Previous Page Next Page 
స్వాతి జల్లు పేజి 5

 

    సాయంత్రం అయిదు గంట అయింది. ఈవేళప్పుడు తార తప్పకుండా ప్రకాశరావుగారింట్లో, అరుంధతితో కబుర్లు చెపుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అరుంధతి మనోరంజని బలవంతం మీద క్లబ్ కెళ్ళి పోయినా తార మాత్రం ఏదో పత్రిక తిరగేస్తూ కూర్చుంటుంది. రవికి, తారతో ప్రాణ సంకటంగా ఉంది. ప్రకాశరావుగారింటికి నడుస్తున్న అతని అడుగులు తడబడ్డాయి. వద్దు అనుకొంటున్న మనస్సు ను దిక్కరిస్తూ ప్రతి రోజూ ఆ వేళ కతని పాదాలు అక్కడికే తీసికొని పోతాయి.
    తార కళ్ళలోని నీలిమలో ఎంత కాంతి? ఆ చిన్ని నోరు నవ్వినప్పుడు ఎంత ముద్దుగా ఉంటుందీ]?
    కానీ, అయస్కాంత శక్తిని మరింప జేసే ఆమె చూపుల్లో ఎందుకంత హేళన?
    వెన్నెలలు కురిపించే , ఆ మందహాసం లో ఎందుకంత వెక్కిరింత?
    పనికట్టుకుని తననే ఎడుపిస్తుం]
దెందుకు? అ దేవకన్య లో ఈ కఠినత్వం ఎలా చోటు చేసుకొందో?
    సామ్రాజ్జి లా ఎదుటి వారిని కనుసన్నలతో శాసించగలిగే శక్తి ఆమెకే దేవుడిచ్చాడో?
    యావత్ర్సందాన్నీ తన ఎదుట మోకరింపజేసే ఆ చిరునవ్వును దగ్గిరగా దర్శించగలగటం, ఎన్ని జన్మల తఫః ఫలితం?
    అరుంధతి క్లబ్ కెళ్ళింది. తార ఒక్కర్తే ఉంది. ఆ సంగతి రవికి తెలిసినా "అక్కయ్య గారూ!" అని పిల్చాడు--
    తార గలగల నవ్వింది.
    "ఎందుకా తిప్పలు? నన్ను పిలుస్తే కరుస్తానా?" ఒక్కసారి క్షణ కాలం ఆకళ్ళలోకి చూడాలని మనసెంత కొట్టుకులాడినా , రవి కనురెప్పలు పైకి లేవలేదు. పెదవులు మాత్రం ఎలాగో కదిల్చి, కనుపించీ కనుపించని చిరునవ్వుతో "కరిస్తే ఏం బాధ" అన్నాడు.
    తార ఒక్క క్షణం తెల్లబోయింది-- మరుక్షణం మరింత వెటకారంగా నవ్వుతూ "మీకు కూడా మాతలోచ్చే >!" అంది.
    "నేనూ మనిషినే!"
    "నిజంగా!! ఆ విషయం మీరు నొక్కి చెప్పేవరకూ తెలియలేదు సుమండీ ?!"
    రవి ముఖం పాలిపోయింది. వణికే పెదవులను పళ్ళతో నొక్కి పెట్టి, కళ్ళలో నిండిన నీళ్ళు క్రిందికి రాకుండా చాలా ప్రయాస పడ్డాడు.
    "మిస్టర్ రవీ! నాకు చేతి రుమాళ్ళు కావాలి. తెచ్చి పెడతారా?"
    అల్లరిగా నవ్వుతూ అంది తార.
    "అలాగే!"
    "పువ్వులు కూడా కావాలి."
    "వూ!"
    "ఇదిగో! ఈ పది రూపాయల కాగితం తీసికోండి. మిగిలిన చిల్లర మీరుంచుకొండి!"
    రవి ముఖం ఎర్రబడింది.
    "నేను కూలివాడ్ని కాను."
    తార చిలిపిగా నవ్వింది.
    "ఛ! ఛ! కూలివాడని ఎందు కనుకొంటారు? కూలి వాళ్ళు, మాటంటే పడతారా? ఎంత డబ్బిచ్చుకొన్నా, ఎప్పుడంటే అప్పుడు ఎపనంటే ఆపని అగ్గగ్గ లాడుతూ చేస్తారా?"
    రవి దుఃఖాన్ని నిగ్రహించుకోలేక పోతున్నాడు.
