Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 5


                                              2
    
    సభనించి యింటికొచ్చేరు- కారులో - రామదాసు. కారు దిగి లోపలికి అడుగుపెడుతూనే ఆయన చిరంజీవినీ మరో ముగ్గురు కుర్రాళ్ళనీ చూచేరు. రామదాసుగారి రాకను చూచి ఆ మొత్తం నలుగురూ వినయంగా లేచి నిలబడ్డారు.
    రామదాసు తల పంకించి-
    "కూచోండి. కూచోండి!" అన్నారు.
    వాళ్ళెవరూ కూచోలేదు.
    "మా కాలేజీలో ఎన్నిక లొచ్చాయి నాన్నా!" అన్నాడు చిరంజీవి.
    "ఎన్నికలా? భేష్ నువ్వు నించున్నావా?"
    "వద్దంటే వినడంలేదు వీళ్ళు." తండ్రిలాగా మాట్లాడేడు చిరంజీవి.
    ఆ మాటకి రామదాసు మురిసిపోయేరు.
    "అడ్డమైన వాళ్ళూ నించుంటే మనవాడేమిటి సార్ నించోనంటాడు? మనవాడికేం తక్కువ?" అన్నాడొకడు ముగ్గుర్లో - ప్రజల్లాగా, అమితమైన ఉద్రేకంతో.
    వాడు బక్కటి మనిషి; మాసిపోయిన తలా వాడూను. పై పెచ్చు వెధవకి ఆకలి చూపులు గూడా తగులబడ్డాయి గనక రామదాసు గారికి వళ్ళు మండిపోయింది.
    "నీ పేరేమిటోయ్?" అన్నారాయన ప్రేమగా.
    "సీతాపతండి," అన్నాడు వాడు వినయంగా.
    "మీ నాన్నగారేం చేస్తారు?"
    "నాన్నగారు లేరండి. మేనమావఁ దగ్గిరున్నాను. కనకంగారు- అయిదో వార్డు కౌన్సిలర్."
    ఆ పరిచయం విన్న తర్వాత రామదాసు చల్లబడ్డారు. ముచ్చట గూడా పడ్డారు.
    "ఓర్నీ! కనకానికి మేనల్లుడివా? కూచో, కూచో, కూచోండయ్యా! అల్లా బొమ్మలా నించుండిపోయారే? కూచోండి," అన్నారు.
    రామదాసుగారితోపాటు అందరూ కూచున్నారు.
    "ఇప్పుడు చెప్పండి వివరంగా," అన్నాడు రామదాసు.
    "కాలేజీలో ఎలక్షన్లొస్తున్నాయ్ సార్! మనవాడు, మన చిరంజీవి తప్పనిసరిగా పోటీ చేయాలని మేమంతా అనుకుంటున్నాం," అన్నాడు సీతాపతి.
    "అదిచెప్పేరు. వీడితోపాటు పోటీవాళ్ళ కథ చెప్పండి."
    "ఇద్దరున్నారు," అన్నాడొకడు నసుగుతూ.
    "ఇద్దరూ యిద్దరే దద్దమ్మలు. ఒక పెర్సనాలిటీనా, పాడా?" సీతాపతి చాలా రోషంగా అనేసేడు.
    "ఎలక్షన్లో నించోడానికి పెర్సనాలిటీలవసరమటోయ్?"
    "కాలేజీ ఎలక్షన్లో అవసరమేనండి."
    "అల్లా చెప్పు అయితే మనవాడు నించుంటే తప్పనిసరిగా గెలుస్తాడంటావ్?"
    "నిక్షేపంగా సార్!"
    "అయితే యింకేం? నించోరా అబ్బీ! నీ ఫ్రండ్సిందరు వత్తిడి చేస్తుంటే కాదనడమెందుకు?.....అవునూ, ఇంతకీ మీరు కాపీలు పుచ్చుకున్నారా?"
    "కాఫీల్దేముంది సార్! ఎప్పుడూ తాగేవేగా," అన్నాడు సీతాపతి నసుగుతూ.
    "ఎలక్షన్లే ఎప్పుడూ రావంటావ్! చాకులాటి కుర్రాడివోయ్. మేనమామ పోలికలు నిలువెత్తు పోసుకున్నావ్. రైట్.....మీ సమావేశం కంటిన్యూ చేయండి. ఈలోగా వెంకటస్వామి మీకు కాఫీలు తెస్తాడు. కాఫీలు ముగించిన తర్వాతనే వెళ్ళండి సుమీ!"
    రామదాసు లేచి నించున్నప్పుడు కుర్రాళ్ళంతా లేచి నుంచున్నారు.
    రామదాసు మేడ మీదికి వెళ్ళిపోతుండగా కుర్రాళ్ళు చేతులు జోడించి వున్నారు.
    కుర్రాళ్ళు మళ్ళా కూచున్న తర్వాత సీతాపతి ప్రారంభించేదు.
    "విన్నావుగా చిరంజీవీ! మీ నాన్నగారు కూడా వప్పుకున్నారు. రేపు సాయంత్రానికి పాంప్లెట్సు గుద్దించేద్దాం. మన శిష్యుల్ని ప్రచార నిమిత్తం ఎంకరేజ్ చేద్దాం. ఒ.కే.?"
    చిరంజీవి చిర్నవ్వు నవ్వి అన్నాడు:
    "ఏఁటోరా పతీ! నా కెందుకో దడగా వుంది. అవతల సుబ్బారావుకి మంచి పేరుండిపోయింది గదా. వాడి ముందు మనం నిలబడలేమేమో?"
    "గాడిద గుడ్డేం కాదు? సుబ్బిగాడుట! పెద్ద మొనగాడుట! ఆ భారమేదో నా నెత్తిన నెట్టి నువ్వు తప్పుకోరా జీవీ! నేను నరుక్కొస్తాగా."
    సీతాపతి చాలా ఆవేశంగా హామీ యివ్వడంతో మరో కుర్రాడికి ఉత్సాహం ముంచుకొచ్చేసింది.
    "ఇంకెందుకొచ్చిన ఆలోచనలు గురువుగారూ? యస్సనండంతే. వెళ్ళొస్తాం!" అన్నాడతను.
    "అంతేనంటారా?" అన్నాడు చిరంజీవి.
    "అంతే" అన్నారు సత్రకాయలు.
    సమావేశం "అంతే" దగ్గిర ఆగిపోయిన మరుక్షణం వాళ్ళకి కాఫీ లొచ్చేసేయి. కాఫీలు తాగి, ప్రచారానిక్కావలసిన హంగుల గురించి కాసేపు ముచ్చటించి, మంచిరోజు లొచ్చేస్తున్నాయి బాబో అని మురిసిపోయేరు. ఆ గోల పూర్తయిం తర్వాత సమావేశం ముగిసింది.
    వొచ్చిన స్నేహితులంతా వెళ్ళిపోయిం తర్వాత చిరంజీవి మేడ ఎక్కేడు. కొడుకుని అతి ముద్దుగా ఆహ్వానించేరు రామదాసు. కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి అతి వినయంగా నించున్నాడు.
    "అంతా వెళ్ళిపోయేరా?" అడిగేరాయన.
    "వెళ్ళిపోయేరు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS