Previous Page Next Page 
పారిజాతం పేజి 5

   

    ఆదివారం సాయంత్రంఅయిదు గంట లయింది. పెరట్లో పారిజాతం చెట్టుకింద మంచం వేసుకొని, పారిజాతం వోడ్ హౌస్ పుస్తకం 'లాఫింగ్ గాస్' చదువు కొంటున్నది. పారిజాతానికీ, సత్యవతికీ పుస్తకాలపిచ్చి ఎక్కువ. తెలుగు, ఇంగ్లీషు నవలల్లో చాలా భాగం వాళ్ళు చదివినవే. పుస్తకాల మీద వాళ్ళు విమర్శించు కొంటుంటే పారిజాతానికీ, సత్యకూ కాలమే తెలియదు.
    ఇంతలోకే "రండక్కా!" అని ఆహ్వానిస్తున్న సంగీత గొంతు, "ఏం జేస్తున్నది, పారిజాతం?" ని ప్రశ్నిస్తున్న సత్య గొంతూ వినపడి, ఇంట్లోకి వచ్చింది పారిజాతం. "రా, సత్యా! అట్లా పారిజాతం చెట్టుకింద కూర్చుందాము. చల్లగా, హాయిగా ఉంటుంది" అని ఆహ్వానించింది స్నేహితురాలిని.
    "నీ దగ్గర ఉడుకు తప్ప చల్లదన మెక్కడిదీ?" నవ్వుతూ అంది సత్య.
    ఇద్దరూ చెట్టుకింది మంచంమీదకు చేరారు.
    ఇంతలోకే పారిజాతం సవతి తల్లి సౌభాగ్యమ్మగారు "ఏం, సత్యవతమ్మా! ఒంట్లో బాగా కులాసా చిక్కిందా?" అని ప్రశ్నిస్తూ, కాఫీ పట్టుకు వచ్చారు. సత్యవతి వినయంగా, లేచి, "బాగానే ఉందమ్మా! నాన్నగారెక్కడ? కనిపించటం లేదే?" అని అడిగింది.
    పారిజాతం నాన్నగారు భద్రగిరి నాయుడుగారు. హెడ్మాస్టర్ గా పనిచేసి రిటైరయ్యారు. మొదటి నుంచీ ఆయనకు తన పని స్వయంగా తానే చేసుకోవడం అలవాటు. పారిజాతం ఆయన మొదటి భార్య కూతురు. ఆయన దసలు మద్రాసు. ఏ కారణంచేత జన్మస్థలాన్ని వదిలి, రాయలసీమలో స్థిరపడ్డారు. తనకి చుట్టాలంటూ ఎవరూ లేరని అంటాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పారిపోయి వచ్చిన బాపతేమో నని స్నేహితుల అనుమనం. ఆయన మాత్రం ఏమీ తొణకడు. రిటైరయిన తరవాత, చేతికందిన ప్రావిడెంట్ ఫండ్ తో ఇల్లు కొన్నాడు. తిండి ఉన్నా, లేకపోయినా నిలవ నీడ ఉండాలని, సౌభాగ్యమ్మగారు కూడా ఇల్లు కొనాలన్నా ఆలోచనను బలపరిచారు. ఉద్యోగరీత్యా పారిజాతం ట్రాన్స్ ఫర్ అయినా, నాలుగు ట్యూషన్లు చెప్పుకొంటూ ఆయనక్కడే ఉండవచ్చు. లేదా అద్దె కియ్యవచ్చు. ఏమైతేనేమి, మొత్తానికి ఇల్లు కొన్నారు.
    ధరలు మండిపోతున్న ఈ కాలంలో పారిజాతం జీతం పంటికిందికి రాదు కాబట్టి భద్రగిరి నాయుడు గారు ట్యూషన్లు కుదుర్చుకొన్నారు. పూర్వకాలం చదువు కాబట్టి, ఆయన అన్ని సబ్జెక్టులూ చక్కగా చెప్పగలడు. అందుకని పిల్లల 'పాసు'కంటే, 'చదువే' ముఖ్యమని తలిచే పిల్లల తల్లిదండ్రులు తను పిల్లల నాయన దగ్గర ట్యూషన్ కు ఉంచారు.
    రాయలసీమలో ఉద్యోగం సంపాదించి స్థిరపడ్డ తరవాత భద్రగిరి నాయుడుగారు, స్నేహితుల బలవంతం మీద సౌభాగ్యమ్మగారిని వివాహం చేసుకొన్నాడు. పెండ్లయిన చాలా కాలాని కామె కడుపు ఫలించి, సంగీత పుట్టింది. తరవాత ఒక మగపిల్లాడూ, ఆడపిల్లా పుట్టి పోయారు. పైకి తొణకలేదు గాని, తనకో మగబిడ్డ లేడనీ, తన వంశం నిర్వంశం అవుతున్నదనీ నాయుడుగారు మనసులో చాలా మథనపడేవారు. కాని, క్రమంగా జీవితంతో రాజీ పడ్డారు.
    సవతి తల్లి అయినా సౌభ్యాగమ్మగారు పారిజాతాన్నీ, సంగీతనూ ఒకలాగే పెంచారు. పారిజాతం ఏనాడూ ఆమెను సవతి తల్లిగా భావించలేదు. వివాహం కావలసిన ఈడులో పారిజాతం ఉద్యోగం చేస్తుంటే, పాపం, సౌభాగ్యమ్మగారి మనసు విలవిల్లాడేది కాని, పరిస్థితి నర్దం చేసుకొన్నందువల్ల, అంతకంటే గత్యంతరం లేదని ఊరుకొన్నది.
    ఇదీ పారిజాతం కుటుంబ సమాచారం.
    మాటల్లోనే కాఫీపొడి, మల్లెపూలూ తీసుకొని నాయుడుగారు వచ్చారు. సత్యను చూస్తూ, "ఏమమ్మా ఎట్లా ఉంది నాన్నగారికి? ఇహ ముసిలాయనను కొడుకు దగ్గరికి పంపమ్మా! నా కంటే కొడుకు చేతిలో కన్ను మూసే ప్రాప్తి లేదు. కొడుకైనా, కూతురైనా నా తల్లి పారిజాతమే! మీ నాయనకేం? మహారాజు! నిక్షేపంగా మగబిడ్డ ఒళ్ళో కన్ను మూయవచ్చు. పంపించవమ్మా మీ అన్న దగ్గరికి!"అని అన్నాడు.
    సత్య నవ్వింది. కాని జవాబు లేదు. వదిన దగ్గర స్వాభిమానం గలవా వాళ్ళెవ్వరూ బతకలేరు. మునుపు ఆస్తి అహంకారం. ఇప్పుడు అధికారపు టహంకారం! ఒక్కనాడయినా తనతో ఆప్యాయంగా ఆస్తినీ, హోదామా మరిచి మాట్లాడలేదు. ఈ వేళ నాన్నగారి నక్కడకు పంపితే, పురుగుకంటే హీనంగా చూస్తుంది! నాన్నగారికి కూడా అందుకే ఇష్టం లేదు.
    కాస్సేపాగి సత్య- "పారిజాతం! మన పిల్లలు హంపీ అని కలవరిస్తున్నారు. వచ్చే ఆదివారం, స్పెషల్ బస్ చేసుకొని పోదామా?" అని అడిగింది.
    'హంపీ' అని వినగానే చాలా సరదా పడింది పారిజాతం. "తప్పకుండా పోదాము. కాని ఇంతలో పనులౌతాయా? పిల్లలంతా డబ్బు తేవద్దూ? స్పెషల్ బస్ మాట్లాడవద్దూ!" అని అంది.
    "హెడ్ మిస్ట్రెస్ భర్తతో చెప్పి అన్నీ తయారు చేయించుతుందట. ప్రతిఫలం మూడు ఫ్రీ టికెట్లు మాత్రమే! తనకూ, భర్తకూ, కూతురికీ! మన మీ కండిషన్ కు ఒప్పుకొంటే, హంపీప్రయాణం ఖాయం." సత్య విడమరిచి చెప్పింది.
    పారిజాతం నవ్వి, "ఒక్కొక్కరికీ ఎంతవుతుందీ?" అని అడిగింది.
    "ముఫ్ఫై రూపాయలని చెబుదాము. ఎటుపోయి ఎటొచ్చినా మంచిది."
    "అంటే-నేనూ, సంగీతా అరవై రూపాయలు చెల్లించాలన్నమాట! పోనీ, నేను మీకు అక్కడ భోజనాలు వడ్డిస్తాను. నాకో ఫ్రీ టికెట్ ఇవ్వరాదూ?"
    అంతా గలగలా నవ్వారు. భద్రగిరి గారు మీసాలు సవరించుకొంటూ, "పోవడమంటూ జరిగితే, ఇద్దరూ వస్తారులే, అమ్మా!" అని అన్నారు.
    "అసలు పెద్దదాన్ని నేను లేకపోతే, సత్యకు బుద్ది పనిచేయదు, నాన్నా! నేను లేకుండా అడుగు ముందుకు వెయ్యలేదు." నవ్వుతూ అంది పారిజాతం.
    "అదంతా ఇట్లాంటి వాటికే! రేపు మొగుణ్ణి వెతుక్కొనేటప్పుడు మాత్రం నీకు చెప్పకుండా వెతుకు కొంటుంది, చూడు." సౌభాగ్యమ్మగారు నవ్వుతూ అందుకొన్నారు. ఆవిడ పాతకాలం మాటలకు అలవాటయిన అంతా నవ్వుకొని లేచారు. సత్యవతి ఇంటికి పోతానని బయలుదేరగానే పారిజాతం, సంగీత ఆమెను ఇంటిదాకా దిగబెట్టి వచ్చారు.

                           *    *    *

    హోస్పేటలో బంగళాముందున్న తోటలోని పూల మొక్కల మధ్య కూర్చుని రామనాథం కాఫీ తాగుతూ, టపా చూచుకొంటున్నాడు. మనిషి చాలా మారాడు. బాగా నునుపుదేలి, మరికాస్త తెల్లబడ్డాడు. ముఖంలో పెద్ద ఆఫీసర్ కు ఉండే ఠీవి, గర్వం తొణికిసలాడుతున్నవి. కొంతదూరాన ఫ్యూన్ హొస్నూరప్ప చేతులు కట్టుకొని నిలుచున్నాడు.
    ఇంతలోకే స్నానం ముగించుకొని లలిత (పూర్వాశ్రమంలో వెంకమ్మ) వచ్చింది. ఆవిడా చాలా మారింది. లేత నీలం సిల్కు చీర, నీలపు రంగు జాకెట్ వేసుకొన్నది. జాకెట్ చేతులు జబ్బలదాకా మాత్రమే ఉన్నాయి. మెడలో ఏదో నీలం పూసలదండ వేసుకొంది. పెదవులకు రంగు. రామనాథాన్నీ, ఆవిడనూ చూస్తే ఏ ఆంగ్లో ఇండియన్లో, పంజాబీలో అనుకోవలసిందే గాని, పదహారణాల ఆంధ్రులని కలలోకూడా ఎవరూ అనుకోలేరు!    
    ఎదురుగా కూర్చుని, కాఫీ కలుపుకొంటున్న భార్య వంక రామనాథం ఒక క్షణం రెప్పలార్ప కుండా చూశాడు. అసహ్యం, తిరస్కారం లాంటి భావమేదో అతని ముఖంలో ఓ క్షణం మెరుపులాగా మెరిసి మాయమైంది. మరుక్షణమే పెదవుల మీద చిరునవ్వు కనపడింది.    
    "హోస్నూరప్పా! కాఫీ ట్రే తీసెయ్యి" అంటూ లలిత ఫ్యూన్ కు పని పురమాయించి, టపాలు సుతారంగా అటూ ఇటూ కదుపుతూ, "ఏమిటి విశేషాలు?" అని భర్తను అడిగింది.
    "గొప్ప విశేషమే ఉంది! సత్య స్కూలు పిల్లలు, టీచర్లు హంపీ ఎక్స్ కర్షన్ వస్తున్నారుట. కమలాపురం ట్రావెలర్స్ బంగళా రిజర్వ్ చేయించడానికి వీలయితే చేయించమని వ్రాసింది. తుంగభద్ర డామ్ సైట్ చూపించడానికి వీలయితే ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని వ్రాసింది." జాబు చూస్తూ అన్నాడు రామనాథం.  

                                  
    అతని చేతిలోనుండి జాబందుకొని లలిత చదివింది. సత్యవతి దస్తూరీ ముత్యాలకోనలాగా ఉంటుంది. రామనాథం కోడి కెలికిన ట్లుంటుంది.
    "సత్య నా చెల్లెలయితే, పెండ్లి చేసి, ఆమె పిల్లలను పెంచుకొనేదాన్ని! తప్పి, మీ చెల్లెలయింది. అందు లోనూ సవతి చెల్లెలు!"
     ఆవిడ ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నదోగాని, రామనాథం చెవులకు మటుకు 'సవతి చెల్లెలు పెండ్లి చెయ్యకుండా వదిలి పెట్టా'డన్న ఎత్తి పొడుపు ధ్వనించింది. తమాషాగా అంటున్నట్లుగా అన్నాడు: "సత్య నీ చెల్లెలయితే, దాని పిల్లలను పెంచుకొనే గొప్ప మనస్సు ఉంటే, నాకు రెండో పెళ్ళి చేసి, ఆ చెల్లెలి పిల్లలనే పెంచుకోరాదూ! చట్టరీత్యా ఆ పిల్లలు నీ పిల్లలే అవుతారుగా!" తమాషాగా అతని పెదవులు నవ్వుతున్నాయి. ఆ నిమిషాన అతని కన్నులలో కనపడ్డ భావం పిల్లలమీద మమకారం అని ఏ ఆడదీ భ్రమించదు! మరో ఆడదానిమీద ఆశ అని స్పష్టంగా తెలుస్తున్నది!
    ఐ. ఎ. ఎస్. ఆఫీసర్ అయినప్పటినుండీ రామనాథం మారిపోసాగాడు. ఆడవాళ్ళంటే ఆపేక్ష ఎక్కువయింది. ఈ విషయం లలితకు తెలియనిదేం కాదు. క్లబ్బులలో రాసక్రీడలు ఎక్కువయ్యాయనికూడా తెలుసు. మిసెస్ రోజినా విల్సన్, మిసెస్ వసుమతీ రామకృష్ణన్, మిసెస్ భవానీ మీనన్ మొదలైన వాళ్ళతో రామనాథం మాట్లాడేటప్పుడు అతని కళ్ళతో కొట్ట వచ్చినట్లు దాహం కనుపించేది. తనవైపు చూసినప్పుడు నిర్లక్ష్యం కనుపించేది! వయసు పెరిగినకొద్దీ పరస్త్రీలపై మోజుకూడా పెరుగుతున్నదని లలిత ఆడమనసు ఇట్టే పసిగట్టింది!
    అయితే, స్పష్టంగా కుండ బద్దలు కొట్టి, ఈవేళ, "రెండో పెళ్ళి-సంతానం కోసం చేసుకొంటాను" అని రామనాథం అనడంతో లలితకు కారం రాచినట్లయింది. వెటకారంగా-"దానికేం భాగ్యం! కోర్టు కెక్కండి. విడాకులు రాగానే, హాయిగా రెండో పెండ్లి కాకపోతే అయిదో పెళ్ళి చేసుకోండి!" అంటూ పడక గదిలోనికి వెళ్ళిపోయింది.
    ఏదో ఆలోచించుకొంటూ, సిగరెట్ వెలిగించి అక్కడే కూర్చున్నాడు రామనాథం. లోపల వంట గదిలో వంటమనిషి సావిత్రి హొన్నూరప్పతో చేతులు తిప్పితిప్పి విరగబడి నవ్వుతూ ఏదో చెబుతున్న దృశ్యం ఎవరికంటా పడలేదు.
    
                             *    *    *

    "యావదు కప్పా, పిలిచిడిసివా పంట?" (ఎందుకయ్యా పిలిచినాపుటా?) అని అడుగుతూ, భద్రీప్రసాద్ రామనాథం ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.
    సాయంత్రం ఆరు గంట లయింది. తోటలో జాజిపూల రకానికి చెందిన పూలేవో విచ్చుకొంటూ సువాసనలను తోటనంతా నింపుతున్నవి. సన్నగా వీచే గాలికి ఇంట్లో దేవుడి పటం దగ్గర వెలిగించిన ఊదుకడ్డీల వాసన తోటలోకి వస్తున్నది. సాయంసంధ్య సుమనోహరంగా ఉంది. ఆ సువాసనలను కలుషితం చేస్తున్నవి రామనాథం తాగే సిగరెట్ నుండి వచ్చే పొగలు.
    "ఏం లేదయ్యా? మా చెల్లెలూ, వాళ్ళూ హంపీ చూడ్డానికి ఆదివారం పొద్దున్న వస్తున్నారట. ఆఁ! ఆఁ! ఎల్లుండి ఆదివారమే! శనివారం రాత్రి బయలుదేరి వస్తారుట. ఆదివారం హంపీ, సోమవారం డామ్ సైట్, ఊరూ చూసి, రాత్రికి తిరిగి ఇంటికి పోతారుట. వాళ్లకు హంపీ, డామ్ సైట్ చూపించే ఏర్పాట్లు కాస్త చెయ్యి. అన్నట్లు, కమలాపురం ట్రావెలర్స్ బంగాళా కూడా రిజర్వ్ చెయ్యి. కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ పనులన్నీ చెయ్యి. అయినా, అనుభవజ్ఞుడిని నీకు చెప్పేదేమిటిలే!" అని భద్రీప్రసాద్ తో అన్నాడు రామనాథం.
    భద్రీప్రసాద్ తలమీద చుట్టూ వెంట్రుకలూ, మధ్య బట్టతలా చూస్తే-చుట్టూ చెట్లూ, మధ్య కోనేరూ జ్ఞాపకం వస్తుంది. బట్టతలపై, ఎడమ చేతి చూపుడు వేలుతో గీరుకొంటూ భద్రీప్రసాద్- "యా ఊరినుండి వస్తుండరూ? జనం ఎష్టుమంది ఉందురూ?" అని ప్రశ్నించాడు.

                                                  *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS