Previous Page Next Page 
స్రీ పేజి 5

 

    పార్వతి మనస్సంతా ఆలోచనల మాయమై పోయింది. చెప్పలేనంత సంతోషంగానూ ఉంది. ఏమిటో ఆపద వచ్చి మీద పడినంత విచారం గానూ ఉంది. సూర్యానికి బాగా ఇష్టమైన దేమైనా తినటానికి చేసి పెడదామనుకుంది గానీ కాలూ చెయ్యీ కూడి రానట్టు ఎక్కడ కూర్చుంటే అక్కడే, ఎక్కడ నిలబడితే అక్కడే అయింది పరిస్థితి.
    పద్మజ మాటిమాటికి కళ్ళలో మెదులు తున్నది.
    'ఈ రోజుల్లో ఎవరి సుఖం వాళ్ళదే! తల్లి దండ్రుల ఇష్టాయిష్టాలూ, మంచి చెడ్డలు ఎవరాలోచిస్తున్నారు? రెక్కలు రాగానే సరి. యెగిరి పోతారు' అనుకుని నవ్వుకుంటున్నారు మధ్యాహ్నం వెయిటింగ్ రూమ్ లో పద్మజ పెళ్ళి ఫోటో మీద దుమారం లేవదీస్తూ . తనకెంతో కష్టం తోచింది. కానీ, ఏం చెయ్యగలదు? పద్మజ అలాంటిది కాదని మాత్రం ఎలా వాదించగలదు?
    "నీకు స్వార్ధమే లేదక్కయ్యా!' అంటున్న సూరి మాటలు చెవులో గింగురు మంటున్నాయి.
    'ఇలా అయినా నీ ఋణం తీర్చుకోవటానికి భగవంతుడు సాయం చేస్తాడని నమ్ముతున్నాను.' రుక్కు వ్రాసిన వాక్యాలు కళ్ళ ముందు కదిలాడుతున్నాయి. తన తోడబుట్టినవాళ్ళే కాదు-- తన చరిత్ర తెలిసినంత వరకూ చుట్టాలూ, స్నేహితులూ కూడా తన నిస్వర్ధ్యాన్ని శ్లాషిస్తూనే ఉంటారు.
    కాలంతో పాటు సమానంగా మారగాలిగిన పద్మజను విమర్శించటానికీ, సర్వ సామాన్యమైన కర్తవ్యాన్ని మాత్రం పాటిస్తున్న తనను సమర్ధించటానికి ఏమంత అర్ధం లేదేమో అనిపించింది పార్వతికి.
    ఆ రాత్రికి వండుకున్న అన్నం వండుకున్నట్లే ఉంది.
    పరీక్ష పాసైన సంతోషం తోనే కడుపు నింపుకుని స్నేహ బృందంతో కలిసి సినిమాకు పోయాడు సూర్యం. పట్టెడు మెతుకులు కంచం లో పెట్టుకున్నా, తినీ తినకుండా లేచిపోయింది పార్వతి. ప్రైవేటు పిల్లలు వస్తే -- "ఇవ్వాళ చెప్పను, ఇళ్ళకి పొండి " అని అందరినీ పంపేసి పక్క సర్దుకు పడుకుంది.

                               *    *    *    *
    పదిహేను సంవత్సరాలకు పైగానే అయ్యుంటుంది.
    బుట్టబొమ్మలా , దొరసానమ్మ లా పెద్ద పెద్ద పువ్వుల గౌను తొడుక్కుని, నిర్భయంగా నవ్వుతూ కొత్త రబ్బరు సంచీ భుజం మీదుగా వేళ్ళాడేసుకుని తరగతి లో కాలు పెట్టింది పద్మజ. జడలు రెండూ ఎగిరెగిరి పడేలా ఓసారి గిర్రున తలతిప్పి క్లాసులో పిల్లలందరినీ చూసింది. చోటు కోసం ఎప్పుడూ కీచులాడుకునే సీతా, సత్యవతీ, వాళ్ళు ఎదర బెంచీలో దగ్గరగా ఇరుక్కుని తను పక్కనే ఖాళీ చూపించినా పద్మజ టక్కుటక్కుమంటూ బూట్లు చప్పుడు చేసుకుంటూ రెండు బెంచీలు దాటి వెనక్కే నడిచింది.
    అంత చక్కటి కొత్త అమ్మాయి వచ్చి నిజంగా తన దగ్గరే కూర్చునేసరికి సిగ్గుతో బిగుసుకు పోయిందా మూడవ బెంచి లో పిల్ల. పిల్లలందరూ తమ కేసి ఎగబడి చూస్తుంటే బుర్ర వంచేసుకు కూర్చుంది.
    కొంతసేపు చుట్టూ చూసి, పక్కన తల వంచుకు కూర్చున్న పిల్ల నడిగింది పద్మజ. "నీ పేరేమిటి?"
