Previous Page Next Page 
సంపెంగ పొదలు పేజి 5


    "దేవి గారి అలకకు కారణం, ఈ దాసుడి కి తెలియజెప్పరాదా? తను కటాక్ష వీక్షణం కోసం, ఏ పని చెయ్యడాని కైనా, సిద్దంగా ఉన్నాను.' అన్నాడు.
    ఉమ చటుక్కుని అందుకుంది.
    "నిజంగా నాకోసం నీకిష్టం లేనిది ఏవైనా చెయ్యగలవా?"
    "పరీక్షించి చూడరాదూ?!"
    "నాకింకా చదువుకోవాలని ఉంది."
    హరి ముఖంలో నవ్వు మాయమయింది.
    "ఎమంతున్నావ్ నువ్వు?" నమ్మలేనట్లు అడిగాడు.
    "నా నిశ్చయాన్ని చెపుతున్నాను. నేను ఎం.బి.బి.యస్ . చదువుతాను డాక్టర్ను అయ్యాక కానీ పెళ్లి చేసుకోను." దృడంగా అంది ఉమ-- ఆ దృడస్వరానికి హరి విచలితుడయ్యాడు-- అతనికి కొంచెం కోపమూ ,రోషమూ గూడా వచ్చాయి.
    "కానీ, నేనంతవరకూ ఆగలేను." కోపంగా అన్నాడు హరి.
    "అంత వోపిక లేకపోతె, నువ్వు పెళ్లి చేసుకో! నేను పెళ్లి చేసుకోనన్నాను, కానీ నిన్ను చేసుకో వద్దని అనలేదుగా?' తేలికగా నవ్వుతూ అంది ఉమ.
    హరికి తల తిరిగినట్ల యింది. ఆ మాట్లాడిన తీరూ, ఆ మాటల అర్ధమూ, ఆ తేలిక నవ్వూ అన్నీ అతడిని దిగ్భ్రాంతిని చేశాయి. అయోమయంగా వూరు ముఖంలోకి చూస్తూ నిలబడి పోయాడు.
    ఆ చూపులకు ఉమ కడుపులో దేవినట్లయింది. అక్కడ నిలబడలేక లోపలకు పోయింది. ఇట్లాంటి సంఘటన లెవరి జీవితంలో నైనా వస్తాయా? ఇంత అల్లకల్లోలాన్ని భరించలేక పోతుంది తాను.
    ఏదో పని మీద అటు వచ్చిన దుర్గ ఉమ కన్నీటిని చూసి తెల్లబోయింది -- దగ్గరగా వచ్చి ఉమ భుజం మీద చెయ్యి వేసి "ఉమా! ఏమయింది?' అని అనునయించింది.
    ఎందుకనో , నిజం చెప్పాలని పించలేదు.
    "నాకు డాక్టర్ని కావాలని ఉంది. చదువు కుంటానంటే మీ అన్నయ్య ఒప్పుకోవటం లేదు." అంది ఉమ.
    దుర్గ చాలా ఆశ్చర్య పోయింది. పరీక్షగా ఉమ ముఖం లోకి చూసింది. ఉమ ముఖం తిప్పుకుంది.
    "ఇంత దానికి బాధ పడటం దేనికి? నువ్వు మెల్లగా నచ్చ చెపుతే , అన్నయ్య కాదంటాడా? ఇందుకేనా , అన్నయ్య కూడా , ఇవాళంతా గదిలోంచి బయటకు రాలేదు? -- ఇంతవరకూ అన్నం కూడా తినలేదు. ఆకలిగా లేదని తలుపు వేసుకున్నాడు. ఏమిటి వదినా, చిన్న పిల్లల్లాగా, ఇద్దరూ రాజీ పడండి."
    పెద్ద అరిందలాగా చెప్పి, ఇంచు మించు ఉమను హరి గది దగ్గరకు లాక్కెళ్ళి అక్కడ విడిచి పెట్టి వెళ్ళిపోయింది దుర్గ. అంతవరకూ , హరి అన్నం తినలేదంటే ఉమ కూడా బాధ పడింది. మెల్లగా తలుపు తట్టింది. లోపల నుండి విసురుగా "ఎవరూ?' అని సమాధానం వచ్చింది.
    "ఉమను!" మెల్లగా అంది ఉమ.
    వెంటనే తలుపులు తెరుచుకున్నాయి.
    "ఉమా?' అన్నాడు దీనంగా హరి.
    ఒక్క రోజులో నమ్మలేనంతగా మారిపోయిన హరి ముఖాన్ని చూసేసరికి , ఉమ కదిలిపోయింది. "ఉమా?' అన్న అతని దీన స్వరం ఉమ గుండెల్లో మారు మ్రోగింది.
    "ఇదేమిటి బావా? ఇంత అలకా]
?" ఎంతో ఆర్ద్రంగా నవ్వుతూ అంది. ఉమ చిరునవ్వు చూసేసరికి, హరి ప్రాణం లేచి వచ్చింది. అంతక్రితం వరకూ, అతని మనసులో లావా మరుగుతుంది. ఆపరాని ఆవేశంతో ఉమను దగ్గరకు లాక్కుని ఇంచుమించు గట్టిగా ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఉమ అతని కౌగిలి నుండి విడిపించుకో లేకపోయింది. హరి గద్గదికంగా, "నీ కోసరం ఎన్ని యుగాలయినా , ఎదురు చూస్తూ ఉంటాను ఉమా! నీకెలా సంతోషమో, అలాగే చేద్దాం, నీ సంతోషం కంటే నాక్కావలసింది లేదు." అన్నాడు.
    ఏమనడానికి ఏం చెయ్యడానికీ, ఉమ అశక్తురాలయింది. ఆప్రయత్నంగా హరి తల మీద చెయ్యి వేసి నిమిరింది. హరి ఆ చేతిని గుండెలకు హత్తుకుని "నా ఉమా? నా జీవితం లో నీ స్థానం ఎంత ప్రముఖ మైనదో ఇవాళ మొదటి సారిగా అర్ధమైంది ." అన్నాడు.
    వోర్పు నిలదొక్కుకో లేక పోతుంది. పేలవంగా నవ్వి, "కవిత్వం తరువాత! ముందు అన్నానికి పద!" అంది ఉమ చిరునవ్వు లోని పెలవత్వం గమనించగలిగే స్థితిలో లేడు హరి -- ఆమె చేతులు పట్టుకుని వూపుతూ "ఇవాళ సాయంత్రం నాతొ సినిమాకు వస్తానంటే......." కొంటెగా నవ్వుతూ అన్నాడు.
    "బాగుంది. నన్ను ఉద్దరించదాని కేమిటి?' చిరాకుగా అంది ఉమ ఉమ చిరాకు నిజమైనదే అయినా, హరికి నటన అనిపించింది.
    "అవును నిన్ను ఉద్దరించడానికే! నా బ్రతుకే నీకోసం!" అన్నాడు.
    ఇంకా సంభాషణ సాగించటం ఇష్టం లేక ఉమ, "సరే, వస్తాలే, తిను.' అంది.
    హరి హుషారుగా వెళ్ళిపోయాడు.
    ఉమ దిగాలుగా కూలబడింది.

                                         6
    బయట పోస్ట్ జవాను "టెలిగ్రాం" అని కేక పెట్టగానే ఆదుర్దాగా బయటకు వచ్చాడు శంకర్. సంతకం పెట్టి కవరందుకొని చింపు కున్నాడు.
    "గాభరా పడవలిందేమీ లేదు. వెంటనే బయల్దేరు ." గిరి.
    ఆ టెలిగ్రాం శంకర్ కు చాలా ఆశ్చర్యం కలిగించింది. గిరి సాధారణంగా ఉత్తరాలే వ్రాయదు. అట్లాంటి వాడు , ఇట్లా వైరి చ్చాడంటే, ఏమనుకోవాలి? రకరకాల ఆలోచనలతో శంకర్ బయలుదేరి వచ్చాడు. తన ఆలోచనలకూ విరుద్దంగా, నవ్వుతూ స్టేషన్ కు వచ్చిన గిరిని చూసి ఆశ్చర్య పోయి, "పెళ్లి కొడుకులా లక్షణంగా ఉన్నావు. నాకు వైరెందుకిచ్చావ్?" అన్నాడు.
    గిరి నవ్వి "నిన్ను చూడాలని మోజు పడ్డాన అబ్బాయ్" అన్నాడు -- శంకర్ కూడా నవ్వాడు కానీ, అతనికి తమాషాగా ఉంది-- శంకర్ గిరికి చాలా దూరపు బంధవు మొదట, శంకర్ కుటుంబమే! ఒక్కడే కొడుకు కావటం వలన తల్లి అతని కియ్య కూడనంత గారాబాన్ని ఇచ్చింది. ఫలితంగా అతనికి చదువు బదులు, దుర్వసనాలు పట్టు బడ్డాయి. ఒకనాడు , అకస్త్మాత్తుగా తండ్రి చనిపోయే సరికి, శంకర్ ఒంటిగా నిలబడవలసి వచ్చింది. తండ్రి సంపాదించాడే కాని  నిలువ జేయలేదు. శంకర్ తల్లీ, గిరి తల్లీ బంధువుల కంటే స్నేహితులు-- ఆమె గిరి తల్లీ దగ్గరకు వచ్చి, తన పరిస్థితి చెప్పుకుంది. గిరి తల్లి తప్పక, తాను చేయగలిగినంత సహాయం చేస్తానని ఆమెను వోదార్చి వారిని తన ఇంట్లో ఉండనిచ్చి, శంకర్ బాధ్యతను గిరికి అప్పజెప్పింది-- గిరి శంకర్ ను చదువులో పెట్టడానికి ప్రయత్నించాడు. త్వరలోనే ఆ ప్రయత్నం వృధా అని గమనించి విరమించు కున్నాడు. క్రమంగా అతని లౌకిక జ్ఞానమూ, బేరసారాలలో అతడు చూపే మెలకువా గమనించి , అతడిని వ్యాపారం లో ప్రవేశ పెడితే బాగుంటుందని అనుకున్నాడు. ఆ ఆలోచన శంకర్ కూ, గిరి తల్లికీ నచ్చింది. శంకర్ తల్లి మొదట్లో అభ్యంతర పెట్టినా , చివరకు అంగీకరించింది. శంకర్ గిరి ప్రోత్సాహంతో స్టెయిన్ లెస్ స్టీలు సామాను వ్యాపారం ప్రారంభించాడు. గిరి, అంచనా నిజమై, శంకర్ వ్యాపారం లో నుంచి ప్రజ్ఞ చూపించ గలిగాడు. అతని వ్యాపారం దిన దినాభివృద్ది కాసాగింది. శంకర్ తన తల్లితో కూడా తన మకాము బొంబాయి కి మార్చదల్చుకున్నాడు-- శంకర్ వ్యాపార దక్షత ను గమనించిన గిరి అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. శంకర్ కు గిరి దేవత-- గిరికి శంకర్ అంటే ప్రాణం. హరి తర్వాత అతడేక్కువగా అభిమానించేది శంకర్ నే!--


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS