Previous Page Next Page 
క్షమార్పణ పేజి 5


                                   11
    "మన స్నేహం నీకు ప్రమాదం గా లేదు కదా?-- అనడిగాడు కమలాకరం అప్పుడే స్పురించినట్టు.
    ప్రతిమ స్వేచ్చగా నవ్వింది. "ఆ మాట ఇప్పుడా అడుగుతున్నారు? మిమ్మల్నే నాడూ మా వదిన కి పరిచయం చేశానో అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆమె  చేత సాధింపులు తింటూనే వున్నాను. మా అన్నయ్య అంతగా ఏమీ అనడనుకొండి-- అయినా ఒకరి లక్ష్య పెట్టె స్వభావం కాదు నాది. అంతెందుకు నేను ఎంతోమంది పరాయి మగవాళ్ళతో స్నేహం చేశాను వాళ్ళు నా నిర్లక్ష్యాన్ని మెచ్చుకోలేక పోయారనే నా అనుమానం. ఏదో మోజు కొద్ది వెంట పడేవాళ్ళ ని నేను పోల్చేసి ఖచ్చితంగా వున్నాను కూడాను. ఎందుకో నాకే తెలియదు. మీరంటే గొప్ప గౌరవమే కాదు, ప్రత్యేకాభిమానం నాకు. మీలాగా బిడియస్తూలూ, గౌరవనీయులూ చాలా కొద్ది మంది ఉంటారు."
    "ఆ చాలు పొగడ్తలు " అన్నాడు లోపల ఆనందంగా వున్నా.
    అటు పిమ్మట అతని కోరిక మీద "వసంత కాలపు నిశీధిని" అనే పాట పాడింది ప్రతిమ. ఆమె స్వరంలోని సంగీతపు అపస్వరాలను సాహిత్యపు మధురిమలు కప్పి పెట్టాయి.
    ఆరు నెలలుగా ఆకాశ పర్యంతం అలుకుపోతున్న ఈ స్నేహ లతకి కొస ఎలాటిదో కమలాకరానికి తెలీనట్టే ప్రతిమకు కూడా తెలీక పోవచ్చు.
    ఇద్దరిలో ఏ ఒక్కరూ ఈ స్నేహ బంధాన్ని పెంచుకోడానికి సుముఖులుగా లేరు. ఆలోచనా లేదు. ప్రయత్నమూ లేదు.
    "ప్రతిమను ప్రేమిస్తున్నాను కాబోలు" అనుకోడానికి అభిమానం అడ్డు వస్తుంది కమలాకరం కి. కాని ప్రతిమని కలుసుకుంటే నరకం లో స్వర్గం కనిపించి నట్టుంది. అందుకే ఒడులుకోలేదు. సాయంకాలాల్లో కలుస్తుంటారు తరచుగా. కమలాకరం షికారు కి బయలు దేరే వేళా. ప్రతిమ వర్క్ షాప్ నుంచి బయటపడే సమయం సాధారణంగా కలుస్తుండడం కొంత కారణం.

                                    12

      
    సంక్రాంతి నాటి రాత్రి పెద్ద గడబిడ జరిగింది. లోలోపల భర్త మీద రగులుకుంటున్న కోపాన్ని అణచి వుంచటం ఇరవై ఏళ్ళు నిండీ నిండని పంకజం కి సాధ్యం కావటం లేదు. ఆవిడ గదిలో సారాకంపు కొడుతోందేం?' అన్నది అడుగు పెడుతూనే నిరసనగా.
    నీరసంగా వెలుగుతున్న జ్వాలల్లో ఆజ్యం పోసినట్టయింది. కమలాకరం బలవంతాన పంకజం చెయ్యి దొరక బుచ్చుకుని, బరబర లాక్కువెల్లి శారదమ్మ మీదకు విసిరేశాడు.
    "అమ్మా?-- చదువుకున్నదంటూ తెచ్చి నా మెడకు కట్టావు. ఈ సభ్యతా సంస్కారాలు లేని మనిషా చదువు కున్నది? చదువుకున్న వారంతా తలలు వంచుకోవాలి."
    "ఏం జరిగింది రా?' శారదమ్మ ఆయాస పడిపోయింది.
    "ఇంకా ఏం కావాలి -- నన్ను త్రాగుబోతు కింద జమకట్టింది. అది నన్ననడం కాదు నిన్ను తూలనాడ్డమే అనుకో --" అన్నాడు ఒగారుస్తూ.
    పంకజం బింకంగా వున్నది.
    "ఏమైనా -- ఇంకోసారి ఇలా జరిగితే నేను సహించలేను. ఈ ఇంట్లో ఈవిడన్నా వుంటుంది. నేనన్నా వుంటాను. అంతే--"
    స్థాణువై నిలబడిన తల్లి వంక చురుకుగా చూసి వెను దిరగ బోయాడు.
    పంకజం ఊరుకోక "మా నాన్న రాశాడు మొన్న-- అంత కష్టంగా వుంటే విడాకులు పారేసి ఒచ్చీయమని-- "అంది.
    శారదమ్మ సింహం లా కస్సుమని పులిలా చూసింది.
    "ఇది ఇల్లనుకున్నావా, పాడనుకున్నావా పంకజం? ఊరంతా సర్దుమణిగాక ఇంతలేసి గావు కేకలా?--- అందరికీ వినిపించే లాగ అంతంత ముదనష్టపు మాటలా?-- మా కాలం -- ఇలాటి పిల్లలు కారు , ఇలాటి చదువులూ కావు!--"
    ఈసారి కోడలు అత్తను గౌరవించలేదు. ఆమె పులి అయితే తాను సింహ మైంది. ఆమె ఎలుగు బంటి యైనప్పుడు తానింకేదో అయింది. కొసకి మోసపుచ్చి పెళ్లి చేసి గొంతుక కోశారంటూ నింద మోపడం జరిగింది.
    ఆ తగువు లాట లోంచి కమలాకరం ఎప్పుడో వెళ్ళిపోయాడు. తన జీవితం బాగుపడేలా లేకపోయినా, తల్లి కోడలి బుద్ది ఇప్పటి కన్నా గ్రహించి నందుకూ గ్రహించి పశ్చాత్తాప పడుతున్నందుకు తృప్తి పడింది మనసు. అందుచేతనేమో అతను నిద్రకోసం కొట్టు మిట్టాడ లేదు ఆ రాత్రి.

                                    13
    సూర్యుడు నడిమింటి కొచ్చినప్పుడు మండుతాడు మనుషులు యౌవన మధ్య మాప్పుడే ఉద్రిక్త మానసు లౌతారు అది ప్రకృతి గుణం. అంచేతనే యౌవనం లోని సంకుచితత్వాన్ని క్షమించినట్టు, ముసలి తనం లోని సంకుచిత్వాన్ని క్షమించలెం.
    నిప్పులు చెరుగుతున్న ఒక మధ్యాహ్న సమయంలో అన్నంత పనీ చేసింది పంకజం. మరేమీ కాదు-- పుట్టింటికి వెళ్ళిపోయింది విడాకులు తప్పదంటూ కొడుకు గురించీ తన గురించీ కూడా శారదమ్మే ఏడవవలసి వచ్చింది. ఆనాడు కోడలి నోట్లో నోరు పెట్టినందుకు ఫలితంగా. మిగిలిన కొంచెం మర్యాదలు కావడం మినహా ఇంకేమీ జరగలేదు. కొడుకు కాపరం చేడుతోందని ఏడవాలో, కోడలు ఎదిరించుచున్నదని ఏడవాలో బొత్తిగా తేలీలేదు శారదమ్మ కి. పైగా కమలాకరం చీటికీ మాటికీ తల్లిని దేప్పటం ఆరంభించాడు ఈ మధ్య. "వసంత గురించి మహా తెలిసినట్టు-- ఆమెని మించినదాన్ని తెచ్చి కడతానన్నావు ఇదిగో ఈ గుది బండను తెచ్చి, నాకు కాదు నా మెడకే కట్టుకున్నావు." అన్నాడు కసిగా ఆమె తల్లి అనే మాట మరిచినట్లే.
    "అదేమిట్రా అలా అంటే ఎలాగ? ఏదో ఉద్రేకం పట్టలేక వెళ్ళిందది వయసులో అలాగే వుంటారు. కబురు పెట్టించి ఇటు పైన మనమే సర్దుకు పొతే సరి అదే దారికి వస్తుంది" అంది శారదమ్మ ఆలోచనల్తేనే అయోమయంలో పడుతూ.
    "ఇంకా నయం! అమ్మా ఇప్పుడే చెప్పేస్తున్నాను. చేసిన పొరపాటే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చేస్తావు? -- అది విడాకు లిస్తుందేమో. ఇవ్వనియ్యి మనకే మంచిది కాని పంకజం ఈ ఇంటికి మళ్ళీ ఒచ్చిందా , నేను ఉండేది లేదు నీ యిష్టం."
    ఆవిడ సుదీర్ఘాపన్యాసాలకి అవకాశం లేకుండా వడివడిగా వెళ్ళిపోయాడు.
    
                                *    *    *    *
    కాని శారదమ్మ అప్పటికే పంతులు కోసం కబురు పెట్టేసింది పంతులు కమలాకరం పెళ్ళిలో శారదమ్మ కి గొప్పగా సాయపడ్డాడు. అంత నిస్వార్ధంగా చేసేవాళ్ళు ఈ ప్రపంచాన ఉండవచ్చన్న సంగతి అప్పటి వరకూ శారదమ్మ కు తోచలేదు. తోచలేదు కనుకనే అతనలా తటస్థ పడి వుంటాడు. ముఖ్యమైన సంగతి. చిన్న కుటుంబానికి మరో కుటుంబం అండ వుండాలమ్మా-- అంటూ జ్ఞానోపదేశం చేశాడు. అప్పటి నుంచి శారదమ్మ , ఆ దూరపు చుట్టాన్ని దగ్గరలో ఉన్నందు వల్ల కూడా కావచ్చు. స్వంత సోదరుడిలా నమ్ముకుని అప్పుడప్పుడు పండగ పబ్బాలకు వర్తమానాల్నీ, పిండి వంటల్నీ పంపిస్తున్నది. కావలసినప్పుడల్లా కబురు పంపుతున్నది ఇదివరకొకసారి , కమలాకరం . పంకజంలా దంపత్యాన్ని గురించి అతని దగ్గర వాపోవటం జరిగింది కూడా. ఈసారి ఆవిడ గుండెలు ఎందుకో గుబగుబ మంటున్నాయి మరీ ఎక్కువగా.
    సాయంత్రం -- యింట్లో పంతుల్ని చూస్తూనే కమలాకరం ఎర్రబడి పోయాడు. అతనికి అంతా అర్ధమైంది అప్పటికప్పుడు. అర్ధం కాని దేమన్నా వుంటే -- ఆ ముసలి వాళ్ళ చర్చలూ సంభాషణ లూ వినేసరికి అర్ధమై పోయింది.
    "పసిపిల్లలు -- వాళ్లకు విడాకులేవిటమ్మా?-- నీ వెర్రి గాని-- ఇవాళ సర్దితే రేపటి క చెరిగి పోతుంది. వాళ్ళు తెలుసుకోలేరు ఈ వయసులో. మనమైనా తెలియజేయాలా? అంతదాకా వస్తే -- అప్పుడేదో దారి చూడక పోము. అంటూ పొడిదగ్గు దగ్గాడు పంతులు. అది తుమ్మో, దగ్గో శారదమ్మ పోల్చలేక కాసేపు సందేహించింది.
    అక్కడే -- పాంటు జేబులో చెయ్యి జాపుకుని నిలబడ్డ కమలాకరం పళ్ళు పటపట మనడం ఇద్దరూ గమనించినట్టు లేదు.
    చివరికి శారదమ్మ అంది. 'మీరన్నదే సబబుగా వున్నది అన్నగారూ? పిల్లలు సుఖపడటం లేదన్న దుఃఖం ఉంది, అలాగని పరువు పోయే మాట కొని తెచ్చుకో గలమా?-- నా ప్రాణాలు ధారపోసి వాళ్ళిద్దరినీ దారికి తేవడానికి చూస్తాను. విధి లిఖితం ఎలా గున్నదో ?--"
    తల్లి నోటంట రెండు మాటలు వినేసరికే కమలాకరానికి పీక మొయ్యా కోపం వచ్చేసింది. మిగతా మాటలు వినడానికి సమయమే లేదు.
    గిరుక్కున వెనుదిరిగి బజారులో పడ్డాడు. ఎప్పుడూ లేనంత కోపం వచ్చింది లోకం మీద. తల్లి మీద. అందుకే తాను కేవలం విధి వంచితుడు. మాత్రమే అనుకోలేక పోయాడు . విధి కాదు ; మనుషులే తనను వంచిస్తున్నారు మళ్ళీ మళ్ళీ అదేమాట అనుకున్నది అతగాని మనసు.
    అక్కడితో ఆగలేదు ఆవేదన.
    "ఎక్కడికన్నా పారిపోవాలని ఉంది." అన్నాడు ప్రతిమతో. ప్రతిమ కంగారు పడి "అదేమిటది?" అన్నది. తన బాధ అంతా, గడిచిన కధ అంతా వరుస క్రమంలో చెప్పుకు వచ్చాడు. ఒక్క వసంత ప్రస్తావన మాత్రం తీసుకు రాకుండా. నిజానికి ఇప్పటి వరకు కమలాకరం యదార్ధ జీవితం ప్రతిమకు తెలీదు. ఆలోచించింది. తర్వాత అంది. "ఈ లోకంలో కష్టాలన్నీ మిమ్మల్నే వరించినట్టు అంత బాధపడుతున్నారు. కాని నా స్థితి ఎలాటిదో  మీకు తెలుసా తర్వాత ప్రతిమ, తనని వదినగారు ఎన్ని యిడుములు పెడుతున్నదో వివరించి చెప్పింది. అన్న తన విషయం పట్టించుకోడని చెప్పి బాధ వ్యక్తం చేసింది. కమలాకరం ప్రతిమను తేలిగ్గా అర్ధం చేసుకున్నాడు.
    ఇంటికి చేరువవుతూ కమలాకరం చాలా చాలా ఆలోచించాడు. సంఘాన్ని తలుచుకుంటూ పగలబడి నవ్వుకున్నాడు. తల్లి అంటే ప్రేమ అభిమానం, పెద్ద మనుషులంటే భయమూ భక్తీ -- సంఘమంటే గురీ భీతీ -- అన్నీ సమసి పోయాయి క్షణాల మీద. ఈ విశాల విశ్వమే తనకి తల్లీ తండ్రీ గురువూ మొదలైన వన్నీ ! ఎటొచ్చీ తనకొక స్నేహితురాలైన స్త్రీ కావాలి. ఆఖరికి అదొక్కటే కమలాకరం మొదటి సాహస నిర్ణయ మైంది!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS