Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 6


    "కారిచ్చి పంపేనా? నడిచే వెళ్ళేరా?"
    "నడిచే వెళ్ళారు."
    "అదేం పనిరా? తప్పు కాదూ? కారిచ్చి పంపక పోయేవా?"
    "వర్షం తగ్గిపోయిందిగా. ఇంకా కారెందుకు నాన్నా!?"
    "పాపం.....వాళ్ళంతా నీకోసం కష్టపడుతున్నారాయెను. ఆ మాత్రం మర్యాద చేయకపోతే బావుంటుందా?"
    "ఏడిపేరు. వీళ్ళెవర్నీ నమ్మకూడదు నాన్నా! సుబ్బారావని నాతో పోటీ చేస్తున్నాడు. వాడంటే వీళ్ళెవరికీ పడి చావదు. అదిగో ఆ మంట మీద నన్ను సపోర్టు చేస్తున్నారేగాని నామీద ప్రేముండిగాదు. పైగా, వీళ్ళందరికీ నేనెంటే జెలసీ గూడాను."
    "జెలసీనా? ఎందుకుట పాపం!"
    "నాకు మేడా, కారూ వున్నాయని, నేను మీ అంతటి వారికి ఒక్కగా నొక్క కొడుకుననీ."
    ఆ తండ్రికి ముచ్చటనిపించింది.
    "మంచిదిరా నాన్నా! ఎన్నో చెబుదామనుకున్నాను. నాకు నువ్వే చెబుతున్నావు. ఆ .....మరోటి..... ఎవడతనూ.....సీతాపతికదూ. వాడ్ని మాత్రం సుతారామూ నమ్మకు. వాడు నా కంటికి గుంటనక్కలా కనుపించేడు. నా కంటి మీద నాకు నమ్మక ముంది. వాడు గుంటనక్కే. పై పెచ్చు వాడు కనకానికి మేనల్లుడట. వెధవలంతా ఒకే గూటి పక్షులు. మిగతా యిద్దర్లోనూ.....మెతకతనం కనిపించింది. జెలసీ అంటావా, తప్పదురా అబ్బీ. పచ్చగా వున్న వాడి మీద ఎదుటి వాడికి మంటే మరి. ఛస్తారా? ఆ మాత్ర్తం జెలసీని భరించవచ్చు. ఆ సీతాపతిని మాత్రం దూరంగా వుంచు. అవునూ, "ఈ ఎన్నికల్లో నీ చేతి చమురు భాగోతం ఎంత మాత్రముంటుంది?"
    "ఆ భయం అక్కర్లేదు నాన్నా. చెప్పేనుగా, సుబ్బారావంటే వీళ్ళందరికీ మంటని. ఆ మంట వీళ్ళచేత గడ్డిని గూడా తినిపించగలదు. పైగా, నాన్నా! ఆ సుబ్బారావు మనం కులంవాడు కాడు."
    "బాగుంది. 'వాతావరణాన్ని కనిపెట్టి బెట్టుగానే వుండు. జాగ్రత్త సుమీ, వెళ్ళింక. సరసయ్య వస్తే మేడ మీదికి పంపు. ఇంకెవ్వడొచ్చినా సరే, నిద్రపోతున్నానని చెప్పు వెళ్ళు."
    కొడుకు మేడ దిగి వెళ్ళిపోయేడు.
    రామదాసు కాగితాలు ముందేసుక్కూచున్నాడు. కానీ, వారి మనసు సుపుత్రుడి బావి రాజకీయ జీవితాన్ని ఊహించటం ప్రారంభించింది.....
    చిరంజీవిని తలుచుకుంటున్నప్పుడల్లా రామదాసుగారు ముచ్చట పడిపోడం ఆనవాయితి. కొడుకులో సుళ్ళు తిరుగుతూన్న ఆశయాల పట్ల వారికి మక్కువ ఎక్కువ.
    కొడుకు రోజు రోజుకీ ఆ ఆశయాల్లో ఎదిగి పోడం చూసి ఆ తండ్రి ఆనందించని క్షణం లేదు. ఎంత పరిశీలనా జ్ఞానం లేకపోతే తనకే పాఠాలు చెబుతాడు వాడు.
    వారి రాజకీయ జీవితానికి తగ్గ వారసున్నే దేవుడిచ్చేడు.
    రామదాసుగారికి నీతి సూత్రాల మీద వళ్ళు మంట. ఏ నీతైనా సరే, మనిషికి సుఖాన్నివ్వాలేగాని మనిషి వాంఛల్ని కట్టిపారేసి ఇబ్బంది కలిగిస్తే చిరాకు వారికి.
    శ్రీవారు చదువుకుంటున్న రోజుల్లోనే దేశానికి స్వరాజ్యం లభించింది. తెల్లవాడు వెళ్ళిపోయాడు గనక నల్లవాడి చేతుల్లోకి రాజ్యం వచ్చేసింది.
    అప్పట్లోనే శ్రీవారికి చిరుద్యోగం లభించింది. దాదాపు పదేళ్ళ పాటు శ్రీవారు ఆ ఉద్యోగం వెలిగించేరు.
    అందర్లాగా ఉద్యోగం చేయడంలో ప్రత్యేకత లేదనే బాధ శ్రీవార్ని కుదిపేసింది.
    తోటి నల్లవాడిని దబాయించే బతుక్కొరకు వారు కొన్ని పధకాలను ఊహించి పెట్టుకున్నారు.
    ఉద్యోగస్థుల్లో యూనియన్లున్నాయి. శ్రీవారు మంచి రోజెంచుకుని ఒక యూనియన్లో చేరేరు.
    ఉద్యోగస్థులకు ప్రతినిధిగా నించుని వారి హక్కులను సాధించి పెట్టేందుకు ప్రభుత్వంతో పోట్లాడేరు.
    ఇక్కడే శ్రీవారి దృష్టి-ఉద్యోగుల ఉద్దరణ నుంచి-దేశ శ్రేయస్సు పట్లకి మళ్ళింది.
    ఉద్యోగం తాలూకు యూనియనుల్లో గలవారి అనుభవాన్ని పురస్కరించుకుని, దేశంలో గల గొర్రెలమందల్ని గమనించి, కొన్ని లెక్కలు తయారు చేసుకుని వుంచుకున్నారు.
    సభల్లో ఉపన్యాసాలూ, పేపర్లలో పేరూ, ఇంటి ముందు బోర్డూ, అప్పుడప్పుడూ సమ్మానాలు శ్రీవారి ఎత్తుని పెంచేయి. వారి సేవ దేశానికెంతో  అవసరమని కొందరు వ్యక్తులూ, కొన్ని ముఠాలూ గొంతెత్తి అరిచేయి.
    పరిస్థితులన్నీ శ్రద్దగా గమనించి, ఇక దేశం పిలుపు తప్పని సరిగా స్వీకరించాలని నిర్ణయించుకున్న తర్వాత శ్రీవారు ఉద్యోగానికి రాజీనామా చేసేరు.
    రాజీనామా తర్వాత దేశాన్ని తగులుకున్నారు.
    కాయలు విరివిగా కాసే చెట్టు మీద రాయి విసరడంవల్ల ప్రయోజనముంది. దేశాన్ని పాలిస్తున్న ఫలానా ప్రభుత్వాన్ని తిట్టి పోయడంతో జనం దృష్టిని అతి సులువుగా ఆకట్టుకోవచ్చు.
    పనిచేసి అవుననిపించుకోడం కంటే, విమర్శించి భేషనిపించుకోడం తెలీక. ఈ మొదలైన అంశాలన్నీ శ్రీవార్ని ఆకర్షించేయి.
    దేశంలో పేదలూ, అసంతృప్త ప్రజలూ ఎక్కువగా కనిపించేరు. పేదల పెన్నిదనబడే పేదల పార్టీలో శ్రీవారు సభ్యులై పోయేరు. ఇవాళ కాకపోయినా, రేపటికైనా ఈ పేదల పార్టీ ద్వారా గద్దెకెక్కే రోజు రాక పోతుందా అని వారు శ్రమించేరు.
    పార్టీ సాహిత్యం శ్రీవారు చదువుకోలేదు. "నేను చదవలేద"ని చెప్పరు. చదవకుండానే, పార్టీ ఆశయాలను అశువుగా చెప్పగలిగేవారు. అది ఆచరణలో ఎంత కష్టమో, అసలా సూత్రాల్ని ఆచరణలో పెట్టుకోవాలంటే తీసుకోవలసిన జాగ్రత్త లేవిఁటో శ్రీవారికి అనవసరం.
    అంత తీరుబడిగా వుందా దేశం?
    మలమల మండిపోతోంది దేశం. మండిపోతున్న దేశం మొహమ్మీద యిన్ని నీళ్ళు చల్లి పుణ్యం కట్టుకుంటే అక్కడికదిదేస్సేవే!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS