత్త సంగతులు తెలుసుకుని మరింత నీతిగా పోతాడనుకున్నాడు. చదవేస్తే వున్నమతి పోయి నట్లు అయింది. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. కొడుకు దగ్గర కోపం తెచ్చుకుంటే లాభం లేదు. వాడికి నచ్చచెప్పాలి. "నా తరవాత నివ్వే నాయనా పెద్దవి, ఇప్పటినించే యీ గుంపుపై యేలుబడి చెయ్యి, వద్దనను. ఈ పాకలు తీసి మిద్దెలు కట్టు. వద్దనను. ఆ మిద్దెలకి పునాదులు అన్నాయం. అయినీతి అనే యిసికతో యెయ్యకు. నాయం. నీతి అనే రాళ్ళతో పునాదెయ్యి. దోచిన డబ్బుతో మిద్దెలు కట్తే గోడలు పగుల్తాయ్. ఏనాడో కూలిపోతాయి. అందులో వున్నవాళ్ళంతా వస్తారు. మాటంటే అందులో సబబుండాల. ఏదైనా చేస్తే తన పెమట కారాల-ఎదుటోడి చెమటతో ఎన్నాళ్ళు బతుకుతావు?" ఇలా యెన్నో బుద్ధులు చెప్దామనుకున్నాడు. కుర్రాడు చన్ను విడిచాకైతే తన చదువచ్చేది. ఇప్పుడు చన్ను పట్టుకునే వయసులో వున్నాడు. మప్పటం అంత సులువుకాదు. ఈడికి యేగిరం పెళ్ళి చేసిస్తే బాగున్నేమో? నలుగురిలాగ ఆడపిల్ల తన కోడలిగా దొరకటం కష్టం కాదు. ఇంకెవడైతే ఆడపిల్ల భూమ్మీద పడగానే కొనుక్కోవాలి. రజస్వల వరకూ కన్నవారింట్లో వుంటుంది. అప్పుడు ఐదు పదులో, వందలో యెంచుకున్న వందితో సహానివ్వాలి. పెళ్ళికొడుకు యింట్లో మూడు రోజులు పెళ్ళి జరిపించాలి. ఆడపిల్ల తండ్రికి పెళ్ళికొడుకు తండ్రి రెండొందలు ఖర్చుకివ్వాలి. ఇంత తంతుంది. పెళ్ళిలో ఖర్చంతా పెళ్ళికొడుకు వాళ్ళదే. ఆవేళ పెళ్ళి వూసు యెత్తాడు.
"నివ్వు రెండోపెళ్ళి చేసుకున్నావు కదా? నా కెందుకులే" అన్నాడు. వీరన్న మాటాడకుండా వూరుకున్నాడు. ఆ మరుసటిరోజు గుంపులో ఆడాళ్ళిద్దరు నైలాన్ చీరలు కట్టారు. వీరన్న ఒళ్ళు కనిపిస్తందని మందలించాడు.
"అది మామ్మూలు బట్టకాదు. చాలా విలవైంది" అన్నాడొకదాని మొగుడు.
"మనకి నేత బట్టలు రివాజు".
"ఇవి అంతకంటే మంచివట".
"ఎవరన్నారు?"
"నీ కొడుకే..."
