Previous Page Next Page 
చదరంగం పేజి 5


    "ఉష్ అమ్మ!" భారతి మట్టెల చప్పుడు మెట్ల మీదనుంచి రవి చెవిలోకి దూరింది. అన్నదమ్ములిద్దరూ నిరపరాధుల్లా పుస్తకాలలో మొహం దూర్చారు.

                             *    *    *

    బడినుంచి ఇంటికి రావడం, ఇద్దరే టిఫిన్ తినడం, తండ్రితో ఇద్దరే షికారుకు వెళ్ళడం ఏమిటో బాధ అనిపించింది రాముకు. తమ్ముడు రవి అదేమీ తెలియనట్లు ఎంతో చక్కగా ఆడుతూ పాడుతూ హుషారుగా ఉంటే కూడా ఆశ్చర్యంగా ఉంది. తనేదో లేవలేని స్థితిలో ఉన్నట్లు బాధ పడుతూంటే వీడికి చీమ కుట్టినట్టు కూడా లేదేమిటి? అనిపించింది. పసి హృదయంలో జరిగే సంఘర్షణను అంత తరిచి చూడాలని ఎవరూ ప్రయత్నం ఛేయలేదు.
    రెండు మూడుసార్లు రాము కళ్ళు తుడుచుకోవడం భారతి గమనించింది. కానీ పసిపిల్లల మనసు ఒత్తిడి చేసి అటువైపు ఆకర్షణకు గురి చేయడంవల్ల క్రమశిక్షణకు ఎంత లోపమో అనుభవంమీద బాగా తెలుసు. అందుకే మౌనంగా చూసీచూడనట్లు వెళ్ళిపోయేది.
    రాము పుస్తకం ముందు కూర్చున్నాడు. కళ్ళు అక్షరాల వెంబడి పరుగు తీస్తున్నాయి. మనస్సు చదువు తూంది. పేజీలకు చేతులు తిప్పుతున్నాయి. అంతే మెదడు గ్రహించడంలేదు. ఒకటా రెండా పదిహేను రోజులుగా జయ కనిపించడంలేదు.
    గుమ్మంలో ఏదో చప్పుడైంది. బహుశా తల్లి కాలు గుమ్మానికి తగిలిన చప్పుడేమో? నిర్లక్ష్యంగా ఊరుకొన్నాడు. చిన్నగా దగ్గి తన రాకను సూచిస్తూంది జయ.
    రాము కళ్ళు అప్రయత్నంగా అటు తిరిగి మెల్లగా నవ్వును పులుముకొన్నాయి. "వచ్చావా!" ఎన్నాళ్ళనుంచో గుంభనంగా దాచిన మాటలు నోటివెంట దొర్లిపోయాయి.
    "కోపం వచ్చిందా?" జయ కూర్చుంటూ అడిగింది.
    రాము మాట్లాడలేదు. జయవంక దృష్టిని సారించి పరిశీలనగా చూస్తున్నాడు. పచ్చగా బొద్దుగా తయారై ఉన్న జయ పట్టు పరికిణీ, పట్టు జాకెట్టూ వేసుకొని పలచటి ఓణీ వేసుకొంది. గాజులు తళతళ మెరుస్తున్నాయి. చెవులకు జూకాలు. ఒక జడ బిగించి వేసుకొని జడగంటలు పెట్టుకొంది, రెండు జడలు మానేసి.
    ఎడమ చేతికి వాచీ పెట్టుకుంది. చూస్తూంటే మరీ మరీ చూడ బుద్ధి పుడుతూంది. రాము నవ్వాడు. "అమ్మ అంటే ఏమిటో అనుకొన్నాను. నిజమే."
    జయ సిగ్గుగా, "ఏమిటి?" అంది.
    "అమ్మ నువ్వు పెద్దదానవయ్యావు అంటే ఏమిటో అనుకొన్నాను, జయా! నిజమే." పుస్తకం మూసేసి జయ చెయ్యి పట్టుకొన్నాడు. జయ భయం భయంగా చూసింది. 'ఏమి'టన్నట్లు ప్రశ్నిస్తున్నాయి కళ్ళు.
    "నువ్వు తోటలోకి రావా?"
    జయ నవ్వింది. "ఇకనుంచి ఆటకు రాను. కావాలంటే ఇంట్లోనే చెస్ ఆడుకొందాం."
    "కూర్చొని ముసలమ్మలా." కసిగా అంటూ జయ చేతిని విసురుగా విదిలించాడు. పచ్చని గాజులు డ్రాయర్ కు గుద్దుకొని పప్పు పప్పైపోయాయి. విరిగిన గాజులు 'పిరికిపంద' అంటూ చప్పుడు చేస్తూ కింద పడ్డాయి. సన్నగా చీరుకొని చేతికి గాయం తగిలింది. జయ నవ్వుతూనే అంది: "నేను చెప్పలేదూ? నీకు రోషం తప్ప మరేమీలేదు."
    రామునొచ్చుకొంటూ పగిలిన గాజు ముక్కల్ని ఏరి కిటికీలోంచి దూరంగా విసిరేశాడు. జయ ఎదురుగా కూర్చుని చాలాసేపు మాట్లాడాడు. చీకటి పడబోతూంటే "వస్తా" అంటూ వెళ్ళిపోయింది. జయ మలుపుతిరిగేవరకూ చూస్తూనే ఉన్నాడు రాము కిటికీలోంచి. ప్రతిసారీ జయ మధ్యలోనే వెళ్ళిపోతూందనిపించింది.

                             *    *    *

    "ఒక విషయం ఎన్నాళ్ళనుంచో అడగాలని అనుకొంటున్నాను. "పిల్లలకు పాఠాలు చెప్పి మంచంమీద కూర్చుంటూ అడిగాడు వేణుగోపాల్ భార్యను.
    "ఏమిటో అడగండి." వంట ఇంటి తలుపు వేసి వచ్చి కొంగుతో చేతిని తుడుచుకొంటూ భర్తవైపు చూసింది భారతి.
    వేణుగోపాల్ భార్య మొహంలోకి గుచ్చి చూస్తూ, "ఆరోజు అంటే మీ అక్కయ్య దగ్గరనుంచి టెలిగ్రాం వచ్చిన రోజున ఏమీ పట్టించుకొనట్టూ అసలు వెళ్ళడమే ఇష్టం లేనట్టూ మాట్లాడావు దేనికీ?" అని ప్రశ్నించాడు.
    భారతి చూపులన్నీ వేణుగోపాల్ మీదే ఉన్నాయి. ఎన్నో భావవీచికలు మొహంమీద నృత్యం చేస్తున్నాయి. ఎప్పటిలా చిన్నగా నవ్వుతూనే అంది: "అక్కయ్య పిల్లలు ఒంటరివాళ్లైపోతారని నాకు పూర్తిగా తెలుసు. అక్కయ్య కోరిక కూడా ముందే ఊహించాను. మీరు......."
    "చెప్పు, భారతీ, నేను......"
    "మీరు ఇంత దయగా పిల్లల్ని ఆదరిస్తారని నాకు తెలియదు. మనిషి ఎవరైనాసరే ఒక విషయం పూర్తిగా ఆలోచిస్తే తెలుస్తుంది. తన బిడ్డలమీద ఉన్న మమత ఇతరులు కన్నబిడ్డలమీద ఉండదు. ఇంతే ఊహించాను నేను. అందుకే అటు అక్కయ్య మనసు నొప్పించలేక ఇటు సంఘర్షణలో కొట్టుకుపోయాను." భారతి మనసులో బయలుదేరిన భయాన్ని భద్రంగా దాచుకొంటూ నిర్లక్ష్యాన్ని అభినయిస్తూ అన్నది.
    "ఇప్పుడైనా నీ సమస్య పరిష్కారం అయినట్లేనా?"
    "పూర్తిగా ప్రపంచంలో మగవాళ్ళ సంగతి అందరి నట్లా ఒకేరకంగా ఉండదు. మీరు.....మీరు దైవాన్ని మించిపోయారు." హఠాత్తుగా భర్త కాళ్ళమీద వాలిపోయింది.
    తలక్రింద రెండు చేతులూ పెట్టుకొని తృప్తిగా నిట్టూర్చి తన కాళ్ళమీద తల ఆన్చిన భారతిని కౌగిలిలోకి తీసుకొన్నాడు.
    "దైవాన్ని మించిపోవడం.....అంత పెద్ద మాటలనకు, భారతీ! దేవుడితో మనిషి ఎన్నటికీ సమానం కాలేడు."
    భారతి కళ్ళు రెండూ మూసుకొంది. భగవంతుడు మానవుల్లో దేవతల్ని కూడా సృష్టిస్తాడు.
    వెనక్కు వాలి ప్రశాంతంగా నిద్రపోయాడు వేణు గోపాల్. పిల్లలిద్దరూ మంచంమీద పడుకొన్నారు. అమాయకంగా చిరునవ్వు సదా చిందులు తొక్కే భర్త మొహంలోకి అలా ఎంతోసేపు చూస్తూండి పోయింది. భారతి హృదయంలో చెలరేగే సముద్ర ఘోషకు అంతులేకపోతూంది. 'భగవాన్! నన్ను క్షమించు!' అనుకొంటూంది. ఈ ఆరేళ్ళలో భారతి తలమీద వెంట్రుకలు తెల్లబడి పెద్ధతనాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. మనసులో గూడు కట్టుకొన్న విచారానికి కాలం పూర్తిగా ముద్రవేస్తూ భారతిని వయసు మళ్ళిస్తూంది. వాలు కుర్చీలో నీరసంగా చేరగిలబడి అలా ఎంతోసేపు నిద్రపోయింది.
    
                               *    *    *

    "బారతీ, ఆంద్రప్రదేశ్ అయింది కదూ? హైకోర్టు మార్చేశారు." కోటు విప్పి భారతి భుజం చుట్టూ వేసి నవ్వాడు వేణుగోపాల్.
    "ముసలితనాన దసరా పండగట. ఇదేమిటి? నాకు డిగ్రీ లేదనేగా ఇలా చేస్తున్నారు!" కోటు తీసేయబోయింది భారతి.
    "బారతీ! నిన్ను లాయర్ గా చూడాలని ఎన్నో కలలుగన్నాను. చదువుకు స్వస్తి చెప్పి నా ఆశల్ని నేల కూల్చావు. మనం హాయిగా ఇద్దరం హైకోర్టు లో వాదించుకొంటూ ఉంటే....."
    భారతి నవ్వేసింది. "ఇంట్లో వాదనలతోటే తలప్రాణం తోకకు వస్తోంది. ఇంకా కోర్టులో కూడానా!"
    "పోనీలే, భారతీ. నాకిక పని చెయ్యాలని లేదు. తరగని ఆస్తి ఉంది. హైదరాబాదుకే కాపురం మార్చేద్దాం."
    "మీ ఇష్టం!" భారతి మొహం పూర్తిగా నల్లబడి పోయింది. మాయని గాయం తాలూకు నొప్పి అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది.
    కిటికీలోంచి శూన్యంలోకి చూస్తూ ఒకటికి రెండుసార్లు పిచ్చిదానిలా నవ్వుకొంది.
    "నీలో నువ్వు నవ్వుకోకపోతే నన్నుకూడా నవ్వించరాదుటోయ్!" వేణుగోపాల్ వేళాకోళం పట్టించాడు.

                               *    *    *

    పరీక్షలైపోయాయి. రాము ఈ పరీక్షలు కాకూడరని కోటి దేవుళ్ళకు మొక్కుకున్నాడు. అతని మొక్కు బడులు ఏ దేవుడూ ఆలకించలేదు. పరీక్షలు, పరీక్షలు అన్నంతసేపు పట్టలేదు. పరీక్షలు జరగనూ జరిగాయి. సెలవులు కూడా చకచకా దొర్లిపోతున్నాయి. హఠాత్తుగా తండ్రి మకాం హైదరాబాదుకు ఎందుకు మార్చాలని సంకల్పించాడో అర్ధం కాలేదు. ఎవరిని అడగాలన్నా ధైర్యం చాలడంలేదు. జయ మేడమెట్ల మీద పరిగెత్తుతూ వచ్చింది. దూరంగా కుర్చీలో కూర్చొని ఎంతోసేపు మౌనంగా ఉండిపోయింది. రాము కూడా మాట్లాడలేదు. ఇద్దరి మధ్యా నిశ్శబ్దం తాండవించింది. క్రింద హాల్లో రవి ఒకడే టేబిల్ కు నెట్ తగిలించి ఆట ఆడుతున్న టకటక తప్ప మరే శబ్దం వినబడటంలేదు. రవి జయతో మాట్లాడడం పూర్తిగా మానేశాడు. ఒకవేళ మాట్లాడినా రెండు మూడు మాటలకు తూచి తూచి జవాబిస్తాడు, భారతి ఏనాడూ జయ ఒంటరిగా రాముతో మట్లాడటానికి ఆక్షేపణ చేయలేదు. ఆటంకపరచనూలేదు.
    ఉన్నట్టుండి తల పైకెత్తింది జయ. ఆ కళ్ళలో కోటి భావాల సందేశాలు మూగగా పరిగెత్తుతున్నాయి. గొంతు పెగల్చుకొని, "మీరు ఊరు వదిలి వెళ్ళిపోతున్నా రట, నిజమేనా?" అంటూ రామువైపు చూసింది.
    రాము అపరాధిలా దృష్టి తప్పించుకొన్నాడు. కాస్సేపాగి, "అనే ఇంట్లో అంతా అనుకొంటున్నారు. నాకసలేం తెలియడంలేదు. నాన్నగారు దేనికి ఇలా చేశారో? నాకు అంతా పిచ్చిగా ఉంది. ఇక్కడే ఉంటే ఏమో? ఇల్లు ఉంది. అన్నీ ఇక్కడే ఉన్నాయి" అన్నాడు.
    "మనుషులు ఎక్కడుంటే ఏం, మమతలు ఉండాలి గానీ! నేనెప్పుడైనా నీకు జ్ఞాపకం వస్తే...." సగంలో ఆపేసి ముఖానికి కొంగు అడ్డు పెట్టుకొని ఏడవసాగింది.
    బిత్తరపోయాడు రాము. జయవైపే చూస్తూంటే ఏదో బాధగా ఉంది. తను ఏడవలేక పోతున్నాడు. జయ ఏడుస్తూంది. అంతే తేడా.
    ఇదివరకులా చనువుగా జయ చేతిని పట్టుకొంటే జయ కోపగించుకొంది. అమ్మ ఎన్నోసార్లు మందలించింది కూడా. "లేదు, జయా. నీకంటే ఎక్కువైన స్నేహితులు నా కెవరున్నారో నీకు తెలియదూ? నిన్నెలా మరిచిపోతాను?" తనలో తను అనుకొంటున్నట్టు ఒక్కొక్క పదమే కూడ బలుక్కుంటున్నాడు.
    జయ మొహం పైకెత్తి రాము కళ్ళలోకి చూసింది. "నువ్వు వట్టి అమాయకుడివి, రామూ నీకన్నా రవే ఎంతో తెలివైనవాడు. నీకు ఏదీ తెలియదు. కానీ మన స్నేహాన్ని ఇలా తెంపేస్తావా?" జయ పెద్దదవ గానే గ్రహించింది, స్త్రీకి పురుషుడి  అవసరం ఎంతో.
    "నేనేం చేయను?" అయోమయంలో ప్రశ్న వేశాడు.
    "నన్ను.....నన్ను....." జయ వెక్కిళ్ళమధ్య మాటలకోసం వెతకసాగింది.
    జయను తన దగ్గరకు తీసుకొని రెండు చేతులతో చుట్టేయాలనే కోరికను భయంగా అదిమేసి, ఎర్రబడిన మోహంలో విచారాన్ని స్పష్టంగా చూపించి, తల దించుకొన్నాడు.
    రాము హృదయంలో బలంగా అడుగులో అడుగు వేస్తూ జయ కదిలి వెళ్ళిపోయింది.
    అలా ఎంతోసేపు చీకట్లో కూర్చుండిపోయాడు. 'జయ రామా వచ్చింది. వెళ్లనూ వెళ్ళింది, తనకే ఏది చేయాలో అర్ధం కావడంలేదు. జయను తనతోనే ఉంచుకోవడం ఎంత అసాధ్యం!'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS