3
పదిహేను రోజుల తరువాత ఓ రోజు ఉదయాన తొమ్మిది గంటలకు, త్యాగరాజు పెట్టిలో అడుగున ఉన్న డిగ్రీని, మిగతా సర్టిఫికెట్లని బయటకు లాగాడు.
తరువాత అర గంటలోనే స్నానపానాదులు పూర్తిచేసుకొని భోజనానికి ఆలస్యంగా వస్తానని ఇంట్లోచెప్పి బయిటకు వచ్చాడు.
క్రితం రోజు డక్కన్ క్రానికల్లో 'కింగ్స్ వే' లో వున్న ఓ ఫరమ్ లో గుమాస్తా ఉద్యోగం ఖాళీగా వున్నట్లుగా ప్రకటించ బడింది. కొన్ని అర్హతలిస్తూ - అవి కలిగివున్న వారిని సర్టిఫికెట్లు తీసుకొని సరాసరి ఆఫీసుకే రమ్మంటూ వ్రాశారు.
అందుకే త్యాగరాజు బయల్దేరాడు.
రోడ్లన్నీ ఆఫీసులకు వెళ్ళే మనుష్యులతో నిండుగా వున్నయి - ఇక చిక్కడపల్లి సంగతి చెప్పేదేఁవున్నది!-
వెళ్ళి బస్ స్టాపులో స్టేషన్ వైపుకు వెళ్ళే బస్సుకోసరం నిలబడ్డాడు. రెండు బస్సులు వచ్చి వెళ్ళిపోయిం తరువాతగాని అతడు తోసుకుంటూ వెళ్ళి మూడో బస్సులో ఎక్కలేక పోయాడు-ఓ నిండిన బస్సులో!
స్టేషన్ కు జేరేటప్పటికి తరువాత పావుగంట పట్టింది.
మరో బస్సుకోసరం క్యూలో నిలబడకుండా, గాంధీ హాస్పిటల్ ముందుగా నడవసాగాడు.
-ఈ ఉద్యోగంవస్తే హాయిగా వుంటుందనిపించింది.
ప్రస్తుతానికి తక్కువ జీతానికైనా సరే ఒప్పుకొని దేంట్లోనో ఒకదాంట్లో జేరితే తరువాత చిన్నగా మంచి ఉద్యోగం కోసరం ప్రయత్నం చేసుకోవచ్చు!
చిన్నగా రోడ్డువెంట నడుస్తుంటే ఏవేవో ఊహలు అతడిని అల్లుకు పోసాగినయ్...
తను ఏ పరిస్థితులలో తన ఇల్లు వదిలి ఇక్కడికి వంటరిగా వచ్చాడు?- రైల్లో ఎలాంటి సంఘటన జరిగింది? -తను ఎలాంటివారి నడుమ ఇరుక్కుపోయాడు?...
చిన్నగా నవ్వుకున్నాడు.
'-శకుంతల వింతమనిషి! అంతే గాదు 'అహంభావి' గూడా!'
కింగ్స్ వేలోకి వచ్చి ఒకసారి నాలుగువైపులా చూచి, తనవైపే వస్తున్న ఓ వ్యక్తిని, తనకు కావాల్సిన కంపెనీ వివరాలు అడిగి తెలుసుకొని, అటువైపుగా నడిచాడు.
అప్పటికే అక్కడ నలుగురు వ్యక్తులు కూర్చొని వున్నారు.
త్యాగరాజువెళ్ళి ముభావంగా ఒపక్కగా కూర్చున్నాడు.
-ఈ ఉద్యోగం తనకు వస్తుందా?
వస్తే మంచిది-రాకపోతేనష్టంలేదు!
రోడ్డుమీద వచ్చేపోయే మనుష్యులని, కార్లని, స్కూటర్లని చూస్తూ మౌనంగా కూర్చున్నాడు.
పక్క అతను ఏదో పలకరించబోయాడు గాని, త్యాగరాజు మౌనాన్ని చూచి జంకాడు.
తరువాత పావుగంటకు ఆ కంపెనీ ప్రొప్రైటర్ కారుదిగి తన గదిలోకి వెళ్ళాడు.
-ఆ పైన పది నిముషాలకే ఒక్కొక్కరికి లోపలికి పిలుపు!
త్యాగరాజు అందరికంటే చివరవెళ్ళాడు లోపలికి.
గదిలోకి వెళ్ళగానే, విష్ చేసిన త్యాగరాజుకు, ఆ కంపెనీ అధిపతి కూర్చోవటానికి కుర్చీ చూపించాడు. త్యాగరాజును సర్టిఫికెట్లు అడిగి తీసుకొని వో రెండు నిముషాలు పరిశీలించాడు.
'మీరు ఫుల్ టైం చేయగలరా?....పార్ట్ టైం ఏనా?'
'ఫుల్ టైం'...
'మీరెక్కడా ఉద్యోగం చేయటం లేదా?'
'ప్రస్థుతానికి ఖాళీగానే వున్నాను!'
'ఎందుకని?'
'మా ఊళ్ళోనే ఓ ఉద్యోగం చేస్తుండే వాడిని ... ఎందుకో విసుగెత్తేసింది ...వదిలేసి వచ్చేశాను!' చిన్నగా చెప్పాడు చెప్పటం ఇష్టంలేదన్నట్లుగా నంగి నంగిగా చెప్పాడు అదైనా!
ఆయన ఒక్కక్షణం సంశయించి, 'పోనీయండి... మీ వెనుకటి విషయాలు నాకేఁవీ వద్దు...మాది చిన్నకంపెనీ...ఎకౌంట్స్ అంతా మీరే చూడవలసి వుంటుంది... అంతేగాదు .... దీనికి మీరే ఎకౌంటెంట్ మీరే గుమస్తా!... మహా వుంటే రోజూ వో మూడు నాలుగు గంటల పని వుంటుంది ... అసలు ఇది పార్ట్ టైం జాబేగాని - ఇన్నాళ్ళూ అలాగే చేయించానుగూడా....కాని, దాని ఇబ్బందులు దానికున్నయి....అందుకే ఫుల్ టైం మనిషిని ఏర్పాటు చేసుకుందామనుకున్నాను....ఈ కంపెనీపెట్టి అర సంవత్సరమయినా ఇంకా నిండలేదు... ఆఁ... అన్నట్లు... మీకు టైప్ రైటింగ్ వచ్చా?' త్యాగరాజు మొఖంలోకి చూస్తూ అడిగాడు.
'వచ్చు!'
'...గూడ్ ... అదే చెబుతున్నాను...కొత్తగా పెట్టిన కంపెనీ ఇది....మేం ప్రస్తుతానికి నెలకు నూటయాభైకంటే ఎక్కువ ఇవ్వలేం....ఇందాక చెప్పినట్లుగా అన్నీ మీరే చూడవల్సి వుంటుంది...మీకు ఇష్టమైతే...' ఆయన ఆశను నిర్లక్ష్యంతో కప్పిపుచ్చుకో ప్రయత్నిస్తూ అన్నాడు.
'మంచిది....అలాగే చేస్తాను!'
'ఆల్ రైట్.....మీ యిష్టం..... రెండు మూడు రోజుల్లోగా ఎప్పుడైనా వచ్చి జేరవచ్చు!'
త్యాగరాజు లేచి నిలబడ్డాడు.
'థాంక్యూ వెరీమచ్!...' ఒక్కడుగు వెనక్కు వేయబోతూ, 'కాగితంమీద ఆర్డర్స్ ఏఁవైనా ఇస్తారా?' అడిగాడు.
'కావాలా?'
'అంత పట్టింపేం లేదు!'
'దెన్ ఆల్ రైట్....ఏం అక్కర్లేదు....రెండు మూడు రోజుల్లోగా మీరు వచ్చేయండి.....ఆఁ.... ఒక్కక్షణం.... మీ అడ్రసివ్వండి!' అంటూ త్యాగరాజు చెప్పిన దాన్ని టేబిల్ ప్యాడ్ మీద వ్రాసుకున్నాడు ఆయన....
తల వంచుకొని స్ప్రింగ్ డోర్ తెరుచుకొని బయటకు వచ్చాడు త్యాగరాజు.
తలెత్తేటప్పటికి ఎదురుగా శకుంతల కనబడింది- ఇందాక తను కూర్చున్న స్థలంలో కూర్చుని!
ఒక్కక్షణం తటపటాయించి, 'వెళ్దాం రండి!' అన్నాడు-ఇంకా ఏం అనాలో, ఎలా చెప్పాలో అర్ధం కాలేదు త్యాగరాజుకు.
శకుంతల పరిస్థితీ అలాగే వున్నది. నోటమ్మట మాట రాలేదు.....కొద్దిక్షణాల మౌనం తరువాత! ఆమె మొఖాన్ని చికాకు అలుముకున్నది!- అసహనంగా అటూ ఇటూ తల తిప్పింది!
మళ్ళా ఒక్కక్షణం మౌనం తరువాత, 'వెళ్దాం పదండి శకుంతలా!' అన్నాడు ముందుకు అడుగులు వేస్తూ త్యాగరాజు.
శకుంతలకు అర్ధమయింది!
మరుక్షణంలోనే చటుక్కున లేచి నిల్చుని, తలవంచుకొని అతడిని అనుసరించింది.
-ఆమె మొఖం నల్లగా మాడిపోయి వున్నది!
రోడ్డుదాటి పదడుగులు వేసిం తరువాత, 'కాసిని కాఫీత్రాగి వెళ్దామా?' అన్నాడు.
'వద్దు!' ముభావంగా అన్నది శకుంతల.
ముందుకు అడుగులు వేస్తూనే, 'ఆ ఉద్యోగంలో నేను సెలక్టు అయ్యాను!' అన్నాడు.
'నాకు తెలుసు' అన్నంత నిర్లక్ష్యంగా, 'ఊఁ' అని ఊరుకున్నది.
ఇద్దరూ - ఎవరో ముక్కూ మొఖం తెలియని వ్యక్తుల్లా-ఎవరికివారు, వారి వారి ఆలోచనలను నెత్తిన రుద్దుకుంటూ నడుస్తున్నారు.
'పోనీయ్....మీరు జేరతారా?....నేను చెబుతాను!'
శకుంతల ఉలిక్కిపడింది.
'ఏఁవిటి?!' అన్నది -ఆలోచనలను పక్కకు నెట్టుకుంటూ.
'అదే... మీరు జేరాలనుకుంటే చెప్పండి...'
ఒక్కక్షణం గూడా ఆలస్యం చేయకుండా, 'వద్దు వద్దు! అన్నది తల ఊగిస్తూ:
ఇద్దరూ స్టేవన్ దగ్గరకు వచ్చి ఒకటో నెంబరు బస్సు ఎక్కారు.
త్యాగరాజు ముందువైపుగా నిల్చున్నాడు. శకుంతల ఆడవాళ్ళసీట్లో కూర్చున్నది.
త్యాగరాజే రెండు టిక్కెట్లూ కొన్నాడు.
చిక్కడపల్లి జేరేటప్పటికి పావుగంట పట్టింది.
త్యాగరాజు దిగాడు.
శకుంతలా దిగింది.
త్యాగరాజు ఆమెపక్కగా నడుస్తుండగా అతడి దృష్టి ఆమె బంగారపురంగు చేతిమీద పడింది.
మరుక్షణంలోనే కంఠాన్ని గంభీరంగా మార్చి, 'మీరు టిక్కెట్లు కొనుక్కున్నారుగదూ?' అడిగాడు.
'ఊఁ...' అన్నది నిర్లిప్తంగా.
అతడు తన చేతివంక చూచుకున్నాడు.
అప్పటికే చేతివేళ్ళు చేతిలోని రెండు టిక్కెట్లనూ కసిగా నలిపి ముక్కలు ముక్కలుగా చేస్తున్నాయి!
* * *
శకుంతల తనని ఎందుకో అసహ్యించు కుంటోంది?
-త్యాగరాజు నరనరాన్ని ఆవరించి వున్న భావం అది!
తనేం చేశాడు?
ఆమె అసహ్యించుకునేటంతగా తను ఎప్పుడైనా ప్రవర్తించాడా?
లేదు!
'లేవండి!....ఈ రోజు మీకు చిన్న పార్టీ యిస్తున్నాను!' అన్నది-
అతడు కళ్ళుమూసుకు పడుకున్నా కాళ్ళూపుతుండటం చూచి-మెళుకువతో ఉన్నాడనే ఉద్దేశ్యంతో.
మెడ వెనక్కు ఎత్తి చూచాడు.
'దేనికి?' కంఠం ఆశ్చర్యాన్ని ప్రస్ఫుటించింది.
తన ఆలోచనలకు శకుంతల కంఠం వో కత్తెరయింది.
మరోసారి అనుకున్నాడు: 'శకుంతల తనకు అర్ధం కావటం లేదు!
క్షణంలో కోపగిస్తూ, మరుక్షణం లోనే నవ్వుతూ మాట్లాడుతుంది.
'దేనికో చెప్పందే స్వీకరించరా?' అని, అతడు తిరిగి మాట్లాడ బోయే లోగానే అడ్డుపడుతూ, 'శలవురోజుల్లో హోటల్లో యిచ్చే స్పెషల్ లాంటిదే ఇదీను అనుకోండి!' అని ఫక్కున నవ్వింది.
త్యాగరాజు దెబ్బకొట్టేలా చెప్పబోయాడుకానీ శకుంతల అక్కడ లేదు- ఆమె తిరిగి, చేతులో స్వీటుప్లేటుతో వచ్చేటప్పటికి ఆ వేడి తగ్గింది!
మెదలకుండా ప్లేటందుకున్నాడు.
'ఈ రోజు నా పుట్టిన రోజు!' అన్నది.
-గాలి కెగురుతూ, రాగి రంగులో పట్టులా మెరుస్తున్న ఆమె వత్తైన తలకట్టుకు అర్ధం ఇప్పుడు స్ఫురించింది.
ఆమె చాలా సంతోషంగా కలబడింది, - మరుక్షణంలోనే రాణి గుర్తుకు వచ్చింది!
ఆరునెలల క్రితం అత్యుత్సాహంలో జరుపుకున్న రాణి పుట్టినరోజు గుర్తుకు వచ్చింది!
ముఖం వివర్ణమయింది.
'ఏవిఁటి అలా మౌనంగా వుండిపోయారు?'
-రాణి తలంటుకొని స్నానంచేసి, కొత్త చీర కట్టుకొని అక్షింతలు చేతికిస్తూ, 'నమస్కరిస్తానన్నయ్యా!' అన్నది.
తను దీవిస్తూ అన్నాడు: 'అన్నీ సవ్యంగా వుంటే వచ్చే ఈనాడు నిన్ను నేనే గాకుండా నాకంటే ఆత్మీయులైన మరొకరుగూడా దీవిస్తారమ్మా!'
'ఎవరు వారు?' కళ్ళు పెద్దవి చేసి అన్నది.
'నీ భర్త!' కొంటెగా అన్నాడు.
'ఫో! అన్నయ్యా!' చెంగున అవతల గదిలోకి దూకింది.
సిగ్గుతో ఎర్రబడిన-ఆ క్షణం- రాణి మొఖం తను జన్మలో మరువలేదు.
శకుంతల పెద్దగా మళ్ళీ అన్నది! 'ఏఁవిటి ఆలోచిస్తున్నారు?'
తడబడ్డాడు త్యాగరాజు.
అతడి మొఖం నల్లబడింది.
'రాణి......రాణి!' అన్నాడు అసంగతంగా.
శకుంతలకు అర్ధం కాలేదు.
'ఎవరు రాణి?'
-అప్పటికిగాని అతడు తన ఊహా ప్రపంచంనుండి బయటపడలేదు!
తేరుకొని కొద్దిగా సిగ్గు పడ్డాడు గూడా.
సర్దుకుంటున్నట్లుగా అటూ యిటూ కదిలి, 'తరువాత చెబుతాను!' అన్నాడు.