    "ఏం, అలా ఉన్నారూ? వెళ్ళలేరా?' నవ్వుతూనే అడిగింది తార.
    "ఎంతమాత్రం వెళ్ళను" మనసులో గట్టిగా అరచుకొన్నాడు.
    "వెళ్తాను" అన్నాడు పైకి.
    "ఈ పనుల వల్ల ప్రకాశరావు గారి పనుల కేమీ ఇబ్బంది లేదు గదా!"
    "లేదు!"
    "అది చూసుకోండి ముందు. లేకపోతె ప్రకాశరావు గారికి మీమీద కోపం మోస్తుంది. అప్పుడు మీరు బ్రతగ్గలరా?"
    రవి దీనంగా తార వంక చూసాడు. తార ఒక్క క్షణం కరిగిపోయింది. కానీ, వూరుకోలేదు.
    "మీరాయన దగ్గిర గుమస్తాయే కదూ!"
    "అవును!"
    "నౌకరు కంటే , హడలి పోతుంటే.... సందేహ మొచ్చింది."
    ".........."
    "ఇక్కడ తప్పితే, ఇంకెక్కడా మీకు ఉద్యోగం దొరకదా?"
    "కష్టం!"
    "మీ దగ్గర అర్హత ఉన్నప్పుడు కష్ట మెందు కవుతుంది?"
    "నా అర్హత లేపాటివి? నేను మెట్రిక్ మాత్రమే పాసయ్యాను."
    "అది చాలు! అయినా అక్కడితో ఎందుకాపేశారు? మన తెలివి అంతంత మాత్రమా?"
    "అద్బుతమైన తెలివి లేకపోయినా, దద్దమ్మను కాను. కానీ , బీదవాణ్ణి . కాలేజీ కి చదువులు ఎలా సాధ్యమవుతాయి?"
    "వీధి దీపాల క్రింద చదువుకొని హైకోర్టు జడ్జి అయిన వారి కధలు వినలేదా?'
    "నేనంతటి వాడినా?"
    "సాధనమున పనులు సమకూరు ధరలోన అని తెలియదా?"
    "అవి పుస్తకాల్లో మాటలు!"
    "అవి బ్రతుకును చూసి వ్రాసినవి-- అవి చూసి బ్రతుకును దిద్దుకోవడాని కుద్దేశించినవి."
    రవి ధైర్యం చేసి తార కళ్ళలోకి చూసాడు - వాటిల్లో హేళన లేదు. దయ నిండుకొని ఉంది.
    రవి తేలికగా నిట్టూర్చాడు.
    "మీరు చెప్పిందంతా ఆశలున్నవాళ్ళకి. నా బ్రతుక్కి మాత్రం చాలు!"
    దీనంగా అన్నాడు రవి. తార సమాధానం చెప్పే లోగానే ప్రకాశరావు వచ్చాడు.
    "ఏమోయ్! రవీ! నా బూట్ పాలిష్ డబ్బా తెచ్చావా?'
    "లేదండీ! వెడుతున్నాను."
    "అరె! ఇంకా వెళ్ళలేదా? ఇవాళ నాకు పార్టీ ఉందని మరిచిపోయావా? ఇక్కడ కబుర్లు చెబుతున్నావు కదూ! ఇంతకంటే వెళ్లనని స్పష్టంగా చెప్పకూడదూ? ఇక్కడ నిన్నేవరైనా నిర్భంధించారా? సరే! నేనే వెళ్ళి తెచ్చుకొంటానులే!"
    రవి గడగడ లాడాడు.
    "నేను రావటమే, కొంత ఆలస్యమయిందండీ! ఇప్పుడే తెస్తాను."
    రవి హడావుడిగా గాభరాగా బయలుదేరుతూ, తారవంక ఒక్కసారి చూసాడు. అ కళ్ళలో వ్యక్తమవుతున్న తిరస్కారానికి చటుక్కున తల వాల్చుకుని వెళ్ళిపోయాడు.
    
                             *    *    *    *
    "ఇస్త్రీ పెడుతున్నారా?"
    లోపలికి అడుగుపెడుతూ అడిగింది తార. తల వంచుకుని, ప్రకాశరావు గారి పెంట్, ఇస్త్రీ పెడుతున్న రవి కంగారు పడి, చేతికి వాత పెట్టుకొన్నాడు , బాధగా దాని వంక చూసుకొన్నారు.
    తార పెదిమలు బిగపట్టి "తరువాత మీ వాతలు చూసుకొందురు గాని, ముందర పని కానియ్యండి. చెయ్యి కాలితే బాధ లేదు. అదే తగ్గిపోతుంది.  పేంట్ మాదిపోతుందేమో?' అంది.
    రవి ఉలిక్కిపడి , గబగబ ఆ కాలిన చేత్తోనే ఇస్త్రీ చెయ్యటం మొదలుపెట్టాడు.
    "నా బట్టలు కూడా చాలా ఉన్నాయి. అవి తీసి కొస్తాను. ఇస్త్రీ పెడతారా? చాకలికి బోలేడవుతుంది."
    "అలాగే!"
    "మడతలుంటే వూరుకొను! జాగ్రత్తగా పెట్టాలి."
    "ప్రయత్నిస్తాను."
    తార అతని వంక ఈసడింపుగా చూసింది. రవి బాధపదిపోయాడు. ఈ అమ్మాయి చెప్పిన పనులన్నీ చేస్తానంటే కూడా ఇంత ఈసడింపెందుకూ?
    తార కంఠస్వరం విని అరుంధతి లోపలినుండి వచ్చింది. తన చేతిలో ఉన్న పూల పళ్ళెం టేబిల్ మీద ఉంచుతూ "ఈ పూలు కట్టుతారా! నేనింతలో తయారుతాను" అంది.
    "నేను నీ దగ్గర గుమస్తా బంట్రోతును కాను. కేవలం బంధువును మాత్రమే!" కసిగా అంది తార.
    అరుంధతీ , రవి, ఇద్దరూ తార ముఖంలోకి తెల్లబోయి చూసారు.
    "ఆత్మాభిమానం బొత్తిగా లేనివాళ్ళు వ్యక్తిత్వం పూర్తిగా చచ్చిన వాళ్ళు, నువ్వాడించినట్లల్లా ఆడుతారు. నాకేమున్నా , ఏం లేకపోయినా మనిషిననే జ్ఞానముంది. తోటి ప్రాణి దగ్గిర నన్ను నేను హీనపరచుకునే అగత్యం నాకు లేదు."
    అరుంధతి తెల్లబోయింది.
    "నన్ను క్షమించుతారా! నువ్వు అందంగా కడ్తావని అడిగాను. అంతే! ఇంత నొచ్చుకుంటా వనుకోలేదు."
    రవి ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్క లేదు. తార ఈ మాటలన్నీ ఎందుకందో అతనికి స్పష్టంగా అర్ధమయింది. అసలే కృంగిపోతున్న తన మనసు నీ అమ్మాయిలా ఎందుకు పిండి పెడ్తుందో?
    అరుంధతీ ప్రకాశరావు లు సినిమాకు తయారయ్యారు. ప్రకాశరావు "నువ్వూ వస్తావా, తారా?" అన్నాడు.
    "నాకు ఇంగ్లీష్ సినిమాలు అర్ధం కావు."
    "ఓస్! అ మాత్రం అర్ధం కాదా! నే చెపుతాను రా!"
    "మీ కర్దమయినంత నాకూ అర్ధమవుతుందన్నయ్యగారూ! కానీ, అంతకంటే అర్ధం చేసుకోవలసినది చాలా ఉందని నాకు తెలుసు!"
    నిర్లక్ష్యంగా అంది తార. ప్రకాశరావు కనుబొమలు ముడిపడ్డాయి. విసురుగా బయటకు నడిచాడు. అరుంధతి నవ్వుకొంది. రవి బిత్తర పోయి చూసాడు.
    అరుంధతి రవి వంకకు తిరిగి "నువ్వు కూడా వస్తావా రవీ?" అంది.
    ఆశించని ఈ ఆహ్వానానికి రవి ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఏం సమాధానమియ్యాలో తెలియక తికమకపడ్తుండగా తార అంది.
    "నీకు పిల్లలు కూడా లేరు కదా, తనెందు కొదినా?"
    అరుంధతి తెల్లబోయింది.
    "అదేమిటీ?"
    "నీకు పిల్లలుంటే, సినిమాలో వాళ్ళు ఏడవకుండా ఎత్తుకోవటానికి రవి పని కొచ్చేవాడు. ఇప్పుడెందుకూ?"
    అరుంధతి తారను కోపంగా చూసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS