నేను ఒక్క క్షణం స్తంభించి పోయాను. అవును....ప్రసాదు ఎంతదూరం ఆలోచించాడు. ఆలోచిస్తున్నాడు. నిజమే ....! నాన్నగారి అభిప్రాయం నాకు కూడా తెలియదు.
'ప్రసాద్! నీనిప్పుడు నాకు మరీ సన్నిహితుడ వయ్యావు. నీ ఈ మాట వల్ల నా ఆవేశం అణిగి పోయింది. అర్ధం లేని చిలిపి పనులు మానేస్తాను. నాన్నగారి ఉద్దేశ్యం బయటపడెంత వరకు సహనంతో వేచి ఉంటాను. నీవు ఎంత నిగ్రహం కలవాడవు? ఆ భగవంతుడు నీకు అగ్నిపర్వతాలను కూడా హాయిగా గుండెలలో దాచుకొనే శక్తిని ప్రసాదించాడు.'
నా మనసు తేలికైంది. ప్రసాదు నావాడనే దృడ విశ్వానికి నాంది పలికింది. నా మనస్సు ఆ క్షణంలో పరవశంతో కళ్ళు మూసుకున్నాను.
'అమ్మాయి గారూ! భోజనానికి వేళ యిందని వాణి అందరినీ పిలుస్తూ ఉంది. వెడదాం పదండి....'
మూగగా ప్రసాదు ననుసరించాను నేను.
"రేఖా....'
'............'
'రేఖా.............! రేఖా........!
'............."
'అదేమిటే యోగ ముద్రలో ఉన్నావా ఏమిటి? అంత గట్టిగా పిలిచినా పలకడం లేదు.
వాణి కుదుపులతో నా ఆలోచనలకు స్వస్తి చెప్పి ఈ లోకంలో పడ్డాను.
'ఏమిటే వాణీ! నన్ను గట్టిగా పిలిచావా? అంతా ఉత్తదే!"
బుకాయించాను; చిరునవ్వుతో---
'మొఖం చూడు, మొఖం ....! నా పిలుపులకు ఎంతో దూరంలో ఉన్న మనవాళ్ళంతా 'ఏమి జరిగిందా ' అని యిటు వైపు చూస్తున్నారు. ఇంతదగ్గరలో ఉన్న నీకు వినపడ లేదంటే నిన్నేమనాలే......! పైగా పిలవలేదని దబాయిస్తున్నావా? నీ యోగసమాధి రెండు పాప్ కార్న్ పాకెట్ల ను తినివేసింది. నిన్ను మా యింటికి నైట్ వాచ్ మెన్ గా తీసుకొమ్మని మా నాన్నగారికి గట్టిగా రికమెండ్ చేస్తాను. తెల్లవారే సరికి యిల్లంతా గుల్ల వుతుంది. ఏమంటావే....?"
ఇద్దరమూ పగలబడి నవ్వాము. అవును నా కాపలా అంతటి జాగ్రత్త గలదే! నేను ఏవో ఆలోచనలతో సతమతమవుతున్న సమయంలో ఒక కుక్క పిల్ల మా తినుబండారాల నుండి రెండు పాప్ కార్న్ పొట్లాలు అందుకొని వాటిని పూర్తీ చేసింది మరొకటి సగంలో ఉంది. వాణి అరుపులతో దూరంగా వెళ్ళి కూర్చొని నావైపు పరిహాసంగా చూస్తూ ఉంది. వాణికి సమాధానం చెప్పలేక సిగ్గు తో తల వంచాను.
'భగవత్సక్షాత్కారం జరిగిందటే....! ఇంతకూ!'
'...............'
'జరిగే ఉంటుంది! లేకపోతె ఈ పరధ్యానమేమిటి? పగటి కలల్లో కూడా నీకు ప్రసాదు కనుపిస్తున్నాడా ఏమిటే....?"
'ఛీ...పో....! ఏం మాటలే అవి?'
'నాకంతా తెలుసు. ప్రసాదు వెళ్ళిపోయిన దగ్గర నుండి నీవెంతో మారి పోయావు. ఆ చిలిపితనం, ఆ చురుకు తనం మచ్చుకైనా లేవు. మన్ను తిన్న పాములా కనుపిస్తున్నావు. చిక్కి సగమయ్యావు. రాత్రిళ్ళు నిద్రపోవడం లేదు. అతిగా పలవరిస్తున్నావు. మొత్తానికి జబ్బు బాగా ముదిరినట్లుగానే ఉంది. డాక్టరమ్మ గారే జబ్బున పడితే ఆ జబ్బు నయం చేయడానికి ఎంత పెద్ద డాక్టరు కావాలో? వో....మర్చేపోయాను , తెలివైన.....చురుకైన డాక్టరు....ప్రసాద్! ఆ డాక్టరు గారితో కన్సల్టేషన్ మాత్రమే చాలనుకొంటా! ప్రిస్కిప్షను ...ట్రీటుమెంటు అక్కరలేదు. జబ్బు పత్తా లేకుండా పోతుంది , ఏమంటావే?'
'అబ్బ! పోవే! నువ్వు.....నీ పరహసాలూ....! నేనెంత బాధపడుతున్నాను? నీకేమో నవ్వులాటగా ఉంది....'
నా కళ్ళు చెమర్చాయి బాధతో. వాణి పరిహాస ధోరణి టకీమని ఆగిపోయింది. తన చేతి రుమాలుతో నా కళ్ళు ఒత్తుతూ 'నన్ను క్షమించు రేఖా....! నిజంగా నీవంత అదృష్ట వంతురాలవు. నీ మనసెరిగి నిన్ను పువ్వులలో పెట్టి పూజించే ప్రియుడు లభించాడు. ప్రసాదు క్రొత్తగా హాస్పిటల్ లు వెళ్ళిన రోజులలో ఎంతో చురుకుగా నవ్వుతూ పేలుతూ ప్రసాదు సహచర్యంలో రోగులకు సేవ చేసే దానివి మీ ఇద్దరినీ చూస్తూ ఒక ప్రక్క ఆనందంతో.... మరొక ప్రక్క ఏదో తెలియని అసూయతో ఉక్కిరిబిక్కిరై చూస్తుండేదాన్ని. అటువంటి నిన్ను యిప్పుడు ఈ స్థితిలో చూడాలంటె నిజంగా బాధగానే ఉంది. రేఖా! అయినా ధైర్యం తెచ్చుకోవాలి. గుండె దిటవు పరచుకోవాలి. ఏం చేస్తాం....? ప్రసాద్ నిజంగా ధన్యుడు. ఈ విపత్కర సమయంలో దేశానికి సేవ జేయడానికి ధైర్యంతో ముందంజ వేశాడు. గాయపడే సైనికుల గాయాలకు మానసికంగా, బౌతికంగా మాన్పుతున్నాడు. ప్రసాదు గురించి మా క్లాసు మేటు రవి వ్రాశాడు మొన్న. అతను కూడా ప్రసాదు తో పాటే రిక్రూటయ్యాడు.
'ఏమిటి! రవి....! మిస్టర్ రవి....అతను కూడా ఫ్రంట్ కు వెళ్ళాడా....? అంత సున్నితమైన వ్యక్తీ....విలస పురుషుడు. ఎలా వెళ్ళగలిగాడబ్బా....? ఆశ్చర్యంగా ఉందే....!'
'అంతా ప్రసాదు సహచర్యం! సత్సంగత్య ఫలితం....యిద్దరూ స్నేహితులు. ఎప్పుడు కూడా పలుకుకున్నారో? ఏమో? మనిద్దరి ని ఒంటరి వాళ్ళను చేసి వారిద్దరూ పరారయ్యారు. ప్రసాద్ వెళ్ళేటప్పుడు అందరికీ చెప్పి, అందరి వద్ద శలవు తీసుకొని వెళ్ళాడు. కాని...రవి....? మూడవ కంటికి కూడా తెలియకుండా వెళ్ళాడు. అతని కోసం వాళ్ళ యింటికి వెళ్ళాను. అతని తల్లి తండ్రులు ఎంతో బాధపడుతూ రవి వ్రాసిన ఉత్తరం చూపించారు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. పెద్ద ఆస్తి .. ఆ వృద్ద దంపతులు పుత్ర వియోగం భరించలేక గొల్లుమన్నారు. మొదట్లో ఆచూకీ తెలియక గాభరా పడి, బంధువులందరి యిళ్ళకు ఉత్తరాలు వ్రాశారు. ఎక్కడా లేడని తెలిసి భయపడి పోలీసు రిపోర్టు యివ్వాలని అనుకుంటూ ఉండగా రవి దగ్గరనుండి ఉత్తరం వచ్చింది. కొంత ఊరట....! మనసుకు శాంతి....! ఏమైనా బెంగ బెంగే!'
'అవుతే నీ పరిస్థితి కూడా నా పరిస్థితికి తోడుగానే ఉందన్న మాట! నీవు నిండు కుండలా అలా ఎలా ఉండగలుగుతున్నావే వాణి? నాకు మాత్రం అయోమయంగా ఉంది. నీలా నేను తోణకని కడవ లా ఉండలేక పోతున్నాను. అబ్బ....! ప్రసాదు ఆలోచనలు తలపుకు వచ్చేసరికి నాకేమీ తోచడం లేదు. ఒక్కసారి వెళ్ళి చూసి రావాలనిపిస్తూ ఉంది. కానీ నాన్నగారు ఒప్పుకోరు. ఏం చేయమంటావే?'
ఆవేదన...ఆవేశం....భరించలేక వాణి ఒడిలో తల దూర్చాను. వాణి నా వీపు పై మెల్లిగా తట్టుతూ 'పిచ్చి పిల్లా....! ఇంత మాత్రానికే బెంబేలు పడితే ఎలా? రేపు జీవితంలో ఎదుర్కోవలసిన సమస్యల ఎన్నో....? ధైర్యం కూడ తీసుకోవాలి. మనసు చిక్క పట్టుకోవాలి... నాకు తెలుసు నీ హృదయం సున్నితం.... అతి కోమలం... అయినా తప్పదు. హృదయాన్ని గట్టి పరచుకో. ఏ వ్యక్తీ కైనా చేతినిండా పని ఉంటె యిటువంటి ఆలోచనలు చాలావరకు దూరమౌతాయి నీవేమీ అనుకోకుండా ఉంటె నీకో చిన్న సలహా! ప్రతిరోజూ నర్సింగ్ హోమ్ కు వెళ్ళు....నాన్నగారికి తోడుగా పని చెయ్యి. రోగులకు దయార్ద్ర హృదయంతో సేవ చెయ్యి. ఆ పనిలో ఆత్మ తృప్తి ...ఆనందం కలుగుతుంది. ఈ నీ పరిస్థితికి కొంత మెరుగవుతుంది. ఏమంటావ్?' పై మాటలంటూ నన్ను మెల్లిగా తట్టి లేపింది వాణి --
నా కళ్ళలోకి సానుభూతి తో ....దీనంగా చూసింది. నేను ప్రసాదు తలపుతో పులకించి పోతూ ..వియోగం వల్ల బాధపడుతూ ఉక్కిరిబిక్కిరవుతున్నాను.
'వాణి, ఈ పరిస్థితిలో రోగులకు ఎలా సేవ చేయగలను? డాక్టర్ ఒక పేషంటు గా మారినప్పుడు అతని వైద్యం రోగులకు ఎంత వరకు క్షేమం? అందుకే నేను నర్శింగ్ హోంకు వెళ్ళడం లేదు. అయినా నీ మాటలు కూడా కొంతవరకు బాగానే ఉన్నాయి. మనసు కూడ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. నాన్నగారికి తోడ్పడతాను. తప్పకుండా నీ సలహా పాటిస్తాను.'
'నా పిచ్చి రేఖా!'
నన్ను దగ్గరకు తీసుకొని లాలించింది వాణి. ఆ క్షణం లో నాకు అక్కలేని కొరత తీరినట్ల నిపించింది. అసంగతే పైకన్నాను. మరింత దగ్గరకు తీసుకుంది నన్ను. ఆ విధంగా ఎంతకాలం గడిచిందో ఏమో? మా స్నేహితురాళ్ళంతా కలకలంగా మావైపే వస్తున్నారు. ఆ సందడికి ఇద్దరమూ బాహ్య ప్రపంచంలోకి వచ్చాము. ఒంటిగంట కావచ్చింది. ఆకలి మంటేమో పాపం....!
అందరమూ నవ్వుతూ పేలుతూ భోజనాలు పూర్తీ చేశాం. వాణి ఒడిలో కొంతసేపు విశ్రాంతిగా నిద్రపోయాను నేను. నా ముఖంలోకి తదేకంగాచూస్తూ వాణి కూడా ఏవేవో ఆలోచనలో మునిగిపోయి నట్లు తోచింది నాకు.
సాయంత్రం కాగానే అందరమూ యింటికి వెళ్ళే హడావుడి లో మునిగి పోయాం. సామాన్లు సర్దుకొని అన్నింటిని కార్లలోకి చేర్చాం.
చివరిసారిగా నన్ను హెచ్చరిస్తూ తన కారులోకి వెళ్ళి కూర్చుంది వాణి. నాకారు వైపు నడిచాను నేను--
