తల టేబిల్ మీద ఉంచుకుని కూర్చున్నది హిమబిందు. ఆమెను మాట్లాడించాలో లేదో తెలియలేదతనికి. అలాగే నిలుచుండి పోయాడు రెండు మూడు నిమిషాల వరకు. చేతుల్లో ఉన్న నల్లని కవరున్న పుస్తకం తెరిచి ఉంది. అత్యంత ప్రియామైన వస్తువును పట్టుకున్నట్లు చేతులెంతో ప్రేమగా ఆ పేజీలనే పదే పదే స్పర్శిస్తున్నాయి. అది డైరీ అని తెలుసుకున్నాడు తను. కానీ ఆమె వ్రాసిందో, లేక వ్రాస్తుందో అర్ధం గాలేదతనికి. ఆమె కూర్చున్న భంగిమ లో విషాదం తప్ప ఉత్సాహం ఉన్నట్లు కనిపించలేదు. ఒకటి రెండు సార్లు భారంగా విశ్వసించింది.
నెమ్మదిగా తలుపులు వేసి వెళ్ళిపోయాడతడు.
"ఎందుకలా తను లోలోన కుమిలి పోతుంది? కరుణతో అంత స్నేహంగా ఉంటుంది. కానీ, ఆ బాధ విప్పి చెప్పలేక పోతుంది! తన హృదయాన రాగులుతూన్న దుఃఖం కరుణ స్నేహంతో చల్లారడం లేదు. ఉత్సాహంగా ఉన్నట్లు నటిస్తున్నది. నవ్వినట్లు నమ్మించుతుంది. అందుకే ఆ ఉత్సాహం , ఆ నవ్వూ చప్పగా ఉంటున్నాయి" అనిపించిండతని మనస్సుకి.
మరునాడు కరుణ అనుమానాన్ని కూడా అదే నవ్వుతో కరిగించి వేసింది.
"కళ్ళలా ఎర్రబడ్డా యేమిటి , బిందూ?! రాత్రి నిద్రపోలేదా?"
"జ్యోసం చెబుతున్నావా ఏమిటి , తల్లీ! నిద్రపోక చేసేదేముంది? చదువు మరీ అర్ధరాత్రి దాకా సాగడానికి పరీక్షలు కాదుగా ఇప్పుడు?"
శ్యామ సుందర్ విన్నాడా సమాధానాన్ని.
"రాత్రి మీరు ఒంటి గంట వరకు మేల్కొనే ఉన్నారు!" అన్నాడు.
"మీకెలా తెలుసు నండో య్! కరుణ గాని చెప్పలేదు గద?"
"నేనే చూశాను. ఎందుకలా అంత రాత్రి వరకు చదువుతారు? ఆరోగ్యం పాడవుతుంది. లిమిటెడ్ గా ఉండాలి చదువు కూడా!"
ఆ పైన నవ్వుతో కప్పి పుచ్చలేక పోయింది నిజాన్ని. కరుణకి కోపం వచ్చింది. "ఎందుకిలా అతడు నా మనస్సున మెదిలే ఊహల నింత కుతూహలంగా గమనించు తున్నాడు? నాకేమిందని ఇతని బాధ?' లోలోన అతని పై సద్భావం బలపడుతూందామె కు. కోపంతో కరుణ మాట్లాడకుండా కాలేజీ కి వెళ్ళిపోయింది.
ఆ రోజున హిమబిందు రెండో అవర్ కాగానే ఇంటికి వచ్చేసింది తలనొప్పిగా ఉందని ప్రిన్సిపాల్ కి చెప్పి . శ్యామ సుందర్ స్నేహితుడి వివాహానికి వెళ్లాలని సెలవు తీసుకున్నాడు రెండురోజులు. ప్రయాణ సన్నాహం లో ఉన్నాడతడు బిందు ఇంటికి వచ్చేసరికి.
రూం తాళం తీసిన చప్పుడు వినిపించి తలుపులు తీశాడు.
"వచ్చాశారేమిటి? కురుణేది?" అన్నాడు ఆమె వంక చూస్తూ.
"తలనొప్పి గా ఉంది! ఉండలేక పోయాను!"
"శారిడాన్ ఉంది వేసుకోండి!" అని టాబ్లెట్ తెచ్చి ఇచ్చాడు.
ఎందుకో ఆమె ముఖం చూడగానే అతని ప్రయాణ సన్నాహం లోని ఉత్సాహ మంతా చల్లబడి పోయింది.
రవ్వంతైనా ఓపిక లేనట్లు నీరసంగా పడుకుని కళ్ళు మూసుకున్న ఆమెని చూస్తుంటే అతని మనసు ద్రవించి పోయింది. లాలనగా ఎన్నో అడిగి తెలుసుకోవాలని పించింది.
"ఫాన్ వేయనా?" చల్లగా ఉంటుంది!"
ఆమె సమాధానానికి నిరీక్షించకుండానే ఫాన్ అన్ చేశాడు. ఆ చల్లని గాలికి కొంత ఊరట లభించిన ట్లని పించిందామెకి.
"రాండి! కూర్చోండి. కొంచెం తగ్గింది లెండి తల నొప్పి" అంటూ లేచి కూర్చున్నదామె. అతడు నిలబడే ఉండడం, ఆప్యాయంగా పలుకరించి ఫాన్ వేయడం ఆమెని కదిలించాయి.
"లేవకు కూర్చో. రాత్రి ఎందుకలా కూర్చున్నావ్ అంత ప్రోద్దుపోయే వరకు?' తనకు తెలియకుండానే ఆత్మీయత దొర్లింది అతని కంఠం లో. ఎప్పటిలా బహువచనం ప్రయోగించ లేదతడు. ఆ క్షణం ఆమె తన కెంతో ఆత్మ బంధువై నట్లు తోచింది. ఎన్నాళ్ళ నుంచో దాగిన మమత వెల్లువలై దూకిందతని కంఠంన.
హిమబిందు తలెత్తి చూసింది కించిత్ ఆశ్చర్యంతో.
"నిజంగా మీరు చూశారన్న మాట! ఏదో చదువుతూ కూర్చుండి పోయాను! మీ భగవద్గీత నా దగ్గరే ఉండిపోయింది."
"నా దగ్గర మరో కాఫీ ఉందిగా?"
"అయితే నేను తీసుకోవచ్చు నంటారా ఆ పుస్తకాన్ని?"
"ఓ....ఎస్! ఈ మాత్రానికి అడగడానికి నేనేం పరాయి వాణ్ణి గాదుగా?"
ఈసారి మరింత ఆశ్చర్యం కలిగిందామెకి.
ఏనాడూ అతడింక ఆత్మీయంగా మాట్లాడలేదు తనతో. కానీ, ఆ మాటల్లో కదులుతున్న ఆత్మీయత ఆమె మనస్సున మెదిలే భావాలకి అందమైన రంగులు వేస్తుంది. లోన పేరుకున్న నిరుత్సాహాన్ని కరిగించి వేస్తున్నది. కొన్ని ఊహల్లో ఉత్సాహం ఝల్లు మంటున్నది ఆ మాటలు వింటుంటే.
"కరుణ ఎంతో నేనూ అంతే! కానీ, నాతొ అలా ఉండడం లేదు. బిందూ, నువ్వు! .....ఓ ...సారీ!" అతనికి అప్పటికీ తెలిసింది తను ఏకవచనం లో సంబోధించినట్లు.
"ఫర్వాలేదు! ఇలాగే పిలవండి! నాకూ ఇబ్బందిగానే ఉంది 'మీరు, గారూ' అంటుంటే వినడానికి."
కాని, అతనికా పైన మాటలు దొరకలేదు మాట్లాడ్డానికి. దాచుకున్న అమూల్యమైన వస్తువేదో తన కంట బడినట్లు అనిపించి అంత సన్నిహితంగా సంబోధించలేక పోయాడా పైన.
"చెప్పండి , ఎలా ఉండమంటారు మీతో? నాక్కొంచెం కోపం ఎక్కువ. ఆ కోపంలో మిమ్మల్ని ఎప్పుడైనా నొప్పించు తానేమో అని దూరంగా ఉంటాను."
"కోపం గాదు. క్షణాని కో రకంగా ఆలోచిస్తుంది నీ మనస్సు! ఒంటరిగా ఉండలేడు. కానీ, నలుగురి మధ్యలో ఉంది వంటరితనం ఫీలవుతుంది కొన్నిసార్లు. ఎందుకిలా విచిత్రంగా ప్రవర్తించు తుంది?" అన్నాడతడు.
తల్లబోయిందామె. 'తన మనస్సు అతనికి పూర్తిగా అర్ధమై పోయింది, ఎలా తెలిసింది? ఎందుకిలా నా హృదయం లోకి తొంగి చూస్తున్నాడు తను? ఏమైందని చెప్పను? చెప్పకుండా ఉండలేనేమో!" లోలోన గొణిగిందామె మనస్సు.
"నాకే అర్ధం గావడం లేదు నా మనస్సు! మీకెలా చెప్పమంటారు?"
"అదిగో , దాతెస్తున్నావ్ మళ్ళీ! కరుణ నీ ఇలాగే నమ్మిస్తున్నావ్? నీ మనస్సు కేమైందో నీకు తెలియదా?"
"ఎవరిచ్చారితని కింత హక్కు నా పైన? ఎందుకిలా మాటిమాటికి నన్ను పరీక్షిస్తున్నాడు తను? నేనేమైతే తన కెందుకు?' విసుక్కుందామె మనస్సు.
"చెబితే మరింత దిగజారి పోతుంది నా మనస్సు! ఒకరి సానుభూతి ని భరించ లేను నేను. నన్ను నేనే ఓదార్చు కోవాలి! వేరోకళ్ళు నన్ను ఒడార్చితే అది మరీ పెద్ద రణం అవుతుంది."
"..........."
మౌనంగా ఆమె వంకే చూస్తుండి పోయాడతడు కొంతసేపటి వరకూ.
అతనితో అంతా చెప్పుకోవాలన్న ఉత్కంట తో ఆమె మనస్సు ఊగిపోతుంది. ఆ క్షణాన అతడు తన కెంతో దగ్గరి బందువయ్యాడు.
"మీకు టైమవుతుందేమో? వైజాగ్ వెళ్ళాలను కున్నారుగా పెళ్ళికి?"
"వెళ్ళాలి. కరుణ కోసం!"
"కరుణ కోసమా? ! ఎందుకు? ! ఎవరో స్నేహితుడి పెళ్లి క్కాదా మీరు వెళ్ళడం?"
"రెండింటికి వెళుతున్నాను. నిన్న అమ్మ వ్రాసింది. వైజాగ్ లో మా దూరపు బంధువుల తాలుకూ ప మేచ్ ఉందట. అతను ఎమ్.ఎస్ సి. చేస్తున్నాట్ట. అన్నీ బాగానే ఉన్నాయి. చూసి నచ్చితే కరుణ కీ వేసవి లో పెళ్లి చేద్దాం అంటోంది అమ్మ."
"కరుణ నాతొ అనలేదే?"
"తన కింకా తెలియదు. వచ్చిన తరవాత అక్కడ అంతా బాగున్న దనిపించి తే చెబుతాను."
"అయితే కరుణ పెళ్లి అవుతుందన్న మాట! ఇద్దరం కలిసి యూనివర్శి టీకి వెళ్ళాలను కున్నాం. లేకపోతె ఇక్కడే ఏదో జాబ్ లో జాయినవ్వా లనుకున్నాం . పోనివ్వండి! అనుకున్న వన్నీ జరిగితే జీవితం లో చేదు ఉండదుగా?"
ఆమె కళ్ళు అశ్రు సిక్తా లయ్యాయి చివరలో. అంతలోనే తనెందు కలా కదిలి పోయిందో అతని కర్ధం కాలేదు. ప్రయాణానికి టైమవుతుందని అతడు వెళ్ళిపోయాడు.
'తను మాత్రం పెళ్లి చేసుకోదా? కరుణ కి పెళ్లి అనగానే ఎందుకలా త్రుళ్ళి పడిందామె మనస్సు? ఆ కళ్ళలో తడి మెరిసిందేమిటి? స్నేహం ఇంత గాడంగా ఉండదని భయమేమో పెళ్లి తరవాత? తన కళ్ళలో నవ్వు మెరుస్తుంటే ఎంత అందంగా ఉంటుంది! ఎంత మృదువైన దామె మనస్సు? క్షణంలో అర్ద్రమై పోతుందేమిటి? లోన ఏదో స్మృతులు తన ఇష్టా యిష్టాల్ని శాసించు తున్నాయి! ఆ స్మ్ర్తుతులంత మధురమైనవి గావనిపించుతుంది. అయినా అవే తన జీవితాన ఆశా దీపిక లేమో? ఏమిటవి?' ఆలోచనలతో నిండి పోయిందతని మనస్సు.