    ఆ పిల్ల ఓ ఘడియ మాట్లాడలేదు సిగ్గుతో.
    "దాని పేరేనా? నే చెప్పనా? పార్వతి. నా పేరేమో సీతా, దీని పేరు సత్యవతిను" అంటూ వెనక్కు వంగి కుతూహలంగా ఏకరువు పెట్టింది సీత.
    పద్మజ పార్వతి నుద్దేశిస్తూ రెట్టించింది :   "ఏం? నీ పేరు పార్వతేనా? అవునా?"
    "ఊ, అవును, పార్వతే." కాస్త తల ఎత్తింది పార్వతి.
    "నా పేరు పద్మజ.మా చెల్లాయి పేరు సుజాత. అది ఇంకా పెద్ద బళ్ళో చదువుకోవటం లేదు."
    కాస్త బెరుకు కూడా తగ్గింది పార్వతికి. ఎగాదిగా పద్మజ పువ్వుల గౌను చూస్తూ కూర్చుంది.
    "నీ పరికిణీ ఎంచక్కా ఉంది" అంది పార్వతి పరికిణి కొంచెం ముట్టుకొని చూస్తూ పద్మజ.
    పార్వతికి మళ్ళీ సిగ్గు వేసింది. తన పరికిణీ ఏం బాగుందనీ? పరుపు గళ్ళలా వెడల్పాటి చారలూ అదీనూ!
    "నీ పరికిణీ కొత్తగా?' అంది అమాయకంగా చూస్తూ పద్మజ.
    "ఊహూ! పాతదే. చిరగను కూడా చిరిగింది" అంటూ కుచ్చెళ్ల లో వెదికి పట్టుకుని రెండు మూడు కుట్లు కూడా చూపించింది పార్వతి. "తొందరగా మాసిపోకుండా ఉంటుందని ఈ గళ్ళ పరికిణీ కుట్టించింది మా అమ్మ. నీ గౌనే బాగుంది. ఎంచక్కా పెద్ద పెద్ద పువ్వులూ అవీను."
    కుతూహలంగా అడిగింది పద్మజ. "మరి నీకు కొత్త పరికిణీ లు లేవూ?" కుట్టిన చిరుగుల కేసి జాలిగా చూసింది.
    "ఉందిగా , ఓ పరికిణీ! అది పండక్కి కట్టుకుంటాగా!"
    పద్మజ చేతులు తిప్పుతూ చెప్పింది ; "నాకూ మా చెల్లాయి కీ బోలెడు గౌనులున్నాయి. అన్నీ కొత్తవేను. సిల్కువీ, పట్టువి వేరే అద్దాల బీరువా లో ఉన్నాయి. ఓసారి మా ఇంటికి రాకూడదూ? నీకు చూపిస్తాను."
    అడ్డంగా తల తిప్పింది పార్వతి.
    "ఏం?" ఎందుకు రావు?"
    "ఊహూ! నువ్వే మా ఇంటికి రా, ముందు"
    "ఓ ! వస్తాను. రేపు నువ్వు మా ఇంటికి వస్తావా మరి?"
    మళ్ళీ తలతిప్పి అంగీకారం తెలిపింది పార్వతి.
    తెల్లగా అందంగా ఉన్న కొత్త అమ్మాయిని ఇంటికి తీసుకు వస్తుంటే అవ్యక్తమైన సంతోషం కలిగింది పార్వతికి. పార్వతీ వాళ్ళమ్మ సావిత్రి పద్మజ కు కూడా ఓ గిన్నెలో అటుకులూ, బెల్లం పొడీ కలిపి పెట్టింది -- కబుర్లాడుగుతూ. ఆ అటుకులు తింటూ పద్మజ ఎంత తియ్యగా , ఎంత స్నేహితంగా చూసిందనీ!
    ఆ చూపు కోసమే పార్వతి పద్మజ నేస్తాన్నీ పెంచుకొంటూ వచ్చిందంటే అతిశయోక్తి కాదేమో! పద్మజ చెయ్యగల స్నేహామంతా ఆ చూపులో ఉంది. పద్మజ చూపించగల అభిమాన మంతా ఆ ఒక్క చూపులోనే ఉంది. కళ్ళు పెద్దవి చేసి నవ్వుతూ చూసే ఆ చూపు పార్వతి ఎన్నటికీ మరిచిపోలేదు.
    పార్వతి స్నేహం లో మాత్రమే కాదు-- ఇంటా, బయటా -- అంతటా పద్మజ కో ప్రత్యెక స్థానం ఉందన్న సంగతి కొద్ది కాలంలోనే పార్వతి కని పెట్టక పోలేదు. అక్క చేల్లెళ్ళ యి ఒక్క తల్లి కడుపున పుట్టినా సుజాత ల అందచందాలలో , హావ భావాలలో అన్తులేనంత తేడా వుంది. పద్మజ రాకుమార్తె లాంటి అందగత్తె. పచ్చని శరీర చ్చాయ , విశాలమైన నేత్రాలు, సుదీర్ఘ మైన తలకట్టు ఆ పిల్లకు ప్రత్యెక లక్షానాలు. ఎదుటి వాటిని సమ్మోహ పరచగల చిత్రమైన ఆకర్శణేదో ఆ చిరునవ్వులో లీనమై ఉంటుంది. ఇంట్లో అమ్మా నాన్నల దగ్గర కూడా ముక్కు సూటిగా , ఇచ్చానుసారం ప్రవర్తించే ధైర్యం పద్మజకు మాత్రమే సొంతం. సాహస గంభీర్యాలు ఉట్టిపడే పద్మజ రూపం తల్లితండ్రులకు కూడా అపురూపమైనదే. రూపవతే గాక తెలివి తేటలలో కూడా అఖండురాలైన పద్మజ పట్ల అన్నగారి కో ప్రత్యేకాభిమానం , నాలుగైదేళ్ళు చిన్నదైన సుజాత సన్నగా, పొడుగ్గా , చామన చాయతో , తల్లి పోలికలతో సర్వ సామాన్యంగా ఉంటుంది. తళతళ మెరిసే కళ్ళు తిప్పి ప్రతి విషయాన్ని ఆశ్చర్యంగా, కుతూహలంగా చూస్తూ ఉంటుంది. "చిన్నక్కయ్యా!' అని పిలుస్తూ పద్మజ దగ్గర కూడా చూపించలేని చనువుతో పార్వతి దగ్గర ప్రవర్తిస్తూ ఉంటుంది. పెద్ద కూతురు పట్ల వ్యక్తం కాని సాన్నిహిత్యమేదో కామేశ్వరమ్మ మాత్రుహృదయం లో చిన్న కూతురు పట్ల నిండి ఉంటుంది. "ఆ పెద్దది ఉత్త రాలుగాయి. పెంకి భడవ! అది మీ కూతురూ , ఈ చిన్నది నా కూతురునూ. నా సుజా తల్లి బంగారు కొండ. అన్నెం పున్నెం ఎరగని పిచ్చి తల్లి." నవ్వుతూ అంటుంది ఎన్నోసార్లు. ఆ మాట నిజం కాదనటానికి కూడా వీల్లేదు. పద్మజ కు తండ్రి దగ్గరా, సుజాత కు తల్లి దగ్గరా చనువు ఎక్కువ. భయంతోనో, సిగ్గుతోనో తండ్రి చాయల కైనా వెళ్ళలేని సుజాత తల్లి కొంగు లో దూరి మొహం దాచుకుంటే -- సిసింద్రి లా పద్మజ మాత్రం తండ్రి సరసనే కూర్చుని నవ్వుతూ మాట్లాడుతుంది. నిర్భయంగా వాదిస్తుంది . నిర్లక్ష్యంగా ఎదిరిస్తుంది.
    ప్రతి తరగతి లోనూ ఫస్టు మార్కులతో పాసాతూ తెలివిగా చదువుతున్న పెద్ద కూతురంటే ఈశ్వర సోమయాజి హృదయం అమిత గర్వంతో పొంగి పోతూ ఉంటుంది.
    ఇంటికి అంతకూ ఓ ప్రత్యెక స్థానం పొందగలుగుతున్న స్నేహితురాలంటే పార్వతి కళ్ళకు సాక్షాత్తూ ఓ దేవకన్యే! కధల్లో తిరిగే అమ్మాయి లాంటి పద్మజ కళ్ళలోకి విస్మయంగా చూస్తూ కూర్చోటం పార్వతికో వేడుక.
    సిరిసంపదలకు లోటు లేని కుటుంబం లో పెరుగుతున్న పద్మజ -- నెలకు కొన్ని పూటలైనా మజ్జిగ మెతుకులతో సంతృప్తి పడే బీద బడి పంతులు గారి అమ్మాయి పార్వతి తో చేసిన స్నేహం -- దేవత లెవరో ఆశీర్వదించినట్టే చిలవలు పలవలతో ఏపుగా ఎదుగుతూ వచ్చింది.

                             *    *    *    *
    పార్వతి ముఖంలో పసితనం తాలూకు పూర్వ కళ మెరిసింది. చిన్ననాడే ఆ కుటుంబంలో పార్వతి కొక ప్రత్యెక స్థానం లభించింది. కామేశ్వరమ్మ పార్వతిని తన బిడ్డల్లో బిడ్డ లాగే ఆదరించి ప్రేమించింది. పద్మజ తలిదండ్రుల సహృదయతే పార్వతికి వెన్నె ముకై నిలిచిందనుకోవచ్చు. అభామూశుభామూ తెలియని ఆ చిన్ననాటి అమాయకపు స్నేహ మాధుర్యాన్ని పంచుకోవటానికి మరో నేస్తం తయారయ్యాడు - రఘుపతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS