Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 5


    "చెన్నా! ఈ నోట్లను లెక్కపెట్టలేదు. పదివేలు మించి వుండవచ్చు. ఇది నా తండ్రిగారి డబ్బు కాదు, నాది, మనం చూసిన పేదవారికి నేను ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ సాయపడలేను. దయచేసి ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళందరికీ పంచు. ఆ విధంగానైనా కలతపడ్డ నా మనసుకి కొంత తృప్తి కలిగించు చెన్నా! వెళ్ళు" అన్నాడు.
    చెన్నయ్య వెంటనే కదల్లేకపోయాడు. ఉపేంద్ర మంచితనానికి, సున్నితహృదయానికీ జోహారప్పించేడు. ఆపైనగాని అతను ఆ గది విడిచిపెట్టలేదు.
    అంతే! వేసవికాలం ఇంకా వెళ్ళనూ లేదు. ఎండలు తగ్గనూ లేదు. దేశం నుండి పోవడంలేదు. చల్లారనూ లేదు. కానీ చెన్నయ్య మాత్రం కనిపించడం లేదు. ఉపేంద్ర దగ్గర డబ్బు తీసుకున్నరోజునే చెన్నయ్య పరారీ అయ్యాడు. రోజుకో ఊళ్ళో కన్పిస్తున్నట్లు వార్తలందుతున్నాయి. ఆ డబ్బుతో అతను అలిసిపోయేలా పరుగులెత్తుతున్నట్లు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది.
    పేదవాళ్ళని, వాళ్ళ సమస్యల్నీ గాలికొదిలి - వాళ్ళ కందించవలసిన డబ్బు చేతుల్లో పడగానే చెన్నయ్య పారిపోయేడు! పా..రి..పో...యే...డు...    
    ఇక్కడితో కథ అయిపోలేదు. జరిగిన చరిత్ర యావత్తూ విన్న రంగనాథరావు ఉపేంద్రను మందలించబోయాడు. కానీ, ఉపేంద్ర తండ్రి నోరును కట్టేశాడు.
    "తిట్టకు నాన్నా! అమెరికాలో చదివొచ్చిన కుర్రాడ్ని నేను. తిట్టకు. నాకు మంచి జరిగినందుకు సంతోషించు. ఎక్కడో వీధుల్లో మనకి విరోధులున్నారని నాకు పాఠాలు చెప్పావు. అవునా? కాని నీ ఇంట్లో వున్న నీ బడ్డ విరోధిని గమనించలేక పోయావు.
    ఐపిటీయూ! కాన్నేను అమెరికా కుర్రాడ్ని గాలి పీల్చి గుణం చెప్పే మనిషిన్నేను. ఆ స్టుపిడ్ చెన్నాగాడు - ఆనాడు నా గదికొచ్చి తొంగిచూసిన వైనం, నీ ఉపన్యాసం చాటుగా విని పళ్ళు నూరిన విషయం నేను గమనించాను. వాడిని లొంగదీసుకోకపోతే, ఈ ఇంట్లో మనలో ఎవరో ఒకళ్ళు వాడి కసికి మసైపోక తప్పదని నాకు తెలుసు.
    ఈ జాకాల్ గాడి మనసులో ఇంకా ఎన్ని భయంకరమైన ఆలోచనలున్నాయో తెలుసుకోవడానికి నేను వాడిని కోరి నగరం చూపించమన్నాను. అమాయకపు వెధవలా నటించి వాడి ఆలోచనలూ, వాడి ఆవేశమూ తెలుసుకున్నాను. వాడు నాకు నగరములో మేడలూ, మిద్దెలూ, వైభవాలూ, ఉత్సవాలూ చూపించలేదు. చూపించడని తెలుసు నాకు.
    మురికినీ, మురికి వెధవల్నీ, పందుల్నీ, పందుల్లాంటి మనుషుల్నీ ఇరుకు కుళ్ళు సందుల్నీ చూపించి నా మనసు పాడుచేయాలనుకున్నాడు రోగ్!
    అతి సున్నితమనుకున్నాడు నా మనసు.
    ఈ మనసు. ఈ హృదయం మేడిన్ అమెరికా అని వాడికి తెలియదు. నేను ఎవరికి పుట్టానో -
    ఏ గుంపుతో పెరిగానో వాడికి తెలిసినా-దేవుడిచ్చిన ఈ రూపును చూసి మోసపోయాడు ఫూల్.
    కాని వాడి అంతరాంతరాలు నాకు తెలుసు. వాడి ఆవేశానికి విలువెంతో, వాడి రోషానికి మందేవిటో పూర్తిగా నాకు తెలుసు. పదివేల రూపాయల్తో వాడిని తోలేశాను. డబ్బుతో వాడిని కొట్టేను. చంపేను. ఈ డేంజరస్ రోగ్ కోరుకున్నట్టు దేశంలో ఉన్న దరిద్రులందరికీ మన ఆస్తిని పంచాలంటే - మనిషికో పైసా గిడుతుంది. మన దగ్గర కూడా పైసాయే మిగులుతుంది. లెక్కలు నాకు చెబుతాడా ఫూల్!
    వాడికి పెట్టేను చిన్న టెస్టు! విత్ టౌన్ థౌసండ్స్ బక్స్ పేదలకి పంచమని పదివేలు వాడిచేతుల్లో పోశాను. డబ్బుమీద యావ వాడి ఆవేశాన్ని చంపింది. వెధవ పరిగెత్తాడు. వాడే గనుక ఆ పదివేలు పేదలకు పంచి మళ్ళా నాక్కనిపించివుంటే అఫ్ కోర్స్, దటీజ్ ఎ డ్రీమ్! కానీ కనిపించి వుంటే-వాడ్ని చంపేసి వుందును.
    అంత మంచివాడు మన దగ్గర బతక్కూడదు. ఆ కష్టం తప్పించేడు. నా చేతిలో చచ్చే అదృష్టంగానీ, పేదల చేత సన్మానం చేయించుకునే అవకాశం గానీ వాడికి లేవు. అందుకే - హి రేనెవే! లుక్ ఫాదర్..... నా బద్ద విరోధిని, ప్రథమ విరోధిని, పదివేలతో చంపేశాను. ఇప్పుడు చెప్పు నాన్నా - నేను చేసింది క్రైమా? ఫ్రాడా?"
    రంగనాథరావు మరింకేమీ మాట్లాడలేకపోయారు. ఆయన కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆపైన నీళ్ళతో నిండిపోయేయి. ఉపేంద్ర తన కళ్ళకి అందువల్ల మసక మసగ్గా కనిపిస్తున్నా, తనకోసం దిగి వచ్చిన దేవదూతలా ఉన్నాడు. సాక్షాత్తూ దేవదూత తన కుమారుడైనందుకు ఆయన ఎంతో గర్విస్తున్నాడు.
    చేతులు రెండూ కొడుకువైపు చాచాడు. ఆ చేతుల మధ్య కొడుకు మేరుపర్వతంలా వచ్చి చేరాడు. కొడుకును ప్రేమతో గాఢాలింగనం చేసుకున్నాడు రంగనాథరావు. ఇప్పటికీ ఈ కథ పూర్తి కాలేదు.
    ఉత్తర హిందూస్థాన్ లో చెన్నయ్య స్థిరపడ్డాడు. 'చెన్నాస్ ఆటోమొబైల్స్' ప్ర్రారంభించి రెండు చేతులా ఆర్జిస్తున్నాడు. వేసవి వెళ్ళిపోయింది. వర్షాకాలమూ దాటింది. శీతాకాలమూ ఆసన్నమైనప్పుడు చెన్నయ్య పెళ్ళి చేసుకున్నాడు. ఆ పెళ్ళితో తృప్తిపడక ఇద్దరు అమ్మాయిల్ని కూడా ఉంచుకున్నాడు. ఆనందంగా బతకడానికి ఈ ఏర్పాట్లు చాలనుకున్నాడు.
    కానీ చెన్నయ్యకి ఇప్పుడు కూడా సుఖనిద్ర పట్టలేదు. రాత్రిళ్ళు ఇంకా ఆలోచనలు చేస్తూనే వున్నాడతను. అవి పేదలగురించి కాదు గనక ఆ ఆలోచనల్లో వేడి ఏమాత్రమూ లేదు. అల్లాగని ఇవి చల్లటి, కమ్మటి ఆలోచనలు కావూ- క్లాస్ వన్ కుట్రలతో కూడిన భయంకరమైన ఆలోచనలు అవి.
    చాలీచాలని వేతనాల కోసం అల్లరిచేస్తున్న తన పనివాళ్ళ గొంతులెట్లా కోయాలో, తన దగ్గిరున్న డబ్బుని రోజుకి రెట్టింపుగా ఎలా పెంచాలో వగైరా పథకాల్లో ఉంటున్న చెన్నయ్యకి నిద్రెలా పడుతుంది?
    అందుచేత -ఈ కథ ఎప్పటికీ పూర్తికాదు.
    
                                      *     *    *
    
    "నీ ఒక్కడికే గడిసేడవక పోతున్న ఈ దగాకోరు పరిస్థితుల్లో నీకు పెళ్ళామెందుకు? పిల్లలెందుకూ? వదిలెయ్ సన్యాసం బెటరు.
    (అ)నాగరికమైన ఈ సమాజంలో నీకెల్లాగూ తిండి దొరకదు. కనుక అడవికి వెళ్ళిపో. అక్కడ దుంపలూ, గడ్డీ దొరుకుతాయ్. అవి తినేసి బతుకు. గుడ్డలేదని బెంగపడకు. ఆకులుంటాయి కట్టేసుకో"
    
                                        *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS