రాత్రి మళ్ళీ నా ఆలోచనలు ప్రారంభమయ్యాయి. సుశీల ని అతి గారాబంతో పెంచడం వల్ల యిలా అయ్యిందా! ఇప్పుడెం చెయ్యాలి? ఎలా చెప్పాలి? తెలియనట్టు వూర్కొవాలా? తెలిసినట్టు నచ్చ చెప్పాలా! నాకు బోధపడలేదు.
సుశీల కు తల్లి పోలిక రాకూడదని వెయ్యి దేముళ్ళకి మ్రొక్కు కున్నాను. వస్తుందేమో నని భయపడ్డాను.
భయపదినంతా జరిగింది.
కర్తవ్యం తోచలేదు.
సుశీల తల్లి నా కళ్ళల్లో మెదిలింది.
"------అవి నేను మధుర లో ఉద్యోగం చేస్తున్న రోజులు. మనస్సు రాయి చేసుకుని, జీవనోపాధి కి సంపాదన ప్రారంభించాను. ఆ రోజుల్లో ఒక కంపెనీ లో వంద రూపాయలు యిచ్చేవారు. ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకు శేషగిరి అనే అతనితో స్నేహం అయ్యింది. అరవదేశం లో తెలుగు స్నేహితుడు దొరికే సరికి నా ప్రాణం లేచి వచ్చింది. అతను గవర్నమెంటు ఎలక్ట్రిసిటీ దిపార్టు మెంటు లో పని చేసేవాడు.
ఒకరోజున నేను మీనాక్షి దేవాలయానికి వెళ్లాను. గుళ్ళోంచి బయటకు వస్తుండగా కళ్ళు ఒకమ్మాయిని చూశాయి. కాళ్ళు ఆగిపోయాయి.
ఆ పిల్ల చక్కగా తలంటుకుని, జుట్టు చివర ముడి వేసింది. నా కిష్టమైన ఆకుపచ్చని చీర కట్టింది. నానామే కేసి చూసేసరికి ఆమె నాకేసి చూసింది. నేను యాంత్రికంగా అక్కడే నిలబడి పోయాను. ఆమె తన తల్లితో వచ్చినట్టుంది. ఆ యిద్దరూ దర్శనం చేసుకుని, బయటకు వచ్చేవరకు అలాగే నిలబడ్డాను. ఆమె వెళ్ళిపోయింది. నేను నిట్టూర్చి, రూముకి చేరి మంచం మీద వాలిపోయాను.
ఆ పిల్ల నన్ను ఆకర్షించింది.
పెళ్లి చేసుకుంటేనో అంది నా మనస్సు.
అసలామే అరవ పిల్లో, తెలుగు పిల్లో! నేను అనామకుడ్ని. తలిదండ్రులు ఉన్నా-- లేనివాణ్ణి. నాకు పిల్లని ఎవరిస్తారు? నాకు అమ్మా, నాన్న గారు గుర్తుకు వచ్చారు.
నా మనస్సు మధన పడింది.
ఎలాగయినా సరే వూరు వెళ్లి తల్లిదండ్రులతో రాజీపడి తీరాలని నిర్ణయించు కున్నాను. వెంటనే శెలవు చీటీ వ్రాసి , ఎకౌంటెంటు యింటికి పట్టుకెళ్ళి యిచ్చి, రైలు ఎక్కాను.
ఇంటికి చేరేసరికి మంచం మీద పడుకుని చుట్ట కాల్చుకుంటున్న నాన్నగారు నన్ను చూసి ఆశ్చర్య పోయారు. కోపంతో అయన కళ్ళు ఎర్రబడ్డాయి. నేను ఎంత ప్రాధేయపడినా వినలేదు. అసలు నన్ను నోరు మెదపనివ్వ లేదు.
"సంవత్సరంన్నారయ్యాక మేము బ్రతికి ఉన్నామో, చచ్చి పొయామో నీకు కావాల్సి వచ్చిందా! పైగా అపేక్ష ఉన్నవాడులా వచ్చావా? నీకు మా ఆస్తి మీదే గానీ, మా మీద అపేక్ష ఉందా! ఉందనగలవా? నీకోసం సంవత్సరం కన్నీరు మున్నీరుగా ఏడ్చి, తిండి మాని, ఉపవాసాలు చేసి చేసి చచ్చిపోయింది మీ అమ్మ....ఇక నే నంటావా ....ఇవాళో రేపో....
నా నెత్తి మీద కొండ విరిగి పడినట్టయింది.
నా బ్రతుకు ఎంత చెడ్డదో!
తల్లిని పోగొట్టుకున్నాను.
నాన్నగారు తిట్టిన ప్రతి తిట్టూ నాకు ఒక ప్రాయశ్చిత్తం అనిపించింది. నాన్నగారు కన్నీరు తుడుచుకున్నారు. అయన కంటతడి నేనెప్పుడూ చూడలేదు.
"వెళ్ళు....వెళ్ళిపో....నీతో నాకు ఎప్పుడూ సంబంధం లేదు. మళ్ళీ నీ ముఖం చూపకు వెళ్ళు..." అన్నారు. ఆ రోజంతా వీధి అరుగు మీద కూర్చున్నాను. కరణం గారు వచ్చి "అబ్బాయ్! నువ్వు క్షమించరాని తప్పు చేశావు. మీ తలిదండ్రుల మనసు గాయపరిచావు. మీ అమ్మగారి మరణానికి నువ్వే కారణం. మీ నాన్నగారి పద్దతి నీకు తెలియనిది కాదు . అయన మనస్సు మార్చడం అనేది చేయలేని పని." అని నచ్చచెప్పారు. నన్ను వెళ్లి పొమ్మని అయన చెప్పిన దాని తాత్పర్యం.
తిన్నగా మళ్ళీ మధుర చేరాను. తాళం తీసి రూములోకి ప్రవేశించి మంచం మీద వాలిపోయాను. కాస్సేపటికి శేషగిరి వచ్చాడు. వస్తూనే "చెప్ప చెయ్యక ఎక్కడి కండీ మీరు హటాత్తుగా వెళ్ళిపొయ్యారు? మొన్న మేం యిల్లు మారాం. ఆ సాయంత్రం వచ్చాను మీ రూముకి" అన్నాడు. 'ఆహా' అన్నాను నేను పొడిగా. అతను బలవంతం చేసి తన యింటికి తీసుకు వెళ్ళాడు. వాళ్ళమ్మ గారు నన్ను చూస్తూనే "అదేవిటోయ్ ! ఈ మధ్యన రావడం మానేశావ్! అంది. నేను నవ్వి వూరుకున్నాను. ఇల్లంతా శేషగిరి చూపించాడు. బాగానేఉంది. ఇల్లంతా చూశాక యిద్దరూ బయట వరండా లో కూర్చున్నాం. శేషగిరి "ఉండు ఇప్పుడే వస్తా" అని లోపలకు వెళ్ళాడు. నేను గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నాను. ఇంతలో పక్క వాటా తలుపు తెరుచుకుంది. తలెత్తి అటు చూసి ఉలిక్కిపడ్డాను.
మీనాక్షి దేవాలయం లో చూసినమ్మాయి.
నన్ను చూసి ఆమె కూడా ఉలిక్కి పడ్డట్టయింది. గమ్మున లోపలకు వెళ్లి, తలుపు వేసేసుకుంది. ఓ రెండు నిముషాలయ్యాక మళ్ళీ తలుపు తెరుచుకుంది. తల వంచుకుని ఆమె వీధి గుమ్మం వైపు వెళ్లి నిలబడింది. ఇంతలో శేషగిరి రెండు గ్లాసుల కాఫీతో వచ్చాడు.
ఆ రాత్రి నాకు పిచ్చి పట్టినట్టయింది. ఎందుకీ ఏకాకి బ్రతుకు? అనిపించింది. ఆత్మహత్య చేసుకుందామనిపించింది. కానీ అంత అదృష్టం నాకు లేదు. నా అన్నవాల్లెవరూ లేరు. అందరికీ తల్లీ, తండ్రి, అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళూ , బంధువులూ ఉంటారు. నాకు ఎవ్వరూ లేరు. ఇంత విశాల ప్రపంచంలో ' నా' అన్న దానికి నేను నోచుకోలేదు. రాత్రంతా బాధ పడ్డాను. ఏడ్చాను.
తెల్లవారింది.
హోటలు కు పోయి కాస్త ఎంగిలి పడి , ఆఫీసు కు చేరాను. ఎక్కౌంటెంటు నన్ను చూస్తూనే మండి పడ్డాడు. "ఇన్నాళ్ళయితే ఎలా? నీకంతగా ఉద్యోగం చేయడానికి తీరుబడి లేకపోతె ఉద్యోగం మానిపారేయ్. అంతేకాని యిలాటివి కుదరవు" అన్నాడు. ఆయనకు నచ్చ చెప్పాను.
ఆ సాయంత్రం మళ్ళీ శేషగిరి యింటికి వెళ్ళ బుద్ది వేసింది. ఆత్మవిమర్శన చేసుకుంటే శేషగిరి ని చూడడం కోసం కాదని, ఆ అమ్మాయిని చూడ్డానికని తేలింది. వెళ్ళకూడదను కున్నా వెళ్ళకుండా ఉండలేక పోయాను.
కొన్నాళ్ళు గడిచాయి.
ఆమెతో కొంత పరిచయం ఏర్పడింది. ఆమె పేరు 'జయ'. ఆమెకు సినిమాలన్నా, నవలల న్నా కధలన్నా తగని పిచ్చి. ఎప్పుడూ వాటిని గురించే మాట్లాడేది. శేషగిరి వాళ్ళింటికి వెళ్లినప్పుడల్లా జయకు నవలలు పట్టుకుని వెళ్ళేవాడిని. ఆ నవలలు చదివి, వాటి మీద దీర్ఘ ఉపన్యాలు యిచ్చేది. శేషగిరి ఎప్పుడూ వింటూ కూర్చునేవాడే తప్ప , మాట్లాడేవాడు కాదు. "ఆయనకు తలనొప్పి. వాదించడానికి అసలు చదవాలి. చదవాలంటే వోపిక, యిష్టం ఉండాలి" అనేది జయ అతన్ని ఎత్తి పొడుస్తున్నట్టు. శేషగిరి నవ్వి వూరుకునే వాడు.
కాలగమనం లో నాలుగు నెలలు గడిచాయి. ఒకనాటి రాత్రి మళ్ళీ ఆత్మవిమర్షన చేసుకున్నాను కూర్చుని.
జయను ప్రేమించినట్టు తేలింది.
మళ్ళీ యీ ప్రేమలో పడ్డాను.
అదేం పెద్ద తప్పు కాదు. అయినా నా జాతకం అంత మంచిది కాదనే అనుమానం నాకు ఉంది. అది గాక 'నా' అన్నవాళ్లు లేనివాణ్ణి నాకు పిల్లనిచ్చే పిచ్చి వాళ్ళేవరుంటారు?
ఆవేశంతో తల గోడ కేసి బాదుకున్నాను. ఏ జన్మ లో పాపమో నన్ను యీ జన్మ లో పీడిస్తోంది. నాకు 'నా' అన్నవాళ్లు కావాలి. ఎలా? కొనుక్కుంటే వస్తారా? లేక ఎవరినైనా బ్రతిమాలితే నా వాళ్ళు గా ఉంటారా! ఎలా? ఈ ఏకాకిత్వాన్ని భరించడం ఎలా? తప్పించుకునే మార్గం ఏమిటి?
ఆ రాత్రంతా ఏడుపుతోనే గడిచింది. తెల్లారి ఆఫీసులో కళ్ళు తిరిగి పడ్డాను. ఎకౌంటెంట్ వెంటనే లేవదీసి, "అరె! ఇంత జ్వరంగా వుంటే ఆఫీసుకు ఎందుకు వచ్చావు?' అన్నాడు. ఇంటికి వెళ్ళమన్నాడు. అతని భ్రమ గాకపోతే నాకు ఇల్లేది? రూముకే వెళ్లాను.
పడుకున్నాను. శరీరమంతా సూదులు గ్రుచ్చినట్ట యింది. తల పగిలి పోతుందనుకున్నాను. కానీ అంత అదృష్టం చూసి చూసి నన్నెలా వరిస్తుంది. రాత్రికి రెండు వాంతులయ్యాయి. నీరసం పట్టుకుంది. చచ్చిపోవాలని దేముణ్ణి ప్రార్ధించినా చస్తానేమో అని భయం వేసింది. అది మానవత్వం కాబోలు. "తండ్రీ, ఈ జ్వరం తగ్గేలా చూడు" అని దేముడి కి దండం పెట్టుకున్నాను. దేముడు నవ్వుకుని ఉంటాడు. నాది మొండి ప్రాణం. తెల్లారుతూ కొంచెం నాయమయ్యింది. ఎకౌంటెంటు నా రూముకి వచ్చి , "ఈ రెండ్రోజూలూ విశ్రాంతి తీసుకో. ఆదివారం కలిసి వస్తుంది. సోమవారానికి కాస్త తేరుకుంటావు" అన్నాడు. అయనలో మంచితనం నా నీరసాన్ని కొంత మటుకు పోగొట్టుకుంది. అయన వెళ్ళాక శేషగిరి వచ్చాడు. బలవంతం మీద వాళ్ళింటి కి అతనితో వెళ్లాను. వాళ్ళమ్మ గారు కాఫీ చేసి ఇచ్చారు. పన్నెండింటి కి వాళ్ళింట్లో నే కాస్త ఎంగిలి పడ్డాను.
మళ్ళీ రాయిలా అయ్యాను.
* * * *
జయకు ఎంత సన్నిహితంగా ఉండకూడదని ప్రయత్నిస్తే అంత సన్నిహితంగా రావడం మొదలు పెట్టాను. ఆమెను ప్రేమించితే వివాహం చేసుకోడం అనేది జరగని పని. ఏకాకి నైనా నాకు పిల్లని ఇవ్వరు. ఆపాటి దానికి మళ్ళీ తెలిసి తెలిసి ఆతెలివి తక్కువ పని చేయడం ఎందుకు!
