బిత్తరపోయి చూస్తోన్న పావనిని చెయ్యిపట్టుకుని వెనక్కు లాగి "ఆ! కులాసాగానే ఉన్నాడు." అన్నాడు విఠల్.
"బావగారు కూడా వచ్చారే! జీవితాంతమూ ఇలా తోడునీడగా కలిసి మెలిసి ఉండే దాంపత్యం దొరకటం ఎంత అదృష్టం అక్కయ్యా!"
"కర్మకొద్దీ నీ జీవితం ఇలా అయిపోయింది కానీ, లేకపోతే నువ్వు మాత్రం..." అని ఏదో అనబోతున్న పావని మాటలకు మధ్యలినే అడ్డుతగిలింది సరళ.
"నా అదృష్టానికేం లోటు అక్కయ్యా! నూరుమందిలో పదిమంది కూడా నా అంత అదృష్టవంతులుండరు. హరితో గడిపిన ప్రతి క్షణమూ నా మనసులో కోటి కోటి కాంతులను విరజిమ్ముతూనే ఉంటుంది. నా హరి పిరికివాడు కాడు.నన్ను వదలడు కొంచెం కోలుకోగానే తప్పకుండా నన్ను వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు..."
మాట్లాడలేక ఆయాసపడిపోతోంది సరళ ... ఏం మాట్లాడాలో తెలీక కుమిలిపోతోంది పావని.
విఠల్ కల్పించుకుని "ఎక్కువగా మాట్లాడకు సరళా! ముందు హాస్పిటల్ కు వెళ్దాం పదండి" అన్నాడు.
"నువ్వేం చెప్పినా వింటాను బావా! నాకు బ్ర్తతకాలని ఉంది. మీ ఎవ్వరి ఆసరాలేకుండానే బ్రతకాలనుకున్నాను. బ్రతకగల ననుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. ఈ సంఘం నన్ను నిలిచినచోట నిలవనీయకుండా తరిమికొట్టింది...తాళిబొట్టు లేకుండా తల్లినయ్యానుట! అదీ నా అపరాధం అంతమాత్రానికి ఈ సంఘం దృష్టిలో వేశ్యకంటే నీచురాలినయిపోయాను. పైకి కనిపించే తాళిబొట్టే వ్యక్తుల పవిత్రతకు నిదర్శనం సంఘం దృష్టిలో ... అంతకంటే ఆలోచించలేరు. అర్ధంచేసుకోలేరు.... హరి కోలుకుని నా దగ్గిరకు వచ్చాక..."
భరించలేక గట్టిగా ఏడ్చేసింది పావని.
"ఎందు కక్కయ్యా! నాకు నయమవుతుంది. నాకు తెలుసు." విఠల్ సైగతో పావని కళ్ళుతుడుచుకుని నిగ్రహించుకుంటూ "సరళా! అమ్మకి టెలిగ్రాం ఇస్తాను." అంది.
"వద్దు వద్దు అక్కయ్యా? నువ్వా పనిచేస్తే ఇలాంటి స్థితిలో నీ దగ్గిర నుంచి పారిపోతాను. అమ్మకి తెలుస్తే నాన్నకి తెలుస్తుంది. ఎంత ఘోరానికైనా సిద్దపడి నన్ను హరికి కాకుండా చేస్తాడు. అన్నట్లు హరికి ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానం లేదు ఆ ఊళ్ళో లేడనుకుంటాను. హరి అడ్రస్ తెలుసా అక్కయ్యా?"
పావనిని సమాధానం చెప్పనీయకుండా విఠల్ ముందుకొచ్చి సరళా కూర్చోగలవా టాక్సీ తీసుకురానా?" అన్నాడు.
"కూర్చోగలను అన్నట్లు తల ఊపింది సరళ.
విఠల్ టాక్సీ తీసుకొచ్చాడు. కూర్చోడానికి కూడా శక్తిలేక తూలిపోతున్న సరళణు పావని పొదివి పట్టుకుని విఠల్ సాయ్మతో టాక్సీలో కూచోబెట్టింది.
ఒక ప్రైవేట్ దిస్పెన్సరీలో చేర్పించాడు సరళని విఠల్.
లేడీ డాక్టర్ అలవాటుగా "భర్త పేరు?" వగైరా ప్రశ్నలు అడుగుతోంటే విఠల్ ముఖం అవమానంతో ఎర్రబడటం పావని గమనించింది.
"చాలా బలహీనంగా ఉంది. ఎంతో కాలంగా సరిగ్గా ఆహరం తీసుకుంటున్నట్లుగా లేదు. మానసికంగా కూడా కృంగిపోయినట్లు ఉంది...గర్భంలో శిశువు పరిస్థితి కూడా అనుమానంగానే ఉంది. ఎక్స్ రే తీస్తాను. రిజల్ట్స్ వచ్చాక కాని ఏ విషయమూ నిర్ధారణ చెప్పలేను..." అంది లేడీ డాక్టర్.
పావనితోపాటు అక్కడే ఉండటానికి విఠల్ కి వీలుపడలేదు.
"పావనీ! నాకు అర్జంట్ కేసులున్నాయి? నేను వెళ్ళక తప్పదు హోటల్ దగ్గర్లోనే ఉంది. హాస్పిటల్ ఆయాకి టిప్స్ చేస్తే సహాయంచేస్తుంది. ఏం కావాలన్నా తెప్పించుకో డబ్బు సూట్ కేసు లో ఉంది జాగ్రత్త..."
"వెళ్ళిపోతున్నారా?" అంది పావని బేలగా.
"వెళ్ళాక తప్పదు పావనీ నువ్వు మరీ ఇంత బెంబేలుపడితే సరళకేం ధైర్యం చేపుతావ్? జాగ్రత్త ఈ పరిస్థితుల్లో సరళకు హరి చచ్చిపోయాడని చెప్పకు. కోలుకున్నాక నచ్చచెప్పి ఏదో ఒకటి ఆలోచించుకోవచ్చు..."
మాటాడలేక తల ఊపింది పావని.
"ఏ అవసరం వచ్చినా టెలిగ్రాం ఇయ్యి. నీ ఆరోగ్యం జాగ్రత్త..."
టాక్సీలో స్టేషన్ కి వెళ్ళిపోయాడు విఠల్.
సరళ దగ్గిరకువచ్చి కూచుంది పావని.
ఆగర్భ శ్రీమంతుల ఇంటిపిల్ల...అల్లారుముద్దుగా పెరిగిన వ్యక్తి-ఈ నాటికి ఇలా అనాధలా పడి ఉండవలసి వచ్చింది.
"అక్కయ్యా! డాక్టర్ ఏమంది?" ఆరాటంగా అడిగింది సరళ.
పావని పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఒక వంక సరళ పరిస్థితికి చెదిరిపోతున్న గుండెను చిక్కబట్టుకోవాలి. మరొకవంక సరళతో అబద్దాలూ చెపుతూ సరళణు దక్కించుకోవాలి.
.jpg)
"ఫరవాలేదంది కానీ, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. సరిగ్గా ఆహారం లేదని..."
సరళ నిట్టూర్పు విడిచింది.
"అవునక్కయ్యా! సరిగ్గా ఆహారం లేదు. రెండు నెలలబట్టీ ఒకపూట తింటే మరొక పూట తినటంలేదు. చెప్పానుగా ఏ ఉద్యోగానికి ప్రయత్నించినా ఒకటే ప్రశ్న... "పెళ్ళికాకుండానే కడుపుతో ఉన్నావా?" అని అక్కడితో ఒక పురుగును చూసినట్లు చూడటం.....చివరకు కూలిపనికూడా చేసాను..."
"చెప్పకే! నేను వినలేను పోనీలే! అదంతా పీడకలలా మరిచిపో!"
"అవునక్కయ్యా! అదంతా పీడకల....హరి అడ్రస్ తెలిస్తే ... అతడు వచ్చేస్తే...ఈ పీడకల నన్నే మీ బాధించదు..."
"సరళా..."
"అక్కయ్యా! నువ్వు వచ్చావు. నా కింక భయంలేదు. నేను బ్రతుకుతాను కదూ?"
"తప్పకుండా బ్రతుకుతావు"
"నాకు చచ్చిపోవాలని లేదక్కయ్యా నా కింకా పాతికేళ్ళు కూడా నిండలేదు. అప్పుడే ఈ జీవితాన్ని వదిలిపోవాలని లేదు. ఎంత అందమైనది ఈ జీవితం ఎన్నెన్ని తీయని అనుభవాలు నా హరితో కలిసి ఈ జీవితాన్ని అనుభవించాలి?..."
ఇంక మాట్లాడలేక అలిసిపోయి కళ్ళు మూసుకుంది సరళ ఆ మూసుకున్న కళ్ళవెనుక ఎన్నెన్ని కలల సౌధాలు నిర్మించుకొంటూందో ఊహించుకొన్న పావనికి గుండెలు బద్దలవుతున్నాయి.
శిశువు గర్భంలో చనిపోయిందనీ, ఆపరేషన్ చేసి తియ్యాలనీ చెప్పింది లేడీ డాక్టర్.
ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళబోతూ "అక్కయ్యా! నాకు బ్రతకాలని ఉంది ఈ జీవితంలో సుఖాలన్నీ అనుభవించాలని ఉంది" అంది జాలిగా సరళ...
పావని దుఃఖం దిగమ్రింగుతూ "తప్పకుండా ఆరోగ్యంగా తిరిగొస్తావు తల్లీ!" అంది.
కానీ, సరళ ఆశలు నెరవేరలేదు. హరితో కలిసి జీవితాన్ని అనుభవించాలని కలలు కనే సరళ తనకు తెలియకుండానే హరిణి కలుసుకోవటానికి వెళ్ళిపోయింది.
5
పావని వచ్చి చెప్పిన తరువాత సరళ చచ్చిపోయిన సంగతి అందరికీ తెలిసింది. సుందరమ్మ కుమిలి కుమిలి ఏడ్చింది. ఆ ఏడుపులూ, మొత్తుకోళ్ళూ చూస్తోంటే పావనిని ఏ కోశానా జాలి కలుగలేదు. సరళ చచ్చిపోయిందా? లేదు హత్యచేసారు. కన్న తల్లిదండ్రులూ, సంఘమూ, - చివరకు ప్రాణంలా ప్రేమించే తనూ - అందరూ కలిసి హత్యచేశారు. తీరా హత్యాకాండ ముగిసాక తాము చేసిన దారుణం తామే తెలిసికోలేక చేతులారా పారేసుకున్న ప్రేమ ధనం కోసం పరితపిస్తున్నారు.
పక్కమీద అశాంతిగా అటూ ఇటూ దొర్లుతోన్న పావనిమీద ఆప్యాయంగా చెయ్యివేసాడు విఠల్.
'నిద్రపో, పావనీ! మనసు కుదుటపరచుకో మనం చెయ్యగలిగింది ఏముందీ?" అన్నాడు నిద్రమత్తులో.
