Previous Page Next Page 
మరుపులో మెరుపులు పేజి 5

 

                                      7
    ప్రభాకర్ కుసుమకు దగ్గిర కావాలని ప్రయత్నిస్తూనే వున్నాడు. కుసుమ దూరంగా పారిపోతూనే వుంది. కుసుమ అతని దగ్గిర నుండి శాశ్వతంగా పారిపోవాలని నిశ్చయించుకుంది. "ఛ.....ఏమిటి బ్రతుకు , ఎప్పుడూ పారిపోవడమే? ఎక్కడా అసంతృప్తే? ఎక్కడ ఎలా బ్రతకాలను కున్నా..... ఎవరో ఒకరు తారస పడతారు. తనకు దగ్గర కావడానికి ప్రయత్నించకుండా వుండరు. కేవలం తన అందం చూసి ఆకర్షణ కు లోనయ్యే వాళ్ళను తను గౌరవించలేదు.... తను వాళ్ళకు దగ్గర కాలేదు.... అసలు తను ఎవరికి మాత్రం ఎలా  దగ్గర కాగలదు?..... ఎవరితో పరిచయం చేసుకోబోయినా. పరిచయం పరిచయం లా మిగల నివ్వరు .....స్త్రీ పురుషులు స్నేహితులుగా మిగిలి పోలేరా ఏ సంబంధం లేకుండా -- ఏ ఆకర్షణ లేకుండా తను వాంచించే స్నేహాన్ని తను ఏ ఒక్కరి వల్లా పొందలేదెం? అటువంటి స్నేహాన్ని సంఘం హర్షించలేదా?
    ....ఆ నిగ్రహశక్తి మనుష్యుల్లోనే కరువా? ప్రపంచంలో స్త్రీ పురుషులందరూ తను కోరుకున్నట్లు కేవలం స్నేహితుల్లానే వుండి పొతే -- యిన్ని కోట్ల జనం ఎలా వచ్చేవారు.... ఎవరు ఎలా వున్నా తను మాత్రం అటువంటి బాంధవ్యాలకు దగ్గర కాలేదు. తను ప్రభాకర్ కు దూరం కావాలంటే ఒకటే మార్గం. యీ వుద్యోగం వదులుకుని ఎక్కడి కయినా వెళ్ళిపోవడమే నన్న నిర్ణయాని కొచ్చేసింది కుసుమ.
    ప్రభాకర్ మనసు మాత్రం అర్ధం కాని ప్రశ్న లకు సమాధానం వెతుకుతూనే వుంది. మిగిలేది నిద్రలేని రాత్రే అయినా, అతను నిరుత్సాహ పడలేదు. ఏమిటి కుసుమను అంత భయపెట్టే విషయాలు, ఎందుకంత దూరంగా పారిపోవాలను కుంటోంది?.... తన స్నేహం యిష్టం లేక పొతే.ఆమె మనసులో మరేవరయినా వుంటే వున్నదున్నట్లు చెప్పవచ్చు కదా! ఎవరూ లేని తను ఒకరికి దగ్గిరవుదామన్న కోరిక లేకుండా ఒంటరిగా ఏ స్త్రీ అయినా వుండి పోగలదా? ఒకసారి చూడంగానే మళ్ళీ చూడాలనిపించే ముఖం యౌవనం తో పరిపూర్ణంగా వికసించిన అవయవాలు, కుసుమ గుర్తుకు రాగానే ఆ వర్షపు రోజు ఉదయం గుర్తుకు వస్తుంది. నిద్రానం గా వున్న తన కోరికలు పడగ విప్పిన రోజది..... ఆ రోజును తనెలా మర్చిపోతారు? భయంగా వణికి పోతూ దగ్గరకు వచ్చిన కుసుమ..... ధైర్యంగా తను దగ్గరకు తీసుకునేందుకు అవకాశం ఎందు కివ్వదు? ఆమె సమస్యలను, యింకోకళ్ళను అర్ధం చేసుకునేందుకు ఎందుకంత అభ్యంతరం ?..... అతని ప్రశ్నలు ప్రశ్నలు గానే వుండి పోతున్నాయి. రాత్రిళ్ళు గడిచిపోతూనే వున్నాయి....ఆఖరికి అడిగి అనుమాన నివృత్తి చేసుకునే అవకాశం కూడా లభించడం లేదు.ప్రభాకర్ కు.
    ఆ ఉదయం ప్రభాకర్ డిక్టేట్ చేస్తుంటే తలవంచుకుని గబగబా రాసుకుపోతోంది కుసుమ. అప్పుడే లోపలకు వచ్చిన రామకృష్ణను చూచి ఆగాడు ప్రభాకర్.
    రామకృష్ణ ఓ నల్లని లెదర్ బాగ్ తెచ్చి ప్రభాకర్ కు అందించాడు. దాన్ని అందుకుని సొరుగులో వున్న తాళం చెవులు తీసుకుని, సేఫ్ లో లెదర్ బాగ్ పెట్టేసి తిరిగి తాళాలు తెచ్చి సొరుగులో పడేశాడు.
    నేనివాళ మధ్యాహ్నం మద్రాసు వెడుతున్నాను. శుక్రవారం వస్తాను.....
    తల వూగించాడు రామకృష్ణ.
    రేపా డబ్బు స్వయంగా తీసి కెళ్ళే కామేశ్వర రావు గారికి యివ్వు.
    "యస్ సర్ ."    
    ఓసారి , అటూ, ఇటూ చూసి "మిగిలిందంతా మామూలే?" అన్నాడు. యింక చెప్పేందు కేమీ లేనట్లు.
    రామకృష్ణ గదిలోంచి వెళ్ళిపోయాడు. వెంటనే కుసుమ వైపు తిరిగి "ఆ.... ఎక్కడ అపాం?" అడిగాడు. కుసుమ చెప్పింది . వెంటనే మిగతాది పూర్తీ చేసి "అది టైపు చేసి రామకృష్ణ కిచ్చేసి వెళ్ళి పొండి. అని ఇవ్వాళ పోస్టు లో వెళ్ళిపోవాలి. నే వెడుతున్నాను. బయలుదేరే లోపల నాకింకా పనుంది." అంటూ కుర్చీ మీద వున్న కోటు తీసుకుని తొడుక్కున్నాడు. ఒక్కసారి వేద్తూ వేద్తూ వెనక్కి తిరిగి అజంతా శిల్పం లా అక్కడే నిలబడి పోయిన కుసుమ వంక చూచాడు. అంతవరకు అతని వైపే చూస్తున్న కుసుమ చటుక్కున కళ్ళు దించుకుంది.
    "వెడుతున్నాను"అన్నాడు ఆమె ముఖంలో ఏవో భావాలు వేదకాలని ప్రయత్నిస్తూ.
    తలవంచుకునే తల వూగించింది . "సరే' అన్నట్లు. ప్రభాకర్ వెళ్ళిపోయాక కూడా గది లోనే నిలబడిపోయిన కుసుమ కిటికీ లోంచి చూస్తూ వుండి పోయింది. ఆఫీసు ముందు వైపుగా ఆపి వున్న పెద్ద ఫారెన్ కారులో కూర్చుని తలుపు వేసుగుంటున్నాడు ప్రభాకర్. కుసుమ చూస్తుండగానే కారు కదిలి పోయింది.
    తేలిగ్గా నిట్టూర్చింది. మళ్ళీ మూడు రోజుల దాకా రాడు. ఇదే మంచి సమయం యిక్కడ నుండి వెళ్లిపోవాలంటే. యిక ముందేప్పుడూ యిలాంటి చోట వుద్యోగం చేయకూడదు. ఏ స్కూల్లో నో....ఏ నర్సింగ్ హో,మ్ లోనో -- తన వునికి ఎవరకూ తెలియనంతగా ..... తను ఎక్కడ ఎలా వున్నా ఎవరూ పట్టించుకొనటువంటి ప్రదేశం లో....
    ఆమె ఆలోచనలు ఒక దరి చేరకుండానే కొత్త భావాలు చోటు చేసుకోసాగాయి. ప్రభాకర్ సేఫ్ లో పడేస్తున్న డబ్బు కళ్ళ ముందు మెదల సాగింది. గోడల ప్రక్క ప్రత్యేకంగా వున్న సొరుగు లో తాళం చెవులు గలగలమని రోద చేయనారంభించాయి. ఎంత అపుకుందామనుకున్నా ఆగని ఆవేశం ఆమెను నిలవ నీయకుండా చేసింది. ఎంతో నిగ్రహం కోసం తల్లడిల్లుతున్నట్లు నుదుటిని కిటికీ చువ్వుల కానించి నిలుచుండి పోయింది. కొద్ది సేపట్లో తేరుకో గలిగినా, మనసులో భావాలకు దాసురాలయిన కుసుమ చుట్టూ పరికిస్తూ వుండి పోయింది. కొద్ది క్షణాలు . తన్ని ఎవరూ చూడటం లేదని నిశ్చయించుకుని మెల్లిగా సొరుగు దగ్గరకు వెళ్ళి తాళాలు తీసుకుని సొరుగు యధాప్రకారం మూసి గది బయటకు వచ్చేసింది. తన టేబుల్ ముందు చాలాసేపు మౌనంగా కూర్చుండి పోయింది. ఎంతో ప్రయత్నం మీద స్తిమిత పడి, టైపు చెయ్యడం ప్రారంభించింది.
    టైపు చేసిన వుత్తరాలు రామకృష్ణ కిస్తూ "యివాళ పంపించేయమని చెప్పమన్నారు." అంది.
    "ఓ.కే. ,,," అన్నాడు వుత్తరాల వంక చూస్తూ.

                                     8
    భాస్కరుడు పశ్చిమానికి వాలిపోయాడు. చకచకా చీకట్లు ముసురుకున్నాయి. ఏడు గంటల వేళ చిరాగ్గా ఆఫీసు ముందు కారాపాడు ప్రభాకర్. అంతా ఏర్పాటు చేసుకుని బయలు దేర బోతుంటే మద్రాసు నించి ట్రంకాలు వచ్చింది. మీటింగ్ కాన్సిల్ అయినట్టు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాకే అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే తగని చిరాకని పిస్తుంది అతనికి. ఎలాగూ వూళ్ళో నే వున్నాడు. ఆ డబ్బు తనే తీసుకు వెళ్ళి కామేశ్వరరావు గారికిచ్చి మాట్లాడితే పోతుందని , ఆఫీసు కొచ్చాడు. అలవాటు ప్రకారం తన రూమ్ లోకి వెళ్ళి, సొరుగు తెరిచాడు. ఖాళీగా వున్న సొరుగు నవ్వినట్లనిపించింది.
    ఒక్కసారి అతని కనుబొమలు ముడుచుకున్నాయి. త్వరత్వరగా కోటు జేబులు తడిమి చూసుకున్నాడు. ఆఫీసుకు వేసుకొచ్చిన సూటు యింట్లో వదిలేశాడు. ఒకవేళ అందులో వున్నాయేమో అనుకుంటూనే. మళ్ళీ సొరుగు తెరిచి చూశాడు. లోపల కాగితాలన్నీ బయటకు తీశాడు. ఒకవేళ అడుక్కు పోయాయేమో అనుకుంటూ-

    "ఏమయి వుంటాయి? తనకి బాగా గుర్తు యీ సొరుగులో పడేసినట్లు....అలోచిస్తోనే గది తలుపులు వేసేసి గబగబా బయటకు వచ్చి కారెక్కి యింటి ముఖం పట్టాడు.
    ఇంట్లో ఆఫీసుకు వెళ్ళననుకున్న కోటు కూడా ఖాళీ గా ఉండడంతో ఆదుర్దాగా అనిపించింది ప్రభాకర్ కు. "ఏమయి వుంటాయి? రామకృష్ణ తెచ్చిన డబ్బు సేఫ్ లో పడేసి తాళాలు సొరుగులో వుంచాడు అలవాటుగా. నిజానికి యివాళ  డబ్బు తెప్పిస్తున్నట్లు కూడా తనకి, రామకృష్ణ కి తప్ప యింకేవరికి తెలియదు-- ఆ గదిలో వున్నది కూడా తనూ, అతనూ కుసుమ ....' ప్రక్కనే వున్న కుర్చీలో జారిగిల బడి ఆలోచనలో పడ్డాడు ప్రభాకర్.....
    "ఏమయి వుంటాయి....ఎవరు తీసి వుంటారు? ....అక్కడ వున్నది మాత్రం కుసుమ....ఛ.... అయితే మాత్రం ....' ఎందుకో అతని మనసులో అడిచాలా అసంభవం అనిపించింది. కాని అంతలోనే ఆ అనుమానం వెంటాడుతూనే వుంది.... కాని ఆమెకు అలాంటి పని చేసే అవసరం ఏమిటి? ....నిజానికి ఎవరికి మాత్రం ఏమవసరం..... కేవలం డబ్బు మీద వ్యామోహం తప్ప.... అనుమానంగా అనుకుంటూ జుట్టులోకి చెయ్యి పొనిచ్చు కున్నాడు.
    ఆలోచనలలో కొట్టుకు పోతున్న ప్రభాకర్ కు చటుక్కున దాదాపు ఏణార్ధం క్రితం పేపర్లో పడిన సంఘటన గుర్తుకు వచ్చింది. ముఖర్జీ ఆఫీసులో......ఒక్కసారిగా వులిక్కి పడ్డాడు?..... ....దట్సిట్.....ఆ అమ్మాయే కుసుమ..... ఏమిటావిడ పేరు...... ఎక్కడో చూచినట్లనిపించిన కుసుమను ఆరోజు అతని ఆఫీసులో నన్న మాట చూచింది..... మళ్ళా అదేవిధంగా యివాళ కూడా డబ్బు తీసుకు పోదామనా?....." అనుకుంటూ బాధగా నిట్టూర్చాడు. వర్షానికే భయపడే అంత పిరికితనం - దొంగతనానికి కూడా వెరవని మొండి ధైర్యం......కుసుమ చేస్తున్నది కేవలం డబ్బు కొసమయి వుండదు..... దీని కంతటికీ ఏదో కారణముండి తీరాలి....ఇవాళ దీని అంతు తేలాలి.'అనుకుంటూ గబగబా దిగివచ్చి కారేసుకుని ఆఫీసు వైపు వెళ్ళాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS